నాగల గుట్టపల్లె వద్ద వెంచర్‌లో గుమికూడిన టీడీపీ నాయకులు, టీడీపీ నేతలు దున్నిన వెంచర్
చక్రాయపేట: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లె సినిమా హాల్ సమీపంలో కొందరు వ్యాపారులు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్‌ను టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆయన అనుచరులు ఆదివారం ట్రాక్టర్లతో దున్నేశారు. బీటెక్ రవి, సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కలిసి వెంచర్ వద్దకు వచ్చి మారణాయుధాలు పట్టుకుని కేకలు వేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సురభి గ్రామం నాగలగుట్టపల్లె సినిమా హాల్ సమీపంలో గోవిందు రామయ్య అనే వ్యక్తికి చెందిన 1.05 ఎకరాల భూమిని రమణ, సుబ్బయ్య అనే వ్యాపారులు కొనుగోలు చేసి రెండు రోజుల కిందట వెంచర్ వేశారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు తాళ్లపల్లె మహేశ్వరరెడ్డి, రామాంజులరెడ్డిలు బీటెక్ రవిని పిలిపించుకుని వెంచర్‌ను ట్రాక్టర్‌తో దున్నేశారు.
ఈ సందర్భంగా సుమారు రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య, రమణ, సుబ్బయ్య వెంచర్ వద్దకు వచ్చేసరికి అందరూ వెళ్లిపోయారు. దీంతో వారు చక్రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్కే వ్యాలీ, వేంపల్లె, పులివెందుల రూరల్, అర్బన్ సీఐలు గోవిందరెడ్డి, వెంకటేశ్వర్లు, బాలమద్దిలేటి, రాజు, చక్రాయపేట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
కేసు నమోదు చేస్తాం: సీఐ గోవిందరెడ్డి
నాగలగుట్టపల్లె వద్ద వెంచర్‌ను దున్నివేసిన ఘటనపై బీటెక్ రవి, మహేశ్వరరెడ్డితోపాటు మరికొందరిపై తమకు ఫిర్యాదు అందిందని ఆర్కే వ్యాలీ సీఐ గోవిందరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారో విచారించి కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment