సాక్షి, మచిలీపట్నం: బుంగ మిర్చి. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో బుట్ట మిరప అని కూడా పిలుస్తారు. దీనికి మసాలా పెట్టి బజ్జీలేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే. కొంచెం కారంగా.. ఇంకొంచెం కమ్మగా ఉండే ఈ బజ్జీ రకం మిర్చి అచ్చం క్యాప్సికమ్‌ను పోలి ఉంటుంది. కానీ.. సైజులో మాత్రం దానికంటే తక్కువ. అరుదైన ఈ రకం దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో మాత్రమే సాగులో ఉంది. ఆ తరువాత మచిలీపటా్ననికి కూతవేటు దూరంలోని పోతేపల్లిలో సాగవుతోంది. ఇక్కడి కౌలు రైతులు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇలా వచ్చింది..
మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన ఓ వ్యక్తి సుమారు 50 ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతం నుంచి ఒక మిరప మొక్కను తీసికొచ్చి నాటారట. దాని నుంచి వచ్చిన విత్తనాలతో రెండు మొక్కల్ని అభివృద్ధి చేసి.. వాటిలో ఒక దానిని పోతేపల్లి గ్రామంలో ఒక రైతుకు ఇచ్చారని చెబుతారు. ఆ ఒక్క మొక్క నుంచి వచ్చిన విత్తనాలతో 40 ఎకరాల్లో సాగు చేపట్టారని రైతులు చెబుతున్నారు. దీనిని అక్కడక్కడా కూర కోసం వినియోగించినా.. ఎక్కువగా బజ్జీలకే వాడతారు. కృష్ణా, గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు, బరంపురం ప్రాంతాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడి నుంచి ప్రతి వారం కనీసం మూడు లారీల కాయలు ఎగుమతి అవుతాయి.
ప్రత్యేకతలివీ..
తొలకరిలో ఇతర పంటల మాదిరిగానే జూన్‌లో నారు పోస్తారు. ఆగస్టులో మొక్కలు నాటుతారు. నాటిన మూడో నెల నుంచి 9వ నెల వరకు దిగుబడి వస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ వారానికోసారి కాయల్ని కోస్తారు.
చల్లటి వాతావరణంలో మాత్రమే సాగయ్యే బుంగ మిరపకు ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి అవుతుంది. దీనిని కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.40 వేల వరకు కౌలు చెల్లిస్తారు.
ఎకరానికి కనీసం 12 లక్షల వరకు కాయల దిగుబడి వస్తుంది. ఒక్కో కాయను 40 పైసల నుంచి 60 పైసలకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కాయ సగటు ధర 50 పైసల వరకు ఉంటుంది.
పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. చిత్రమేమిటంటే ఈ పంట పోతేపల్లి గ్రామంలో మాత్రమే పండుతుంది. ఇక్కడి విత్తనాన్ని తీసుకెళ్లి పొరుగు గ్రామాల్లో సాగు చేసేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేదు.
ప్రోత్సహిస్తున్నాం..
క్యాప్సికమ్ జాతికి చెందిన బుంగ మిర్చి రకం ఇసుక నేలల్లోనే పండుతుంది. పోతేపల్లిలో ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వలన ఈ పంట సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సలాహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం.
–దయాకరబాబు, ఏడీ, హార్టికల్చర్
లాభాలు బాగుంటాయి
ఈ రకం మిర్చి ఈ ప్రాంతంలోనే పండుతుంది. దీనిని సాగు చేస్తే లాభాలు బాగుంటాయి. మిగిలిన పంటలతో పోలిసే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్ణాటకలోని హుబ్లీ, బెల్గాం, ధార్వాడ ప్రాంతాల నుంచి విత్తనం తెచ్చుకుంటున్నాం.
– కె.నూకలయ్య, రైతు
మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత సాగు
ఎకరా 20 సెంట్లలో 40 ఏళ్లుగా ఈ పంట సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.రెండు లక్షల వరకు మిగులుతుంది. ఈ ప్రాంతంలో పండించే పంటను సేకరించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది.
– కటికల రాజేష్, సాగుదారు
Comments
Please login to add a commentAdd a comment