investing surplus funds
-
‘పెట్టుబడి’కి జియో ట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘పెట్టుబడి’సాయం కోసం వచ్చే ఏడాది రబీ పంటలను జియోట్యాగింగ్ ద్వారా గుర్తించాలని సర్కార్ యోచిస్తోంది. రాబోయే ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్కారు ఇటీవల వేసిన అంచనా ప్రకారం 1.42 కోట్ల ఎకరాలకు ఖరీఫ్‌లో రూ.5,680 కోట్ల పెట్టుబడి పథకం కింద సాయం చేస్తారు. ఏప్రిల్ 20 నుంచే రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం కింద చెక్కులను అందజేస్తారు. రబీలో మాత్రం కేవలం ఆ సీజన్లో సాగు చేసే పంట భూములకే నవంబర్ 18 నాటికి పెట్టుబడి సాయం అందజేస్తారు. రబీలో బోర్లు, బావులు, ఇతర సాగునీటి వనరులు ఉన్నచోట్ల మాత్రమే పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి, పసుపు, మిర్చి వంటి పంటలు రబీలోనూ కొనసాగుతాయి. ఈ పంటలకు రెండో విడత పెట్టుబడి సాయం అందదు. రబీ సీజన్లో ఇతర పంటల సాగు ఎంతనేది గుర్తించడం కష్టం. కచ్చితత్వం లేకుండా పెట్టుబడి పథకం కింద సాయం చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని అంటున్నారు. అందుకే జియోట్యాగింగ్ ద్వారా పంటల వివరాలను గుర్తించాలని భావిస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా వివరాలు... శాటిలైట్ ద్వారా జియోట్యాగింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల వివరాలను కచ్చితంగా గుర్తించవచ్చు. ప్రభుత్వం వద్ద ఉన్న భూసర్వే వివరాలను గ్రామం, రైతు పేర్లతో సహా జియో సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేస్తారు. ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారన్నది జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తారు. అంటే ఏ రైతు ఏ పంట వేశాడు? ఎన్నెకరాల్లో వేశాడన్న సమాచారం సేకరించవచ్చు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జియోట్యాగింగ్ పద్ధతి గురించి రాష్ట్ర అధికారులకు వివరించారు. కర్ణాటకలో మాదిరి గా మన దగ్గర కూడా జియోట్యాగింగ్ పద్ధతి అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రబీ పెట్టుబడి పంపిణీ తేదీకి... పంటల సాగు కాలానికి తేడా నవంబర్ 18 నాటికే రబీలో రెండో విడత పెట్టుబడి సాయం చేస్తానని సర్కారు ప్రకటించింది. వాస్తవంగా రబీ సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే మొదలవుతుంది. వరి నాట్లు మాత్రం ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందిస్తారనేది సమస్య. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
శాలరీ అకౌంట్స్‌పై ఎస్బీహెచ్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) శాలరీ అకౌంట్ ఖాతాలను పెంచుకోవడానికి ‘ఎస్బీహెచ్ స్మార్ట్ శాలరీ’ (ఎస్ఎస్ఎస్) పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. నవంబర్ 15 నుంచి జనవరి 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఖాతాలు తెరిచిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు బ్యాంకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎస్ఎస్ఎస్ గోల్డ్, ఎస్ఎస్ఎస్ సిల్వర్ పేరుతో అందిస్తున్న ఈ రెండు ఖాతాలపై నెలకు 1.35 శాతం వడ్డీ చొప్పున ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ, జీరో బ్యాలెన్స్ అకౌంట్, మల్టీ ఆప్షన్ డిపాజిట్, ఉచితంగా ఏటీఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ఈ ప్రచార సమయంలో ఖాతాలు తెరిచిన వారికి మొదటి సంవత్సరానికి రూ.రెండు లక్షల ఉచిత బీమాను, వ్యక్తిగత రుణాల ప్రోసెసింగ్ ఫీజులో పావు శాతం తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. ఎస్బీహెచ్ లిటిల్ ఇండియన్: నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ‘లిటిల్ ఇండియన్’ పేరుతో ఎస్బీహెచ్ కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కనీ సం 12 నెలల నుంచి గరిష్టంగా 120 నెలలకు పిల్లల పేరు మీద డిపాజిట్ చేయెచ్చు. కనీస డిపాజిట్ మొత్తం రూ.1,000గాను, గరిష్ట డిపాజిట్ మొత్తం రూ.కోటిగా నిర్ణయించారు. ఏడు రోజుల తర్వాత డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నా ఎటువంటి పెనాల్టీ లేకపోవడం దీనిలోని ప్రత్యేకత. వచ్చే జనవరి 14 వరకు మాత్రమే అమలులో ఉండే ఈ డిపాజిట్ పథకంపై 9.14 శాతం వార్షిక వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది.