Transport Minister
-
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
సెల్‌ఫోన్ ఫ్రాడ్ కేసులో బ్రిటన్ మంత్రి రాజీనామా
లండన్: సెల్‌ఫోన్ చోరీకి గురైందంటూ దశాబ్దం క్రితం తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో యూకే రవాణా శాఖ మంత్రి లూయీజ్ హే(37) శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. 2013లో లూయాజ్ను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. తను పోగొట్టుకున్న వాటిలో సెల్‌ఫోన్ కూడా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె సెల్‌ఫోన్ దొరికింది. దీనిపై పోలీసుల విచారణలో ఆమె..దోపిడీకి గురైనవాటిలో మొబైల్ ఉందంటూ పొరపాటున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోర్టులో కూడా ఆమె తన తప్పిదాన్ని అంగీకరించారు. మొదటి తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది. రవాణా మంత్రి లూయీజ్ ఫ్రాడ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో లాయర్ సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితుల్లో రాజీనామా చేయడమే ఉత్తమమని భావిస్తున్నానని, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు. -
అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత
వాషింగ్టన్: అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ సాన్ డఫీని నామినేట్ చేస్తున్నట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్‌కు సంబంధించి ట్రంప్ యంత్రాంగంలో ఇది రెండో నియామకం కావడం విశేషం. ఫాక్స్‌న్యూస్ హోస్ట్ పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ట్రంప్ ఇప్పటికే నామినేట్ చేయడం తెలిసిందే. డఫీ నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయాలు, మీడియా, రియాలిటీ, టీవీ రంగాల్లో విస్తరించిన వైవిధ్యమైన కెరీర్ ఆయన సొంతం. 1990ల చివర్లో ఎంటీవీ ‘ది రియల్ వరల్డ్: బోస్టన్’లో కాస్ట్ మెంబర్‌గా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత ‘రోడ్ రూల్స్: ఆల్ స్టార్స్’లో కనిపించారు. 2010లో విస్కాన్సిన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికవడంతో డఫీ రాజకీయ జీవితం మొదలైంది. 2019లో రాజీనామా చేసి ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్‌గా చేరారు. ప్రస్తుతం ఫాక్స్ బిజినెస్‌లో ‘ది బాటమ్ లైన్’ వ్యాఖ్యాతగా ఉన్నారు. 2022లో విస్కాన్సిన్ గవర్నర్ పదవిని తిరస్కరించారు. -
లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చివరిది కావొచ్చనే విశ్లేషకుల అంచనా తప్పింది. మరికొంత మందిని విచారించాలని ఈడీ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. తాజాగా.. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌కు కైలాష్ మద్దతు ఉందనే ఆరోపణ మీద ఆయనకు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా శనివారమే తమ ఎదుటకు రావాలని సమన్లలో ఈడీ కోరింది. అంతేకాదు.. రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ నాటి లిక్కర్ పాలసీ ముసాయిదా రూపకల్పనలో సభ్యుడిగా ఉన్నారు. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల విచారణ మొదలయ్యాక.. తరచూ ఆయన ఫోన్ నెంబర్లు మార్చినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళే(శనివారం) తమ ఎదుట హాజరు కావాలని ఈడీ మంత్రి కైలాష్కు సమన్లలో స్పష్టం చేసింది. -
బాబుకు బిగ్ షాక్..అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఔట్
-
Iswaran: బాబు సింగపూర్ పార్ట్నర్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రమణియం ఈశ్వరన్.. బాబు బాటలోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి (PAP)కి సైతం రాజీనామా సమర్పించారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది(వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు). ఇక దర్యాప్తు నేపథ్యంలో.. సింగపూర్ ప్రధాని, ఈశ్వరన్‌ను సెలవుల మీద పక్కకు పెట్టారు. మరోవైపు గతేదాడి సెప్టెంబర్‌లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: చిక్కుల్లో ఈశ్వరన్.. కేసు నేపథ్యం ఇదే! భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరన్‌పై గురువారం న్యాయస్థానంలో 27 రకాల నేరారోపణల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సీపీఐబీ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. 2025లో సింగపూర్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ వస్తోంది. తాజా రాజీనామా పరిణామంతో.. గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుతో లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు. Delighted to have met Second Minister (Trade & Industry) S. Iswaran on opportunities in AP. pic.twitter.com/s8kf19f00g — N Chandrababu Naidu (@ncbn) November 12, 2014 అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న నాడు సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అక్రమాల ఒప్పందం రద్దు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అక్రమాల ఒప్పందం రద్దు అయింది. బాబు తరహా మనిషే! సుబ్రమణియం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే విమర్శలు ఉన్నాయి. ఈశ్వరన్ 1997లో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు. ఆపై 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. మన దగ్గర సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సీఐడీ దర్యాప్తు ద్వారా బద్ధలయ్యిందో.. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సింగపూర్ దర్యాప్తు సంస్థ సీపీఐబీ నిర్ధారించింది. ఇక ఈ కేసులో ఈశ్వరన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హూంగ్ బెంగ్‌ను సైతం దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసి విచారించింది. -
ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి.. డ్రైవర్ కన్నీటి పర్యంతం!
సాక్షి, చైన్నె: ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి తనను తేనికి బదిలీ చేయాలని ఓ డ్రైవర్ పట్టుబట్టడం కోయంబత్తూరు రవాణా సంస్థలో కలకలం రేపింది. వివరాలు.. కోయంబత్తూరులో బుధవారం రవాణ శాఖ మంత్రి శివశంకర్ కార్యక్రమం జరిగింది. ఇందులో కొత్త భవనాల ప్రారంభోత్సవం, కారుణ్య నియామక ఉత్తర్వులు, పది, ప్లస్–2లో రాణించి రవాణా కార్మికుల పిలల్లకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీదకు వచ్చిన ఓ డ్రైవర్ హఠాత్తుగా ఆరు నెలల తన బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచాడు. తాను సైతం పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన మంత్రి ఆ చంటి బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. అతడి చర్యలతో మంత్రి షాక్‌కు గురయ్యాడు. చివరకు తన వేదనను మంత్రికి వివరించాడు. కోయంబత్తూరులో తాను ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. 'பணியிட மாறுதல் வேண்டும்' தன் குழந்தையுடன் அமைச்சர் சிவசங்கர் காலில் விழுந்து கோரிக்கை வைத்த ஓட்டுநர் #Kovai | #Coimbatore |#MinisterSivasankar | #Driver pic.twitter.com/cCLm8RJHAb — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 16, 2023 ఇటీవల తన భార్య బిడ్డకు జన్మనిచ్చి మరణించినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను తాను చూసుకోలేని పరిస్థితి ఉందని, దీంతో స్వగ్రామం తేనిలో ఉన్న తన తల్లికి అప్పగించానని పేర్కొన్నాడు. చిన్న పిల్లలను చూసుకునేందుకు అవకాశం కల్పించాలని, తనను కోయంబత్తూరు నుంచి తేనికి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. అతడి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు హాస్యాస్పదం
-
4 లక్షల రోడ్డు ప్రమాదాలు
న్యూఢిల్లీ: దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు. ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు. -
సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్ మ్యాప్ టు నెట్ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
ఫోటో కొట్టండి రివార్డు పట్టండి.. రాంగ్ పార్కింగ్‌పై త్వరలో కొత్త చట్టం
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలో కేంద్రం చట్టం తేనున్నది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాంగ్ పార్కింగ్ కారణంగా తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయన్నారు. రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి మొబైల్లో ఫొటో తీసి పంపితే.. సదరు వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తామని, ఫొటోను పంపిన వ్యక్తికి రూ.500 రివార్డ్ ఇస్తామన్నారు. దీంతో పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు. -
రాజకీయాల్లో రాక ముందే బెంజ్ కారులో తిరిగా: మంత్రి
ఖమ్మం (రఘునాథపాలెం) : ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో శనివారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. ‘రఘునాథపాలెం మండలంలో మల్లెమడుగు గ్రామమే లేకపోగా.. నాకు ఈ గ్రామంలో 32ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని వారికి సవాల్ చేస్తున్నా.. ఒక్క ఎకరం భూమి ఉందని నిరూపించినా ఇక్కడిక్కడే పేదలకు రాసిస్తా’ అని వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి రాక ముందే నేను బెంజ్ కారులో తిరిగా... కానీ ఇప్పుడు పార్చునర్ కారుకు వచ్చింది పరిస్థితి. వచ్చే ఎన్నికల తర్వాత అంబాడిసర్ కారుకో పోతదో, స్కూటర్‌కు పోతదో తెల్వదు’ అని పేర్కొన్నారు. అయితే, తనను ఎంత టార్గెట్ చేస్తే అంత వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తానని స్పష్టం చేశారు. ఒకరికి ఇచ్చే వాడినే తప్ప పుచ్చుకునే వాడిని కాదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరికి ఫ్యూజ్‌లు ఎగిరిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి? మంత్రి: డీజిల్ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? జవాబు: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను. ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా? జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రశ్న: విద్యుత్ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు? జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం. ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి? జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ– బ్రేక్ ఇన్స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం. ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి? జవాబు: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను. ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో? జవాబు: ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను. ప్రశ్న: వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన? జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విశ్వరూప్
-
రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు
సాక్షి అమరావతి: రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు.. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా.. బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు. మంత్రి విశ్వరూప్ రాజకీయ నేపథ్యం.. 1987లో కాంగ్రెస్ నాయకుడిగా పినిపే విశ్వరూప్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్పీసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. -
దేశ్‌ముఖ్, పరబ్‌లకు 40 కోట్లు ఇచ్చారు
ముంబై: బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్ బీర్ సింగ్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే ఈడీతో చెప్పారు. దేశ్‌ముఖ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్‌లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్ బీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్‌ముఖ్, రవాణా మంత్రి పరబ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు. -
కరోనా బారినపడ్డ రాజస్తాన్ మంత్రి
జైపూర్ : కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా రాజస్తాన్‌లో రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాని, ఈ సందర్భంగా కరోనా వచ్చినట్లు తేలిందని మంత్రి ప్రతాప్ సింగ్ స్వయంగా ట్వీట్ చేశారు. గతకొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాగా మంత్రి ప్రతాప్‌సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. (మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్) Wishing my ministerial colleague, Pratap Singh Khachariyawas ji speedy recovery from #COVID19. May he get well soon. @PSKhachariyawas — Ashok Gehlot (@ashokgehlot51) August 30, 2020 -
తమిళనాడు రవాణాశాఖ మంత్రికి కరోనా
చెన్నై : దేశంలో మహారాష్ర్ట తర్వాత తమిళనాడులో అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువరు రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి విజయ భాస్కర్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 6000 మార్క్‌ను దాటేసింది. ఇందులో గడిచిన 24 గంటల్లోనే 121 మంది మరణించారు. కొత్తగా 5709 కరోనా కేసులు నమోదవగా, వీటిలో చెన్నైలోనే 1,182 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులసంఖ్య 3,49,654కు చేరింది. (జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్) -
'సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయొద్దు'
సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణ, పోలీసు శాఖ అధికారులతో సమ్మె ప్రభావంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుందని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అసవరమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకు 50 శాతం బస్సులు నడుస్తున్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి డిపోకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, అద్దె బస్సులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 100 శాతం బస్సులు నడిచేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇదే క్రమంలో అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు బస్సులు నడిపించడంతో పాటు అధిక చార్జీలు వసూలు చేయకుండా అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా రవాణశాఖ అధికారులు కిష్టయ్య, వివేకానంద రెడ్డి, ఆర్టీసీ డీఎం మల్లేష్, రామగుండం అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల డీసీపీ గౌస్‌బాబ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలేదు: పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చర్చల నుంచి ఏకపక్షంగా వైదొలగి సమ్మెను బలవంతంగా ప్రజలపై రుద్దారని విమర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా 7,358 వాహనాలు నడుపుతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రభుత్వంపై విపక్షాలు చేసే విమర్శలను ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, రూ.4,416 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. 5 వతేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవాళ్లనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని ప్రకటించారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విలీనం చేస్తామని అనలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పునరుద్ఘాటించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన జీతాలు ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు తప్పా విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్టిసి కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మె చేస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు తిప్పుతున్నందుకు తమ ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. స్కూల్, కాలేజీ బస్సులను వినియోగించాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: దారుణంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్) -
రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే
సాక్షి, ఖమ్మం: ఉద్యమాల గుమ్మం ఖమ్మంకు ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి పదవి వరించింది. ఆదివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పువ్వాడ అజయ్ పదవీ ప్రమాణం చేశారు. ఆయనకు రవాణా శాఖను కేటాయించారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన అజయ్ రెండుసార్లు ఖమ్మం నిజయోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాక 2018లో ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా రాష్ట్ర పార్టీ దృష్టిని ఆకర్షించారు. కేసీఆర్ తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు తొలి మంత్రివర్గ విస్తరణలోనే అవకాశం లభిస్తుందని భావించారు. అయితే సామాజిక సమీకరణలు, ఇతర కారణాల వల్ల కేసీఆర్ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా పువ్వాడ అజయ్‌కు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని పార్టీ వర్గాలు గత కొంతకాలంగా పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. అయితే జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వివిధ సమీకరణల తర్వాత పార్టీ గుర్తుపై గెలిచినందుకు ప్రోత్సాహకంగా అజయ్‌ను కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టిన పువ్వాడ అజయ్‌కుమార్ మరో అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. అ‘జై..’: ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలి మంత్రిగా ఖ్యాతి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల్లో గెలుపొంది ఆయా ప్రభుత్వాలు అనేక మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏ ఒక్కరూ ఇప్పటి వరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా అయ్యే అరుదైన అవకాశం అజయ్ సొంతం చేసుకోవడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో మంత్రులుగా పని చేసిన జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, కోనేరు నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మంత్రులుగా పని చేసినప్పటికీ వారు జిల్లాలోని సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎన్నిక కావడం విశేషం. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించినా ఆయన ఆ సమయంలో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి లభించినట్లయింది. గత కొంత కాలంగా మంత్రి పదవి అజయ్‌ను వరిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనకు మంత్రి పదవి లభించడంతో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన పువ్వాడ అజయ్ 2014, 2018 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. సీపీఐ సీనియర్ నేతగా ఉన్న ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సైతం ఖమ్మం నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా ఉమ్మడి జిల్లాకు ఇప్పటివరకు మంత్రి పదవి లేకపోవడంతో అభివృద్ధి పరంగా కొంత వెనుకబడినట్లు అయింది. పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి లభించడంతో జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి కృషి ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జిల్లా నుంచి నూతనంగా మంత్రిగా నియమితులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్లో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ప్రాంతప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, జిల్లాపై పూర్తి అవగాహన ఉందని, జిల్లా అభివృద్ధి పథంలో పయనింపచేయడానికి అందరి సహకారం తీసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి సైతం తన వంతు కృషి చేస్తానని అజయ్ తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి రవాణా శాఖను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా శాఖను సమర్థవంతంగా నిర్వహించి ప్రజా రవాణా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించి శాఖ పరంగా చేయవలసిన పనులపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. తనకు లభించిన పదవి జిల్లాలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు లభించినట్లు అని, అందరి ఆశీస్సులతో ఈ పదవి లభించిందని భావిస్తున్నాని, ప్రతి కార్యకర్తకు మరింత అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ప్రొఫైల్.. పేరు: పువ్వాడ అజయ్‌కుమార్ చదువు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కుటుంబం: భార్య వసంతలక్ష్మి, కొడుకు నయన్‌రాజ్ రాజకీయ ప్రస్థానం: పువ్వాడ అజయ్‌కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ సీనియర్ నేత. పువ్వాడ అజయ్‌కుమార్ 2012 నుంచి 2013 ఏప్రిల్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించారు. అనంతరం 2013లో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఖమ్మం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’
సాక్షి, అమరావతి : రవాణాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎవరికైనా అర్హత ఉండి అన్యాయం జరిగితే నేరుగా తనను కలవొచ్చని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇకపై నెలలో ఓ శుక్రవారం రవాణా ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వ్యవస్థల్లో అవినీతిపరులు ఉన్నారని, అంతమాత్రాన వ్యవస్థ మొత్తానికి అవినీతిని ఆపాదించడం సరికాదన్నారు. ఏపీలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. గతంలో పోలిస్తే ఆటో ప్రమాదాల సంఖ్య కొంతవరకు తగ్గాయని తెలిపారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, మరణాలు బాగా పెరిగాయన్నారు. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు వాహనాలు తోలుతూ.. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామని, దీనిపై అధికారుల్లో ప్రజల్లో అవగాహనా కల్పించాలని, జాతీయ రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ ను విస్తృతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేశామని, రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. -
ఆర్టీసీని కష్టాల నుంచి గట్టేక్కించమని ఆర్థిక మంత్రిని కోరాం
-
అవినీతిపై కొరడా
ఓ ఆటో డ్రైవర్...రవాణా శాఖ మంత్రికి ఫోన్ చేయవచ్చా.. చేసినా ఆ బడుగుజీవుల ఆక్రందన అమాత్యులు వింటారా...? ఇన్నాళ్లూ అందరికీ ఇదే సందేహముండేది. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లోని మంత్రులంతా సామాన్యుల సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురంలోని కొందరు ఆటో డ్రైవర్లు బుధవారం రవాణాశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేయడం...వెంటనే స్పందించిన మంత్రి ఆరా తీయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా...ఇది జనసామాన్యుల ప్రభుత్వమని జనం ఆనందపడుతున్నారు. – అనంతపురం టవర్‌క్లాక్ సాక్షి, అనంతపురం: అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖల్లో ప్రక్షాళనకు మంత్రులు సిద్ధమయ్యారు. అంతేకాకుండా సామాన్యులు ఫోన్ చేసినా అందుబాటులోకి వస్తూ అవినీతిపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలోనే అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో అవినీతికి అంతే లేకుండా పోతోందని రవాణాశాఖలో అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని బుధవారం జిల్లాకు చెందిన కొంతమంది ఆటో డ్రైవర్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నీ ఓపికగా విన్న మంత్రి పేర్నినాని...అవినీతికి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అనంతపురం ఆర్టీఏ అధికారులకు ఫోన్‌చేసి ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో పాలన అదుపుతప్పినట్లు తెలిసి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి...అవినీతికి పాల్పడుతున్న అధికారులపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి రవాణాశాఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకూడదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇంకోసారి ఎవరైనా అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తే...విచారించి అధికారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు లైసెన్సుల కోసం కార్యాలయానికి వస్తే... అధికారులు ఎవరూ స్పందించడం లేదని, బ్రోకర్లను కలిసి లైసెన్సులు పొందేలా సూచనలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి విధానం మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. సేవలన్నీ పారదర్శకంగా ఉండాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ ఉన్నతాధికారికి ఫోన్లో ఆదేశించిట్లు తెలుస్తోంది. -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి : సచిన్
న్యూఢిల్లీ : నాణ్యత లేని హెల్మెట్లను తయారీ చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. భద్రత కోసం వాడే వస్తువులు చాలా నాణ్యతగా ఉండాలని, క్రికెటర్లు మైదానంలో వాడే వస్తువులంతా నాణ్యమైనవిగా ఉండాలని సచిన్ లేఖలో ప్రస్తావించారు. ఇక దేశంలోని 70 శాతం ద్విచక్ర వాహనదారులు నకిలీ హెల్మెట్లు వాడుతున్నారని, చాలా కంపెనీలు ఎలాంటి నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా నకిలీ ఐఎస్ఐ ముద్రను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి వాహనదారుల భద్రతకు ప్రమాదమని, ప్రమాదాల తీవ్రతను మరింత పెంచేలా చేస్తాయన్నారు. నకిలీ హెల్మెట్లు తలకు అయ్యే గాయల నుంచి రక్షించలేవన్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూవీలర్స్ రైడర్సే మరణిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని తాను భావిస్తున్నానని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కంపెనీల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన హెల్మెట్లు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించేలా ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ విషయంలో తనవంతు సాయం చేస్తానని సచిన్ స్పష్టం చేశారు. నకిలీ హెల్మెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సచిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా సచిన్ ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.