సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘పెట్టుబడి’సాయం కోసం వచ్చే ఏడాది రబీ పంటలను జియోట్యాగింగ్ ద్వారా గుర్తించాలని సర్కార్ యోచిస్తోంది. రాబోయే ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్కారు ఇటీవల వేసిన అంచనా ప్రకారం 1.42 కోట్ల ఎకరాలకు ఖరీఫ్‌లో రూ.5,680 కోట్ల పెట్టుబడి పథకం కింద సాయం చేస్తారు. ఏప్రిల్ 20 నుంచే రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం కింద చెక్కులను అందజేస్తారు.
రబీలో మాత్రం కేవలం ఆ సీజన్‌లో సాగు చేసే పంట భూములకే నవంబర్ 18 నాటికి పెట్టుబడి సాయం అందజేస్తారు. రబీలో బోర్లు, బావులు, ఇతర సాగునీటి వనరులు ఉన్నచోట్ల మాత్రమే పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి, పసుపు, మిర్చి వంటి పంటలు రబీలోనూ కొనసాగుతాయి. ఈ పంటలకు రెండో విడత పెట్టుబడి సాయం అందదు. రబీ సీజన్‌లో ఇతర పంటల సాగు ఎంతనేది గుర్తించడం కష్టం. కచ్చితత్వం లేకుండా పెట్టుబడి పథకం కింద సాయం చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని అంటున్నారు. అందుకే జియోట్యాగింగ్ ద్వారా పంటల వివరాలను గుర్తించాలని భావిస్తున్నారు.
సర్వే నంబర్ల వారీగా వివరాలు...
శాటిలైట్ ద్వారా జియోట్యాగింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల వివరాలను కచ్చితంగా గుర్తించవచ్చు. ప్రభుత్వం వద్ద ఉన్న భూసర్వే వివరాలను గ్రామం, రైతు పేర్లతో సహా జియో సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేస్తారు. ఏ సర్వే నంబర్‌లో ఏ పంట వేశారన్నది జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తారు. అంటే ఏ రైతు ఏ పంట వేశాడు? ఎన్నెకరాల్లో వేశాడన్న సమాచారం సేకరించవచ్చు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జియోట్యాగింగ్ పద్ధతి గురించి రాష్ట్ర అధికారులకు వివరించారు. కర్ణాటకలో మాదిరి గా మన దగ్గర కూడా జియోట్యాగింగ్ పద్ధతి అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
రబీ పెట్టుబడి పంపిణీ తేదీకి... పంటల సాగు కాలానికి తేడా
నవంబర్ 18 నాటికే రబీలో రెండో విడత పెట్టుబడి సాయం చేస్తానని సర్కారు ప్రకటించింది. వాస్తవంగా రబీ సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే మొదలవుతుంది. వరి నాట్లు మాత్రం ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందిస్తారనేది సమస్య. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment