రూ.లక్షలు హాంఫట్
ఫొటోలో కనిపిస్తున్నది ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకుంటే పొరపాటు. అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతం. అదేంటి అసలు ఇండ్లే లేవు.. ఎవరు నివసిస్తున్నారు అని ప్రశ్నించుకునేరు.? అక్రమాల్లో ఆరితేరిన అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీ కాలనీనే. ఈ కాలనీలో దళిత, గిరిజనులు నివసిస్తున్నారని రికార్డులు సృష్టించారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినట్లు పేర్కొన్నారు.
ఈ సీసీ రోడ్డును చూడండి.. ఎప్పుడో పదేళ్ల క్రితం వేసిన రోడ్డు కాదు.. ఏడాది క్రితమే నిర్మించినా పగుళ్లు తేలి ఇలా తయారైంది. ఈ రోడ్లపై ఇప్పటివరకు ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాల్లేవు. కానీ.. అప్పుడే ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయాయంటే ఆ పనుల్లో నాణ్యత అర్థం చేసుకోవచ్చు. ఘనత వహించిన అధికారులు ఈ పనుల కోసం అక్షరాల సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేసినట్లు నిధులు డ్రా చేశారు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజాప్రతినిధులు, నేతలతో చేతులు కలిపి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన వ్యవహారం ఎట్టకేలకు అధికారుల మెడకే చుట్టుకుంటోంది. ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, పర్సెంటేజీలే ధ్యేయంగా నేతలతో చేతులు కలిపి రూ.లక్షల నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులపై ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. సమస్యలతో సహజీవనం చేస్తున్న దళిత, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.వందల కోట్లలో నిధులు వచ్చాయి.
వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తానూరు మండల కేంద్రానికి వచ్చిన రూ.69 లక్షల నిధులను అధికారులు, నేతలు కలిసి పక్కదారి పట్టించారు. తూతూ మంత్రంగా పనులు చేసి దళిత, గిరిజనుల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అ ప్పనంగా కాజేశారు. నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే పనులు చేపట్టాలి. కానీ స్థానికులను మభ్యపెట్టి బోగస్ తీర్మాణాలు సృష్టించి ఎవ రూ నివాసముండని ఈ నిర్మానుష్య ప్రాంతం లో పనులు చేపట్టారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ పనులతో ఏ ఒక్క దళిత, గిరిజనులకు ప్రయోజనం చేకూరకపోగా, నేతలు, అధికారులు మాత్రం పర్సెంటేజీల రూపంలో జేబులు నింపుకున్నారు.
నాణ్యత గాలికి..
ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. నేతలతో చేతులు కలపడంతో అడిగే నాథుడే ఉండడని ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఈ సీసీ రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాలు లేకపోయినా ఎక్కడికక్కడ పెచ్చులూడి పోయాయి. ఈ డ్రెయినేజీల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత పాటించకపోయినా రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. ఈ వ్యవహారంలో ముథోల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ చేపట్టిన కమిషనర్
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో పంచాయతీరాజ్ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఈ పనులపై విచారణ చేపట్టిన ఆ శాఖ కమిషనర్ వెంకటేశం ఇటీవల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక మేరకు చర్యలకు ఉపక్రమించిన ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ నిర్మల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.వెంకట్‌రావును ఆదేశించినట్లు సమాచారం. ఈ పనుల విషయంలో అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం.