capsicum
-
క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ తాజాగా ఉండాలంటే..!
కొన్ని రకాల కాయగూరలని ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే పాడైపోతాయి. ఎలా నిలువ చేయలో అర్థంకాక సతమతమవుతుంటాం. పైగా అవి ఖరీదు కూడా. పోనీ వెంటనే వండటం కుదురుతుందా అంటే ఒక్కొసారి అస్సలు కుదరదు. అలాంటి టైంతో మన పెద్దవాళ్లు లేదా కొందరూ చెఫ్‌లు చెప్పే చిట్కాలు బాగా పనిచేస్తాయి. మన ఇబ్బంది తీరిపోతుంది. అలాంటి కొన్ని ఇంటి చిట్కాలు మీ కోసం.. గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ వేర్లు మునిగేలా పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. పచ్చని భాగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడల్లా కాస్త కట్ చేసుకోని వాడుకోవచ్చు. మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని దోరగా వేయించి గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. మార్కెట్లో దొరికే బ్రెడ్ క్రంప్స్లా ఇది ఉపయోగపడుతుంది. క్రిస్పీ వెజ్ నాన్‌వెజ్ డిష్‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యాప్సికాన్ని పేపర్ బ్యాగ్‌లో చుట్టిపెట్టి, రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది. బేకింగ్ సోడాలో కాస్త వెనిగర్ వేసి నల్లగా జిడ్డుపట్టిన పాత్రలపైన రాసి పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో తోమితే నలుపంతా పోయి పాత్ర కొత్తదానిలా మెరుస్తుంది. (చదవండి: దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్‌పెడుతుందో తెలుసా! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..) -
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న క్యాప్సికం పంట సాగు
-
క్యాప్సికం సాగు చేస్తూ అదుర్స్ అనిపిస్తున్న సాఫ్ట్ వెర్ ఉద్యోగి
-
Recipe: రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారీ ఇలా..
రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ తయారు చేసుకోండిలా.. కావలసినవి: ►క్యాప్సికమ్ – 6 లేదా 8 (శుభ్రంగా కడిగిపెట్టుకుని.. నాలుగు వైపులా చాకుతో గాటు పెట్టుకోవాలి), ►శనగపిండి – 1 కప్పు ►ఉప్పు – తగినంత ►కారం – 1 టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►ధనియాల పొడి – అర టీ స్పూన్ ►వంట సోడా – కొద్దిగా ►క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు – రుచికి అదనంగా (అన్నీ ఒక బౌల్లో వేసుకుని.. నిమ్మరసం, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి) ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కారం, వంట సోడా, ఉప్పు, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ►ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక్కో క్యాప్సికమ్ తీసుకుని.. శనగపిండి మిశ్రమంలో ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ►చల్లారాక చాకుతో ఒక వైపు కట్ చేసుకుని.. అందులో క్యారెట్ ముక్కల మిశ్రమాన్ని నింపుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బజ్జీలు. -
Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా!
ఆనియన్ రింగ్స్ బోర్ కొడితే ఈసారి ఇలా క్యాప్సికమ్ రింగ్స్ ట్రై చేయండి! కావలసినవి: ►క్యాప్సికమ్ – 3 (గుండ్రంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి) ►శనగపిండి – 1 కప్పు ►బియ్యప్పిండి, కారం – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఉప్పు – తగినంత, బేకింగ్ సోడా – పావు టేబుల్ స్పూన్ ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, నీళ్లు – సరిపడా ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు వేయాలి. ►అదే విధంగా బేకింగ్ సోడా, అల్లం–వెల్లుల్లి పేస్ట్.. వేసుకుని బాగా కలిపాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ తోపులా చేసుకోవాలి. ►అందులో క్యాప్సికమ్ ముక్కల్ని బాగా ముంచి.. కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. ►టొమాటో సాస్ లేదా చట్నీల్లో ఈ రింగ్స్ భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Chicken Omelette Recipe: చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం ఇలా! Masala French Toast Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఇలా తయారు చేసుకోండి! -
నోరూరించే ఎగ్ మఫిన్స్, పనీర్ జల్ప్రెజీ తయారీ ఈజీగా ఇలా..
కావల్సిన పదార్థాలు: గుడ్లు – ఆరు, స్ప్రింగ్ ఆనియన్ – ఒకటి, ఉల్లిపాయలు – రెండు, టోపు – ఆరు ముక్కలు, చీజ్ తురుము – అరకప్పు, ఉప్పు – అరటిస్పూను, ఆలివ్ ఆయిల్ – టీ స్పూను. తయారీ విధానం: ►ముందుగా స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ►తరువాత టోపును కూడా క్యూబ్‌లుగా తరగాలి. ►ఒక గిన్నెలో టోపు ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము గుడ్లు పగల కొట్టి వేసి కలపాలి. ఉప్పువేసి మరోసారి కలపాలి. ►ఇప్పుడు మఫిన్ ఉడికించే పాత్రకు ఆలివ్ ఆయిల్ రాసి దానిలో ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసి ఇరవై నిమిషాలపాటు బేక్ చేస్తే ఎగ్ మఫిన్స్ రెడీ. పనీర్ జల్ప్రెజీ కావల్సిన పదార్థాలు: పనీర్ – పావుకేజీ, క్యాప్సికం – ఒకటి, టొమాటోలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ధనియాలు – టేబుల్ స్పూను, ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీ స్పూను, కారం – అర టీస్పూను, పసుపు – అరటీస్పూను, గరం మసాలా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – గార్నీష్కు సరిపడా. తయారీ విధానం: ►ముందుగా పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి వేడినీళ్లలో పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ►క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ►ధనియాలను దోరగా వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇవి వేగాక క్యాప్సికం, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు సగం వేయాలి. ►ఇవి దోరగా వేగిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరంమసాలా వేసి మీడియం మంటమీద కూరగాయ ముక్కలు రంగు పోకుండా వేయించాలి. ►టొమాటోలు మెత్తబడిన తరువాత పనీర్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ►తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పనీర్ జల్ప్రేజీ రెడీ. ఇది నాన్, తందూరీ రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. గార్లిక్ స్మాష్డ్ పొటాటో కావల్సిన పదార్థాలు: బంగాళ దుంపలు – ఆరు, వెన్న – రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా, బరకగా దంచిన ఎండుమిర్చి కారం – టేబుల్ స్పూను, వెల్లుల్లి పొడి – టేబుల్ స్పూను. తయారీ విధానం: ►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు కలిపి ఉడకబెట్టి నీళ్లు తీసేసి పక్కనబెట్టుకోవాలి. ►ఉడికించిన బంగాళ దుంప స్మాషర్తో మెత్తగా చిదుముకోవాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కలపాలి. ►ఇప్పుడు ఈ దుంపల మిశ్రమాన్ని సన్నని స్లైసుల్లా చేసి నలభై ఐదు నిమిషాలపాటు బేక్ చేస్తే గార్లిక్ స్మాష్డ్ పొటాటోస్ రెడీ. ఆరెంజ్ క్యాలీఫ్లవర్ కావల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ – పెద్దది ఒకటి బ్యాటర్ కోసం: గోధుమ పిండి – ఒకటింబావు కప్పు, బాదం పాలు – కప్పు, పసుపు – టీ స్పూను, వెల్లుల్లి పొడి – టీస్పూను, ఉప్పు – పావుటీస్పూను. ఆరెంజ్ సాస్: నీళ్లు – ముప్పావు కప్పు, ఆరెంజ్ జ్యూస్ – కప్పు, బ్రౌన్ సుగర్ – ముప్పావు కప్పు, మేపిల్ సిరప్ – ముప్పావు కప్పు, రైస్ వెనిగర్ – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు, అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ – టీస్పూను, కార్న్‌స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా బ్యాటర్కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి బ్యాటర్‌ను రెడీ చేసుకోవాలి. ►క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కోముక్కను బ్యాటర్లో ముంచి ముక్కకు పట్టించాలి. ►అన్ని ముక్కలకు బ్యాటర్ పట్టించిన తరువాత ముక్కలను ఇరవై నిమిషాలపాటు బేక్ చేయాలి. ►ఇప్పుడు కార్న్‌స్టార్చ్‌ను నీళ్లల్లో వేసి మందంగా కలుపుకోవాలి. ►స్టవ్ మీద బాణలిపెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత వెల్లుల్లి, అల్లం తురుమును వేసి మూడు నిమిషాలు వేయించాలి.ఇవి వేగాక కార్న్‌స్టార్చ్ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి. తరువాత ఆరెంజ్ సాస్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడికిస్తే ఆరెంజ్ సాస్ రెడీ అయినట్లే. ►ఇప్పుడు బేక్ చేసిపెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలను ఆరెంజ్ సాస్‌లో ముంచి మరో పదినిమిషాల పాటు బేక్ చేయాలి. ►ఐదు నిమిషాల తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను మరోవైపు తిప్పి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు బేక్ చేస్తే ఆరెంజ్ క్యాలీఫ్లవర్ రెడీ. -
బుంగ మిర్చి.. బందరు కుచ్చి
సాక్షి, మచిలీపట్నం: బుంగ మిర్చి. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో బుట్ట మిరప అని కూడా పిలుస్తారు. దీనికి మసాలా పెట్టి బజ్జీలేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే. కొంచెం కారంగా.. ఇంకొంచెం కమ్మగా ఉండే ఈ బజ్జీ రకం మిర్చి అచ్చం క్యాప్సికమ్‌ను పోలి ఉంటుంది. కానీ.. సైజులో మాత్రం దానికంటే తక్కువ. అరుదైన ఈ రకం దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో మాత్రమే సాగులో ఉంది. ఆ తరువాత మచిలీపటా్ననికి కూతవేటు దూరంలోని పోతేపల్లిలో సాగవుతోంది. ఇక్కడి కౌలు రైతులు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా వచ్చింది.. మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన ఓ వ్యక్తి సుమారు 50 ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతం నుంచి ఒక మిరప మొక్కను తీసికొచ్చి నాటారట. దాని నుంచి వచ్చిన విత్తనాలతో రెండు మొక్కల్ని అభివృద్ధి చేసి.. వాటిలో ఒక దానిని పోతేపల్లి గ్రామంలో ఒక రైతుకు ఇచ్చారని చెబుతారు. ఆ ఒక్క మొక్క నుంచి వచ్చిన విత్తనాలతో 40 ఎకరాల్లో సాగు చేపట్టారని రైతులు చెబుతున్నారు. దీనిని అక్కడక్కడా కూర కోసం వినియోగించినా.. ఎక్కువగా బజ్జీలకే వాడతారు. కృష్ణా, గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు, బరంపురం ప్రాంతాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడి నుంచి ప్రతి వారం కనీసం మూడు లారీల కాయలు ఎగుమతి అవుతాయి. ప్రత్యేకతలివీ.. తొలకరిలో ఇతర పంటల మాదిరిగానే జూన్‌లో నారు పోస్తారు. ఆగస్టులో మొక్కలు నాటుతారు. నాటిన మూడో నెల నుంచి 9వ నెల వరకు దిగుబడి వస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ వారానికోసారి కాయల్ని కోస్తారు. చల్లటి వాతావరణంలో మాత్రమే సాగయ్యే బుంగ మిరపకు ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి అవుతుంది. దీనిని కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.40 వేల వరకు కౌలు చెల్లిస్తారు. ఎకరానికి కనీసం 12 లక్షల వరకు కాయల దిగుబడి వస్తుంది. ఒక్కో కాయను 40 పైసల నుంచి 60 పైసలకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కాయ సగటు ధర 50 పైసల వరకు ఉంటుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. చిత్రమేమిటంటే ఈ పంట పోతేపల్లి గ్రామంలో మాత్రమే పండుతుంది. ఇక్కడి విత్తనాన్ని తీసుకెళ్లి పొరుగు గ్రామాల్లో సాగు చేసేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేదు. ప్రోత్సహిస్తున్నాం.. క్యాప్సికమ్ జాతికి చెందిన బుంగ మిర్చి రకం ఇసుక నేలల్లోనే పండుతుంది. పోతేపల్లిలో ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వలన ఈ పంట సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సలాహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం. –దయాకరబాబు, ఏడీ, హార్టికల్చర్ లాభాలు బాగుంటాయి ఈ రకం మిర్చి ఈ ప్రాంతంలోనే పండుతుంది. దీనిని సాగు చేస్తే లాభాలు బాగుంటాయి. మిగిలిన పంటలతో పోలిసే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్ణాటకలోని హుబ్లీ, బెల్గాం, ధార్వాడ ప్రాంతాల నుంచి విత్తనం తెచ్చుకుంటున్నాం. – కె.నూకలయ్య, రైతు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత సాగు ఎకరా 20 సెంట్లలో 40 ఏళ్లుగా ఈ పంట సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.రెండు లక్షల వరకు మిగులుతుంది. ఈ ప్రాంతంలో పండించే పంటను సేకరించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. – కటికల రాజేష్, సాగుదారు -
క్యాప్సికం కాసులవర్షం
యశవంతపుర: సంప్రదాయ రాగి, జొన్న, వరి పంటలకు భిన్నంగా సాగిన రైతు నెలకు రూ. లక్ష లాభాలను కళ్లజూస్తున్నాడు. పాలిహౌస్ ద్వారా క్యాప్సికంను సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు రైతు మైలారప్ప సోమప్ప చలవాది. గదగ్ జిల్లా నరగుంద తాలూకా కపలి గ్రామానికీ చెందిన రైతు మైలారప్ప పాలి హౌస్ ద్వారా రెడ్ క్యాప్సికంను సాగు చేశాడు. ఉద్యానవనశాఖ సాయంతో 20 గుంటల భూమిలో 16 లక్షల ఖర్చుతో వేశాడు. అం దులో రెండు వేల క్యాప్సికం మొక్కలను నాటారు. మంచి కాపు రావటంతో రైతులో ఆనందం కలిగిస్తోంది. రెడ్ క్యాప్సికం కు మంచి డి మాండ్ ఉంది. ఆయన పంటను ఇతర రాష్ట్రాల కు ఉత్పత్తి చేస్తున్నాడు. తక్కువ నీటితోనే మం చి దిగుబడినివ్వడం ఈ పంట ప్రత్యేకత. ఇందులోనే టమోటా సాగును కూడా చేస్తున్నాడు. తాలూకాలోనే మొదటి రైతు తాలూకాలో మొదటిసారిగా పాలిహౌస్ ద్వారా కాయగూరల పండించే రైతును తానేనని ఆయన చెప్పాడు. క్యాప్సికం కేజీ నూరు రూపాయిలు పలుకుతోంది. 8 నెలల పాటు దిగుబడినిస్తుంది. నెలకు కనీసం రూ. లక్ష ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. సాగుకు రెండు లక్షల రూపాయలు ఖర్చయింది. ఐదు లక్షల వరకు లాభం వస్తుందని రైతు తెలిపాడు. ప్రతి నెలా క్యాప్సికం ద్వారా రూ. లక్ష లాభం పొందవచ్చని చెప్పారు. మూడు నెలలలో పంట సంపూర్ణంగా చేతికి అందుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో పంట సాగు చేయవచ్చని చెప్పాడు. పాలి హౌస్ విధానంలో తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చని చెప్పాడు. -
కారంగా ఉండే టమోటాలు
కారం తింటే నోరంతా మండిపోతుంది గానీ.. అందులో ఉండే కాప్సినాయిడ్ రసాయనాల వల్ల మాత్రం బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఊబకాయం, నొప్పి తగ్గించే విషయంలో ఈ కాప్సినాయిడ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇంకేముంది. వీటిని బోలెడన్ని పండిస్తే సరి అంటున్నారా? అక్కడే వస్తోంది చిక్కు. వీటిని పెద్దఎత్తున పండించడం సాధ్యం కాదు. మిరప, మిరియాలు, కాప్సికం వంటి వాటిల్లోనూ ఇవి తక్కువగా ఉంటాయి. పంటపంటకూ తేడాలూ ఉంటాయి. మరెలా? అంటే.. సులువుగా పండించుకోగల టమోటాల్లో కాప్సినాయిడ్లు ఉత్పత్తి చేసే జన్యువులను మళ్లీ ఆన్ చేస్తే సరి అంటున్నారు శాస్త్రవేత్తలు. టమోటా, కాప్సికమ్‌లు రెండూ ఒకేజాతికి చెందినప్పటికీ రెండు కోట్ల ఏళ్ల కిత్రం విడిపోయాయని, కాకపోతే రెండింటిలోనూ ఒకే రకమైన జన్యువులు కొన్ని ఉండటం గమనార్హమని తాజా ప్రతిపాదన తీసుకొచ్చిన శాస్త్రవేత్త అగస్టిన్ సైన్. ఈ జన్యువుల్లో కాప్సినాయిడ్ ఉత్పత్తి చేసేవి కూడా ఉన్నాయని.. ఇవెలా పనిచేస్తాయో తెలుసుకుని టమోటాల ద్వారా బహుళ ప్రయోజనకరమైన కాప్సినాయిడ్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం ఎంతైనా ప్రయోజనకరమని ఆయన వివరించారు. టమోటా కేంద్రంగా కొన్ని ఆహారానికి రంగులిచ్చే బిక్సిన్, కంటిచూపును మెరుగుపరిచే బీటా కెరొటిన్ వంటి ఆక్సిడెంట్లను కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
పైకి పెదరాయుడు లోపల చంటిగాడు
వంకాయ... పుచ్చులు ఏరేస్తాం. బెండ... వేళ్ల చివర్లు విరిచేస్తాం. ఆలూ... తిప్పితిప్పి చూస్తాం. చిక్కుళ్లు... విత్తనాల్ని ఒత్తుతాం. ఒక్కోదానికి ఒక్కో టెస్ట్. అలాగే క్యాప్సికమ్. కలర్ చూసి సెలక్ట్ చేసుకుంటాం. పచ్చిది గ్రీన్... పండింది రెడ్... మగ్గింది ఆరెంజ్... ఆఖర్న ఎల్లో. రంగు చూస్తే నోరూరుతుంది! ఊరితే ఓకే, మండితేనో... (అసలే మిర్చి కదా!). అంత లేదు! క్యాప్సికమ్... పైకి పెదరాయుడు. లోపల చంటిగాడు. సాఫ్ట్ అండ్ స్పైసీ! ఈ రెండూ కలిసిన ‘రుచులు’... ఇంచుమించు స్వర్గపుటంచులు! చాప్సీ నూడుల్స్ సూప్ కావలసినవి నూనె - తగినంత; అల్లం పేస్ట్ - టీ స్పూను; ఉల్లితరుగు - పావు కప్పు; క్యాప్సికమ్ తురుము - కప్పు; క్యారట్ తురుము - పావు కప్పు; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; టొమాటో సాస్ - రెండు టేబుల్ స్పూన్లు; చిల్లీసాస్ - అర టీ స్పూను; పంచదార - టీ స్పూను; వెనిగర్ - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు; నూడుల్స్ - కప్పు; సోయాసాస్ - అర టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను తయారి ఒక పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో అల్లం పేస్ట్, ఉల్లితరుగు, క్యారట్ తురుము వేసి బాగా కలపాలి కారం, ఉప్పు జతచేయాలి మంట పెద్దది చేసి రెండు నిముషాలు కలుపుతుండాలి టొమాటో సాస్, చిల్లీసాస్, పంచదార, వెనిగర్ వేసి కలపాలి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక కప్పులో కొద్దిగా చల్లనీరు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కూరల మిశ్రమంలో వేయాలి మిశ్రమం చిక్కబడేవరకు కలపాలి సోయాసాస్ వేసి బాగా కలిపితే గ్రేవీ తయారయినట్లే ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీరు పోసి మరిగించాలి నూడుల్స్ వేసి రెండుమూడు నిముషాలు నూడుల్స్ మెత్తబడేవరకు ఉంచాలి నీటిని ఒంపేసి, నూడుల్స్‌ని చన్నీటిలో రెండుమూడుసార్లు జాడించాలి కొద్దిగా నూనె జతచే యాలి (ఇలా చేయడం వల్ల నూడుల్స్ అతుక్కోకుండా ఉంటాయి) ఒక పాన్‌లో నూనె కాగాక నూడుల్స్ వేసి వేయించి కిచెన్ టవల్ మీద ఉంచాలి (నూనె అంతా పోయి బాగా క్రిస్పీగా అవుతాయి) సర్వింగ్ బౌల్లో వీటిని వేయాలి. తయారుచేసి ఉంచుకున్న గ్రేవీని నూడుల్స్ మీద పోసి మిరియాలపొడి చల్లి సర్వ్ చేయాలి. స్టఫ్డ్ పెపర్స్ విత్ వెజిటబుల్ ఉప్మా కావలసినవి: నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు; ఉల్లితరుగు - పావుకప్పు; బీరకాయ తరుగు - పావు కప్పు; పసుపురంగు క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; ఎరుపురంగు క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; గ్రీన్ క్యాప్సికమ్ - 10 (స్టఫ్ చేయడానికి అనువుగా పై భాగం జాగ్రత్తగా కట్ చేయాలి); పుదీనా తరుగు - పావుకప్పు; నీరు - ఒకటిన్నర కప్పులు; టొమాటో తరుగు - పావు కప్పు ; బియ్యపురవ్వ - కప్పు; టొమాటో పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారి: ఒక పాత్రలో తగినంత నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, బీర కాయ తరుగు, ఎరుపు + పసుపు క్యాప్సికం తరుగు, పుదీనా తరుగు, టొమాటో తరుగు వేసి బాగా కలపాలి. కొద్దిగా వేగాక, తగినంత నీరు పోసి మరిగించాలి. బాగా మరిగాక బియ్యపురవ్వ వేస్తూ కలుపుతుండాలి టొమాటో పేస్ట్ వేసి మరోమారు కలపాలి మంట తగ్గించి మూత పెట్టి, పది నిముషాలు ఉడికించాలి మరొక పాత్రలో కొద్దిగా నూనె వేసి పై భాగం కట్ చేసిన క్యాప్సికమ్‌లను ఆ నూనెలో వేసి జాగ్రత్తగా కలపాలి కొద్దిగా వేగగానే తీసేసి, అందులో పైన తయారుచేసి ఉంచుకున్న ఉప్మా మిశ్రమాన్ని స్టఫ్ చేసి మరో మారు బాణలిలో ఉన్న నూనెలో వేసి కాయ ఆకారం చెదరకుండా జాగ్రత్తగా కలిపి దించేయాలి వాటిని అలాగే సర్వ్ చేయాలి. చీజ్ క్యాప్సికమ్ పరాఠా కావలసినవి: క్యాప్సికమ్ - 4 (పెద్దవి); పెరుగు - పావు కప్పు; గరంమసాలా - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; గోధుమపిండి - రెండుకప్పులు; చీజ్ స్లైసులు - తగినన్ని; నూనె - తగినంత తయారి: క్యాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి ఒకపాత్రలో క్యాప్సికమ్ పేస్ట్, పెరుగు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి ఇందాకటి మిశ్రమంలో గోధుమపిండి జతచేసి చపాతీపిండి మాదిరిగా కలపాలి పాత్ర మీద మూతగా తడి వస్త్రం వేసి పదినిముషాలు పక్కన ఉంచాలి చపాతీలు ఒత్తుకుని పెనం మీద వేసి, చుట్టూ నూనె వేసి కాల్చి హాట్ప్యాక్లోకి తీసుకోవాలి ఒక్కో చపాతీ మీద ఒక్కో చీజ్ స్లైస్ వేసి చపాతీలను రోల్ చేసి, సర్వ్ చేయాలి. క్యాప్సికమ్ పికిల్ కావలసినవి క్యాప్సికమ్ - 3 (ఏ రంగు కావాలంటే వాటిని ఎంచుకోవచ్చు); పల్లీలు - అర కప్పు; ఎండుమిర్చి - 15; నూనె - 100 గ్రా.; లవంగాలు - 3; వెల్లుల్లి రేకలు - 4; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; చింతపండు రసం - మూడు టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను తయారి ఒక పాత్రలో పల్లీలు, ఎండుమిర్చి వేసి బాగా కలిపి, దించి, చల్లారాక పొడి చేయాలి మరొక పాత్రలో నూనె వేసి కాగాక లవంగాలు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మెత్తబడే