Rabi crop season
-
10 నుంచి రాయితీపై రబీ విత్తనాలు
సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రాయితీపై ఇచ్చే వివిధ రకాల విత్తనాలను ఈనెల 10 నుంచి పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 12 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసినట్టు బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. రబీ సీజన్లో అత్యధికంగా సాగు చేసే వాటిలో ఒకటైన శనగ విత్తనాల పంపిణీ గురువారం కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు. మిగతా జిల్లాల్లో పదో తేదీ నుంచి మొదలవుతుందన్నారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ► 42,023 క్వింటాళ్ల వరి వంగడాలను, 30,819 క్వింటాళ్ల వేరుశనగ, 2,92,319 క్వింటాళ్ల శనగలు, 3,500 క్వింటాళ్ల పెసలు, 11,051 క్వింటాళ్ల మినుములు, 589 క్వింటాళ్ల రాగులు, 42 క్వింటాళ్ల కొర్రలు, 50 క్వింటాళ్ల ఊదలు, 30 క్వింటాళ్ల ఆరికలు, 32 క్వింటాళ్ల సామలు, 2 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల ఆండ్రు కొర్రలు పంపిణీకి సిద్ధం చేశాం. ► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతుంది. ► సబ్సిడీపై ఎకరానికి 25 కిలోల శనగల్ని ఇస్తారు. సబ్సిడీ లేని రైతులు పూర్తి మొత్తాన్ని చెల్లించి కొనవచ్చు. ► జేజీ 11 రకం శనగలు క్వింటాల్ పూర్తి విలువ రూ.7,500 కాగా, ప్రభుత్వం రూ.2,250 సబ్సిడీగా ఇస్తుంది. కేఏకే–2 రకం శనగలు క్వింటాల్ పూర్తి ధర రూ.7,700 కాగా, రూ.2,310 సబ్సిడీగా ఇస్తారు. ► విత్తన నాణ్యతపై ఫిర్యాదులుంటే రైతులు 155251 నంబర్‌కు కాల్ చేయవచ్చు. -
రబీలో సిరిధాన్యాల సాగు
కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు (6నెలల పంటయిన అరికలను ఖరీఫ్‌లో మాత్రమే వేసుకోవాలి) వంటి సిరిధాన్యాలను రబీ పంట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయదలచిన రైతులు ఒక్కరు గానీ, కొందరు కలిసి గానీ ఒకేచోట కనీసం 3 ఎకరాల నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తేనే పక్షుల తాకిడిని తట్టుకొని పంట దిగుబడిని తీసుకోగలుగుతారని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త కె. విజయకుమార్ తెలిపారు. సిరిధాన్యాల పంటలను పిచ్చుకలు, ఇతర చిన్న సైజు పిట్టలు ఇష్టంగా తింటాయి. ఖరీఫ్ కాలంలో అయితే వర్షాధారంగా పంట భూములన్నిటిలోనూ పంటలు ఉంటాయని, గడ్డి గింజలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి పిట్టలు సిరిధాన్య పంటలపైకి మరీ అంతగా దాడి చేయవన్నారు. రబీలో చాలా వరకు భూములన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి సిరిధాన్యాలకు పిట్టల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకని ఎకరం, రెండెకరాల్లో వేస్తే రైతుకు మిగిలేది అంతగా ఉండదంటూ.. కనీసం ఐదెకరాలు వేయడం మంచిదని విజయకుమార్ వివరించారు. ► గత జనవరిలో రైతుకు కిలో చొప్పున 6 వేల కిలోల సిరిధాన్యాల విత్తనాలను విజయకుమార్ ఉచితంగా ఇచ్చారు. విత్తనం తీసుకున్న రైతులు కొందరు సాగు చేశారు. కొందరు దాచి ఉంచారు. ప్లాస్టిక్ సంచిలో నుంచి తీసి గుడ్డ సంచి లేదా మట్టి పాత్రలో పోసి విత్తనాలను నిల్వ చేసుకున్న వారు నిశ్చింతగా ఇప్పుడైనా విత్తుకోవచ్చని ఆయన తెలిపారు. ► అయితే, కొందరు రైతులు ప్లాస్టిక్ ప్యాకెట్లో విత్తనాన్ని అలాగే ఉంచారు. వీరు ఆ విత్తనాన్ని విత్తుకునే ముందు విధిగా మొలక పరీక్ష చేసుకోవాలన్నారు. కొబ్బరి చిప్పలోనో, ప్లాస్టిక్ గ్లాసులోనో అడుగున చిన్న చిల్లి పెట్టి, మట్టి నింపాలి. తగుమాత్రంగా నీరు పోసి 2 గంటల తర్వాత 10–20 విత్తనాలు వేసి తేలికగా మట్టి కప్పేయాలి. రకాన్ని బట్టి 3–7 రోజుల మధ్య మొలక వస్తుంది. మొలక తక్కువగా ఉంటే ఆ ధాన్యం విత్తనానికి పనికిరాదని గుర్తించాలి. ఇప్పటికీ సాగు చేసే ఆలోచన లేని రైతులు విత్తనాన్ని వృథా చేయకుండా ఆసక్తి గల ఇతర రైతులకైనా ఇవ్వాలని విజయకుమార్ సూచించారు. ► ప్రస్తుత రబీ కాలంలో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, బరిగెలు, గోల్డు బరిగలను సాగు చేయవచ్చు. వీటి పంటకాలం 10–80 రోజులు. ఎకరానికి 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేలల్లోనైనా పండుతాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం చాలు. ► కొర్రలో జడ కొర్ర, ముద్ద కొర్ర రకాలుంటాయి. ముద్ద కొర్రకంకిపై నూగు పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి పిచ్చుకలు తినడానికి అవకాశం ఉండదు. 85–95 రోజుల్లో కోతకు వస్తాయి. నల్లరేగడి, తువ్వ, ఎర్రచెక్క, ఇసుక నేలల్లో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చౌడు గరప నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. 3 లేదా 4 తడులు అవసరం. ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు. ► ఊదలు ఎటువంటి నేలల్లోనైనా సాగు చేయవచ్చు. ఒకమాదిరి జిగట, ఉప్పు నేలల్లోనూ, నీరు నిలువ ఉన్న నేలల్లోనూ సాగు చేయవచ్చు. భూమిని తేలికపాటుగా మెత్తగా దున్ని పశువుల ఎరువు ఎకరానికి 5 టన్నులు వేసి కలియదున్నాలి. అది లేకపోతే గొర్రెలు, ఆవుల మందను పొలంలో మళ్లించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. భూమి సారవంతంగా ఉంటే 8–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద నుంచి 110 రోజుల పంటకాలం. 5 సార్లు నీరు పారించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో అయితే నీరు పారించాల్సిన అవసరం లేదు. ► అండుకొర్రను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా పండుతుంది. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. దీన్ని పల్చగా విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. పలచగా ఉంటే ఎక్కువ పిలకలు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడకూడదు. యూరియా వేస్తే బాగా పెరిగి పడిపోతుంది. 90–105 రోజుల్లో పంట వస్తుంది. ముందుగా కోస్తే గింజలు నాసిరకంగా ఉంటాయి. బియ్యం సరిగ్గా ఉండవు. పిండి అవుతాయి. సిరిధాన్యాలు ఏవైనా సరే గింజ ముదిరి, కర్రలు బాగా పండాకే కోయాలి. అప్పుడే మంచి నాణ్యమైన దిగుబడి∙వస్తుంది. మంచి ధర కూడా పలుకుతుంది. సిరిధాన్యాలు సాగు చేసిన భూమి ఏగిలి మారి సారవంతమవుతుంది. సిరిధాన్యాల సాగుపై సలహాల కోసం విజయకుమార్ (98496 48498) ను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. -
‘పెట్టుబడి’కి జియో ట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘పెట్టుబడి’సాయం కోసం వచ్చే ఏడాది రబీ పంటలను జియోట్యాగింగ్ ద్వారా గుర్తించాలని సర్కార్ యోచిస్తోంది. రాబోయే ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్కారు ఇటీవల వేసిన అంచనా ప్రకారం 1.42 కోట్ల ఎకరాలకు ఖరీఫ్‌లో రూ.5,680 కోట్ల పెట్టుబడి పథకం కింద సాయం చేస్తారు. ఏప్రిల్ 20 నుంచే రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం కింద చెక్కులను అందజేస్తారు. రబీలో మాత్రం కేవలం ఆ సీజన్లో సాగు చేసే పంట భూములకే నవంబర్ 18 నాటికి పెట్టుబడి సాయం అందజేస్తారు. రబీలో బోర్లు, బావులు, ఇతర సాగునీటి వనరులు ఉన్నచోట్ల మాత్రమే పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి, పసుపు, మిర్చి వంటి పంటలు రబీలోనూ కొనసాగుతాయి. ఈ పంటలకు రెండో విడత పెట్టుబడి సాయం అందదు. రబీ సీజన్లో ఇతర పంటల సాగు ఎంతనేది గుర్తించడం కష్టం. కచ్చితత్వం లేకుండా పెట్టుబడి పథకం కింద సాయం చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని అంటున్నారు. అందుకే జియోట్యాగింగ్ ద్వారా పంటల వివరాలను గుర్తించాలని భావిస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా వివరాలు... శాటిలైట్ ద్వారా జియోట్యాగింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల వివరాలను కచ్చితంగా గుర్తించవచ్చు. ప్రభుత్వం వద్ద ఉన్న భూసర్వే వివరాలను గ్రామం, రైతు పేర్లతో సహా జియో సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేస్తారు. ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారన్నది జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తారు. అంటే ఏ రైతు ఏ పంట వేశాడు? ఎన్నెకరాల్లో వేశాడన్న సమాచారం సేకరించవచ్చు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జియోట్యాగింగ్ పద్ధతి గురించి రాష్ట్ర అధికారులకు వివరించారు. కర్ణాటకలో మాదిరి గా మన దగ్గర కూడా జియోట్యాగింగ్ పద్ధతి అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రబీ పెట్టుబడి పంపిణీ తేదీకి... పంటల సాగు కాలానికి తేడా నవంబర్ 18 నాటికే రబీలో రెండో విడత పెట్టుబడి సాయం చేస్తానని సర్కారు ప్రకటించింది. వాస్తవంగా రబీ సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే మొదలవుతుంది. వరి నాట్లు మాత్రం ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందిస్తారనేది సమస్య. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
ఏరు ఎడారి..బతుకు తడారి
లక్సెట్టిపేట : అసలే దెబ్బతీసిన ఖరీఫ్..ముంచిన సుడిదోమ, తెగులు..పేరుకుపోయిన అప్పులు తీర్చేందుకు రబీపైనే ఆశలు. ఓవైపు కడెం ప్రాజెక్టు, మరోవైపు గూడెం ఎత్తిపోతల పథకం. ఇదే భరోసాతో రైతులు రబీకి సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్టు గూడెం ఎత్తిపోతల ద్వారా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాలకు సుమారు 20వేల ఎకరాలకు సాగునీరందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ ఇరవై రోజుల్లోనే పరిస్థితి తారుమారైంది. తీరా నాట్లు పడ్డాక చుక్కా నీరు రావడం లేదు. దీంతో పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. కడెం కెనాల్ ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో లక్సెట్టిపేట మండలంలో పొలాలు బీళ్లు బారుతున్నాయి. రబీకి సాగునీటి కష్టాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. లక్సెట్టిపేట మండలంలో ఈ సీజన్లో ఇప్పటి వరకూ సుమారు 7వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కడెం మెయిన్ కెనాల్ ద్వారా గూడెం ఎత్తిపోతల నీటిని సీజన్ ప్రారంభంలో డిస్ట్రీబ్యూటరీ 37 నుంచి 42 వరకూ అందించారు. గూడెం ఎత్తిపోతల మరమ్మతులకు గురికావడంతో ఒక మోటార్‌తో కొద్ది మొత్తంలో మాత్రమే నీటి సరఫరా చేపడుతున్నారు. దీంతో సరిపడా నీరందకా పొలాలు ఎండిపోతున్నాయి. దిగువకు వెళుతున్న నీరు.. మండలంలోని చల్లంపేట వద్ద ఉన్న 37వ డిస్ట్రీబ్యూటరీ షెటర్ పైకి, కిందకు లేపేందుకు రాడ్డు లేదు. దీంతో విడుదలవుతున్న కొద్దిపాటి నీరు సైతం దిగువకు వెళ్లిపోతుంది. దీంతో ఎత్తిపోతల నీరు మండల రైతులకు ఉపయోగపడడం లేదు. షెటర్ వద్ద మరమ్మతులపై ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. షెటర్ కిందకు ఉండడంతో నీరంతా కింది పొలాలకు వెళ్తుంది. అధికారులు పట్టించుకుని వెంటనే మరమ్మతులు చేపట్టి, పొలాలకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి నాకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేస్తున్నా. రెండెకరాలు మోటారుతో నడుస్తుంది. మిగతాది కాలువ నీరు రాకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉంది. కాలువ షెటర్‌కు మరమ్మతు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోవడం లేదు. – దుమ్మని రవి, రైతు కాలువ నీళ్లు రావడం లేదు నాకున్న మూడెకరాల్లో వరి పొలం సాగు చేసినా. ఇప్పటి వరకు నీరు అందలేదు. ఇదే పరిస్థితి ఉంటే పొలం మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంది. మా ఆయకట్టుకు సంబంధించి షెటర్ మరమ్మతు చేయాలి. అధికారులు పట్టించుకుని రబీ సీజన్లో సాగునీరందేలా చూడాలి. – లచ్చన్న,గంపలపల్లి మరమ్మతు చేయిస్తున్నాం కాలువకు సంబంధించి షెటర్ రాడ్డును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో షెటర్ కిందకు దిగిపోయింది. జన్నారం నుంచి రాడ్డును తెప్పిస్తున్నాం. త్వరలోనే పూర్తిస్థాయిలో నీటిని అందిస్తాం. – అశ్విన్, ఇరిగేషన్ జేఈ, లక్సెట్టిపేట -
ఆశాజనకంగా రబీసాగు
వంగూరు : రబీలో సాగుచేసిన పంటలన్నీ ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంగూరు మండలంలోని వివిధ గ్రామాల్లో గత నాలుగేళ్లనుంచి లేని సాగు ఈఏడాది రబీలో రైతులు పెద్ద ఎత్తున వేరుశనగ, వరి సాగుచేశారు. దాదాపు ఏడు వేల ఎకరాల్లో వేరుశనగ, వెయ్యి ఎకరాల్లో వరి సాగుచేశారు. పంటలు అధిక దిగుబడి ఇచ్చేందుకు అవసరమైన సాగునీరు, విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండడం, క్రిమికీటకాలు సోకకపోవడంతో ఎలాగైనా ఈసారి రబీలో అధిక దిగుబడి పొంది అప్పుల ఊబిలో నుంచి బయటపడతామన్న నమ్మకంతో రైతులు ఉన్నారు. గతేడాది 3వేల ఎకరాల్లో.. గతేడాది కేవలం 3వేల ఎకరాల్లోనే వేరుశనగ, వంద ఎకరాల్లోనే వరి సాగు చేశారు. ఈఏడాది రబీలో పంటలు సాగుచేసేందుకు అనుగుణంగా వర్షాలు రావడం, డిండివాగు సాగడం, ప్రాజెక్టులోకి నీరు చేరుకోవడం తదితర కారణాలతో భూగర్భజలాలు భారీగా వృద్ధి చెందాయి. దీంతో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం అప్పులు తీసుకువచ్చి పంటలు సాగుచేశారు. అక్కడక్కడా దెబ్బతిన్న పంటలు వేరుశనగ ప్రారంభంలో లద్దె పురుగు తగిలి అక్కడక్కడా పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో లద్దెపురుగు నివారణ జరిగింది. దీంతో రబీలో సాగుచేసిన పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయి. గత నాలుగేళ్ల నుంచి ఎప్పుడు కూడా రబీలో రైతులు ఇంత పెద్ద ఎత్తున సాగుచేసిన దాఖలాలు లేవు. కొంతమంది రైతులైతే దెబ్బతిన్న పత్తిపంటను తొలగించి బోర్లకింద వేరుశనగ పంటలు వేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున వేరుశనగ దిగుబడి ఉంటుందని రైతులు అంటున్నారు. పంటలు ఆశాజనకమే.. గతంలో కంటే ఈఏడాది రబీలో రైతులు అధికంగా వేరుశనగ, వరి సాగుచేశారు. గతానికంటే ఈసారి క్రిమికీటకాలు తక్కువగా ఉండడంతో రైతులకు పెట్టుబడులు కూడా తగ్గాయి. భూగర్భజలాలు అధికంగా ఉండడంతో ఏమాత్రం ఎండిపోకుండా రైతులు వారి పంటలకు తడి వేస్తున్నారు. ఏది ఏమైనా గతానికంటే రబీలో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పవచ్చు. – తనూజారాజు, ఏఓ, వంగూరు -
రైతులూ ..ఈ సూచనలు పాటించండి
మినుము ప్రస్తుతం రబీలో మినుము సాగు చేసేందుకు అనువైనం సమయం. ఆయూ సమయూల్లో కింది రకాలు వేసుకుంటే మేలు. నవంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు మొదటి పక్షం వరకు విత్తుకొనే మినుము రకాలు ఎల్బీజీ-645, ఎల్బీజీ-648 డిసెంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు చివరి వరకు విత్తుకొనే మినుము రాకాలు ఎల్బీజీ-645, ఎల్బీజీ-685 జన వరిలో విత్తుకొనే రకాలు-ఎల్బీజీ-752, ఎల్బీజీ-623 పల్లాకు తెగులు తట్టుకునే పీయూ-31 రకాన్ని అన్ని కాలాల్లో విత్తుకోవచ్చు. పెసర నవంబరు రెండో పక్షం నుంచి జనవరి వరకు విత్తుకొనే రకాలు ఎల్జీజీ-42, టీఎం96-2, ఎల్జీజీ-410. విత్తనమోతాదు ఒక చదరపు మీటరుకు సుమారు 30-35 మొక్కలు ఉండేలా మినుము అరుుతే ఎకరాకు 16-18 కిలోలు, పెసర అరుుతే 10-12కిలోల విత్తనాలు వెదజల్లితే మంచి దిగుబడులు సాధించవచ్చు. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 30 గ్రా.కార్బోసల్ఫాస్ మందును వాడి విత్తనశుద్ధి చేయూలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా. థయోమిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేస్తే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. కలుపు నివారణ: గడ్డి, వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉంటే ఇమిజితాఫిర్ పది శాతం మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేస్తే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొన్ని భూముల్లో బంగారుతీగ సమస్య ఎక్కువగా ఉంది. దీని నివారణకు ఆశించిన ప్రదేశాల్లో మాత్రమే పారాక్వాట్ 24 శాతం ద్రావకం 50 మిల్లీలీటర్లు, పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయూలి. పత్తి తీతలో మెలకువలు పత్తి తీయడం మొదలైనందున మంచి నాణ్యత కోసం కింది మెలకువలు పాటించాలి. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుంచి వేరుచేయూలి. మంచువల్ల పత్తి నాణ్యత దెబ్బతింటుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు పత్తి తీయూలి. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తి తీస్తే వాటితోపాటు గుల్ల వద్ద ఉన్న తొడిమలు, ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై పత్తికి అంటుకొంటారుు. పత్తి తీయగానే నీడలో మండెలు వేసి తగు తేమ శాతం వచ్చేవరకు ఆరబెట్టాలి. మొదటిసారి తీసిన పత్తిని తరువాత తీసిన పత్తితో కలపకుండా విడిగా అమ్ముకోవాలి. అప్పుడు తరువాత తీసిన పత్తికి ఎక్కువ ధర పలుకుతుంది. వేరుశనగ రబీ సీజనుకు అనువైన వేరుశనగ రకాలు చిన్నగుత్తి రకాలు: కదిరి-6, కదిరి-9 కదిరి హరితాంధ్ర, అనంత మరియు ధరణి పెద్ద గుత్తి రకాలు: కదిరి-7 బోల్డ్ మరియు కదిరి-8 బోల్డ్ రబీలో వేరుశనగ డిసెంబరు 15 వరకు వేసుకోవచ్చు. విత్తన శుద్ధి: కిలో వేరుశనగ విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల డైథేన్ ఎం45 కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. వేరు పురుగు సమస్య ఉన్న నేలలకు ఫ్యురడాస్ 4 జీ గుళికలు 5 కేజీలు ఎకరాకు దుక్కిలో వేసుకోవాలి. వేరుశనగ విత్తనం మొలకెత్తాక తొలి పూత కనిపించేవరకు (25 నుంచి 30 రోజులు) తడి ఇవ్వకూడదు. తరువాత నుంచి బెట్ట రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. రబీ పంట కాలం వేరుశనగ విత్తనోత్పత్తికి చాలా అనువైన కాలం. విత్తిన మూడు రోజుల్లోపు పై సాళ్లు వేసిన తరువాత ఒక లీటరు పెండి మెథాలిన్ కలుపు మందును ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన 40 నుంచి 50 రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు. -
రైతు చైతన్య యాత్రలేవీ?
జోగిపేట, న్యూస్‌లైన్: ఈ ఏడాది రబీ పంట కాలం దాదాపు ముగిసింది. ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయశాఖ చేపట్టాల్సిన రైతు చైతన్య యాత్రలు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలను ముందుగా గుర్తించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వ రకు ఎన్నికల్లో నిమగ్నమైన యంత్రాంగం శాఖాపరమైన కార్యక్రమాలను పక్కన బెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేది అనుమానమేనని సం బంధిత అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముం దు రైతు చైతన్య యాత్రలు నిర్వహించాలని ఉ న్నతాధికారుల నుంచి ఆయా డివిజన్ మ ండల అధికారులకు సమాచారం వచ్చింది. అయితే ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. అధికారులకు అందని ఆదేశాలు వ్యవసాయ అనుబంధ శాఖలపై రైతులకు అవగాహన కల్పించి సమాయత్తం చేయడానికి జి ల్లా యంత్రాంగం ఏటా ఏప్రిల్ చివరి వారం ను ంచి మే మొదటి వారం వరకు రైతు చైతన్య యా త్రలు నిర్వహిస్తూ వచ్చేది. ఖరీఫ్‌లో సూచనలకు గాను క్షేత్ర స్థాయిలో గ్రామాలకు వెళ్లి అన్నదాతలకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పిం చి వారిలో చైతన్యం తీసుకురావాలన్నది ఈ యాత్రల ఉద్దేశం. గత ఏడాది విత్తనాలు, ఎరువుల కోసం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రో జుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు, తొక్కిసలాటలు జరిగిన సందర్భాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతు చైతన్య యా త్రల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నా యి. గత సంవత్సరం ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు రైతు చైతన్య యాత్రలను నిర్వహించారు. యాత్రల ఉద్దేశo రైతు చైతన్య యాత్రల్లో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా అనుబంధ శాఖల్లో అమలు చే స్తున్న కార్యక్రమాలు, భూసార పరీక్షలు, శ్రీవరి సాగు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందు లు కొనుగోలులో జాగ్రత్తలు, విత్తన శుద్ధి తది తర కార్యక్రమాలపై రైతులను చైతన్య పరచాల్సి ఉంటుంది. పశుసంవర్థక శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్య్స, సాగునీటి, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మార్కెటింగ్, ట్రాన్స్‌కో, బ్యాంకు లు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు రైతు చైతన్య యాత్రల్లో పాల్గొని అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను వివరిస్తారు. ఆయా శాఖల అధికారులు వివిధ అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులను పంటల సాగు గురించి చైతన్య పరుస్తారు. పంట రుణాలు, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇస్తున్న రాయితీ ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పిస్తారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అధునాతన పరిజ్ఞానం అందించే పొలంబడి, విత్తనోత్పత్తి, వర్మీకంపోస్టు, భూసార పరీక్షల గురించి వివరిస్తారు. దీంతో రైతులు ఆధునిక మెలకువలు నేర్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశం ఉంటుంది.