మృత్యు లారీ | Huge road accident in Nalgonda district | Sakshi
Sakshi News home page

మృత్యు లారీ

Published Thu, Oct 8 2015 2:41 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

మృత్యు లారీ - Sakshi

మృత్యు లారీ

* నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
* 10 మంది మృతి.. 18 మందికి గాయాలు
* రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
* ఘటనాస్థలిలో 9 మంది, ఆసుపత్రిలో ఒకరి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం
* మృతుల్లో గర్భిణి సహా ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు, 9 నెలల బాలుడు
* హుటాహుటిన ప్రమాదస్థలికి వచ్చిన మంత్రులు నాయిని, జగదీశ్, మహేందర్‌రెడ్డి
* మృతులకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటన.. ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మృత్యులారీ దూసుకొచ్చింది.. రహదారి రక్తమోడింది.. ఓ గర్భిణి సహా పది మంది నిండు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి! నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి నుంచి నల్లగొండకు వస్తున్న ఆర్టీసీ బస్సును, భువనగిరి వైపు పుస్తకాల లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొంది. ఘటనాస్థలిలోనే తొమ్మిది మంది చనిపోగా, మరో మహిళా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది.
 
 ప్రమాదంలో 18 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఓ గర్భిణి సహా ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు, తొమ్మిది నెలల బాలుడు ఉన్నారు. చనిపోయిన వారంతా నల్లగొండ జిల్లా వాసులే. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మౌనిక(20) అనే యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
 
 ఎలా జరిగింది..?
 ప్రమాదం తీరును పరిశీలిస్తే రెప్పపాటు కాలంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఇంద్రపాలనగరం శివారు వద్ద మూల మలుపు ఉండడంతో భువనగిరి వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ (హెచ్‌ఆర్38-6833)... ఆర్టీసీ బస్సు(ఏపీ29జెడ్2270)ను వేగంగా ఢీకొట్టింది. లారీ చాలా వేగంగా ఉండడంతో బస్సు పూర్తిగా రోడ్డు దిగిపోయి గుంతలో పడిపోయింది. లారీ కూడా పల్టీ కొట్టింది. ముందుగా డ్రైవర్ కూర్చున్న చోట ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ... అదే వేగంతో బస్సు వెనుక భాగం వరకు దూసుకుంటూ వెళ్లి పడిపోయింది. దీంతో బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది.
 
 చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, తెగిపడిన అవయవాలతో ప్రమాద స్థలి హృదయవిదారకంగా మారింది. బస్సు పడిపోయిన గుంతలో కొన్ని, బస్సులో కొన్ని మృతదేహాలు ఉన్నాయి. చనిపోయిన వారిలో కొందరి మొహం పూర్తిగా ఛిద్రమైపోగా.. మరికొందరి శరీర భాగాలు తెగిపోయాయి. ప్రమాద ఘటనను తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఏఎస్పీ గంగారాం, భువనగిరి ఆర్డీవో నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు.
 
 మంత్రుల పరామర్శ
 ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఘటనాప్రాంతానికి వచ్చారు. అంతకుముందు రామన్నపేట ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించారు. మృతుల బంధువులతో మాట్లాడారు. గాయపడ్డ వారికి మంత్రి మహేందర్‌రెడ్డి వెంటనే రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షలు, ఆర్టీసీ నుంచి రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్టు మంత్రులు ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం అందిస్తామని చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆసుపత్రి నుంచే ప్రమాద వివరాలను సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో తెలియజేశారు.
 ఆయన ఆదేశాల మేరకు పరిహారం ప్రకటించారు. ప్రయాణికులను కాపాడేందుకు శత  విధాలా ప్రయత్నించిన ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ మల్లారెడ్డికి ఆర్టీసీ నుంచి అదనంగా రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎల్పీ నేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు పలువురు నేతలు రామన్నపేట ఏరియా ఆసుపత్రికి వచ్చి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను రూ.5 లక్షల పరిహారం ప్రకటించాలని సీపీఎం కోరింది.
 
 సీఎం సంతాపం
 రోడ్డు ప్రమాదంపై సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభలో సంక్షేమ పథకాల అమలుపై జరిగిన చర్చలో సమాధానమిచ్చే ముందు ప్రమాదం విషయాన్ని సభకు వివరించి, సంతాపం ప్రకటించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ముగ్గురు మంత్రులను ఘటనా స్థలానికి పంపించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు.
 
 వైఎస్సార్‌సీపీ దిగ్భ్రాంతి
 రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతులకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్న గౌడ్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
 
 మృతుల వివరాలు
 1. యాస మల్లారెడ్డి (45), బస్సు డ్రైవర్, నార్కట్‌పల్లి మండలం
     చిన్నతుమ్మలగూడెం
 2.  కాదారి అశ్విని (20), భువనగిరి
 3. భూపతి శ్రీదేవి (32),  ఊట్కూరు
 4. సయ్యద్ సాదియా బేగం (18), రామన్నపేట
 5. అంతటి వెంకన్న (45), కట్టంగూరు
 6. గోనె శ్రీనివాస్ (40), నల్లగొండ
 7. తోట విజయలక్ష్మి (22),  దుబ్బాక
 8. పసుపుల నిర్మల (22),
 9. జగదీశ్ (9 నెలలు),  నల్లగొండ (వీరిద్దరు తల్లీ కొడుకులు)
 10. వేముల యాదగిరి (40), ఊట్కూరు
 
 మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముగ్గురు మంత్రులను ఘటనా స్థలానికి పంపించాం.
 - అసెంబ్లీలో కేసీఆర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement