ST colony
-
వింత శిశువు జననం
పూతలపట్టు : అసలే పేద కుటుంబం. వింత శిశువు జన్మించడంతో ఆ తల్లిదండ్రులు మాన సిక క్షోభకు గురవుతున్నారు. పూతలపట్టు మండలం తేనేపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కూలీ వెంకటేశులు భార్య కుమారి నిండు గర్భి ణిగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాతంలో పురిటి నొప్పులు వ చ్చాయి. కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వచ్చేలోగా ఆమె ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు తల, కాళ్లు, చేతులు, బాగానే ఉ న్నా కడుపు కింద బొడ్డు భాగంలో చర్మం లేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంతలో 108 వాహనం వచ్చింది. సిబ్బంది వెం టనే శిశువును చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అదే 108లో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, బిడ్డ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, సెలైన్ ఎక్కించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్సకు తగి న పరికరాలు లేవని, చెన్నై లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పి చేతు లెత్తేశారు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చేతిలో ఉన్న రూ.700తో ఆటోలో బిడ్డను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. వెంకటేశులు మాట్లాడుతూ ఏం చేయాలో పాలుపోవడం లేదని విలపించాడు. -
ఇంత దుర్మార్గ ముఖ్య మంత్రి దేశంలోనే లేడు
-
ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి దేశంలోనే లేడు
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ రైతులకు రుణాలివ్వొద్దని బ్యాంకులకు చెబుతారా? ♦ బంగారం కుదవపెట్టుకోవద్దని ఆదేశించడం దుర్మార్గం ♦ తాళిబొట్లు తాకట్టుపెట్టాల్సిన దీనస్థితిలో రైతులు ♦ లక్షల ఎకరాల్లో పంటనష్టం.. ఊరంతా వరద ♦ ఊళ్లో హెలికాప్టర్ దిగి ఊరు చూడని సీఎం ♦ నా పర్యటనతోనైనా కదలిక వస్తుందనే తిరుగుతున్నా ♦ సిగ్గుతోనైనా సర్కారు సాయం చేస్తుందని ఆశిస్తున్నా ♦ గుంటూరు జిల్లాలో వరద బాధితులకు జగన్ పరామర్శ సాక్షి, గుంటూరు : ‘‘వ్యవసాయ పెట్టుబడుల కోసం భార్యల తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సిన దీనస్థితి రైతులది.. కానీ వారి కష్టాలు పట్టించుకోకుండా.. బంగారం కుదవపెట్టుకుని రుణాలివ్వద్దంటూ బ్యాంకులను ఆదేశించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడం వల్లే రుణాల రీషెడ్యూల్ లేదు.. రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక తాళిబొట్లు తాకట్టుపెట్టి పావలావడ్డీ రుణాలైనా తెచ్చుకుని వ్యవసాయం చేద్దామని రైతులు ఆశిస్తుంటే.. బంగారం కుదవబెట్టుకుని రుణాలివ్వద్దని చంద్రబాబు బ్యాంకర్లకు చెబుతున్నారు’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధున్నోడు ఎవడైనా రైతులకు తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు చెబుతారని, కాని రైతులకు రుణాలు ఇవ్వొద్దని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని జగన్ ఎద్దేవా చేశారు. భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులు, వరద బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన జగన్మోహన్రెడ్డి మంగళవారంనాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.... హెలికాప్టర్ దిగిన సీఎం ఊళ్లోకి రాలేదు.. ‘‘వారం రోజులుగా గ్రామం మొత్తం వర్షంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయింది. ఆరు నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహించింది. ఇళ్లల్లో అన్నీ తడిసిపోయాయి. కనీసం బియ్యం కూడా లేని దుస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో గ్రామం ఉంటే చంద్రబాబు ఈ గ్రామంలో హెలికాప్టర్లో వచ్చి దిగడం మంచిదే. దిగిన తరువాత గ్రామానికి ఏమైనా మంచి చేశారా అంటే లేదు. కనీసం గ్రామంలోకి వచ్చి చూశారా అంటే అదీ లేదు.. అలా చేస్తే ఆయన గొప్పవాడని చెప్పుకోవచ్చు. గ్రామంలోకి రాలేదు... చివరకు ఏ సహాయమూ చేయలేదు.. ముఖ్యమంత్రి ఈ గ్రామానికి వచ్చి నాలుగు రోజులు అయ్యింది కాబట్టి కనీసం అధికారులైనా గ్రామానికి వచ్చి ఏమైనా సాయం చేశారా అంటే అదీ లేదు... ఇప్పటికే ఆరు రోజులైంది.. ఏ గోడ చూసినా ఆరు నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహించినట్లు చారలు కనిపిస్తున్నాయి. ఉర్దూ స్కూల్లోకి వెళితే పుస్తకాలు, కంప్యూటర్లు అన్నీ పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. ప్రభుత్వం వల్ల ఏ మేలూ జరగలేదు.. చంద్రబాబు టీవీల్లో కనిపించడం కోసం హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ ల్యాండయ్యారు. ఆయన వచ్చి పోయిన తరువాత అధికారులు వస్తారనుకుంటే వారూ రాలేదు. దమ్మిడీ సహాయం చేయలేదు. వైఎస్సార్ సీపీ నాయకులు మాత్రమే గ్రామస్తులకు సహాయం అందించారు. ప్రభుత్వంలో ఉన్నవారు సిగ్గుతెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి తమ గ్రామానికి హెలికాప్టర్లో వచ్చాడు కాబట్టి ఆయన్ను కలుసుకుని కష్టాలు చెప్పుకుందామనుకుంటే గ్రామస్తులను కనీసం దగ్గరకు కూడా రానీయలేదు. కేంద్రం ఇచ్చిందీ మళ్లించారు... గ్రామంలోని ఇళ్లేకాదు... పంటలన్నీ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో పత్తి, లక్షన్నర ఎకరాల్లో మిర్చి, 30 వేల ఎకరాల్లో వరి పంటలు సాగు చేస్తే అందులో మూడో వంతు పంటలు కుళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మన ఖర్మ ఏమిటంటే జూలై చివరి నుంచి ఆగస్టు చివరి వరకు వర్షాలు కురవలేదు. పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఈనెల 12, 13, 14 తేదీల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. మళ్లీ వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాలి. వారి కన్నీళ్లు తుడవాలి. ఇది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాల్సిన పని. కానీ చంద్రబాబు ఎలాంటి సహాయమూ చేయడం లేదు. గత సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. గత సంవత్సరం వెయ్యి కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అప్ప ట్లో ఇలాంటి వరదలే వచ్చి రైతులు అన్యాయమైన పరిస్థితిలో రైతాంగం ఉంటే, దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వాలని, తగ్గించి తగ్గించి లెక్కలు చూపింది చంద్రబాబు ప్రభుత్వం. అందులో రూ.463 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలింది వేసి రైతులకు ఇవ్వాల్సింది పోయి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన రూ.463 కోట్లు కూడా వేరే దానికి అడ్డుపెట్టుకున్నారు. మామనే కాదు.. ప్రజలను కూడా... నిజంగా ఈ మనిషికి రైతులపై ప్రేమ ఉందా? రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీవీల్లో చెప్పారు. బాబు సీఎం అయ్యాడు, ప్రజలతో పనై పోయింది. బ్యాంకులు బంగారం వేలం వేస్తుంటే చంద్రబాబు చూస్తూ ఊరుకున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయని కారణంగా రైతుల రుణాలు రెన్యువల్ కాలేదు. అందువల్ల ఇవాళ రైతులు బ్యాంకులకు వెళ్తే రెండురూపాయలు, రూపాయిన్నర వడ్డీ వసూలు చేసే పరిస్థితి. అయినా రుణాలిచ్చేలా కనిపించడం లేదు. దాంతో వ్యవసాయం పెట్టుబడుల కోసం భార్య మెడలో ఉన్న తాళిబొట్టు కుదవబెట్టి పావలావడ్డీకి రుణాలు తెచ్చుకుందామని రైతులు అనుకుంటుంటే బంగారం పెట్టుకుని రుణాలు ఇవ్వద్దని బ్యాంకులను చంద్రబాబు ఆదేశించారు. రైతులపై ఆయనకున్న దుర్మార్గమైన ప్రేమ అటువంటిది. ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొడతారు... మాఫీ చేస్తానని అబద్ధాలతో మోసం చేస్తారు.. బంగారం పెట్టుకుని రైతులకు రుణాలు ఇవ్వద్దని చెబుతారు... ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా ఉండరు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు.. ఆయనకు తెలిసింది ఏమిటంటే పనయ్యాక కత్తి తీసుకుని మెత్తగా పొడవడం బాగా తెలుసు.. పిల్లనిచ్చిన సొంత మామను పొడుస్తాడు.. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కూడా పొడుస్తాడు... ఇటువంటి దారుణమైన వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు... బాబు గ్రామానికి వచ్చి వెళ్లిన తరువాత కూడా దమ్మిడీ సహాయం కూడా అందలేదనే విషయాన్ని రాష్ట్రానికే కాక, దేశానికి చెప్పాలని ఇక్కడకు వచ్చా. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవండి. గ్రామానికి వచ్చి తోడుగా నిలబడండి. కనీసం ఈ కార్యక్రమానికి పబ్లిసిటీ వస్తే బాబులో కదలిక వస్తుంది.. ప్రజలకు తెలుస్తుందని సిగ్గుపడైనా మేలు చేస్తారనే గ్రామానికి వచ్చా. ఆయనపై ఒత్తిడి తెస్తాం. వైఎస్సార్సీపీ మీకు తోడుగా ఉంటుంది. సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నా.’’ అని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలే సాయపడ్డారు ‘‘మా గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఆరు నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహించింది. సర్వం కోల్పోయాం. మా ఊర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లో వచ్చి దిగారు. ఆయన్ను కలుసుకుందామని ప్రయత్నిస్తే దగ్గరకు రానీయలేదు. కనీసం ఊళ్లోకి వచ్చి మా కష్టాలు చూస్తారనుకుంటే ముఖ్యమంత్రి మా ఊర్లోకి అడుగు పెట్టలేదు. ఆయన వెళ్లాక అధికారులు కూడా ఎవరూ రాలేదు. ఏ సహాయమూ మాకు అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలబడ్డారు.’’ అని జగన్‌కు రెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తనయుడు బాషా చెప్పారు. ‘‘చంద్రబాబు వచ్చివెళ్లిన తర్వాత కూడా మాకు సాయం అందక అల్లాడుతుంటే వైఎస్సార్సీపీ నాయకులు మా గ్రామానికి 60 క్వింటాళ్ల బియ్యం, కందిపప్పు, నూనె అందించారు.’’ అని ఎంపీటీసీ గౌసియా బేగం జగన్‌కు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం గంటన్నరపైగా కురుస్తూనే ఉంది. రహదారికి ఇరువైపులా బారులు తీరిన ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జగన్ కోసం ఎదురుచూపులు చూశారు. జగన్ కాన్వాయ్ ముందు భారీ సంఖ్యలో మోటార్‌సైకిళ్లపై యువకులు వర్షంలోనే తడుస్తూ ముందుకు సాగారు. 3.20 గంటలకు జగన్ రాజుపాలెం చేరుకున్నారు. ఊరిబయట కస్తూర్బా పాఠశాల విద్యార్థినులను జగన్ పలకరించారు. అక్కడి నుంచి రెడ్డిగూడెం చేరుకోవడానికి దాదాపు గంటకు పైగా సమయం తీసుకుంది. రెడ్డిగూడెం మాజీ సర్పంచ్ ఖాజా మొహిద్దీన్ను ఆయన పరామర్శించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన జగన్‌కు వివరించారు. స్థానిక మండల పరిషత్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి.. తడిసిన పుస్తకాలు, కంప్యూటర్లను పరిశీలించారు. నష్టం వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలకు సర్వం కోల్పోయామని, తినడానికి బియ్యం కూడా లేవని గ్రామస్తులు జగన్ వద్ద భోరుమన్నారు. జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఎండీ నసీర్ అహ్మద్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, సమన్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, క త్తెర సురేష్‌కుమార్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి తదితరులు ఉన్నారు. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు ‘వరదల కారణంగా సర్వం కోల్పోయాం.. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడండి..’ అంటూ రాజుపాలెం మండలం కొండమోడు ప్రాంతంలో ఉంటున్న వలస రైతు కూలీలు జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సుమారు 300 మందికిపైగా వచ్చి పలు న ర్సరీలు, పొలాల్లో పనిచేస్తూ బతుకు వెళ్లదీస్తున్నామని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాల కారణంగా చేతికంది వచ్చిన పంట కూడా సర్వనాశనం అయిపోయిందని, తమకు కూలి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. పూట గడవక అవస్థలు పడుతున్నాం.. పులిచింతల నిర్వాసితులు బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద జగన్‌ను కలుసుకుని తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడిచినా తమకు రావాల్సిన ప్యాకేజీని పూర్తిగా ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తున్న నేపథ్యంలో గ్రామాల నుంచి తమను బలవంతంగా ఖాళీ చేయించారని, పునరావాస కేంద్రాలలో తాము నరకయాతన పడుతున్నామని తెలిపారు. గృహ నిర్మాణాలు పూర్తికాక, నిర్మించుకునేందుకు డబ్బు లేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఉపాధి లేక పూట గడవని పరిస్థితిలో ఉన్నామని, తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. -
అనుపాలెం ఎస్టీ కాలనీలో వైఎస్ జగన్ పర్యటన
-
అనుపాలెం ఎస్టీ కాలనీలో వైఎస్ జగన్ పర్యటన
గుంటూరు : జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఆయన మంగళవారం రాజుపాలెం మండలం అనుపాలెంలోని వరద బాధిత ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్నారు. స్థానికులు ఈ సందర్భంగా తమ గోడును వైఎస్ జగన్‌తో వెళ్లబోసుకున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారులు కూడా రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో పనులు చేసినా అడ్డుకుంటున్నారని, పంచాయతీ నిధులున్నా...పనులకు అడ్డుపడుతున్నారని తెలిపారు. కేసులు పెట్టి, వేధిస్తున్నారని వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని తమ బాధలు చెప్పుకున్నారు. అంతకు ముందు వైఎస్ జగన్ అనుపాలెంలో...వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. -
ఎస్సీ, ఎస్టీ వాడల్లో శ్రీవారి ఆలయాలు
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం సాక్షి,తిరుమల: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు రూ.8 లక్షలు(ఒక్కో ఆలయానికి) కేటాయిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. గతంలో ఉండే మ్యాచింగ్ గ్రాంట్ పద్దతి రద్దు చేస్తూ, ఆలయాల నిర్మాణానికి అయ్యే ఖర్చు వందశాతాన్ని ధార్మిక సంస్థే భరించేలా మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసినట్టు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ, అభివృద్ధి కోసం టీటీడీకి చెందిన 2.19 ఎకరాల స్థలాన్ని రైల్వే విభాగానికి గతంలో కేటాయించారు. దీనికి అదనంగా 74 సెంట్ల స్థలాన్ని తక్షణమే మార్కెట్ ధర కింద రైల్వే విభాగానికి ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఏడాదిలోపే పనులు పూర్తి చేసే నిబంధనతో దీనికి ఆమోదం తెలిపారు. టీటీడీలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డులుగా పునర్ నియామకం పొందిన సైనిక పింఛను దారుల భార్యలకు ఏపీ ప్రభుత్వం సవరించిన పింఛను ఉత్తర్వులను అమలు చేయాలని నిర్ణయించారు. -
భస్మీపటలం
అగ్నికి గాలి తోడై సృష్టించిన విలయానికి పేదల రెక్కల కష్టం బుగ్గిపాలైంది. పచ్చని చెట్లు, పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న పేదల కాలనీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఓ ఇంటిలో వంట చేస్తుండగా పైకి ఎగసిన నిప్పు రవ్వలు క్షణాల వ్యవధిలో కాలనీని కాలిన కట్టెల మోడుగా మార్చింది. ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపు కళ్ల ముందే 101 ఇళ్లు భస్మీపటలమయ్యాయి. - పేదల రెక్కల కష్టం బుగ్గిపాలు - క్షణాల వ్యవధిలో 101 ఇళ్లు ఆహుతి - సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం నగరం : మండల కేంద్రం నగరంలోని ఎస్టీకాలనీలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు సంభవించిన అగ్నిప్రమాదంలో 101 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా. కొండపల్లి లక్ష్మయ్యకు చెందిన పూరింటి నుంచి అంటుకున్న మంటలు పక్కనే ఉన్న ఆంజనేయులు, మరియమ్మ, సైదులు ఇళ్లకు వ్యాపించి ఒక్కసారిగా కాలనీని చుట్టుముట్టేశాయి. స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాలనీ వాసులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలిగారు. ఇళ్లల్లోని విలువైన సామానులను పక్కనే ఉన్న పొలాల్లోకి తరలించుకుని కొంత మంది కాస్తంత నష్టాన్ని నివారించుకోగలిగారు. కాలనీ లో సుమారు 250 ఇళ్లు ఉండగా 101 ఇళ్లు పూర్తిగా ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో పడమట గాలి వీయడంతో అరగంట వ్యవధిలో కాలనీ బూడిదగా మారింది. ఆలస్యంగా అగ్నిమాపక శకటాలు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో స్థానికులు ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు. రేపల్లె అగ్నిమాపక శకటం 10.35 నిమిషాలకు చేరుకుంది. అప్పటికే ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ తర్వాత అరగంట వ్యవధిలో బాపట్ల, పొన్నూరుకు చెందిన అగ్నిమాపక శకటాలు వచ్చి కట్టెలను ఆర్పివేశాయి. బావురుమన్న పేదల కాలనీ ... క్షణాల్లో కాలనీ బుగ్గిపాలు కావటంతో పిల్లపాపలతో కట్టుబట్టలతో రోడ్డునపడ్డ నిరుపేదలు బావురుమన్నారు. ఆ ప్రాంతంలో మహిళలు, చిన్నారుల రోదనలు మిన్నంటాయి. కష్టపడి రూపాయి, రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకున్న గూడు కళ్లెదుటే ఆహుతి అవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గుండెలను బాదుకుం టూ బోరున విలపించారు. బాధిత కుటుంబాలను జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణరావు పరామర్శించారు. ప్రభుత్వ సాయంగా జానీమూన్ ఐదు వేల వంతున నగదు అందజేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మోపిదేవి డిమాండ్ చేశారు. -
చెల్లెల్ని వేధిస్తున్నాడని..బావ కాళ్లను కత్తితో నరికి
బావ కాళ్లను కత్తితో నరికిన బావమరిది పరిస్థితి విషమం గుడ్లూరు : చెల్లెల్ని వేధిస్తున్నాడని బావను చెట్టుకు కట్టేసి బావమరిది కత్తితో కాళ్లు నరికి వేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పూరేటిపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటమ్మకు శింగరాయకొండకు చెందిన అంజయ్యతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అంజయ్య భార్య వెంకటమ్మను వేధిస్తున్నాడు. నాలుగు రోజులు క్రితం భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. ఆదివారం ఉదయం శింగరాయకొండ నుంచి పూరేటిపల్లి వచ్చిన అంజయ్య బావమరుదులు చినకొండయ్య, శ్రీనివాసులుతో కలిసి మద్యం తాగి ఇంటికెళ్లాడు. అక్కడ కొండయ్య..‘మా చెల్లెల్ని ఎందుకు వేధిస్తున్నావు’ అని అడగటంతో ముగ్గురి మధ్య మాట మాట పెరిగి గొడవ పెట్టుకున్నారు. దీంతో అంజయ్యను ఇంటి ముందున్న వేప చెట్టుకు కట్టేసిన కొండయ్య ఇంటిలో ఉన్న మొద్దు కత్తిని తీసుకొచ్చి ఒక కాలును పూర్తిగా నరికేశాడు. రెండో కాలిపై, చేతులపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచాడు. అంజయ్య పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో చిన కొండయ్య, శ్రీనివాసులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంత గొడవ జరుగుతున్నా ఇంట్లోవారెవరూ వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. నెత్తుటి మడుగులో భయానక పరిస్థితిలో ఉన్న అంజయ్య దగ్గరికెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై హుస్సేన్‌బాషాకు సిబ్బందితో కలిసి హుటాహుటిన గ్రామానికి చేరుకుని అప్పటికే అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్న అంజయ్యను 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నెల్లూరు తీసుకెళ్లారు. అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రక్తం ఎక్కువగా పోవడంతో బతకడం కష్టమే అని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ మధుబాబు పరిశీలించారు. ఘటన వివరాలను అంజయ్య భార్య, అత్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హుస్సేన్‌బాషా తెలిపారు. -
రూ.లక్షలు హాంఫట్
ఫొటోలో కనిపిస్తున్నది ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకుంటే పొరపాటు. అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతం. అదేంటి అసలు ఇండ్లే లేవు.. ఎవరు నివసిస్తున్నారు అని ప్రశ్నించుకునేరు.? అక్రమాల్లో ఆరితేరిన అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీ కాలనీనే. ఈ కాలనీలో దళిత, గిరిజనులు నివసిస్తున్నారని రికార్డులు సృష్టించారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ సీసీ రోడ్డును చూడండి.. ఎప్పుడో పదేళ్ల క్రితం వేసిన రోడ్డు కాదు.. ఏడాది క్రితమే నిర్మించినా పగుళ్లు తేలి ఇలా తయారైంది. ఈ రోడ్లపై ఇప్పటివరకు ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాల్లేవు. కానీ.. అప్పుడే ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయాయంటే ఆ పనుల్లో నాణ్యత అర్థం చేసుకోవచ్చు. ఘనత వహించిన అధికారులు ఈ పనుల కోసం అక్షరాల సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేసినట్లు నిధులు డ్రా చేశారు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజాప్రతినిధులు, నేతలతో చేతులు కలిపి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన వ్యవహారం ఎట్టకేలకు అధికారుల మెడకే చుట్టుకుంటోంది. ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, పర్సెంటేజీలే ధ్యేయంగా నేతలతో చేతులు కలిపి రూ.లక్షల నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులపై ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. సమస్యలతో సహజీవనం చేస్తున్న దళిత, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.వందల కోట్లలో నిధులు వచ్చాయి. వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తానూరు మండల కేంద్రానికి వచ్చిన రూ.69 లక్షల నిధులను అధికారులు, నేతలు కలిసి పక్కదారి పట్టించారు. తూతూ మంత్రంగా పనులు చేసి దళిత, గిరిజనుల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అ ప్పనంగా కాజేశారు. నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే పనులు చేపట్టాలి. కానీ స్థానికులను మభ్యపెట్టి బోగస్ తీర్మాణాలు సృష్టించి ఎవ రూ నివాసముండని ఈ నిర్మానుష్య ప్రాంతం లో పనులు చేపట్టారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ పనులతో ఏ ఒక్క దళిత, గిరిజనులకు ప్రయోజనం చేకూరకపోగా, నేతలు, అధికారులు మాత్రం పర్సెంటేజీల రూపంలో జేబులు నింపుకున్నారు. నాణ్యత గాలికి.. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. నేతలతో చేతులు కలపడంతో అడిగే నాథుడే ఉండడని ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఈ సీసీ రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాలు లేకపోయినా ఎక్కడికక్కడ పెచ్చులూడి పోయాయి. ఈ డ్రెయినేజీల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత పాటించకపోయినా రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. ఈ వ్యవహారంలో ముథోల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపట్టిన కమిషనర్ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో పంచాయతీరాజ్ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఈ పనులపై విచారణ చేపట్టిన ఆ శాఖ కమిషనర్ వెంకటేశం ఇటీవల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక మేరకు చర్యలకు ఉపక్రమించిన ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ నిర్మల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.వెంకట్రావును ఆదేశించినట్లు సమాచారం. ఈ పనుల విషయంలో అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. -
సబ్‌ప్లాన్‌కు మంగళం..
ఘట్కేసర్ టౌన్: మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధులు మంజూరు కావడం లేదు. వారికి కేటాయించిన నిధులు వారికే వెచ్చించాలని 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేయడానికి ఆర్థిక శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నోడల్ ఏజన్సీని నియమిం చింది. ఆయా కాలనీల అభివృద్ధికి నివేదికలు తయారుచేసి ఏడాది క్రితం ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ సర్కా రు నిధులను విడుదల చేయకపోవడంతో కాలనీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా.. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఇతర పనులకు వినియోగించారు. విడుదలైన నిధులు దారి మళ్లకుండా సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి ఏడాది గడిచినా ఎస్సీ, ఎస్టీల కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండలంలో గుంటిగూడెం, కొండాపూర్, మాదాపూర్, కాచివానిసింగారం, అంకుషాపూర్, యంనంపేట్ తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీల కాలనీల అభివృద్థికి అవసరమైన పనులకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సబ్‌ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీల గృహనిర్మాణం, తాగునీరు, ఇందిర జలప్రభ, గ్రామీణ రోడ్లు, మురుగుకాల్వలు, పింఛన్లు, పొదుపు సంఘాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రణాళికలు వేశారు. ఆయా కాలనీలు డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేక దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో చిన్నపాటి చినుకుకే మట్టిరోడ్లు చిత్తడిగా మారి ప్రజలు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 2013లో ఇంది రమ్మ కలలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఊరూరా సమావేశాలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్ర ణాళికలను వేసి నిధులను విడుదల చే యాలని పంపిన నివేదికలక ు మోక్షం లభించడం లేదు. అధికారులు స్పందించి నిధులను విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆ ఊరికి పెళ్లి సంబంధమా.. వద్దు బాబోయ్
ఆ గ్రామంతో వియ్యమందేందుకు కూడా ఇతర ప్రాంతాల ప్రజలు జంకుతారు. అలాగని గ్రామంలో కక్షలూ, కార్పణ్యాలూ ఉన్నాయా? అంటే అదీ కాదు. ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదంతే. ఎంతగా అంటే.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కూడేరు మండలం పి.నారాయణపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం పేరు ఎంఎం హళ్లి. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 1100 మంది జనాభా గ్రామంలోని బీసీ కాలనీలో 265 కుటుంబాలు, ఎస్టీ కాలనీలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 1100 దాకా జనాభా ఉంటుంది. వీరిలో వాల్మీకి, ఎరుకల సామాజిక వర్గాల ప్రజలే అధికం. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొందరికి భూములున్నా నీరు లేక బీళ్లుగా వదిలేశారు. మరి కొందరు అరకొరగా ఉన్న నీటితో పంటలు సాగు చేసుకుంటున్నారు. చాలామంది స్థానికంగా పనులు లేక బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న పొలాల్లోకి కూలిపనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారు. మేనరికపు వివాహాలే అధికం ఇప్పటిదాకా గ్రామానికి ఎర్రబస్సు వచ్చిన దాఖలాలే లేవంటే, ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలున్నాయో అర్థమవుతుంది. గ్రామానికి వెళ్లే రహదారి గులకరాళ్లు, ముళ్ల పొదలతో అధ్వానంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే 108 వాహనం కూడా ఈ గ్రామానికి వెళ్లదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో, ప్రసవ సమయాల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని రెండు ఆటోలే వారికి దిక్కు. అందువల్లే ఈ గ్రామానికి స్థానికుల బంధువులు గానీ, అధికారులు గానీ వెళ్లాలంటే వెనుకంజ వేస్తారు. ఇక ఈ గ్రామస్తుతో వియ్యమందేందుకు ఎవరూ ముందుకు రారు. వాహన సౌకర్యం లేని గ్రామంలోని అబ్బాయికి, అమ్మాయిని ఇవ్వాలన్నా, గ్రామంలో అమ్మాయిని చేసుకోవాలన్నా ఆలోచిస్తున్నారు. దీంతో, గ్రామంలోని వారే, తమ బంధువుల కుటుంబాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారు. చదువు మానేసిన విద్యార్థులు బీసీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలున్నాయి. దాదాపు 90 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. 50 మంది దాకా 8 నుంచి డిగ్రీ వరకు ఆత్మకూరు, అనంతపురంలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. బస్సు సౌకర్యం లేక, ఆర్థిక సమస్యలు సహకరించక చదువు మానేశారు. అభివృద్ధికి కృషి చేయండి అన్ని విధాల వెనుకబడిన తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసి, బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కృష్ణమ్మ, గ్రామస్తులు కృష్ణప్ప, నారాయణ స్వామి, రామస్వామి, ప్రసాద్ తదితరులు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఎగుడుదిగుడు వీధులు గ్రామంలోని కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన వాటికన్నా, ఆర్డీటీ నిర్మించిన ఇళ్లే అధికంగా ఉన్నాయి. సిమెంటు రోడ్డు లేకపోవడంతో వీధులన్నీ ఎగుడుదిగుడుగా మారాయి. వీటన్నింటితో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామస్తులను వేధిస్తోంది.