ఆ ఊరికి పెళ్లి సంబంధమా.. వద్దు బాబోయ్
ఆ గ్రామంతో వియ్యమందేందుకు కూడా ఇతర ప్రాంతాల ప్రజలు జంకుతారు. అలాగని గ్రామంలో కక్షలూ, కార్పణ్యాలూ ఉన్నాయా? అంటే అదీ కాదు. ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదంతే. ఎంతగా అంటే.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కూడేరు మండలం పి.నారాయణపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం పేరు ఎంఎం హళ్లి. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
1100 మంది జనాభా
గ్రామంలోని బీసీ కాలనీలో 265 కుటుంబాలు, ఎస్టీ కాలనీలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 1100 దాకా జనాభా ఉంటుంది. వీరిలో వాల్మీకి, ఎరుకల సామాజిక వర్గాల ప్రజలే అధికం. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొందరికి భూములున్నా నీరు లేక బీళ్లుగా వదిలేశారు. మరి కొందరు అరకొరగా ఉన్న నీటితో పంటలు సాగు చేసుకుంటున్నారు. చాలామంది స్థానికంగా పనులు లేక బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న పొలాల్లోకి కూలిపనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
మేనరికపు వివాహాలే అధికం
ఇప్పటిదాకా గ్రామానికి ఎర్రబస్సు వచ్చిన దాఖలాలే లేవంటే, ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలున్నాయో అర్థమవుతుంది. గ్రామానికి వెళ్లే రహదారి గులకరాళ్లు, ముళ్ల పొదలతో అధ్వానంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే 108 వాహనం కూడా ఈ గ్రామానికి వెళ్లదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో, ప్రసవ సమయాల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని రెండు ఆటోలే వారికి దిక్కు.
అందువల్లే ఈ గ్రామానికి స్థానికుల బంధువులు గానీ, అధికారులు గానీ వెళ్లాలంటే వెనుకంజ వేస్తారు. ఇక ఈ గ్రామస్తుతో వియ్యమందేందుకు ఎవరూ ముందుకు రారు. వాహన సౌకర్యం లేని గ్రామంలోని అబ్బాయికి, అమ్మాయిని ఇవ్వాలన్నా, గ్రామంలో అమ్మాయిని చేసుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. దీంతో, గ్రామంలోని వారే, తమ బంధువుల కుటుంబాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారు.
చదువు మానేసిన విద్యార్థులు
బీసీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలున్నాయి. దాదాపు 90 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. 50 మంది దాకా 8 నుంచి డిగ్రీ వరకు ఆత్మకూరు, అనంతపురంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక, ఆర్థిక సమస్యలు సహకరించక చదువు మానేశారు.
అభివృద్ధికి కృషి చేయండి
అన్ని విధాల వెనుకబడిన తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసి, బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కృష్ణమ్మ, గ్రామస్తులు కృష్ణప్ప, నారాయణ స్వామి, రామస్వామి, ప్రసాద్ తదితరులు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.
ఎగుడుదిగుడు వీధులు
గ్రామంలోని కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన వాటికన్నా, ఆర్డీటీ నిర్మించిన ఇళ్లే అధికంగా ఉన్నాయి. సిమెంటు రోడ్డు లేకపోవడంతో వీధులన్నీ ఎగుడుదిగుడుగా మారాయి. వీటన్నింటితో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామస్తులను వేధిస్తోంది.