రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. మితిమీరిన వేగం..ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి ముగ్గురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోగా.. మరో పదిహేడుమందిని క్షతగాత్రుల పాల్జేశాయి. ఈ దుర్ఘటన జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కట్టంగూర్ (నకిరేకల్) : కృష్ణాజిల్లా గవర్నరుపేట డిపో–1కు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఆది వారం రాత్రి గం.11.00లకు విజయవాడ నుంచి హైదరాబాదుకు 46మంది ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్‌తో కలిపి మొత్తం 48 మందితో బయలు దేరింది. మార్గమధ్యలో కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై సుమారు సోమవారం తెల్లవారు జామున గం. 2.15 లకు బస్సు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ముందున్న సిమెంట్ ట్యాంకర్ ను ఓవర్‌టేక్ చేయబోయి వెనుకనుంచి ఢీ కొట్టాడు. దీంతో సిమెంట్ ట్యాంకర్ వెనుకభాగం కొంత బస్సు క్యాబిన్‌లోకి దూసుకెళ్లింది. రెండు వాహనాలు ఒకదానికొకటి ఇరుక్కుపోయి అక్కడే నిలిచిపోయాయి.
హాహాకారాలు.. ఆర్తనాదాలు
ఆర్టీసీ బస్సు వెనుకనుంచి సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒకేసారి భారీ శబ్దం రావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. తేరుకునేలోపే సిమెంట్ ట్యాంకర్ వెనుకభాగం కొంత ఆర్టీసీ బస్సుఎడమవైపు నుంచి క్యాబిన్‌లోకి దూసుకొచ్చింది. అనుకోని ప్రమాదంతో ప్రయాణికులు హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తుండగానే ముందుభాగంలో కూర్చున్న కృష్ణాజిల్లా నంది గామ మండలం శనిగపాడు గ్రామానికి చెందిన కండక్టర్ పంతంగి రామకృష్ణ(43) రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం పాలయ్యాడు. బస్సులో ఎడమవైపు కూర్చున్న మరో 19మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రయాణికులు అప్రమత్తమై..
ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొని నిలిచిపోయిన కాసేపటికి ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చొని ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే 100 ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కట్టంగూర్ ఎస్‌ఐ నర్ర అంతిరెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయవాడలోని కృష్ణలంకకు చెందిన పాతర్లపల్లి అప్పాయమ్మ(47) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు అప్పాయమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నర్ర అంతిరెడ్డి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారు వీరే..
ఆర్టీసీ బస్సు వెనుకనుంచి సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో హైదరబాదుకు చెందిన కొమ్మినేని లక్ష్మి, చిక్కాల వాసుకీదేవీ, బొమ్మడి సాంబశివరావు, సంబంగి భానుప్రియ, ఊచ శ్రీని వాసరావు, ఆకుల అనిల్‌కుమార్, డేగ జయరాం, రవీంద్ర సురేశ్‌కుమార్, కూకట్‌పల్లికి చెందిన పులిగడ్డ శైలజ, దుర్గాచారి, వీరపనేని రంగారావు, వనస్థలిపురానికి చెందిన పుల్లూర బ్రహ్మం, కృష్ణాజిల్లా పెనిగంజిప్రోలు మండలం అనిగెల్లపాడు గ్రామానికి చెందిన బస్సుడ్రైవర్ చిలవేరు గణేశ్, ఇదే జిల్లా ముదినేపల్లి మండలం అన్నవరం గ్రా మానికి చెందిన గుమ్మడి శ్యాంనాగబాబు, విసన్నపేటకు చెందిన అన్నబత్తుల గోపి, గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన లంకె రత్నం, విజ యవాడలోని కృష్ణలంకు చెందిన పాతర్లపల్లి నాగదుర్గారావులకు గాయాలయ్యాయి. అయితే వీరపనేని రంగారావు(72) పరిస్థితి విషమించి రాత్రి మృతిచెందాడు. శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి ఉద యం సంఘటన స్థలాన్ని పరిశీలించి, అనంతరం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదవివరాలు తెలుసుకున్నారు.
మృతదేహాన్ని వెలికితీసేందుకు మూడుగంటల సమయం
బస్సు డ్రైవర్ అతివేగంతో సిమెంట్ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ Ððవెనుకభాగం కొంత బస్సు క్యాబిన్‌లోకి దూసుకొచ్చింది.ముందు కూర్చున్న కండక్టర్ రామకృష్ణ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. అతడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో జీఎంఆర్ సంస్థకు చెందిన రెండు క్రేన్‌లు తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు నల్లగొండ నుంచి ఫైర్ సిబ్బందిని రప్పించి కట్టర్ సహాయంతో పట్టీలను తొలగించి మృతదేహాన్ని వెలుపలికితీశారు. అనంతరం బస్సును క్రేన్ సహాయంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రక్రియ మూడుగంటల పాటు సాగింది.
Comments
Please login to add a commentAdd a comment