
అభిప్రాయం
గత కొన్ని వారాలుగా వివిధ రకాల మిరప ధరలు విపరీతంగా పడిపోవడంతో గుంటూరులోని మిర్చి రైతులు గుండెల్లో మిర్చి మంటతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆక్రందనలు చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన ‘గుంటూరు మిర్చి యార్డ్’ (Guntur Mirchi yard) ఏటా 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. అయితే, అన్ని మిరప రకాల ధరలు ఇటీవలి వారాల్లో ఒక్కో బస్తాకు రూ. 1,000 నుండి రూ. 4,000 వరకు పడిపోయాయి. కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి (Sattenapalle) తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా అధిక లాభాలు వస్తాయనే ఆశతో గుంటూరుకు వెళ్లిన రైతులు... ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి సాగు 1.94 లక్షల హెక్టార్లలో ఉంది, ఈ సీజన్‌లో 11.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం వరుస చీడపీడల వల్ల సాగు ఖర్చులు 30% పైగా పెరిగాయి. చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లాలో ఎకరాకు రూ. 2.5 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసిన అనేక మంది నష్ట భయంతో గజగజలాడుతున్నారు. ‘ప్రస్తుత మార్కెట్ ధర లతో, మా పెట్టుబడులను తిరిగి పొందేందుకు మార్గం కనబడడం లేద’ని రైతులు వాపోతున్నారు.
అనూహ్యంగా గత కొన్ని వారాలుగా మిర్చి కొనుగోళ్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారి పోయింది. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి కీలక మార్కెట్ల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం గణనీయంగా మందగించిందని మిర్చి యార్డ్‌లో కొందరు వ్యాపారస్తులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2023–24లో 0.179 మిలియన్ టన్నుల దిగుమతులతో చైనా భారతీయ ఎర్ర మిరప కాయల అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇది పరిమాణంలో సుమారుగా 14 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
ఒలియోరెసిన్, పాక రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా చైనాకు ఎర్ర మిరప ఎగుమతులు పుంజుకున్నాయి. విలువ పరంగా రెండవ అతిపెద్ద కొనుగోలుదారు అయిన థాయ్‌లాండ్, దాని దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం పెరిగాయి. గడచిన కొంత కాలంలో భారత దేశం నుండి అమెరికాకు ఎర్ర మిర్చి ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. గత ఏడాది 29,173 టన్నుల నుంచి 2023–24లో ఎగుమతులు 25 శాతం పెరిగి 36,413 టన్నులకు చేరుకున్నాయి. అంటే ఎగుమతుల డిమాండ్ తగ్గిందన్నది దీనినిబట్టి చూస్తే అవాస్తవమే అన్నమాట!
గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు విలవిల్లాడి పోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తెలుదేశం పార్టీ అధి నేత తన అధికారులతో మంతనాలు, సమీక్షల తోనూ; కేంద్రంవైపు సహాయం కోసం చూసే చూపులతోనూ కాలం గడుపు తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని, మిర్చి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలైతే తీసుకోవడం లేదు. నిజంగా రైతుకు మేలు చేయడమే సీఎం నైజం అయితే తమకు వెంటనే భరోసా ఇచ్చే చర్యలను చేపట్టాలని రైతాంగం కోరుకుంటోంది.
చదవండి: రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వ్యాపారులు, విక్రయదారులు, ప్రభుత్వ అధికారులతో చర్చించారని చెబుతున్నారు. ఈ చర్చల్లో వ్యాపారులను కొనుగోలు కార్యకలా పాలను పెంచాలని డైరెక్టర్ కోరినా... మార్కెట్‌లో ఎటువంటి నిర్ణయాత్మక మార్పు కనబడడం లేదు. ఈ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి నుండి రైతులను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక తప్పదు. లక్షల్లో అప్పుచేసి మిరప సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడి కూడా రాబట్టుకోలేని దయనీయ స్థితిలో ఉండగా, వ్యాపారులు నిశ్శబ్దంగా అసంబద్ధ చర్యలకు పాల్పడుతున్నట్టుగా పలు అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే అంతగా అభివృద్ధి చెందిన మిరపకు మార్కెట్ పడిపోవడం ఎలా సాధ్యం? చైనాతో సహా 20కి పైగా దేశాలు గుంటూరు మిర్చి వైపు చూస్తుండటం, గత సంవత్సర లాభసాటిగా మార్కెట్ ఉండటం చూస్తుంటే ఈ పతనం వెనుక ఉన్న కాణాలు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెను నిద్దర వదిలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి.
- బలిజేపల్లి శరత్ బాబు
ప్లాంట్ ప్రొటెక్షన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment