ప్రతి పల్లెకూ బస్సు | bus facility should be every village | Sakshi
Sakshi News home page

ప్రతి పల్లెకూ బస్సు

Published Sat, Dec 6 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

ప్రతి పల్లెకూ బస్సు

ప్రతి పల్లెకూ బస్సు

ఖమ్మం: రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు. రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన పశుసంవర్థకశాఖ జేడీఏ కార్యాలయం, రూ.కోటితో నిర్మించిన గిరిజన బాలుర వసతి గృహ సముదాయాలను ప్రారంభించారు. రూ. కోటి వ్యయంతో నిర్మించే 33/11 సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం బస్టాండ్‌ను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకున్నారు.

గత 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా పనిచేసిన పలువురు డ్రైవర్లను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.150 కోట్లు రవాణా శాఖకు కేటాయించారని చెప్పారు. వీటితో 100 ఏసీ, 400 పల్లెవెలుగు బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఈ బస్సుల్లో 30 ఏసీ బస్సులు ఖమ్మం జిల్లాకు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1300 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదని గుర్తించామని,  జిల్లాలో 65 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని చెప్పారు.

ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్ల మరమ్మతు, బీటీ రోడ్లు వేయడం కోసం రూ. 100 కోట్లు కేటాయించామని, రోడ్ల నిర్మాణం పూర్తి కాగానే ఆయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. నాలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఖమ్మం బస్టాండు ప్రయాణికులకు సరిపడా లేదని, దీన్ని మరోచోటుకు మార్చే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిప ల్లి కవిత మాట్లాడుతూ జిల్లాలో గిరిజన ఆ వా స ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, మారుమూల ప్రాంతాలకు బస్సులు వెళ్లకపోవడం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలి...

ఆర్టీసీ, ఆర్టీవో అధికాారులు సమన్వయంతో పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తేవాలని మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇరు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆరు డిపోల పరిధిలో 634 బస్సులు నడుస్తున్నాయని, రోజుకు మూడు లక్షల మంది ప్రయాణికులు బస్సులను వినియోగించుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజుకు ఆర్టీసీకి రూ. 10 కోట్ల ఆదాయం వస్తోందని, ఖర్చు రూ. 12 కోట్లు అవుతోందని చెప్పారు. నష్టాల్లో ఉన్నా ప్రజలపై భారం మోపొద్దనే ఉద్దేశంతోనే చార్జీలు పెంచడం లేదన్నారు. ప్రైవేట్ వాహనాలు అధికంగా తిరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ ద్వారా మరిన్ని సౌకర్యాలు అందించేందుకు రాష్ట్రంలోని 94 డిపోల మేనేజర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

రైతుల పక్షపాతిగా ప్రభుత్వం..

నవ తెలంగాణలో రైతులు సంక్షేమానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలకు అదనపు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని మంత్రి అన్నారు. రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన పశుసంవర్థకశాఖ జేడీఏ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కల్తీపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మేలిమి పాలకోసం రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి గేదెను ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు.

ఇందుకోసం నూతన విధానాలు, కృత్రిమ గర్భధారణ కేంత్రాలను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్, ఖమ్మం ఇన్‌చార్జీ ఆర్జేసీ కృష్ణ, ట్రాన్సుకో ఎస్‌ఈ తిరుమలరావు, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ శంకర్, పశుసంవర్థక శాఖ జేడీఏ అంజయ్య, ఆర్టీఏ మోహిమిన్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ నాయక్, ఆర్‌ఎం చావా అజయ్‌కుమార్, డీప్యూటీ సీటీఎం విజయగీతా, సీఎంఈ షతర్‌కుమార్, డీఎం వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వేణుమనోహర్, ఎంవీఐలు ఈశ్వర్, రవీందర్, ఎఎంవీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement