వంగూరు : రబీలో సాగుచేసిన పంటలన్నీ ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంగూరు మండలంలోని వివిధ గ్రామాల్లో గత నాలుగేళ్లనుంచి లేని సాగు ఈఏడాది రబీలో రైతులు పెద్ద ఎత్తున వేరుశనగ, వరి సాగుచేశారు. దాదాపు ఏడు వేల ఎకరాల్లో వేరుశనగ, వెయ్యి ఎకరాల్లో వరి సాగుచేశారు. పంటలు అధిక దిగుబడి ఇచ్చేందుకు అవసరమైన సాగునీరు, విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండడం, క్రిమికీటకాలు సోకకపోవడంతో ఎలాగైనా ఈసారి రబీలో అధిక దిగుబడి పొంది అప్పుల ఊబిలో నుంచి బయటపడతామన్న నమ్మకంతో రైతులు ఉన్నారు.
గతేడాది 3వేల ఎకరాల్లో..
గతేడాది కేవలం 3వేల ఎకరాల్లోనే వేరుశనగ, వంద ఎకరాల్లోనే వరి సాగు చేశారు. ఈఏడాది రబీలో పంటలు సాగుచేసేందుకు అనుగుణంగా వర్షాలు రావడం, డిండివాగు సాగడం, ప్రాజెక్టులోకి నీరు చేరుకోవడం తదితర కారణాలతో భూగర్భజలాలు భారీగా వృద్ధి చెందాయి. దీంతో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం అప్పులు తీసుకువచ్చి పంటలు సాగుచేశారు.
అక్కడక్కడా దెబ్బతిన్న పంటలు
వేరుశనగ ప్రారంభంలో లద్దె పురుగు తగిలి అక్కడక్కడా పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో లద్దెపురుగు నివారణ జరిగింది. దీంతో రబీలో సాగుచేసిన పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయి. గత నాలుగేళ్ల నుంచి ఎప్పుడు కూడా రబీలో రైతులు ఇంత పెద్ద ఎత్తున సాగుచేసిన దాఖలాలు లేవు. కొంతమంది రైతులైతే దెబ్బతిన్న పత్తిపంటను తొలగించి బోర్లకింద వేరుశనగ పంటలు వేశారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున వేరుశనగ దిగుబడి ఉంటుందని రైతులు అంటున్నారు.
పంటలు ఆశాజనకమే..
గతంలో కంటే ఈఏడాది రబీలో రైతులు అధికంగా వేరుశనగ, వరి సాగుచేశారు. గతానికంటే ఈసారి క్రిమికీటకాలు తక్కువగా ఉండడంతో రైతులకు పెట్టుబడులు కూడా తగ్గాయి. భూగర్భజలాలు అధికంగా ఉండడంతో ఏమాత్రం ఎండిపోకుండా రైతులు వారి పంటలకు తడి వేస్తున్నారు. ఏది ఏమైనా గతానికంటే రబీలో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పవచ్చు.
– తనూజారాజు, ఏఓ, వంగూరు
Comments
Please login to add a commentAdd a comment