
భస్మీపటలం
అగ్నికి గాలి తోడై సృష్టించిన విలయానికి పేదల రెక్కల కష్టం బుగ్గిపాలైంది. పచ్చని చెట్లు, పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న పేదల కాలనీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఓ ఇంటిలో వంట చేస్తుండగా పైకి ఎగసిన నిప్పు రవ్వలు క్షణాల వ్యవధిలో కాలనీని కాలిన కట్టెల మోడుగా మార్చింది. ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపు కళ్ల ముందే 101 ఇళ్లు భస్మీపటలమయ్యాయి.
- పేదల రెక్కల కష్టం బుగ్గిపాలు
- క్షణాల వ్యవధిలో 101 ఇళ్లు ఆహుతి
- సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం
నగరం : మండల కేంద్రం నగరంలోని ఎస్టీకాలనీలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు సంభవించిన అగ్నిప్రమాదంలో 101 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా. కొండపల్లి లక్ష్మయ్యకు చెందిన పూరింటి నుంచి అంటుకున్న మంటలు పక్కనే ఉన్న ఆంజనేయులు, మరియమ్మ, సైదులు ఇళ్లకు వ్యాపించి ఒక్కసారిగా కాలనీని చుట్టుముట్టేశాయి.
స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాలనీ వాసులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలిగారు. ఇళ్లల్లోని విలువైన సామానులను పక్కనే ఉన్న పొలాల్లోకి తరలించుకుని కొంత మంది కాస్తంత నష్టాన్ని నివారించుకోగలిగారు. కాలనీ లో సుమారు 250 ఇళ్లు ఉండగా 101 ఇళ్లు పూర్తిగా ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో పడమట గాలి వీయడంతో అరగంట వ్యవధిలో కాలనీ బూడిదగా మారింది.
ఆలస్యంగా అగ్నిమాపక శకటాలు
ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో స్థానికులు ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు. రేపల్లె అగ్నిమాపక శకటం 10.35 నిమిషాలకు చేరుకుంది. అప్పటికే ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ తర్వాత అరగంట వ్యవధిలో బాపట్ల, పొన్నూరుకు చెందిన అగ్నిమాపక శకటాలు వచ్చి కట్టెలను ఆర్పివేశాయి.
బావురుమన్న పేదల కాలనీ ...
క్షణాల్లో కాలనీ బుగ్గిపాలు కావటంతో పిల్లపాపలతో కట్టుబట్టలతో రోడ్డునపడ్డ నిరుపేదలు బావురుమన్నారు. ఆ ప్రాంతంలో మహిళలు, చిన్నారుల రోదనలు మిన్నంటాయి. కష్టపడి రూపాయి, రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకున్న గూడు కళ్లెదుటే ఆహుతి అవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గుండెలను బాదుకుం టూ బోరున విలపించారు.
బాధిత కుటుంబాలను జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణరావు పరామర్శించారు. ప్రభుత్వ సాయంగా జానీమూన్ ఐదు వేల వంతున నగదు అందజేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మోపిదేవి డిమాండ్ చేశారు.