Electrical Showroom
-
ఎలక్ట్రికల్ షాపులో మంటలు!
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ దుకాణంలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. రాత్రి 10.30 గంటలకు వ్యాపారి షాపు మూసివేసి పైఅంతస్తులో ఉన్న ఇంటికి వెళ్లి పోయారు. పది నిమి షాల వ్యవధిలోనే షట్టర్ లోపల నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అలర్ట్ చేశారు. అప్పటికే దుకాణం లోపల నుంచి మంటలు ఎగసి పడ్డాయి. పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా.. సమీప దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందే క్రమంలో బోరు మోటారు పైపులతో మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెకానిక్, టైర్లు, ఆటో మొబైల్, తదితర షాపుల వరకు స్వల్ప మంటలు వ్యాప్తి చెందడంతో దుకాణదారులు ఆందోళన చెందారు. పది నిమిషా ల లోపు జనగామ ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే కెమికల్‌తో వాటర్ స్ప్రే చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఫైర్ ఇంజిన్ కూడా రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో రూ.50లక్షల వరకు నష్టం జరగవచ్చని అంచనా. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ పండేరి చేతన నితిన్, సీఐలు దామోదర్‌రెడ్డి, అబ్బయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్సైలు రాజేష్, రాజన్‌బాబు, సిబ్బంది, ఫైర్ సేఫ్టీ అధికారులకు సహకారం అందించారు.కుటుంబ సభ్యులు సేఫ్మంటలు చెలరేగిన సమయంలో జై భవానీ దుకాణం కుటుంబ సభ్యులు, అందులో పని చేసే సుమారు 15 మంది కార్మికులు పై అంతస్తులోనే ఉన్నారు. మంటలు పైకి చేరుకునే లోపే వారిని వెనక భాగం నుంచి కిందకు దింపడంతో అంతా సేఫ్‌గా బయట పడ్డారు. దుకాణం లోపల ఎగసి పడుతున్న మంటలు ఆర్పేందుకు షట్టర్లను పగుల గొట్టారు. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మి, విజయ షాపింగ్ మాల్స్ దగ్ధమైన సంఘటన మరువక ముందే... జైభవానీ షాపులో మంటలు చెలరేగడం వ్యాపారులతో పాటు పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. -
రెడ్ జోన్లలో ఆటో, ఏసీ షాపులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు రెడ్జోన్ల పరిధిలో ఉన్న ఇతర అన్ని మున్సిపాలిటీల్లో ఆటోమొబైల్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, వాహనాల రిపేర్ గ్యారేజీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లకు సంబంధించిన అన్ని రకాల షోరూమ్స్, షాపులను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం రెడ్జోన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు, అత్యవసర సేవలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన హార్డ్‌వేర్ తదితర షాపులు, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పంపుసెట్ల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై పైన పేర్కొన్న దుకాణాలు, షోరూమ్స్‌ను అనుమతించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సమ్మర్లో కూల్ కూల్‌గా...
సాక్షి, తానూరు(ముథోల్): ఎండాకాలం రాగానే మనందరికీ గుర్తొచ్చేవి కూలర్లే. ఎండ నుంచి ఉపశమనానికి, వేసవి తాపం నుంచి రక్షణకు ప్రతీ ఇంట్లో కూలర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో కూలర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచే ఎండలు తమ ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో కూలర్లకోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలుస్తుండగా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రికల్ షాపులో వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ధర రూ.1600 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. గత పక్షం రోజులుగా ఎండలు అధికం కావడంతో వీటి కొనుగోళ్లు అధికమయ్యాయి. ఎక్కడ చూసిన కూలర్ల దుకాణాలే.. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూలర్ షాపులు అధికంగా కనిపిస్తున్నాయి. గతంలో వాడిన కూలర్లకు మరమ్మతు చేయడంతోపాటు కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల బాట పడుతున్నారు. కొంతమంది ఎండలు ముదిరితే కూలర్ల రేట్లు పెరుగుతాయని ముందుగానే కొంటున్నారు. ఫైబర్, ఇనుప కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కూలర్లను మహారాష్ట్రలోని నాగపూర్, ఔరంగాబాద్, నాందేడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు నెలలే వ్యాపారం.. ఎండాకాలంలో నాలుగు నెలలు కూలర్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఏటా సీజన్లో 10 నుంచి 20వేల కూలర్లు అమ్ముడవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కావడం.. కట్నకానుకల జాబితాలో కూడా కూలర్ చేరడంతో వేసవిలో వీటికి డిమాండ్ పెరిగింది. టేబుల్‌పై ఉంచుకునే పర్సనల్ కూలర్‌తోపాటు పెళ్లిళ్ల సందర్భంలో ఫంక్షన్హాల్లో, హోటళ్లలో వినియోగించే జంబో కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువకులకు ఉపాధి.. ఎండాకాలం రావడంతో పట్టణాల్లో ఉన్న షాపు యాజమాన్యాలు దుకాణాల్లో మరమ్మతు కోసం యువకులను పెట్టుకుంటున్నారు. దీంతో ఉపాధి లభిస్తోంది. నాలుగు నెలలపాటు ఈ వ్యాపారం కొనసాగడంతో యువకులు దుకాణాల్లో వ్యాపారం సాగిస్తున్నారు. నాలుగు నెలలపాటు ఉపాధి లభిస్తుందని యువకులు చెబుతున్నారు. ఇనుప కూలర్ల తయారీ.. పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వ్యాపారులు ఇనుప కూలర్లు తయారు చేస్తున్నారు. కూలర్ల తయారీలో వినియోగించే ముడి సరుకును హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, పూణే నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కూలర్ల తయారీకి ఐరన్ స్డాండ్, ఐరన్ ఫీల్స్, పంపులు, మోటార్, గడ్డి, కలర్ స్విచ్‌లు, వాటర్ సప్లై పైపులు వాడుతున్నారు. స్టాండర్ట్ ఐరన్ వాడటంతో రెడీమేడ్ కూలర్ల కన్నా అవి నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. వీటి ధర నాణ్యతను బట్టి రూ.3 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. -
‘పంచ’తంత్రం
► జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగ్, మట్కా, వ్యభిచారం, పేకాట, నంబర్‌గేమ్ ► మట్కా కింగ్‌ను అరెస్టు చేసినా మారని తీరు ► మూడో కంటికి తెలీకుండా నంబర్‌గేమ్ ► అసాంఘిక కార్యకలాపాలకు ‘అనంత’ అడ్డా చోద్యం చూస్తున్న పోలీసులు (సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంత’ ‘పంచ’తంత్రంలో చిక్కుకుపోయింది. జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్నాయి. క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట మాత్రమే కాదు.. కొత్తగా నంబర్‌గేమ్ వచ్చింది. ఇక వ్యభిచారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ఐదింటి దెబ్బకు వందలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొందరు భారీగా అప్పులు చేసి ఆస్తులను అమ్ముకుంటుంటే... ఇంకొందరు ‘కాల్‌మనీ’ చేతుల్లో చిక్కి శల్యమవుతున్నారు. ఆగని మట్కా అనంతపురంలో మట్కా జోరుగా నడుస్తోంది. మట్కా కింగ్ మంగలి చంద్రను పోలీసులు అరెస్టు చేసినా అడ్డుకట్ట పడలేదు. తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలోనూ ఇదే పరిస్థితి. గతంలో రతన్‌లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కా ఆరురోజులు నడుస్తోంది. ఈ మాట్కా నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా సాగుతోంది. కళ్యాణ్, సత్తా మట్కాలకు సాయంత్రం ఐదు గంటల వరకూ చీటీల డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ఓపెన్, 11.15కు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతో చాలామంది మట్కా రాయుళ్లు సాయంత్రం నుంచి నంబర్ వచ్చేదాకా టెన్షన్‌తో గడుపుతున్నారు. అనంతపురం వన్‌టౌన్ పరిధిలో బీటర్లు అధికం. వారెవరన్నది పోలీసులకూ తెలిసినా బ్రేక్ వేయలేకపోతున్నారు. సత్సంబంధాలే ఇందుకు కారణం. టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఈ ఊబిలో పడి వేలాది కుటుంబాలు నాశనమవుతున్నాయి. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. బెట్టింగ్‌కు అడ్డా క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు ‘అనంత’లోనూ జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్‌సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు. ఐపీఎల్ నేపథ్యంలో నెలన్నరగా బెట్టింగ్‌రాయుళ్లు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఓ బంగారు వ్యాపారి నెలరోజుల్లోనే రూ.9లక్షలు, ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి రూ.7లక్షల దాకా కోల్పోయారు. విద్యార్థులు కూడా కోచింగ్ ఫీజుల పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని వచ్చి బెట్టింగ్ వేస్తున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్తో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీలో గ్రూపులుగా కూర్చొని బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. నెలన్నరలో రూ.30-40కోట్లదాకా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నంబర్‌గేమ్ ‘నంబర్‌గేమ్’ పేరుతో కొత్త వ్యసనం ‘అనంత’లోకి ప్రవేశించింది. కళ్యాణదుర్గం, బళ్లారి బైపాస్రోడ్లలో కొందరు గుంపులుగా చేరి ఈ గేమ్ ఆడుతున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించే లారీలు, బస్సుల నంబర్లు కూడితే 20 ప్లస్ ఉంటుందని కొందరు, మైనస్ ఉంటుందని కొందరు బెట్టింగ్ కాస్తారు. వేసవి కావడంతో వీరు బస్టాండ్, శ్రీకంఠం సర్కిల్‌లోకి మకాం మార్చారు. బస్టాండ్‌లోకి వచ్చే బస్సు నంబర్లపై పందేలు కాస్తున్నారు. దీంతో పాటు అంకెలపైనా బెట్టింగ్ వేస్తున్నారు. 0-9 వరకూ ఓ అంకెను ఎంచుకుంటారు. వచ్చే వాహనంలో ఆ అంకె ఉంటుందని ఒకరు, ఉండదని మరొకరు పందెం కాస్తారు. దీని గురించి పోలీసులుకు తెలిసినా పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వ్యభిచారం వ్యభిచారం అనంతతో పాటు తాడిపత్రి, గుంతకల్లులో జోరుగా సాగుతోంది. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్, బస్టాండ్ వద్దనున్న లాడ్జీలలో కొన్ని పూర్తిగా వ్యభిచారానికి అడ్డాగా మారాయి. శారదానగర్‌లో ఓ మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్విహ స్తోందని సమాచారం. నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి అమ్మాయిలు వస్తారని తెలుస్తోంది. ఈ విషయం వన్‌టౌన్ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. తాడిపత్రిలో ఇటీవల అరెస్టు చేసినా ఆగలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు వచ్చి పనిచేస్తున్నారు. వారు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పేకాట పాపారావులు ఎక్కువే.. అనంతలో పేకాటరాయుళ్లు ఎక్కువగానే ఉన్నారు. చాలామంది జిల్లా నుంచి కర్ణాటక ప్రాంతాలకు కూడా వెళుతున్నారు. జిల్లాలోని మిడ్పెన్నార్డ్యాం, పెన్నహోబిలం, పెనుకొండ వద్ద స్థావరాలున్నాయి. వీరిలో పోలీసుకానిస్టేబుళ్లు కూడా ఉండటం గమనార్హం. ఇద్దరు గన్మెన్లు పేకాట ఆడే కానిస్టేబుళ్లకు వడ్డీకి అప్పులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.