వరకు ఉంచాలి పసుపు, ఉప్పు జత చేయాలి చింతపండు రసం వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉడికించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పల్లీల పొడి వేసి మరోమారు మిక్సీపట్టాలి బాణలిలో నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో కలపాలి. ట్రై కలర్ పెపర్ సలాడ్ కావలసినవి నూనె - పావు కప్పు; రెడ్ క్యాప్సికమ్ - 2 (నిలువుగా సన్నగా కట్ చేయాలి); గ్రీన్ క్యాప్సికమ్ - 2 (నిలువుగా సన్నగా కట్ చేయాలి); ఎల్లో క్యాప్సికమ్ - 2 (నిలువుగా సన్నగా కట్ చేయాలి); ఉప్పు - తగినంత; జీడిపప్పు ముక్కలు - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 6; నిమ్మరసం - టీ స్పూను; ధనియాల పొడి - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు తయారి ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో... తరిగి ఉంచుకున్న కూరముక్కల (రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్)ను వేసి దోరగా వేయించాలి ఉప్పు, జీడిపప్పు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి వెల్లుల్లి రేకలు జతచేసి బాగా కలిపాక, నిమ్మరసం వేయాలి దనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి చల్లి బాగా కలపాలి రెండు నిముషాలు ఉంచి దించేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి ఇది సలాడ్‌లాగ తినచ్చు, లేదంటే చపాతీలోకి కూడా బాగుంటుంది. చికెన్ క్యాప్సికమ్ కావలసినవి: మారినేట్ చేయడానికి ... పెరుగు - టేబుల్ స్పూను; కారం - అర టీ స్పూను; మిరియాలపొడి - అర టీ స్పూను; ధనియాలపొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; జీలకర్ర పొడి - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; నిమ్మరసం - టీ స్పూను; సోయాసాస్ - టీ స్పూను; ఉప్పు - తగినంత; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; చికెన్ - అర కేజీ (మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి); నూనె - తగినంత; ఉల్లితరుగు - అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; గరం మసాలా పొడి - (దాల్చినచెక్క, ఏలకులు, లవంగాల పొడి); టొమాటో సాస్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - టీ స్పూను. తయారి: ఒక పాత్రలో పెరుగు, కారం, మిరియాలపొడి, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మరసం, సోయా సాస్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చికెన్‌కి పట్టించి సుమారు రెండు గంటల సేపు మ్యారినేట్ చేయాలి బాణలిలో సగం నూనె వేసి కాగాక, ఉల్లితరుగు వేసి వేయించాలి క్యాప్సికమ్ తరుగు, టొమాటో తరుగు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాత్రలో మిగతా సగం నూనె వేసి, మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సుమారు నాలుగైదు నిముషాలు ఉడికించి, పక్కన ఉంచిన కూరల మిశ్రమాన్ని జత చేయాలి మంట తగ్గించి పది నిముషాలు ఉడకనివ్వాలి. మూత తీసి సుమారు పావు కప్పు నీరు పోసి, చికెన్ మెత్తబడేవరకు ఉడికించాలి గరంమసాలా పొడి, టొమాటో సాస్ వేసి కలపాలి వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, క్యాప్సికమ్, టొమాటోతరుగు వేసి కలిపి నిముషాలు ఉడికించాలి. (గ్రేవీ తక్కువగా ఉండేలా చూడాలి) సేకరణ: డా.వైజయంతి