
బొమ్మలరామారం మోడల్ నుంచి నడుచుకుంటూ హాజీపూర్ వెళ్తున్న విద్యార్థినులు
సాక్షి, యాదాద్రి: ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు, నాయకులు చేసే ఆర్భాటం, హడావుడి అంతాఇంతాకాదు, హామీల మీద హామీలు ఇస్తుంటారు. వాటిని వెంటనే నెరవేరుస్తామని నమ్మబలుకుతారు. ఆ తరువాత అతీగతీ ఉండదనడానికి హాజీపూర్ ఉదంతమే చక్కని ఉదాహరణ. 2019లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వెలుగు చూసిన బాలికలపై అత్యాచారం, హత్యల నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు.
హాజీపూర్ నుంచి బాలికలు ప్రతిరోజూ కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి ట్రాప్ చేసి, ముగ్గురు బాలికలపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్ 26న వెలుగు చూసింది. నిందితుడు ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దారుణ సంఘటన అనంతరం హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం, గ్రామం పక్కన గల శామీర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు అప్పట్లో హామీలు ఇచ్చారు.
ఇంతవరకు అవి అమలైన దాఖలా లేదు. ప్రస్తుతం హాజీపూర్ నుంచి 16 మంది బాలికలు ప్రస్తుతం కాలినడకన బొమ్మలరామారం మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు కాలినడకన బయలుదేరి 9.30 వరకు పాఠశాలకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి బయలుదేరి 6 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఆకతాయిలు అప్పుడప్పుడు వేధిస్తున్నారు. ఆ విద్యార్థినుల బాధలేమిటో వారి మాటల్లో..
ఆకతాయిలతో ఇబ్బంది
స్కూల్ నుంచి ఇంటికి కాలినడకన వెళ్లే సమయంలో కొందరు యువకులు బైక్‌లపై వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు తాకేలా దగ్గర నుంచి వేగంగా వెళ్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. వెకిలిచేష్టలు చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం.
– గొండ్రు అర్చన, 6 వ తరగతి
బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం
ఆ ముగ్గురు బాలికలను చంపిన బావులకు సమీపంగా నడిచేటప్పుడు భయం వేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మాకు రవాణా సౌకర్యాలు కల్పించాలి. గ్రామం నుంచి మా బడి వరకు బస్సు నడపాలి.
– సిరిమిల్ల శ్వేత, ఇంటర్ సెకండ్ ఇయర్
3 గంటలు నడుస్తున్నాం
ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పాఠ శాలకు గంటన్నర సమయంలో చేరుకుంటున్నాం. పుస్తకాలు, నోట్‌పుస్తకాల బరువుతో బ్యాగ్ మోయలేకపోతున్నాం. రోజూ మూడు గంటల సమయం కాలినడకకే సరిపోతుంది.
– ధీరావత్ సరిత, ఇంటర్ సెకండియర్