సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 670 మండలాలకుగాను 394 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందని వ్యవసాయ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ.. రెండు సీజన్లలో కలిపి 186.41 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఒక్క ఖరీఫ్‌లోనే అత్యధికంగా 98.07 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం, అదును తప్పి కురుస్తున్న వర్షాలతో పంటల సాగు గాడి తప్పింది.
ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. అలాగే, రాష్ట్రంలో చిరుధాన్యాలు, నూనె గింజల పంటల పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి ఏం చేయాలో అర్ధంకాక వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. దిగుబడి తగ్గితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం ఉన్న 30 శాతం వ్యవసాయ రంగం వాటా తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆహార సంరక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో 16.55 శాతం అధికంగా వృద్ధి సాధించడం సాధ్యమయ్యే పనిగా కనిపించడంలేదు.
ప్రధాన పంటల పరిస్థితి ఇలా..
వ్యవసాయ, అనుబంధ రంగాలలో గుర్తించిన 23 అభివృద్ధి సూచికలలో 9 పంటల్ని ఎంపిక చేశారు. వాటిలో వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, ప్రత్తి, చెరకు, పొగాకు ఉన్నాయి. అయితే, వీటిల్లో ప్రస్తుతం ఏ ఒక్క పంట కూడా సరిగ్గాలేదు. 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 186.41 లక్షల మెట్రిక్ టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. వరిలో 14 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, అపరాలలో 33 శాతం, నూనె? గింజల్లో 30 శాతం పెరుగుదల నమోదు చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగ గాడి తప్పింది. ఇప్పటికే తొలిదశలో పంట దెబ్బతింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వేరుశనగ దిగుబడిని 10.28 లక్షల టన్నులుగా అంచనా వేసినా అది ఇప్పుడు 2–3 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
భారీగా తగ్గనున్న దిగుబడి
ఇదిలా ఉంటే.. ఖరీఫ్‌లో మొత్తం 98.07 లక్షల టన్నుల దిగుబడి లక్ష్యం కాగా.. ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు 20 లక్షల టన్నులకు పైగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాధార పంటలు సాగుచేసే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పంట ఉత్పత్తులు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక్కడ వర్షాభావంతో వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా యావత్తు తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. తుపానో, వాయుగుండమో వస్తే తప్ప ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశంలేదు. రాయలసీమలో ప్రధాన ఖరీఫ్ పంట వేరుశనగను సుమారు 9.25 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంటే అధికారిక లెక్కల ప్రకారమే 6.60 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. అయితే, ఈ పంటలో మూడొంతులు వాడు ముఖం పట్టింది. ఫలితంగా దిగుబడి లక్ష్యం 10.28 లక్షల మెట్రిక్ టన్నులు నెరవేరే సూచనలు కనిపించడంలేదు. అపరాలదీ అదే పరిస్థితి. వరి సాగు విస్తీర్ణం కూడా లక్ష్యానికి దూరంగానే ఉంది. వరి పంట చేతికి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున దిగుబడులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.
దేశంలో 7.3మిలియన్ టన్నుల అధిక దిగుబడి
గత ఏడాది కంటే ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 284.80 మిలియన్ టన్నులకు చేరే అవకాశముందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది కంటే ఇది 7.3 మిలియన్ టన్నులు ఎక్కువని కేంద్రం చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వరుస కరువులతో రైతులు అల్లాడుతున్నారు. దిగుబడులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కంటే 7.3 శాతం, అపరాలు 9 శాతం పెరిగితే రాష్ట్రంలో ఈ పంటలు సైతం తిరోగమనంలో ఉండడం గమనార్హం.
దిగుబడికి దెబ్బే!
Published Tue, Sep 18 2018 5:09 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment