అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం
నిధులు, నీళ్లు రాబట్టడంలో సఫలమయ్యాం
జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదిస్తున్నాం
‘సాక్షి’ఇంటర్వ్యూలో మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రగతిమార్గాలు
రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశాం. దారి ఉన్న గ్రామాలు ప్రగతికి సూచికలనే మాటను నిజం చేసేలా.. పంచాయతీరాజ్ రోడ్లకు అత్యధిక నిధులు విడుదల చేశాం. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసే పల్లెల రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ.800 కోట్లు మంజూరు చేశాం. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.2వేల కోట్లను కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సంప్రదింపులు జరపడం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- బీజాపూర్ హైవేకు జాతీయ హోదా సాధించగలిగాం.
జలం.. దక్కింది ఫలం
జలవనరులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడం... వ ర్షపు నీరు భూమిలోకి ఇంకేలా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాం. కనుమరుగవుతున్న నీటివనరులను కాపాడుకోవడమే ధ్యేయంగా మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టాం. రెండే ళ్లలో రూ.360 కోట్లతో 1,145 చెరువులను బాగు చేశాం. పూడిక తీత, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు అతిత్వరలోనే మనకు కనిపించనున్నాయి. ‘మా గ్రామం-మా చెరువు’ నినాదంతో ప్రతి చెరువును అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో నిధులు విడుదల చేస్తున్నాం. కోట్‌పల్లి ప్రాజెక్టు విస్తరణకు రూ.86 కోట్లు కేటాయించాం.
‘భగీరథ’ ప్రయత్నం సఫలం
ఆడపడుచు బిందె పట్టుకొని బయటకు వెళ్లకూడదనే ఏకైక సంకల్పంతో అమలు చేస్తున్న మిషన్ భగీరథ కార్యరూపం దాల్చింది. జిల్లాలో రూ.2 వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే పనులకు టెండ ర్లను కూడా ఖరారు చేశాం. జూన్ మొదటి వారంలో మేడ్చల్ మండలంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నాం.
అంతర్జాతీయ ఖ్యాతి
గూగుల్, మైక్రోమ్యాక్స్, అమెజాన్, ఆపిల్ లాంటి సంస్థలకు జిల్లా కేంద్రబిందువైంది. నూతన పారిశ్రామిక విధానంతో జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భద్రత లక్ష్యంగా... ‘షీ’ క్యాబ్‌లను ప్రవేశపెట్టాం. ప్రత్యేకంగా వారికోసం ఏసీ బస్సులను నడుపుతున్నాం. రూ.40 కోట్లు నష్టం వచ్చినా వారి రక్షణ దృష్ట్యా ఆర్డీనరీ బస్సుల్లోనూ క్యాబిన్‌లను ఏర్పాటు చేశాం.
కృష్ణమ్మతో సస్యశ్యామలం
సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లలో గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది. గోదావరి జలాలను జిల్లాకు తరలించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 2.40 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించింది. తద్వారా చివరి ప్రాజెక్టులో ఉన్న చివరలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు నీరందడం కనాకష్టమే. ఈ పరిణామాలను గమనించే పక్కనే ఉన్న కృష్ణానది జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించాం. ఫలితంగా డిండి, పాలమూరు- రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుల కింద 5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నాం.
కొత్తగా రెండు జిల్లాలు
జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత పాటిస్తాం. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. లోక్‌సభ నియోజకవర్గాలకు అనుగుణంగా జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదిస్తున్నాం. నాతోపాటు పర్యాద కృష్ణమూర్తి సభ్యులుగా వ్యవహరిస్తున్న పున ర్విభజన కమిటీ ద్వారా కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించాం. అయితే, జిల్లాను మూడు ముక్కలు చేయాలనే అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
కొత్తగా రెండు జిల్లాలు: మహేందర్ రెడ్డి
Published Wed, Jun 1 2016 11:30 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement