bus facility
-
అక్కడికి బస్సు కోసం నెటిజన్ ట్వీట్.. స్పందించిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్లో ఎండీ సజ్జనార్ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్లో అక్కడికి ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. ఈ ట్వీట్‌కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్‌ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్డేట్ చేయండి’అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్‌కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు. #TSRTC has arranged special buses to #muchinthal Statue of Equality from the important locations, Timings also furnished. Buses will be scaled up as per traffic demand. Choose #TSRTCBuses for your journeys pic.twitter.com/CEq36k0wzJ — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 31, 2022 -
'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్ గ్రామంతో పాటు మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈసీఐఎల్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్‌కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్ స్కూల్‌కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్ఐ వెంకన్నతో పాటు షీ టీమ్ బృందం ఎస్ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ పరిసరాలలో పెట్రోలింగ్ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. -
కాలినడకన వెళ్తుంటే కాటేశారు
పాన్‌గల్: కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామాంధులు అటకాయించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది. మల్లాయపల్లికి చెందిన విద్యార్థిని(14) పాన్‌గల్ మండలం చింతకుంటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి రోజూ స్నేహితులతో కలసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లి వస్తోంది. రోజులాగే మంగళవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి పాఠశాలకు వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన వివాహితులైన నాగరాజు, అనిల్ రెండు వేర్వేరు బైక్‌లపై వచ్చి స్కూల్ వద్ద వదిలేస్తామని వారిని నమ్మించారు. అనిల్ ఇద్దరు బాలికలను తన బైక్‌పై ఎక్కించుకుని ముందు వెళ్లగా, నాగరాజు మరో బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు బాలికలను స్కూల్ వద్ద వదిలిపెట్టి తిరిగి వచ్చిన అనిల్ సైతం బాధితురాలిపై అఘాయిత్యం చేశాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధితురాలిని భయపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ఏడుస్తూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో వారు కుటుంబసభ్యులు, మల్లాయపల్లి సర్పంచ్ జయకళకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. నాగర్‌కర్నూల్ ఎస్పీ మనోహర్, వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలను సేకరించారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు
సాక్షి, యాదాద్రి: ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు, నాయకులు చేసే ఆర్భాటం, హడావుడి అంతాఇంతాకాదు, హామీల మీద హామీలు ఇస్తుంటారు. వాటిని వెంటనే నెరవేరుస్తామని నమ్మబలుకుతారు. ఆ తరువాత అతీగతీ ఉండదనడానికి హాజీపూర్ ఉదంతమే చక్కని ఉదాహరణ. 2019లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వెలుగు చూసిన బాలికలపై అత్యాచారం, హత్యల నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. హాజీపూర్ నుంచి బాలికలు ప్రతిరోజూ కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి ట్రాప్ చేసి, ముగ్గురు బాలికలపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్ 26న వెలుగు చూసింది. నిందితుడు ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దారుణ సంఘటన అనంతరం హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం, గ్రామం పక్కన గల శామీర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు అప్పట్లో హామీలు ఇచ్చారు. ఇంతవరకు అవి అమలైన దాఖలా లేదు. ప్రస్తుతం హాజీపూర్ నుంచి 16 మంది బాలికలు ప్రస్తుతం కాలినడకన బొమ్మలరామారం మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు కాలినడకన బయలుదేరి 9.30 వరకు పాఠశాలకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి బయలుదేరి 6 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఆకతాయిలు అప్పుడప్పుడు వేధిస్తున్నారు. ఆ విద్యార్థినుల బాధలేమిటో వారి మాటల్లో.. ఆకతాయిలతో ఇబ్బంది స్కూల్ నుంచి ఇంటికి కాలినడకన వెళ్లే సమయంలో కొందరు యువకులు బైక్‌లపై వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు తాకేలా దగ్గర నుంచి వేగంగా వెళ్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. వెకిలిచేష్టలు చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. – గొండ్రు అర్చన, 6 వ తరగతి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం ఆ ముగ్గురు బాలికలను చంపిన బావులకు సమీపంగా నడిచేటప్పుడు భయం వేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మాకు రవాణా సౌకర్యాలు కల్పించాలి. గ్రామం నుంచి మా బడి వరకు బస్సు నడపాలి. – సిరిమిల్ల శ్వేత, ఇంటర్ సెకండ్ ఇయర్ 3 గంటలు నడుస్తున్నాం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పాఠ శాలకు గంటన్నర సమయంలో చేరుకుంటున్నాం. పుస్తకాలు, నోట్‌పుస్తకాల బరువుతో బ్యాగ్ మోయలేకపోతున్నాం. రోజూ మూడు గంటల సమయం కాలినడకకే సరిపోతుంది. – ధీరావత్ సరిత, ఇంటర్ సెకండియర్ -
హాజీపూర్ : వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: తాండూరు పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగైదు పల్లెల్లోని బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉంది. కానీ ఆ ఊళ్లలో సర్కారు బడులు లేకపోవటంతో బషీరాబాద్ మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఉన్న గొట్టిగ ఖుర్ద్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. సరే అంతదూరం వెళ్లయినా చదువుకుందామంటే.. అక్కడిదాకా వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. బడికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. దీంతో అంతంతదూరం నడుస్తూ వెళ్లి చదివించడం అవసరమా అని తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించేందుకు సందేహిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ ఈ కారణంతోనే బడులు మాన్పించారు కూడా. ఈ విషయాన్ని గుర్తించిన రోటరీ క్లబ్ సభ్యులు.. చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారందరికీ గతేడాది 150 సైకిళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు వారు సైకిళ్లపై అంతా కలిసికట్టుగా బడికి వెళ్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. సరే.. మరి సైకిళ్లు కూడా లేని ఊళ్ల సంగతేంటనే సందేహానికి తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చే ఏకైక సమాధానం.. చదువు మాన్పించడమే. కొందరు నడుచుకుంటూనో, వాహనాలను లిఫ్ట్ అడిగో బడులకు వెళ్తున్నారు. ఇలాంటి ఊళ్లు వెయ్యికి పైగానే ఉన్నాయి. మరి ఆ గ్రామాల్లో పరిస్థితేంటి? హాజీపూర్ ఘటన పది రోజుల క్రితం.. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న, యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే కీచకుడి ఉదంతం వెలుగులోకి రావడంతో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో భయం పెరిగింది. చదువు కోసమో, ఇతర పనుల కోసమో వేరే ఊళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే వణికిపోతున్నారు. ఇది ఒక గ్రామం సమస్యకాదు. వేయి గ్రామాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదన. ఎందుకంటే ఈ గ్రామాలకు ఇప్పటికీ బస్సు వసతి లేదు. హాజీపూర్ గ్రామానికి నగరం నుంచి సిటీ బస్సు సౌకర్యం ఉన్నా, స్కూలుకెళ్లే సమయానికి బస్సులు లేకపోవటంతో పిల్లలు నడుచుకుంటూనో, ఆ దారిగుండా వెళ్లే వాహనాలను లిఫ్ట్ అడిగో వెళ్తుంటారు. వీరి ఈ నిస్సహాయతను ఆసరా చేసుకుని శ్రీనివాస్ రెడ్డి ‘హత్యా’చారాలకు పాల్పడ్డ తీరు నివ్వెరపరిచింది. ఇదే ఇప్పుడు బస్సు సౌకర్యం లేని ఊళ్లలో ఆడపిల్లలను అలా పంపాలంటే తల్లిదండ్రులు ఆవేదన చెందేందుకు కారణమవుతోంది. ములుగు గణపురం సమీపంలోని బస్వరాజుపల్లెకు బస్సు వసతి లేక ప్రయాణికులు ఇలా వెళ్తున్నారు ఎందుకీ దుస్థితి? రాష్ట్రంలో 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ అధికారులు అంకెల్లో చూపుతున్నా.. వాస్తవానికి ఆ సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని సిబ్బందే పేర్కొంటున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకంగా 330 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. ఇందులో జనాభా పరంగా పెద్ద గ్రామాలు 66 ఉన్నాయి. అనుబంధ గ్రామాలు కలిపితే వాటి సంఖ్య 1300కుపైనే ఉంది. దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా అవుతూ రికార్డు సృష్టిస్తున్న వేళ.. వెయ్యికి పైగా గ్రామాలు ఆర్టీసీ బస్సు మొహం చూడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బస్సులు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కనీసం డ్రైవింగ్ కూడా సరిగా రాని యువకులు ఆటోలు నడుపుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇష్టమొచ్చినంత మందిని ఆటోల్లో కుక్కి తీసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రతిరోజూ ఆటో చార్జీలు భరించలేని పేద విద్యార్థులకు నడిచి వెళ్లడమో, లిఫ్ట్ అడగడమో తప్ప వేరే మార్గమే లేదు. కానీ.. హాజీపూర్ ఉదంతంతో లిఫ్ట్ అడగాలంటేనే పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. బస్సులెందుకు నడవటం లేదు ప్రధాన రహదారులకు చేరువగా ఉన్నా.. కొన్ని ఊళ్లకు ఇప్పటికీ సరైన రోడ్డు వసతి లేదు. గతుకుల రోడ్డుపై ప్రయాణంతో బస్సులు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ ఊళ్లకు బస్సును నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. గతంలో బస్సులు నడిచి, ఆ తర్వాత రోడ్డు బాగా పాడవటంతో సర్వీసులను ఆపేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీసీ చెబుతున్న లెక్కల ప్రకారం 844 గ్రామాలకు బస్సులు నడవటం లేదు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు సరిగా లేకపోవడాన్నే కారణంగా చూపుతుండటం విశేషం. కొన్ని ఊళ్లకు బస్సు పట్టేంత రోడ్డు లేదు. మలుపులు, వంకలు, పురాతన బావులను దాటుకుని వెళ్లటం అసాధ్యమంటున్నారు. ఈ గ్రామాలకు యుద్ధప్రాతిపదికన రోడ్లను నిర్మించాల్సి ఉన్నా, అది జరగటం లేదు. ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు డబుల్ రోడ్లను నిర్మిస్తున్నా.. గ్రామాల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇప్పటి వరకు రవాణాశాఖ – పంచాయతీరాజ్ శాఖల మధ్య అసలు సమన్వయమే కుదరలేదు. ఈ దిశగా చర్చలు జరగకపోవటమే అసలు ట్విస్టు. ప్రధాన రోడ్లకు చేరువగా ఉంటే శాపమే ఆర్టీసీ పరిభాషలో ‘టీ’ ఆపరేషన్ అని ఉంటుంది. అంటే ప్రధాన రోడ్డుకు నాలుగైదు కిలోమీటర్ల చేరువలో ఉన్న ఊళ్లకు బస్సులు వెళ్లవన్నమాట. ఆ మార్గంలో ఒకటి రెండు ఊళ్లు మాత్రమే ఉంటే, వాటి కోసం ప్రత్యేకంగా బస్సు తిప్పరు. ఆ ఊరి జనం ప్రధాన రోడ్డుమీదకు వచ్చి బస్సు ఎక్కాల్సిందే. ఆ మార్గంలో ఏడెనిమిది ఊళ్లుంటేనే ఓ సర్వీసు నడుపుతారు. అలా ప్రధాన రోడ్లకు చేరువగా ఉండి బస్సు తిరగని ఊళ్లు ఆర్టీసీ లెక్కల ప్రకారం 136 ఉన్నాయి. ఇతర ‘అక్రమ’ వాహనాలతో.. బస్సు లేనప్పుడు ప్రత్యామ్నాయ రవాణావైపు చూడాల్సిందే. పల్లెల్లో చాలాచోట్ల బస్సులు రాకపోవటాన్ని ఆసరా చేసుకుని ఆటోలు, జీపులు, వ్యాన్లు, ఇతర వాహనాలు ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇప్పుడేమో అలాంటి వాహనాలు పెరిగినందువల్ల బస్సులు నడిపితే నష్టం వస్తుందంటూ ఆర్టీసీ కొన్ని గ్రామాలకు బస్సులు తిప్పటం లేదు. తన లెక్కల ప్రకారమే ఇలాంటి రూట్ల సంఖ్య 244. తీవ్ర నష్టాల్లో ఉన్నా... 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆర్టీసీ తేల్చిన నష్టాల లెక్క రూ.680 కోట్లు. మార్చితో అది దాదాపు రూ.750 కోట్లకు చేరి రికార్డు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి దుస్థితి ఉన్నప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి. వీలైనంత వరకు ప్రయాణికుల సంఖ్య పెంచుకుని ఆదాయాన్ని ఆర్జించాలి. కానీ కొత్త ప్రాంతాలకు తిప్పేందుకు ఆర్టీసీ వద్ద చాలినన్ని బస్సులు లేవు. ఒకవేళ తిప్పినా.. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉంటోందన్న పేరుతో రద్దు చేస్తున్నారు. డిపో మేనేజర్లపై నిరంతరం ఓఆర్ కత్తి వేళ్లాడుతుండటంతో.. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే ఊళ్లకు బస్సులు నడిపేందుకు వారు వెనకడుగువేస్తున్నారు. నష్టాలతో లింకెందుకు... ప్రతి ఊరుకు రవాణా వసతి హక్కు లాంటిదే. కానీ వివిధ కారణాలతో వెయ్యి గ్రామాలకు బస్సు వెళ్లకపోవటం బాధాకరమే. నష్టాలతో లింకు పెట్టకుండా అన్ని ఊళ్లకు బస్సు నడపాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఆ నష్టాలను ప్రభుత్వమే భరించి అన్ని గ్రామాలకు ప్రభుత్వ, సురక్షిత రవాణా వసతి కల్పించాలనే వాదన బలంగా ఉంది. కానీ అది అమలు కావటంలేదు. సామాజిక పింఛన్ల తరహాలో రవాణా వసతి లాంటి వాటికి కూడా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ మేరకు ఆర్టీసీకి నిధులు కేటాయిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు. ప్రమాదాలూ తగ్గుముఖం చాలా రోడ్డు ప్రమాదాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా వరకు సురక్షితమే. నలుగురు ఎక్కాల్సిన ఆటోల్లో పదిహేను మంది వరకు ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి తప్పిపోతుంది. కొన్ని చోట్ల లారీల్లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సు ప్రయాణం బాలికలు, మహిళలకు కొంతవరకు రక్షణ ఇస్తుంది. ‘హాజీపూర్’లాంటి దురాగతాలకు బస్సు ద్వారా చెక్ చెప్పినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జగనన్న వస్తున్నారని ఊరికి బస్సేశారు
‘మా ఊరుకు బస్సు సౌకర్యం లేదు. విద్యార్థినులు విద్యాలయాలకు సకాలంలో చేరుకోలేక చదువులు మానేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇప్పుడు ఆర్టీసీ బస్సు వేశారు. ఎన్ని రోజులు నడుపుతారో కూడా తెలియదు. ఈ బస్సు సర్వీసు కూడా ఉదయం 10 గంటలకు వేయడంతో మాకు ప్రయోజనం లేదు. 9 గంటలకు మార్చేలా చూడాలి’ అంటూ నాగులపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని గొర్రెపాటి మాధవి జననేత దృష్టికి తెచ్చారు. – ఒంగోలు వన్‌టౌన్ రుణమాఫీ హామీ బూటకం ‘గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఒట్టి బూటకం. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ టీడీపీ అనుకూల వర్గాలకే వర్తింపజేస్తున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పద్మావతి డ్వాక్రా గ్రూపు మహిళలు వల్లంరెడ్డి పద్మావతి, అంజమ్మ, దుగ్గిరెడ్డి ప్రసన్న, పల్లక సుశీల, ఇనమల కోటేశ్వరమ్మ తదితరులు జననేత దృష్టికి తెచ్చారు. – ఒంగోలు వన్‌టౌన్ -
'ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం'
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఆయన జగిత్యాలలో బస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 1157 కొత్త బస్సులు, 157 మినీ ఏసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్టు సోమారపు సత్యనారాయణ తెలిపారు. -
కలిసి పనిచేస్తే లాభాల బాట
► జిల్లాలో ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలి ► పల్లె వెలుగు’తోనే రూ.500కోట్లు నష్టం ► ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేస్థాయికి ఆర్టీసీ ఎదగాలి ► ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మహబూబ్‌నగర్ క్రైం : జిలాల్లో ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించి.. కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తేనే సంస్థ లాభాల బాట పడుతుందని ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. మహబూబ్‌నగర్ బస్సు డిపోలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓఆర్‌తో పాటు బస్సుల సంఖ్య పెంచి సమయానికి ప్రయాణికుడికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం వారికి 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని, ఇది దృష్టిలో పెట్టుకుని కష్టపడాలన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గురించి సీఎం దగ్గర చర్చించి ప్రత్యేక రాయితీలు తీసుకురావడంతో పాటు సంస్థలో ఉండే వారిని ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీకి ఒక్క పల్లెవెలుగుతోరూ.500కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. సంస్థ గతేడాది రూ.700కోట్ల అప్పుల్లో ఉంటే, ఈ ఏడాది రూ.220కోట్ల అప్పు ఆర్టీసీ సంస్థ తలపై వేలాడుతోందన్నారు. నష్టాలపై చర్చించాలి పాలమూరు జిల్లాలో ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందనే అపకీర్తిని అతి తక్కువ కాలంలో తుడిచివేయాలని సోమారపు అన్నారు. ఏ కారణంతో నష్టం వస్తుందనే విషయం కార్మికుడి నుంచి ఓ ఉన్నత అధికారి వరకు చర్చించుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డుపై బ్రేక్‌డౌన్ కాకుండా మెకానిక్‌లు చూసుకోవాలన్నారు. ఎప్పుడు కూడా ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంపై ఆదారపడకుండా ఆర్టీసీనే ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. భూమి కేటాయిస్తే.. అన్ని హంగులతో నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమి కేటాయిస్తే ఇక్కడి డిపోను ఇతర ప్రాం తానికి మార్చి ఈ బస్టాండ్‌ను అత్యంత హంగులతో పలు వాణిజ్య సముదాయలతో నిర్మాణం చేయిస్తామని ఆర్టీసీ చైర్మన్ అన్నారు. త్వరలోనే మన్యంకొండకు, పిల్లల మర్రికి మినీ బస్సులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ జేఎండీ రమణారావు మాట్లాడారు. -
ఇదెక్కడి దౌర్భాగ్యం!
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది తమిళనాడు ప్రభుత్వ పాలన. గ్రామీణ ప్రాంతాలకు సరైన బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో పలువురు గ్రామీణ విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. తళి నియోజకవర్గంలోని దాసరపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు ఏడు గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి పాఠశాలల వేళకు బస్సు సౌకర్యం లేదు. దీంతో గంటల తరబడి రోడ్డుపక్కనే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో బడిలో చదువులు వల్లె వేయాల్సిన విద్యార్థులు రోడ్డుపక్కనే బారులుదీరి కూర్చొని పాఠాలు చదువుకోవడం ప్రారంభించారు. పాఠశాల వేళకు ఓ బస్సు ఏర్పాటు చేస్తే ఈ విద్యార్థుల వెతలు తీరుతాయని పలువురు అంటున్నారు. -
ఎంసెట్‌కు సర్వం సిద్ధం
అభ్యర్థులు 5970 మంది నిమిషం లేటైనా నో ఎంట్రీ మెదక్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా బస్సు సౌకర్యం సంగారెడ్డి క్రైం : జిల్లాలో గురువారం జరగనున్న ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ జిల్లాలోని మెదక్, సిద్దిపేటలో ఎంసెట్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సీఎస్‌కు వివరించారు. జిల్లాలో మొత్తం 5,970 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వరంగల్ నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని కలెక్టర్లకు ఎంసెట్ పరీక్ష నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ దయానంద్, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఉప రవాణా కమిషనర్ మమతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు గట్టి బందోబస్తు మెదక్ : ఎంసెట్ నిర్వహణకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నట్టు మెదక్ ఆర్డీఓ మెంచునగేష్ తెలిపారు. గురువారం నిర్వహించే ప్రవేశపరీక్ష ఏర్పాట్లపై బుధవారం మెదక్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మెంచు నగేష్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. మెదక్ పరిధిలో మొత్తం 2,920 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు తెలిపారు. పరీక్షల కోసం మెదక్ పట్టణంలో ఇంజినీరింగ్ విభాగానికి 5 కేంద్రాలు, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాలకు 4 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ బాలుర హైస్కూల్, ప్రభుత్వ బాలికల హైస్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ హైస్కూల్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుందన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా జేఎన్టీయూ నుంచి వస్తారని తెలిపారు. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉదయం 9.15వరకు, మెడిసిన్, అగ్రికల్చర్వారు మధ్యాహ్నం 1.45 నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో కరెంట్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల వద్ద హెల్పడెస్క్లను, మంచినీరు, మజ్జిగ అందించనున్నట్టు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శిరిగ ప్రభాకర్ ఆర్డీఓకు తెలిపారు. సమావేశంలో జేఎన్టీయూ ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ పి.వేణుగోపాల్, రూట్ ఆఫీసర్ డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, ఎంసెట్ మెదక్ కోఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ పండిత్రావు, ఇన్చార్జి ఏబీసీడబ్ల్యుఓ హన్మంత్‌రెడ్డి, మెదక్ తహశీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం వైపీఆర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
నానా హైరానా
సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రగతి రథ చక్రం రోడ్డెక్కలేదు. జిల్లాలోని ఏడు డిపోల నుంచి 750 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తొలి రోజు రూ.కోటి మేరకు నష్టం వాటిల్లింది. మరోపక్క ప్రయాణికులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమైంది. 43 శాతం ఫిట్మెంట్ చెల్లిం చాలనే డిమాండ్‌తో తెలంగాణ మజ్దూర్ యూని యన్, ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మె జనజీవనంపై ప్రభావం చూపింది. సమ్మె వల్ల ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు కార్మిక సంఘాల ప్రతిఘటనతో ఫలించలేదు. ఫలితంగా ఒక్క బస్సూ కదల్లేదు. గజ్వేల్ డిపో పరిధిలో ఒక ప్రైవేట్ బస్సును మాత్రం తూప్రాన్ వరకు నడిపించారు. మొత్తంగా కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి బుధవారం ఒక్కరోజే సుమారు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేయడంతో గురువారం కూడా బస్సుల రాకపోకలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే కార్మికులు ఆయా డిపోల వద్దకు చేరుకుని బస్సులను కదలనివ్వలేదు. సంగారెడ్డి డిపోకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్, కండక్టర్లుగా పనిచేయడానికి వచ్చిన వారి అర్హత పత్రాలను చించివేస్తామని కార్మికులు బెదిరించడంతో వారంతా వెనక్కితగ్గారు. సమ్మె తమ కోసం చేయట్లేదని, తమకు సహకరించాలని కార్మికులు కోరడంతో వారంతా సంఘీభావం తెలపడం విశేషం. సమ్మెలో జిల్లా వ్యాప్తంగా 2,900 మంది కార్మికులు పాల్గొనడంతో 750 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా డిపోల వద్ద కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ? సమ్మె.. పైగా శుభకార్యాల సీజన్.. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆయా రీజనల్ మేనేజర్లను ఆదేశించింది. కానీ అటువంటి ప్రయత్నాలను కార్మిక యూనియన్లు అడ్డుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణం సాగక రవాణా సదుపాయాల్లేక వ్యయప్రయాసలు పడి గమ్యాలను చేరుకున్నారు. బస్సులు తిరగవనే విషయం తెలియక పలువురు పిల్లాపాపలతో బస్సు స్టేషన్లకు చేరుకుని.. తీరా విషయం తెలిశాక యాతన పడ్డారు. ఇదే అదనుగా ఆటోలు, ఇతర రవాణా సాధనాల చార్జీలకు రెక్కలొచ్చాయి. దూరంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుల అవసరాన్ని బట్టి డబ్బులు డిమాండ్ చేశారు. డిమాండ్ల నెరవేర్చే వరకు.. ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఇంక్రిమెంట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజనల్ కన్వీనర్ పీరయ్య డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని చూసినా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని హెచ్చరించారు. విధులకు రాకుంటే తొలగిస్తాం రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న క్యాజువల్ కండక్టర్లు, డ్రైవర్లు, కాంట్రాక్ట్ డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఇన్చార్జి రీజనల్ మేనేజర్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 97 మంది క్యాజువల్ కండక్టర్లు, కాంట్రాక్ట్ కండక్టర్లు, 74 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు బుధవారం మూకుమ్మడిగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. వెంటనే విధుల్లో చేరకుంటే సర్వీస్ నుండి తొలగిస్తామన్నారు. బస్సును అడ్డుకున్న కార్మికులు సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం నుంచి డీపోలకే పరిమితమైన బస్సులను రాత్రి 7 గంటల ప్రాంతంలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి ప్రైవేట్ డ్రైవర్‌తో బస్సును డీపోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో కార్మికులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు చేసేదేమి లేక బస్సును డిపోలోకి పంపించారు. దీంతో కొద్దిసేపు బస్సుడిపో ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
పల్లెపల్లెకు బస్సు సౌకర్యం
మెదక్‌టౌన్: రాష్ట్రంలోని పల్లెపల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ బస్ డిపోలోని నూతన బస్సులకు ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీను లాభాల్లోకి తీసుకవెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 500 హైర్, 500 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బంది సేవా ధృక్పథంతో పని చేయాలన్నారు. మెదక్ బస్ డిపోకు 10 బస్సులు అవసరం ఉండగా ఇప్పటికి ఐదు బస్సులు వచ్చాయని, మరో ఐదు బస్సులు త్వరలో వస్తాయన్నారు. మెదక్ నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో పార్కింగ్ స్థలానికి నిధులు కేటాయించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పద్మాదేవేందర్ దృష్టికి తీసుకవెళ్లగా, పార్కింగ్ స్థలానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ నగేష్, తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జునగౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఎంయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, షకయ్య, పృధ్వీరాజ్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సుభాష్‌చంద్రబోస్, మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డిలతో పాటు కౌన్సిలర్లు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
రవాణా వ్యవస్థకు కొత్త మెరుగులు
మంత్రి మహేందర్‌రెడ్డి మంచాల:రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుట్లలో విలేకర్లతో మాట్లాడుతూ రవాణా వ్యవస్థలో నూతన పద్ధతులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణలో 1300 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి బస్టాండ్‌లో తాగు నీటి వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలపారు. హైదరాబాద్ నుండి తె లంగాణలోఅన్ని జిల్లాలకు ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేస్తామని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని వివరించారు. విద్యరంగం అభివృద్ధికి రూ. 50కోట్లతో రాష్ట్రంలో 142 పాఠశాలల భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు భూపతి గళ్ల మహిపాల్, ఎంపీపీ జయమ్మ, వైస్ ఎంపీపీ దన్నె భాషయ్య, మంచాల సహాకార సంఘం చైర్మన్ సికిందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులు,మండల కోఆ ప్షన్ సభ్యుడు సలాం, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవే అభివృద్ధి కార్యక్రమాలు.... మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంచాలలో రూ.7.4 లక్షలతో నిర్మించిన బాలుర పాఠశాల భవ నాలు, దాద్‌పల్లిలో రూ.4.20 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మంచాలలో రూ.11లక్షలతో చేపట్టిన బాలికల ఉన్నత పాఠశాల భవనాలు, కోటి70లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు పనులు, ఆరుట్లలో రూ.84లక్షలతో ఆరుట్ల -బండలేమూర్ రోడ్డు పనులు, రూ.7.4 లక్షలతో బాలుర పాఠశాల భవన నిర్మాణం పనులు, రూ.42లక్షలతో బాలికల ఉన్నత పాఠశాల భవనాల పనులను ఆయన ప్రారంభించారు. ఇంకా రంగాపూర్‌లో రూ.7.5 లక్షలతో గోపాల మిత్ర కార్యాలయం, రూ.5లక్షలతో అంగన్ వాడీ కేంద్రం నిర్మాణం పనులు, దాద్‌పల్లిలో రూ.7.44 లక్షలతో నీటి సరఫరా ట్యాంకు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అర్హత సర్వేపై ఆందోళన వద్దు యాచారం: సంక్షేమ పథకాల అర్హత సర్వేతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులెన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు తప్పకుండా అందుతాయని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన రూ. కోటికి పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గడ్డమల్లయ్యగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడి తల్లెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి వనరులపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో చెరువులు నిర్మించడానికి, పాత చెరువులు, కుంటలు మరమ్మతుకు ఎన్ని రూ. కోట్ల నిధులైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో మరో 75 శాతం నగదును కూడ బ్యాంకుల్లో జమ చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు రూ. 3.50 లక్షల నిధులతో ఇంటిని నిర్మించడానికి సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 500 జనాభా దాటి న గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నట్లు తెలిపారు. తాం డూరు, పరిగి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొత్త గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
ఆ ఊరికి పెళ్లి సంబంధమా.. వద్దు బాబోయ్
ఆ గ్రామంతో వియ్యమందేందుకు కూడా ఇతర ప్రాంతాల ప్రజలు జంకుతారు. అలాగని గ్రామంలో కక్షలూ, కార్పణ్యాలూ ఉన్నాయా? అంటే అదీ కాదు. ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదంతే. ఎంతగా అంటే.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కూడేరు మండలం పి.నారాయణపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం పేరు ఎంఎం హళ్లి. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 1100 మంది జనాభా గ్రామంలోని బీసీ కాలనీలో 265 కుటుంబాలు, ఎస్టీ కాలనీలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 1100 దాకా జనాభా ఉంటుంది. వీరిలో వాల్మీకి, ఎరుకల సామాజిక వర్గాల ప్రజలే అధికం. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొందరికి భూములున్నా నీరు లేక బీళ్లుగా వదిలేశారు. మరి కొందరు అరకొరగా ఉన్న నీటితో పంటలు సాగు చేసుకుంటున్నారు. చాలామంది స్థానికంగా పనులు లేక బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న పొలాల్లోకి కూలిపనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు. మేనరికపు వివాహాలే అధికం ఇప్పటిదాకా గ్రామానికి ఎర్రబస్సు వచ్చిన దాఖలాలే లేవంటే, ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలున్నాయో అర్థమవుతుంది. గ్రామానికి వెళ్లే రహదారి గులకరాళ్లు, ముళ్ల పొదలతో అధ్వానంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే 108 వాహనం కూడా ఈ గ్రామానికి వెళ్లదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో, ప్రసవ సమయాల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని రెండు ఆటోలే వారికి దిక్కు. అందువల్లే ఈ గ్రామానికి స్థానికుల బంధువులు గానీ, అధికారులు గానీ వెళ్లాలంటే వెనుకంజ వేస్తారు. ఇక ఈ గ్రామస్తుతో వియ్యమందేందుకు ఎవరూ ముందుకు రారు. వాహన సౌకర్యం లేని గ్రామంలోని అబ్బాయికి, అమ్మాయిని ఇవ్వాలన్నా, గ్రామంలో అమ్మాయిని చేసుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. దీంతో, గ్రామంలోని వారే, తమ బంధువుల కుటుంబాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారు. చదువు మానేసిన విద్యార్థులు బీసీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలున్నాయి. దాదాపు 90 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. 50 మంది దాకా 8 నుంచి డిగ్రీ వరకు ఆత్మకూరు, అనంతపురంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక, ఆర్థిక సమస్యలు సహకరించక చదువు మానేశారు. అభివృద్ధికి కృషి చేయండి అన్ని విధాల వెనుకబడిన తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసి, బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కృష్ణమ్మ, గ్రామస్తులు కృష్ణప్ప, నారాయణ స్వామి, రామస్వామి, ప్రసాద్ తదితరులు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఎగుడుదిగుడు వీధులు గ్రామంలోని కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన వాటికన్నా, ఆర్డీటీ నిర్మించిన ఇళ్లే అధికంగా ఉన్నాయి. సిమెంటు రోడ్డు లేకపోవడంతో వీధులన్నీ ఎగుడుదిగుడుగా మారాయి. వీటన్నింటితో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామస్తులను వేధిస్తోంది. -
కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా!
హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని సగం పల్లెలకు, తండాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువ. విద్యార్థులు అధికంగా బస్సులను ఆశ్రయిస్తారు. కానీ అరకొర బస్సుల కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాలో కొన్ని చోట్ల డిపోలను నిర్మిస్తామని గతంలో నాయకులు హామీలిచ్చారు. కానీ వాటిల్లో ఏవీ నెరవేర్చలేదు. శరవేగంగా పెరుగుతున్న జిల్లా జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో రవాణా వ్యవస్థ మెరుగవుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతారని, డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి ఇస్తారని, బస్టాండ్లను ఆధునికీకరిస్తారని, కొత్త డిపోలను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు రవాణా సౌకర్యాలు మెరుగు పడతాయని ఆశపడుతున్నారు. జిల్లాలో సుమారు 150కిపైగా ఉన్నతవిద్యా కళాశాలలున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు నిత్యం పలు ప్రాంతాలనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 30వేలకు పైగా విద్యార్థులు నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తారని అంచనా. కానీ ప్రస్తుతం జిల్లాలో అరకొర బస్సులే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బస్సు డిపోలను సైతం నిర్మించాల్సి ఉంది. ఉన్న బస్టాండ్లలో అనేక సమస్యలున్నాయి. కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉండదు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. చిన్నగా ఉన్న బస్టాండ్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. దామరగిద్ద బస్‌డిపో నిర్మాణమెప్పుడో.. చేవెళ్ల, పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నాయి. దీంతో బస్సుల అవసరం కూడా అధికమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012 డిసెంబరులో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేవెళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని దామరగిద్ద వద్ద బస్‌డిపో నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. కానీ అక్కడ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ డిపో నిర్మాణానికి రెవెన్యూ అధికారులు రైతుల నంచి 8 ఎకరాలు తీసుకుని ఆర్టీసీకి ఇచ్చేశారు. కానీ రైతులకు మాత్రం ఇప్పటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. ఇదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొయినాబాద్, శంకర్‌పల్లిలలో కూడా బస్‌డిపోలు ఏర్పాటుచేస్తామని నాయకులు హామీలిచ్చారు. మొయినాబాద్ సమీపంలో డిపో నిర్మాణానికి ముర్తుజగూడ వద్ద 18 ఎకరాల స్థలాన్ని చూశారు. ఆ పనులు ముందుకు సాగడం లేదు. బస్స్టేషన్లలో సమస్యలు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్స్టేషన్ల విస్తరణ చేపట్టాల్సి ఉన్నా.. ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే చేవెళ్ల బస్‌స్టేషన్‌లో అనేక సమస్యలున్నాయి. 1969లో అప్పటి సీఎం డాక్టర్. మర్రి చెన్నారెడ్డి కృషితో ఆరు ఫ్లాట్‌ఫాంల బస్‌స్టేషన్ నిర్మాణమైంది. అప్పటి నుంచి ఒక్క ప్లాట్‌ఫాంను విస్తరించలేదు. తాగడానికి నీళ్లుండవు. కంపుకొడుతున్న మూత్రశాలలే దిక్కు. అదే విధంగా షాబాద్, నాగరగూడ ప్రయాణ ప్రాంగణాలు చిన్నవిగా, సౌకర్యాలలేమితో ఉన్నాయి. నిత్యం వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వచ్చిపోతున్నా మొయినాబాద్‌లో కనీసం బస్‌స్టేషన్ కూడా లేదు. ఖానాపూర్, చిట్టెంపల్లి, కేతిరెడ్డిపల్లి, తదితర బస్‌స్టేజీల వద్ద బస్షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి, మొయినాబాద్‌లలో డిపోలు నిర్మిస్తామని గత పాలకులు హామీలిచ్చారు. కానీ నెరవేర్చలేదు. ఘట్కేసర్ మండలం కొండాపూర్‌లో డిపో నిర్మాణానికి ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మహేశ్వరంలో బస్‌డిపో ప్రారంభమైనా సరిపోను బస్సులను కేటాయించలేదు. ఇచ్చిన కొన్ని కూడా డొక్కువే. మేడ్చల్ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు 2012లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నేటికీ పనులు చేపట్టలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణానికి అధికారులు భూసేకరణ కోసం అన్వేషించారు. ఇందిరా ప్రియదర్శిని సొసైటీలో భూమిని అధికారులు పరిశీలించినా ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. -
జిల్లా ప్రజల సహకారం మరువలేనిది
కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లా ప్రజల సహకారా లు మరువలేనివని ఎస్పీ డాక్టర్ రవీందర్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పనిచేసిన కాలంలో కలెక్టర్లు, అధికారుల సంపూర్ణ సహకారంతో సమన్వయంతో సమస్యలు లేకుండా విధులు నిర్వహించామన్నారు. మారుమూల నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఐఏపీ నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ముకునూర్, నీలంపల్లి, దమ్మూర్కు బస్ సౌకర్యం మెరుగుపడితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్, ఇతర జిల్లా అధికారులు ఎస్పీకి జ్ఞాపికను ఇచ్చి, వీడ్కోలు పలికారు. డీఆర్వో కృష్ణారెడ్డి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు శంకరయ్య, మనోహర్, హౌజింగ్ పీడీ న ర్సింగరావు, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పని చేయడం సంతృప్తినిచ్చింది కరీంనగర్ క్రైం : సమర్థవంతమైన సేవలందించడంలో జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని జిల్లా ఎస్పీ రవీందర్ అన్నారు. ఆయన ఇంటలిజెన్స్ ఎస్పీగా బదిలీ కావడంతో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వీడ్కోలు పలుకుతూ కవాతు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు ఉన్న జిల్లాలో అందరినీ కలుపుకుపోతూ పని చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. సమాజ సేవ కోసం జిల్లా పోలీసులు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోరని పలుమార్లు నిరూపించారన్నారు. సిబ్బంది దురవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో టర్నవుట్‌తో ఉన్న పోలీసులకు రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలన అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బారాయిడు, డీఎస్పీలు రవీందర్, ఏఆర్ డీఎస్పీ సదానందరెడ్డి, ఎస్బీఐ శ్రీనివాసరావు,ఆర్ఐ యాకుబ్‌రెడ్డి, గంగాధర్, శశిధర్, సీఐలు నరేందర్, విజయకుమార్, విజయ్‌రాజ్, కమాలాకర్‌రెడ్డి, తిరుపతిరావు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్ పాల్గొన్నారు.