
రూ.50లక్షల వరకు నష్టం!
సమీపంలోని పలు దుకాణాలకు వ్యాప్తి
రంగంలోకి ఫైర్ సేఫ్టీ అధికారులు, అదుపులోకి మంటలు
డీసీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ దుకాణంలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. రాత్రి 10.30 గంటలకు వ్యాపారి షాపు మూసివేసి పైఅంతస్తులో ఉన్న ఇంటికి వెళ్లి పోయారు. పది నిమి షాల వ్యవధిలోనే షట్టర్ లోపల నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అలర్ట్ చేశారు. అప్పటికే దుకాణం లోపల నుంచి మంటలు ఎగసి పడ్డాయి. పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా.. సమీప దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందే క్రమంలో బోరు మోటారు పైపులతో మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ మెకానిక్, టైర్లు, ఆటో మొబైల్, తదితర షాపుల వరకు స్వల్ప మంటలు వ్యాప్తి చెందడంతో దుకాణదారులు ఆందోళన చెందారు. పది నిమిషా ల లోపు జనగామ ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే కెమికల్‌తో వాటర్ స్ప్రే చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఫైర్ ఇంజిన్ కూడా రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో రూ.50లక్షల వరకు నష్టం జరగవచ్చని అంచనా. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ పండేరి చేతన నితిన్, సీఐలు దామోదర్‌రెడ్డి, అబ్బయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్సైలు రాజేష్, రాజన్‌బాబు, సిబ్బంది, ఫైర్ సేఫ్టీ అధికారులకు సహకారం అందించారు.
కుటుంబ సభ్యులు సేఫ్
మంటలు చెలరేగిన సమయంలో జై భవానీ దుకాణం కుటుంబ సభ్యులు, అందులో పని చేసే సుమారు 15 మంది కార్మికులు పై అంతస్తులోనే ఉన్నారు. మంటలు పైకి చేరుకునే లోపే వారిని వెనక భాగం నుంచి కిందకు దింపడంతో అంతా సేఫ్‌గా బయట పడ్డారు. దుకాణం లోపల ఎగసి పడుతున్న మంటలు ఆర్పేందుకు షట్టర్లను పగుల గొట్టారు. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మి, విజయ షాపింగ్ మాల్స్ దగ్ధమైన సంఘటన మరువక ముందే... జైభవానీ షాపులో మంటలు చెలరేగడం వ్యాపారులతో పాటు పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment