ఖరీఫ్‌పై నిర్లక్ష్యం...!
- పంపిణీకి నోచుకోని పచ్చిరొట్ట విత్తనాలు
- 15 రోజుల్లో రానున్న రుతుపవనాలు
- అయోమయంలో రైతన్నలు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సాగు విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల నిర్వహణలో తలమునకలైన ప్రభుత్వంతో పాటు అధికారులు ఉండటం వల్ల ప్రణాళిక రూపొందించడంలో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రైతులు ఖరీఫ్ సాగు ఎలా చేయాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం డివిజన్లో వరితోబాటు అపరాలు, ఇతర పంటలు చేస్తారు. రుతువపనాలు ప్రారంభమైన నాటి నుంచే రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతారు. దీంతో బాటు ప్రధానంగా తాండవ ఆయకట్టు పరిధిలో సుమారుగా 25వేల ఎకరాల్లో రైతులు వరి వేస్తారు.
అదేవిధంగా రబీ అనంతరం వరి సాగుచేసిన భూముల్లో సారం పెంచేందుకని పచ్చిరొట్ట సాగు చేపడుతుంటారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు ఏటా సీజనుకు ముందుగానే విత్తనాలు సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచేవారు. గత మూడు నెలలుగా అధికారులంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర విభజన జరగడం, విత్తనాలు అమ్మకాలు మీసేవల్లో చేప్టటాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ విధంగా ప్రణాళికలు చేయాలనే దానిపై ఇంకా అధికారులు ఒక నిర్ణయానికి రాలేదు.
దీంతో ఈ ఏడాది రబీ సాగు అనంతరం చేపట్టే పచ్చిరొట్ట సాగుకు రాయితీపై ప్రభుత్వం విత్తనాలు విక్రయించలేదు. దీంతో రైతులంతా విత్తనాల కోసం బయట వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు నుంచి రుతువపనాలు రానున్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో అడపా, దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుక్కులు చేసి ఖరీఫ్ సాగునకు సన్నద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధమైన పరిస్థితులున్నా వ్యవసాయశాఖ మాత్రం విత్తనాలుపై ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు.