
ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి దేశంలోనే లేడు
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ రైతులకు రుణాలివ్వొద్దని బ్యాంకులకు చెబుతారా?
♦ బంగారం కుదవపెట్టుకోవద్దని ఆదేశించడం దుర్మార్గం
♦ తాళిబొట్లు తాకట్టుపెట్టాల్సిన దీనస్థితిలో రైతులు
♦ లక్షల ఎకరాల్లో పంటనష్టం.. ఊరంతా వరద
♦ ఊళ్లో హెలికాప్టర్ దిగి ఊరు చూడని సీఎం
♦ నా పర్యటనతోనైనా కదలిక వస్తుందనే తిరుగుతున్నా
♦ సిగ్గుతోనైనా సర్కారు సాయం చేస్తుందని ఆశిస్తున్నా
♦ గుంటూరు జిల్లాలో వరద బాధితులకు జగన్ పరామర్శ
సాక్షి, గుంటూరు : ‘‘వ్యవసాయ పెట్టుబడుల కోసం భార్యల తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సిన దీనస్థితి రైతులది.. కానీ వారి కష్టాలు పట్టించుకోకుండా.. బంగారం కుదవపెట్టుకుని రుణాలివ్వద్దంటూ బ్యాంకులను ఆదేశించిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడం వల్లే రుణాల రీషెడ్యూల్ లేదు.. రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడంలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక తాళిబొట్లు తాకట్టుపెట్టి పావలావడ్డీ రుణాలైనా తెచ్చుకుని వ్యవసాయం చేద్దామని రైతులు ఆశిస్తుంటే.. బంగారం కుదవబెట్టుకుని రుణాలివ్వద్దని చంద్రబాబు బ్యాంకర్లకు చెబుతున్నారు’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధున్నోడు ఎవడైనా రైతులకు తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు చెబుతారని, కాని రైతులకు రుణాలు ఇవ్వొద్దని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని జగన్ ఎద్దేవా చేశారు. భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులు, వరద బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారంనాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే....
హెలికాప్టర్ దిగిన సీఎం ఊళ్లోకి రాలేదు..
‘‘వారం రోజులుగా గ్రామం మొత్తం వర్షంలోనే ఉంది. పూర్తిగా మునిగిపోయింది. ఆరు నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహించింది. ఇళ్లల్లో అన్నీ తడిసిపోయాయి. కనీసం బియ్యం కూడా లేని దుస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో గ్రామం ఉంటే చంద్రబాబు ఈ గ్రామంలో హెలికాప్టర్‌లో వచ్చి దిగడం మంచిదే. దిగిన తరువాత గ్రామానికి ఏమైనా మంచి చేశారా అంటే లేదు. కనీసం గ్రామంలోకి వచ్చి చూశారా అంటే అదీ లేదు.. అలా చేస్తే ఆయన గొప్పవాడని చెప్పుకోవచ్చు.
గ్రామంలోకి రాలేదు... చివరకు ఏ సహాయమూ చేయలేదు.. ముఖ్యమంత్రి ఈ గ్రామానికి వచ్చి నాలుగు రోజులు అయ్యింది కాబట్టి కనీసం అధికారులైనా గ్రామానికి వచ్చి ఏమైనా సాయం చేశారా అంటే అదీ లేదు... ఇప్పటికే ఆరు రోజులైంది.. ఏ గోడ చూసినా ఆరు నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహించినట్లు చారలు కనిపిస్తున్నాయి. ఉర్దూ స్కూల్‌లోకి వెళితే పుస్తకాలు, కంప్యూటర్లు అన్నీ పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. ప్రభుత్వం వల్ల ఏ మేలూ జరగలేదు.. చంద్రబాబు టీవీల్లో కనిపించడం కోసం హెలికాప్టర్‌లో వచ్చి ఇక్కడ ల్యాండయ్యారు. ఆయన వచ్చి పోయిన తరువాత అధికారులు వస్తారనుకుంటే వారూ రాలేదు. దమ్మిడీ సహాయం చేయలేదు. వైఎస్సార్ సీపీ నాయకులు మాత్రమే గ్రామస్తులకు సహాయం అందించారు. ప్రభుత్వంలో ఉన్నవారు సిగ్గుతెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి తమ గ్రామానికి హెలికాప్టర్‌లో వచ్చాడు కాబట్టి ఆయన్ను కలుసుకుని కష్టాలు చెప్పుకుందామనుకుంటే గ్రామస్తులను కనీసం దగ్గరకు కూడా రానీయలేదు.
కేంద్రం ఇచ్చిందీ మళ్లించారు...
గ్రామంలోని ఇళ్లేకాదు... పంటలన్నీ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో పత్తి, లక్షన్నర ఎకరాల్లో మిర్చి, 30 వేల ఎకరాల్లో వరి పంటలు సాగు చేస్తే అందులో మూడో వంతు పంటలు కుళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మన ఖర్మ ఏమిటంటే జూలై చివరి నుంచి ఆగస్టు చివరి వరకు వర్షాలు కురవలేదు. పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఈనెల 12, 13, 14 తేదీల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. మళ్లీ వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలవాలి. వారి కన్నీళ్లు తుడవాలి.
ఇది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాల్సిన పని. కానీ చంద్రబాబు ఎలాంటి సహాయమూ చేయడం లేదు. గత సంవత్సరానికి సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. గత సంవత్సరం వెయ్యి కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అప్ప ట్లో ఇలాంటి వరదలే వచ్చి రైతులు అన్యాయమైన పరిస్థితిలో రైతాంగం ఉంటే, దాదాపు వెయ్యి కోట్లు ఇవ్వాలని, తగ్గించి తగ్గించి లెక్కలు చూపింది చంద్రబాబు ప్రభుత్వం. అందులో రూ.463 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మిగిలింది వేసి రైతులకు ఇవ్వాల్సింది పోయి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన రూ.463 కోట్లు కూడా వేరే దానికి అడ్డుపెట్టుకున్నారు.
మామనే కాదు.. ప్రజలను కూడా...
నిజంగా ఈ మనిషికి రైతులపై ప్రేమ ఉందా? రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీవీల్లో చెప్పారు. బాబు సీఎం అయ్యాడు, ప్రజలతో పనై పోయింది. బ్యాంకులు బంగారం వేలం వేస్తుంటే చంద్రబాబు చూస్తూ ఊరుకున్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయని కారణంగా రైతుల రుణాలు రెన్యువల్ కాలేదు. అందువల్ల ఇవాళ రైతులు బ్యాంకులకు వెళ్తే రెండురూపాయలు, రూపాయిన్నర వడ్డీ వసూలు చేసే పరిస్థితి. అయినా రుణాలిచ్చేలా కనిపించడం లేదు.
దాంతో వ్యవసాయం పెట్టుబడుల కోసం భార్య మెడలో ఉన్న తాళిబొట్టు కుదవబెట్టి పావలావడ్డీకి రుణాలు తెచ్చుకుందామని రైతులు అనుకుంటుంటే బంగారం పెట్టుకుని రుణాలు ఇవ్వద్దని బ్యాంకులను చంద్రబాబు ఆదేశించారు. రైతులపై ఆయనకున్న దుర్మార్గమైన ప్రేమ అటువంటిది. ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొడతారు... మాఫీ చేస్తానని అబద్ధాలతో మోసం చేస్తారు.. బంగారం పెట్టుకుని రైతులకు రుణాలు ఇవ్వద్దని చెబుతారు... ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా ఉండరు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు.. ఆయనకు తెలిసింది ఏమిటంటే పనయ్యాక కత్తి తీసుకుని మెత్తగా పొడవడం బాగా తెలుసు..
పిల్లనిచ్చిన సొంత మామను పొడుస్తాడు.. ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కూడా పొడుస్తాడు... ఇటువంటి దారుణమైన వ్యక్తి దేశంలో ఎక్కడా లేడు... బాబు గ్రామానికి వచ్చి వెళ్లిన తరువాత కూడా దమ్మిడీ సహాయం కూడా అందలేదనే విషయాన్ని రాష్ట్రానికే కాక, దేశానికి చెప్పాలని ఇక్కడకు వచ్చా. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవండి. గ్రామానికి వచ్చి తోడుగా నిలబడండి. కనీసం ఈ కార్యక్రమానికి పబ్లిసిటీ వస్తే బాబులో కదలిక వస్తుంది.. ప్రజలకు తెలుస్తుందని సిగ్గుపడైనా మేలు చేస్తారనే గ్రామానికి వచ్చా. ఆయనపై ఒత్తిడి తెస్తాం. వైఎస్సార్‌సీపీ మీకు తోడుగా ఉంటుంది. సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నా.’’ అని అన్నారు.
వైఎస్సార్సీపీ నేతలే సాయపడ్డారు
‘‘మా గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఆరు నుంచి పది అడుగుల మేర నీరు ప్రవహించింది. సర్వం కోల్పోయాం. మా ఊర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్‌లో వచ్చి దిగారు. ఆయన్ను కలుసుకుందామని ప్రయత్నిస్తే దగ్గరకు రానీయలేదు. కనీసం ఊళ్లోకి వచ్చి మా కష్టాలు చూస్తారనుకుంటే ముఖ్యమంత్రి మా ఊర్లోకి అడుగు పెట్టలేదు.
ఆయన వెళ్లాక అధికారులు కూడా ఎవరూ రాలేదు. ఏ సహాయమూ మాకు అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలబడ్డారు.’’ అని జగన్‌కు రెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తనయుడు బాషా చెప్పారు. ‘‘చంద్రబాబు వచ్చివెళ్లిన తర్వాత కూడా మాకు సాయం అందక అల్లాడుతుంటే వైఎస్సార్సీపీ నాయకులు మా గ్రామానికి 60 క్వింటాళ్ల బియ్యం, కందిపప్పు, నూనె అందించారు.’’ అని ఎంపీటీసీ గౌసియా బేగం జగన్‌కు తెలిపారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా..
మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం గంటన్నరపైగా కురుస్తూనే ఉంది. రహదారికి ఇరువైపులా బారులు తీరిన ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జగన్ కోసం ఎదురుచూపులు చూశారు. జగన్ కాన్వాయ్ ముందు భారీ సంఖ్యలో మోటార్‌సైకిళ్లపై యువకులు వర్షంలోనే తడుస్తూ ముందుకు సాగారు. 3.20 గంటలకు జగన్ రాజుపాలెం చేరుకున్నారు. ఊరిబయట కస్తూర్బా పాఠశాల విద్యార్థినులను జగన్ పలకరించారు. అక్కడి నుంచి రెడ్డిగూడెం చేరుకోవడానికి దాదాపు గంటకు పైగా సమయం తీసుకుంది. రెడ్డిగూడెం మాజీ సర్పంచ్ ఖాజా మొహిద్దీన్‌ను ఆయన పరామర్శించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన జగన్‌కు వివరించారు. స్థానిక మండల పరిషత్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి.. తడిసిన పుస్తకాలు, కంప్యూటర్లను పరిశీలించారు. నష్టం వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలకు సర్వం కోల్పోయామని, తినడానికి బియ్యం కూడా లేవని గ్రామస్తులు జగన్ వద్ద భోరుమన్నారు.
జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి సీతారామాంజనేయులు, ఎండీ నసీర్ అహ్మద్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, సమన్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, క త్తెర సురేష్‌కుమార్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి తదితరులు ఉన్నారు.
కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు
‘వరదల కారణంగా సర్వం కోల్పోయాం.. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడండి..’ అంటూ రాజుపాలెం మండలం కొండమోడు ప్రాంతంలో ఉంటున్న వలస రైతు కూలీలు జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సుమారు 300 మందికిపైగా వచ్చి పలు న ర్సరీలు, పొలాల్లో పనిచేస్తూ బతుకు వెళ్లదీస్తున్నామని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాల కారణంగా చేతికంది వచ్చిన పంట కూడా సర్వనాశనం అయిపోయిందని, తమకు కూలి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
పూట గడవక అవస్థలు పడుతున్నాం..
పులిచింతల నిర్వాసితులు బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద జగన్‌ను కలుసుకుని తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడిచినా తమకు రావాల్సిన ప్యాకేజీని పూర్తిగా ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తున్న నేపథ్యంలో గ్రామాల నుంచి తమను బలవంతంగా ఖాళీ చేయించారని, పునరావాస కేంద్రాలలో తాము నరకయాతన పడుతున్నామని తెలిపారు. గృహ నిర్మాణాలు పూర్తికాక, నిర్మించుకునేందుకు డబ్బు లేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఉపాధి లేక పూట గడవని పరిస్థితిలో ఉన్నామని, తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడి తమకు న్యాయం చేయాలని విన్నవించారు.