పురుగు మందు కొంటేనే యూరియా! | Companies selling fertilizer dealers with restrictions | Sakshi
Sakshi News home page

పురుగు మందు కొంటేనే యూరియా!

Published Mon, Feb 26 2018 1:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Companies selling fertilizer dealers with restrictions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎరువుల కంపెనీలు రైతులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాల్సిందేనని షరతు పెడుతున్నాయి. ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచి యూరియాతోపాటు ఇతర ఎరువులను అంటగడుతున్నాయి. దీంతో రైతులు అవసరం లేకున్నా ఇతర ఎరువులను కొంటున్నారు. ఎడాపెడా ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన పరిస్థితిని కంపెనీలు రైతులకు సృష్టిస్తున్నాయి. తద్వారా వివిధ ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. రైతులకు సాగు ఖర్చు పెరిగి నష్టం చవిచూసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు.

కొంప ముంచుతున్న టార్గెట్లు
రబీలో 98 శాతం పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి నాట్లు పడ్డాయి. సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్‌ ఏర్పడింది. యూరియా కూడా ప్రస్తుత లక్ష్యానికి మించి అందుబాటులో ఉంది. కాని కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్‌ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెడుతుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచి అంటగడుతున్నారు. ఖమ్మంలో ఒక ప్రముఖ కంపెనీ రూ.1.08 లక్షల విలువ చేసే ఒక లారీ (400 బస్తాల) యూరియాను డీలర్‌కు అమ్మితే, దాంతోపాటు కచ్చితంగా రూ.50 వేల విలువైన ఇతర ఎరువులను అంటగడుతోంది. ఈ టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్‌ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నారు. హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు ఏర్పాటు చేస్తున్నారు.

రైతులను మభ్యపెడుతూ..
యూరియాతోపాటు ఫలానా ఎరువు, పురుగు మందు వాడితే ప్రయోజనం ఉంటుందంటూ రైతులను డీలర్లు మభ్యపెడుతున్నారు. వాస్తవానికి యూరియాతోపాటు ఇతర ఎరువులు, పురుగు మందులను లింక్‌ పెట్టి విక్రయించకూడదని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ దాన్ని వ్యవసాయాధికారులు అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు. పైగా జిల్లాల్లో కంపెనీలకు, వ్యవసాయాధికారులకు మధ్య సంబంధాలు ఉంటాయి. ఈ తతంగం గురించి తెలిసినా వారు మిన్నకుంటున్నారు. కొందరు వ్యవసాయాధికారులకు కమీషన్లు అందుతుండటం వల్లే ఈ దందా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. మండల వ్యవసాయాధికారి ప్రిస్కిప్షన్‌ ఉంటేనే ఎరువులు, పురుగు మందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా.. అది అమలు కావట్లేదు.

గుళికలు కొనాలి
యూరియా కొనాలంటే అదనంగా గులికలు కొనాలని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం సబ్సీడీపై ఇచ్చే యూరియాపై వ్యాపారులు అదనంగా లాభం పొందడానికి రైతులను ఇబ్బందుల పాలుచేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి.
–సీహెచ్‌ రాంచందర్, రైతు సంఘం నాయకుడు, దేవరకద్ర

నియంత్రణ ఏదీ 
ఎరువుల దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే రైతులను వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏది కొనాలన్నా అదనంగా ఇతర ఎరువులు కొనాలంటున్నారు. దీన్ని నివారించాలి. 
–కొండారెడ్డి, రైతు, వెంకటగిరి

కఠిన చర్యలు తీసుకుంటాం: 
యూరియాతోపాటు ఇతర ఎరువులను విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారులతో మాట్లాడుతాం. యూరియాతోపాటు ఇతర ఎరువులను లింక్‌ పెట్టి అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్‌ జగన్‌మోహన్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement