
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వానపల్లిపాలెంలో ఎండిపోతున్న వరి పొలం
బీడు వారుతున్న చివరి ఆయకట్టులోని పొలాలు
నీరందక దెబ్బతింటున్న లక్ష ఎకరాల పంట
లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ సాగు
అయినా సమృద్ధిగా నీరందించలేకపోతున్న ప్రభుత్వం
వంతుల వారీ విధానంలో విఫలం.. గోదావరి, కృష్ణా డెల్టా శివారులో సమస్య తీవ్రం
అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు.. సొంతంగా ఆయిల్ ఇంజన్లతో తోడుకుంటున్న వైనం
పంటను కాపాడుకునేందుకు మురుగు, కలుషిత నీటి వినియోగం.. దెబ్బతింటున్న వరి, మిరప, మొక్కజొన్న
సాగు నీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు.. ధర్నాలు.. రాస్తారోకోలు.. పంటచేలల్లో వినూత్న నిరసన
తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలు
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది..! దీనిప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరందాలి..! కానీ, వంతుల వారీ నీరందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో విసుగుచెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరివ్వడంలోనే కాదు.. విడుదల, నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు.
కళ్లెదుటే ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరి దుబ్బులను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌లపై పంట చేలల్లో తిరుగుతూ గోడు వినండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండడం అన్నదాతలను కుంగదీస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
46 లక్షల ఎకరాల్లోనే సాగు
ప్రభుత్వం రబీలో 57.66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. మార్చి 19 నాటికి 55 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 46 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 19.87 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, 16.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తమ్మీద నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ. మరోపక్క రెండో పంటకు సరిపడా నీరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. పరిస్థితి చూస్తే శివారు ప్రాంతాలకు చేరలేనేలేదు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాక హంద్రీనీవా, వంశధార నదుల కింద కూడా రైతులు పాట్లు పడుతున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది.
–నవంబరు, డిసెంబరులో మైనస్ 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం, జనవరి, ఫిబ్రవరిలో 79.2 మిల్లీమీటర్లు, మార్చిలో ఇప్పటివరకు 98.3 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది.
కోనసీమ జిల్లాలనే కన్నీరు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 95 శాతం పంట గోదావరి కాలువల కిందనే. 5వేలకు పైగా ఎకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. రబీకి నీటి సరఫరా విషయంలో తొలి నుంచి అధికారులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖరీఫ్ వర్షాలతో చేలల్లో ముంపు దిగక రబీ నారుమడులు ఆలస్యమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ శివారుకు చేరడం లేదు.
–అమలాపురం మండలం వన్నెచింతలపూడి, ఎ.వేమవరం, ఎ.వేమరప్పాడు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పర్రభూమి ప్రాంతం, కూనవరం, ముక్తేశ్వరం పంట కాలువ కింద లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం, అంబాజీపేట మండలం కె.పెదపూడి, మామిడికుదురు మండలం నిడిమిలంక గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.
బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ద్వారా కుండలేశ్వరం వైరులాకు దిగువ, ఎగువ ప్రాంతాలకు వంతుల వారీగా ఇస్తున్నా శివారు ఆయకట్టు బీటలు వారింది. కె.గంగవరంలో యండగండి, కూళ్ల, కోటిపల్లి, యర్రపోతవరం పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాళు తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. అదనపు భారం అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుతూ పొట్ట దశలోని వరి పంటను రక్షించేందుకు
ప్రయత్నిస్తున్నారు.
పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సాగునీటి కోసం గురువారం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
చేలల్లోనే వినూత్న నిరసనలు
అయినాపురం–కూనవరం పంట కాలువ శివారు కూనవరం పరిధి గరువుపేట రైతులు పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. ఈనే దశలో ఉన్న సుమారు 350 ఎకరాల్లోని పంట దెబ్బతింటోందని వాపోయారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు దాసరివారిపేటలో ఎండిన చేలలో ఓ రైతు మోటారు సైకిల్ నడిపాడు.
ఆత్మహత్యలే శరణ్యం..
తాళ్లరేవు మండల పరిధి పి.మల్లవరం శివారు రాంజీనగర్, మూలపొలం, గ్రాంటు తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు సాగు నీరు పూర్తిగా అందడం లేదు. దీంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ వరిదుబ్బులు, పురుగు మందు డబ్బాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోన మండలం రామాలయంపేట, గొల్లగరువు, లైనుపేట 150 ఎకరాలు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, చాకిరేవు చెరువు, తిల్లకుప్ప, మొల్లి చెరువు, జి.మూలపొలం తదితర ప్రాంతాల్లో 300 ఎకరాలు బీడువారుతున్నాయి. పి.మల్లవరం పంచాయతీ మూలపొలం, రాంజీనగర్, గ్రాంటు గ్రామాల్లో వరిచేలకు సాగునీరు అందక బీటలు వారాయి. జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు.
–కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో చేలు బీటలు వారాయి. తాళ్లరేవు కరప, గొల్లప్రోలు, శంకవరం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది.
వట్టిపోయిన కేసీ కెనాల్..
శ్రీశైలం నిండింది..రెండో పంటకు దండిగా నీరు అందుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కేసీ కాల్వ ఒట్టిపోయింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి చేలకు నీరు చేరడం లేదు. కేసీ కెనాల్ రైతుల అగచాట్లు మామూలుగా లేవు. గొప్పాడు మండలం యాళ్లూరు వద్ద ముచ్చుమర్రి పంపుల ద్వారా 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నా చివరి ఆయకట్టుకు చేరడమే లేదు.
ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లో 18 వేల ఎకరాల్లో వరి, కంది, మొక్కజొన్న సాగవుతున్నాయి. కోత దశలో ఉన్న మొక్కజొన్నకు కనీసం రెండు తడులు అందించాలి. నీరివ్వకుంటే రూ.లక్షల్లో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద నీరు బంద్ కావడంతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్వ కింద 42 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కోత దశకు రాగా.. తడులందక రైతులు పాట్లు పడుతున్నారు.
సాగర్ కిందా ఇదే దుస్థితి..
ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9 రోజులు, ఉమ్మడి ప్రకాశంకు 6 రోజులు నీటిని విడుదల చేస్తున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు బ్రాంచి కెనాల్, మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాల్వ ద్వారా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లోని శివారు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
ఈ ప్రాంతంలో రబీలో 36 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, మినప, శనగ, మొక్కజొన్న వేయగా, ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్నకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయకపోవడం, చేసినా చివరి భూములకు నీరు చేరక పంటలు బెట్టకు వస్తున్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి చెరువులు, కుంటల్లోని నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలను తడుపుతున్నారు. మురుగు కాలువల్లో నీటిని తోడి పంటలను కాపాడుకోవల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు.
–శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని తడులు అందిస్తున్నారు. వంశధార జలాశయం కింద నీరందని కొందరు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు.
–కృష్ణా డెల్టాలోని ఏలూరు జిల్లా పెడపాడు, దెందులూరు మండలాల్లో 48 వేల ఎకరాలను ఖాళీగా వదిలేశారు. దెందులూరుతో పాటు బీమడోలు మండల పరిధి పలు గ్రామాల్లో ప్రస్తుతం పొట్ట, ఈనిక దశలో ఉన్న వరి పంటకు నీరందని పరిస్థితి ఉంది. సుమారు 7 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
ఆత్మహత్యలే శరణ్యం
ఈ ఏడాది సూపర్–10 రకానికి సంబంధించి పది ఎకరాల మిరప సాగు చేశా. రూ.లక్ష దాక పెట్టుబడి అయింది. మరో రెండు విడతల కోతలు రావాల్సి ఉంది. మార్చి మొదటి వారం నుంచే పొన్నాపురం సబ్ చానల్‌కు నీటి విడుదల ఆపేశారు. భూములు తడులు లేక పగుళ్లిచ్చాయి. కేసీ కెనాల్ అధికారులను వేడుకుంటున్నా సాగు నీటి విడుదలకు ప్రయోజనం లేకపోయింది. దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం.
–చిన్న తిరుపతిరెడ్డి, మిటా్నల, నంద్యాల జిల్లా
అధికారులు కన్నెత్తి చూడడం లేదు
మాది ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం. మూడెకరాలు కౌలుకు చేస్తున్న. దాళ్వాలో వరి వేశా. నీటికి ఢోకా లేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నా. మా గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది?
–వల్లూరి నాగేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కలుషిత నీటిని తోడుకుంటున్నాం
వరి చేలు బీటలు వారాయి. టేకి డ్రైన్‌లో నీటిని మోటార్లతో తోడుతున్నారు. అది ఉప్పగా ఉండడంతో పాటు కలుషితం కావడంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. గతంలో మాదిరిగా తాతపూడి పంపింగ్ స్కీం ద్వారా నీరు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
–దడాల బుజ్జిబాబు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా
ఏం చేయాలో పాలుపోవడం లేదు
4.5 ఎకరాల్లో మెనుగు పెసర వేశారు. నీరు లేక ఎండల తీవ్రతతో పంట ఎండిపోతోంది. 12 ఎకరాల్లోని జీడి పంటకూ నీరు పెట్టే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు పువ్వు మాడిపోయింది. కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోవడంలేదు.
–కనపల శేఖర రావు, పాతయ్యవలస, శ్రీకాకుళం జిల్లా
ఎండిపోతున్న మిర్చి పంట
పల్నాడు జిల్లాలో వారబందీ అమలులో ఉన్నప్పటికీ నీరందక మిర్చి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచర్ల మండలం వీరవట్నం పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం గురువారం ఆందోళన బాట పట్టారు. నాగార్జున సాగర్ సంతగుడిపాడు ఇరిగేషన్ సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్‌లో ఉన్నప్పుడు కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి కన్పించడం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపించారు.
రైతులు ఏయే పంటలు సాగు చేశారు, ఎన్ని రోజులు పాటు ఎంతమేర నీటి అవసరాలు ఉన్నాయనే వివరాలు అధికారుల దగ్గర లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బతినకుండా ఏప్రిల్ 20 వరకు సాగు నీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున సాగర్ కింద ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
సాగు నీరు అడిగితే పోలీస్ స్టేషన్‌లో పెట్టారు
రాస్తారోకో చేస్తున్న వీరంతా పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు. నీళ్లున్నాయన్న ఆశతో రెండో పంటగా చింతపల్లి నాగార్జున సాగర్ కాల్వ కింద 400 ఎకరాల్లో వరి వేశారు. ప్రస్తుతం పొట్ట దశకు రాగా.. మార్చి తొలి వారం నుంచి నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు.
ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సాగు నీటి విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాస్తారోకో చేశారు. దీంతో రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘‘నీళ్లు అడిగిన పాపానికి స్టేషన్‌కు తరలిస్తారా?’’ అంటూ రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment