కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా! | proposals for new bus depots | Sakshi
Sakshi News home page

కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా!

Published Sun, Jun 15 2014 12:21 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా! - Sakshi

కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా!

 హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని సగం పల్లెలకు, తండాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువ. విద్యార్థులు అధికంగా బస్సులను ఆశ్రయిస్తారు. కానీ అరకొర బస్సుల కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాలో కొన్ని చోట్ల డిపోలను నిర్మిస్తామని గతంలో నాయకులు హామీలిచ్చారు. కానీ వాటిల్లో ఏవీ నెరవేర్చలేదు.
 
 శరవేగంగా పెరుగుతున్న జిల్లా జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో రవాణా వ్యవస్థ మెరుగవుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతారని, డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి ఇస్తారని, బస్టాండ్లను ఆధునికీకరిస్తారని, కొత్త డిపోలను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు.        
 
 తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు రవాణా సౌకర్యాలు మెరుగు పడతాయని ఆశపడుతున్నారు. జిల్లాలో సుమారు 150కిపైగా ఉన్నతవిద్యా కళాశాలలున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు నిత్యం పలు ప్రాంతాలనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 30వేలకు పైగా విద్యార్థులు నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తారని అంచనా. కానీ ప్రస్తుతం జిల్లాలో అరకొర బస్సులే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బస్సు డిపోలను సైతం నిర్మించాల్సి ఉంది. ఉన్న బస్టాండ్లలో అనేక సమస్యలున్నాయి. కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉండదు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. చిన్నగా ఉన్న బస్టాండ్‌లను విస్తరించాల్సిన అవసరం ఉంది.
 
 దామరగిద్ద బస్‌డిపో నిర్మాణమెప్పుడో..
చేవెళ్ల, పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నాయి. దీంతో బస్సుల అవసరం కూడా అధికమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012 డిసెంబరులో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేవెళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని దామరగిద్ద వద్ద బస్‌డిపో నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. కానీ అక్కడ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ డిపో నిర్మాణానికి రెవెన్యూ అధికారులు రైతుల నంచి 8 ఎకరాలు తీసుకుని ఆర్టీసీకి ఇచ్చేశారు. కానీ రైతులకు మాత్రం ఇప్పటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. ఇదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొయినాబాద్, శంకర్‌పల్లిలలో కూడా బస్‌డిపోలు ఏర్పాటుచేస్తామని నాయకులు హామీలిచ్చారు. మొయినాబాద్ సమీపంలో డిపో నిర్మాణానికి ముర్తుజగూడ వద్ద 18 ఎకరాల స్థలాన్ని చూశారు. ఆ పనులు ముందుకు సాగడం లేదు.
 
 బస్‌స్టేషన్లలో సమస్యలు
 పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్‌స్టేషన్ల విస్తరణ చేపట్టాల్సి ఉన్నా.. ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే చేవెళ్ల బస్‌స్టేషన్‌లో అనేక సమస్యలున్నాయి. 1969లో అప్పటి సీఎం డాక్టర్. మర్రి చెన్నారెడ్డి కృషితో ఆరు ఫ్లాట్‌ఫాంల బస్‌స్టేషన్ నిర్మాణమైంది. అప్పటి నుంచి ఒక్క ప్లాట్‌ఫాంను విస్తరించలేదు. తాగడానికి నీళ్లుండవు. కంపుకొడుతున్న మూత్రశాలలే దిక్కు. అదే విధంగా షాబాద్, నాగరగూడ ప్రయాణ ప్రాంగణాలు చిన్నవిగా, సౌకర్యాలలేమితో ఉన్నాయి. నిత్యం వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వచ్చిపోతున్నా మొయినాబాద్‌లో కనీసం బస్‌స్టేషన్ కూడా లేదు. ఖానాపూర్, చిట్టెంపల్లి, కేతిరెడ్డిపల్లి, తదితర బస్‌స్టేజీల వద్ద బస్‌షెల్టర్లు నిర్మించాల్సి ఉంది.  
     
చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్‌పల్లి, మొయినాబాద్‌లలో డిపోలు నిర్మిస్తామని గత పాలకులు హామీలిచ్చారు. కానీ నెరవేర్చలేదు.  
     
ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌లో డిపో నిర్మాణానికి ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
     
మహేశ్వరంలో బస్‌డిపో ప్రారంభమైనా సరిపోను బస్సులను కేటాయించలేదు. ఇచ్చిన కొన్ని కూడా డొక్కువే.
     
మేడ్చల్ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు  2012లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నేటికీ పనులు చేపట్టలేదు.
     
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణానికి అధికారులు భూసేకరణ కోసం అన్వేషించారు. ఇందిరా ప్రియదర్శిని సొసైటీలో భూమిని అధికారులు పరిశీలించినా ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement