Geotagging
-
చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్.. పక్కాగా లబ్ధి.. బోగస్‌కు చెక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ.. కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, జౌళిశాఖ అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆధునిక సాంకేతికత సహకారంతో ఆన్లైన్లో భద్రపరుస్తున్నారు. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, లూమ్ ఫొటోలతో మగ్గం ఉన్న చోటి నుంచే అక్షాంశ, రేఖాంశాలతో సహా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. చేనేత మగ్గాలతోపాటు, కండెలు చుట్టే కార్మికుల వివరాలు, ఆ మగ్గాలపై పని చేసే ఇతర అనుబంధ రంగాల కార్మికుల సమాచారాన్ని సైతం క్రోడీకరించి పొందుపరుస్తున్నారు. పక్కాగా లబ్ధి..బోగస్‌కు చెక్ చేనేత మగ్గాలను ఆన్లైన్ చేయడం ద్వారా కార్మికులు, మగ్గాల సమాచారం పక్కాగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకం కింద 40 శాతం యార్న్ (నూలు) సబ్సిడీ అందిస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో ఈ సబ్సిడీ నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండానే అసలైన లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది. నేతన్నలకు చేయూత పథకం (త్రిఫ్ట్)లో చేనేత కార్మికులు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ప్రతి నెలా రూ.1,200 పొదుపు చేస్తే.. అంతే మొత్తం అంటే మరో రూ.1,200 ప్రభుత్వం అందిస్తుంది. ఆ సొమ్ము చేనేత కార్మికుల ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పొదుపు చేసుకున్న సొమ్ము, దానిపై వడ్డీ కలిపి 36 నెలల తర్వాత కార్మికులు తీసుకోవచ్చు. త్రిఫ్ట్ సొమ్మును నెలనెలా నేరుగా కార్మికుల వేతనాల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా లబి్ధదారుల దరికి చేర్చవచ్చు. మరోవైపు బోగస్ చేనేత సహకార సంఘాలు, బోగస్ సభ్యుల బెడద పూర్తిగా తొలగిపోతుంది. నిజంగా శ్రమించే కార్మికులు, కండిషన్లో ఉన్న మగ్గాల డేటా ఆన్లైన్లో ఉంటుంది. తగ్గిపోయిన చేనేత మగ్గాలు.. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మరమగ్గాలు ఉన్నాయి. గతంలో ఇవి కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 36,088 మరమగ్గాలు ఉండగా, చేనేత మగ్గాలు 17,573 మాత్రమే ఉన్నాయి. కాగా మరమగ్గాలకు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26,494 మరమగ్గాలు ఉన్నాయి. చేనేత మగ్గాలు మాత్రం165 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జౌళిశాఖ చేపట్టిన ఆన్లైన్ నమోదు పూర్తి అయితే.. సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఫోన్ సిగ్నల్, నెట్వర్క్ సరిగా లేక సమాచారాన్ని నమోదు చేయడం కష్టమవుతోంది. వివరాలు రాసుకున్నారు.. మాది సిరిసిల్ల గణేశ్‌నగర్. కిరాయి ఇంట్లో ఉంటాను. చిన్నప్పటి నుంచి గిదే పని చేస్తున్న. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. ఆమెకు పెన్షన్ వస్తుంది. రోజుకు ఐదు మీటర్ల బట్ట నేస్తా. మీటరుకు రూ.28.50 ఇస్తారు. రోజంతా పని చేస్తే రూ.140 వరకు వస్తాయి. మొన్ననే నా వివరాలు రాసుకుని, ఫొటోలు తీసుకున్నారు. – రాపెల్లి హన్మాండ్లు(89), చేనేత కార్మికుడు, సిరిసిల్ల క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నాం క్షేత్రస్థాయిలో చేనేత మగ్గాల, కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. చేనేత మగ్గాలున్న ప్రతి పల్లెకు వెళ్లి సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇది పూర్తి అయితే సంక్షేమ పథకాలు నేరుగా అందించే వీలుంది. –ఎం.సాగర్, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల చదవండి: నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి -
జియో ట్యాగింగ్‌కు ‘అగ్రి’ అవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో జియో ట్యాగింగ్ నిఘా రచ్చకు దారితీసింది. వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై జియో ట్యాగింగ్‌తో నిఘా ఏర్పాటు చేసి, తద్వారా అదే పద్ధతిలో హాజరు వేసుకోవాలని నిర్ణయించారు. లేకుంటే గైర్హాజరుగా భావించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏఈవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మండల వ్యవసాయాధికారులు(ఏవో), డివిజనల్ వ్యవసాయాధికారులకు కూడా ఇదే పద్ధతిలో హాజరును ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని ఎత్తేయాలని 21 జిల్లాలకు చెందిన పలువురు అధికారులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. యాక్టివిటీ లాగర్ యాప్... రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే 2,600 మంది ఏఈవోలు ఉన్నారు. ప్రతీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతు వేదికలే వారి కార్యాలయాలు. ఏఈవో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పటికప్పడూ వారి కార్యకలాలపాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాక్టివిటీ లాగర్ యాప్ పేరుతో జియో ట్యాగింగ్ చేసే జీపీఎస్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక నిర్దేశిత స్థలాన్ని నమోదు చేసుకోవాలి. స్పాట్‌లోకి వెళ్లి ‘మార్క్ మై ప్రెజెన్స్’అని నొక్కి ఫింగర్ ప్రింట్ నమోదు చేయాలి. లాంగిట్యూడ్, లాట్యిట్యూడ్ ఆధారంగా గుర్తించిన తర్వాతే హాజరు పడుతుంది. నిర్దేశిత గ్రామంలో ఏ రైతును కలిశారు? రైతుతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారా? ఇంకా ఎవరైనా అధికారి వచ్చారా? రైతు వేదిక వద్ద ఏం చేశారు? ఆ రోజు షెడ్యూల్ ఏంటి? క్రాప్ బుకింగ్, రైతు బీమా, సీడ్ పర్మిట్ స్లిప్‌లు లాంటివి రోజుకు 17 రకాలు, అందులో మళ్లీ ఒక్కోదానికి రెండు, మూడు ఆప్షన్లతో అప్డేట్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రోజువారీ హాజరు, పనితీరు రికార్డు అవుతుంది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఏఈవోలు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: ‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు -
‘క్లాప్’ కొట్టాల్సిందే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు ఇక పరిశుభ్రంగా మారనున్నాయి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరణ.. జియోట్యాగింగ్ చేసిన ఆటోలతో వ్యర్థాల తరలింపు.. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు.. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు.. వ్యర్థాల నుంచి విద్యుత్, కంపోస్ట్ ఎరువుల తయారీ.. వెరసి రాష్ట్రంలోని 123 నగరాలు, పట్టణాలు 100 శాతం పరిశుభ్రంగా రూపుదిద్దుకోనున్నాయి. తద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడనుంది. పరిశుభ్రతే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని జూలై 8న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పురపాలకశాఖ సన్నద్ధమవుతోంది. ఓవైపు పూర్తిస్థాయిలో మౌలిక వసతులను సమకూర్చుకుంటూ మరోవైపు ప్రజలను భాగస్వాములుగా చేసుకుని కార్యాచరణ రూపొందించింది. క్లాప్ కార్యక్రమంలో ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిని గ్రీన్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి గ్లౌజులు, కళ్లద్దాలు, బూట్లుతో పీపీఈ కిట్ల వంటి సూట్ ఇవ్వనుంది. వారి ఆరోగ్య పరిరక్షణతోపాటు సామాజిక గౌరవాన్ని పెంపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రూ.100 కోట్లతో కోటికిపైగా డస్ట్బిన్లు నగరాలు, పట్టణాల్లో రోడ్లు, వీధుల్లో వ్యర్థాలు కనిపించకూడదన్నది క్లాప్ కార్యక్రమం లక్ష్యం. అందుకు ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరిస్తారు. ఇళ్ల నుంచే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తారు. ఆ విషయంపై వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, స్వచ్ఛందసంస్థల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పురపాలకశాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాలతో స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్ ఎండీ సంపత్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి పురపాలక, మెప్మా సిబ్బందికి శిక్షణా తరగతులు ప్రారంభించారు. తడిచెత్త కోసం పచ్చరంగు, పొడిచెత్త కోసం నీలం రంగు, ప్రమాదకర చెత్త కోసం ఎర్ర రంగు డస్ట్బిన్లను ఉచితంగా సరఫరా చేస్తారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున సరఫరా కోసం కోటికిపైగా డస్ట్బిన్లను కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం 15వ ఆర్థికసంఘం నిధులు రూ.100 కోట్లను పురపాలకశాఖ వెచ్చించనుంది. 3,100 డీజిల్ ఆటోలు, 1,800 ఈ–ఆటోలు ఇళ్ల నుంచి వ్యర్థాల తరలింపునకు ఇప్పటివరకు ఉన్న తోపుడు బళ్ల స్థానంలో ఆటోలను ప్రవేశపెడతారు. 45 పెద్ద మునిసిపాలిటీల్లో ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక డీజిల్ ఆటో చొప్పున మొత్తం 3,100 ఆటోలు ఏర్పాటు చేస్తారు. 78 చిన్న మునిసిపాలిటీల్లో ప్రతి 700 ఇళ్లకు ఓ ఈ–ఆటో వంతున మొత్తం 1,800 ఆటోలను ప్రవేశపెడతారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో ఉన్న ఆటోలకు రెండు వైపులా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ ఆటో ఏ ప్రాంతంలో ఉందో అధికారులు పర్యవేక్షించవచ్చు. 121 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు జీటీఎస్ నుంచి వ్యర్థాలను వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. 123 నగరాలు, పట్టణాల్లో 121 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు నెలకొల్పుతారు. ఇప్పటికే 31 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. 18 ప్లాంట్ల నిర్మాణం కొనసాగుతోంది. మరో 72 ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. విశాఖపట్నం, గుంటూరుల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతారు. మిగిలిన వ్యర్థాల నుంచి కంపోస్ట్ తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. రెండుదశల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. రూ.160 కోట్లతో 225 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఇంతవరకు వ్యర్థాలను వీధులు, కాలనీల్లో ఓ ప్రదేశంలో పెద్ద చెత్తకుండీల్లోను, బయట వేస్తున్నారు. ఆ వ్యర్థాలు చెల్లాచెదురై అనారోగ్య పరిస్థితులు ఏర్పడేవి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు (జీటీఎస్‌లు) ఏర్పాటు చేయనుంది. ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను ఆటోలలో తరలించి ఈ జీటీఎస్‌లలో వేస్తారు. అందుకోసం ప్రతి 10 వార్డులకు ఒక జీటీఎస్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా రూ.160 కోట్లతో నగరాలు, పట్టణాల్లో మొత్తం 225 జీటీఎస్‌లు నెలకొల్పుతారు. రూ.13 కోట్లతో 4 వేల కంపాక్టర్ బిన్లను కొనుగోలు చేసి జీటీఎస్‌లలో అందుబాటులో ఉంచుతారు. -
‘ఖాకీ’ కన్నుగప్పలేరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హోంక్వారంటైన్లలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. విదేశాల నుంచి వచ్చినవారు, ప్రభుత్వ ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందినవారు, హోంక్వారంటైన్లలో ఉన్న వారిపై సాంకేతిక సాయంతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న కంటైన్మెంట్ క్లస్టర్లలో ఈ నిఘాను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం ‘టీఎస్‌కాప్’లో ప్రత్యేక ఫీచర్‌ను చేర్చారు. ఎవరైతే హోంక్వారంటైన్లలో ఉంటారో.. వారి మొబైల్లో ప్రత్యేక యాప్‌ను పోలీసులు ఇన్స్టాల్ చేస్తారు. వారి ఇళ్లను ఇప్పటికే జియోట్యాగింగ్ చేశారు. ఈ తరహాలో జియోట్యాగింగ్ చేసిన ఇళ్లు దాదాపు 70 వేల వరకుంటాయి. అతని మొబైల్‌కు పోలీసుల వద్ద ఉండే టీఎస్‌కాప్ ట్యాబ్‌లకు కనెక్షన్ ఏర్పడుతుంది. దీంతో సదరు వ్యక్తి గడప దాటినా టీఎస్ కాప్‌లో అలర్ట్ వచ్చేస్తుంది. కొందరు డిలీట్ చేస్తున్నారు.. కొందరు ఫారిన్ రిటర్నీస్, కరోనా అనుమానితులు యాప్ ఉంటే తమ ఉనికిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నార న్న అసహనంతో యాప్ లను అన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అయితే, వారు అన్ ఇన్స్టాల్ చేసినా.. వారి కదలికలను టీఎస్‌కాప్ ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాబట్టి, హోంక్వారంటైన్లంతా ఖాకీ కన్నుగప్పి పోలేరని స్పష్టం చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించిన 130 కరోనా కంటైన్మెంట్ క్లస్టర్లలో ఈ నిఘాను పోలీసులు మరింత సమర్థంగా కొనసాగిస్తున్నారు. వయొలేషన్ ట్రాకింగ్ యాప్.. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి 3 కిలోమీటర్ల నిబంధనలను పట్టించుకోకుండా బయటికి వస్తున్న పౌరులపై కేసులు పెట్టేందుకు పోలీసుశాఖ సరికొత్త యాప్‌ను అభివృద్ధి చేసింది. బయటికి వచ్చిన పౌరుల ఆధార్/ఫోన్ నంబరు/ ఇతర గుర్తింపు కార్డులను సేకరిస్తారు. జీపీఎస్ ద్వారా పనిచేసే ఈ యాప్‌లో సదరు వాహనదారుడు 3 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే.. పోలీసులను వెంటనే అప్రమత్తం చేస్తుంది. వెంటనే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిపై కేసులు పెడతారు. పోలీసులు ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్ ద్వారా 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. -
గడప దాటారో.. పట్టేస్తారు!
సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ వైరస్ విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలకు సాంకేతికతను జోడించింది. ఆన్లైన్లో పర్యవేక్షించే ఏర్పాట్లు చేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం పక్కన ఇందు కోసం ప్రత్యేకంగా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలకు గూగుల్ మ్యాప్‌లో జియోట్యాగింగ్ చేశారు. దాటి పాజిటివ్ కేసు ఉన్న వ్యక్తులు నివసించే పరిసరాల్లో కిలో మీటర్ దూరంలో పూర్తిగా నిర్భందాన్ని అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఇతరులు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చిన్న చిన్న వ్యాపార దుకాణాలతో పాటు పట్టణంలోని పెట్రోల్ బంకులన్నింటినీ కూడా మూత వేయించారు. జిల్లాలో 27 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చి వీధుల్లో తిరగకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే అనుమానిత ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యలు చేపడుతూనే సర్వే కొనసాగిస్తున్నారు. బయటకు రాకుండా కరోనా నియంత్రణకు సహకరించాలని ప్రజలను పోలీసు అధికారులు కోరుతున్నారు. -
సరుకుకు రక్షణ.. సులభతర రవాణా
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీ పరిధిలోని విద్యా సంస్థలకు జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరుకు రవాణా సులభతరం చేయడంతో పాటు అక్రమాలకు తావీయకుండా ఉండేందుకు దీన్ని అమలు చేయనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సొసైటీలను ఆదేశించింది. రాష్ట్రంలో 5 గురుకుల సొసైటీలున్నాయి. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్(తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీఎంఆర్ఈఐఎస్ (తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీఆర్ఈఐఎస్(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) పరిధిలో 870 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటికి పౌరసరఫరాలశాఖ బియ్యం సరఫరా చేస్తుండగా.. కూరగాయలు, గుడ్లు, మాంసం, ఇతర సరుకులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. ఏటా కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుండటంతో విద్యా సంస్థల చిరునామాల్లో గందరగోళం ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు జియోట్యాగింగ్ చేస్తే బాగుంటుందని పౌరసరఫరాల శాఖ సూచించింది. సులభంగా గమ్యస్థానానికి... గురుకుల పాఠశాలలు, కళాశాలల చిరునామా తెలుసు కోవడం సులభతరం చేసేందుకు జియోట్యాంగింగ్ ఉపకరిస్తుందని యంత్రాంగం యోచిస్తోంది. ప్రతి గురుకుల పాఠశాల, కళాశాల ఎక్కడుందో తెలుసుకునేందు కు వాటి అక్షాంశ, రేఖాంశాల (లాంగిట్యూడ్, లాటిట్యూ డ్)ను గురుకుల సొసైటీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. గురుకుల పాఠశాల, కళాశాల ఫొటోను అందుబాటులో పెట్టనున్నారు. దీంతో సరుకు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో పాటు గురుకులానికి వెళ్లే సందర్శకులకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రయోగాత్మకంగా ప్రతీ సొసైటీలో పది గురుకుల పాఠశాలలను తొలుత జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం సొసైటీ కార్యదర్శులకు సూచించింది. ఇది పూర్తయ్యాక అన్ని గురుకులాలకు జియోట్యాగింగ్ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం కల్లా జియోట్యాగింగ్ పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,660 సంక్షేమ వసతిగృహాలను కూడా జియోట్యాగింగ్ చేయాల్సిందిగా ప్రభుత్వం సంక్షేమ శాఖలకు ఆదేశించింది. గురుకుల విద్యా సంస్థల తరహా లో వీటికి కూడా సరుకులు సరఫరా చేయనుండటంతో హాస్టళ్లకు సైతం ఇదే పద్ధతిలో జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘పెట్టుబడి’కి జియో ట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘పెట్టుబడి’సాయం కోసం వచ్చే ఏడాది రబీ పంటలను జియోట్యాగింగ్ ద్వారా గుర్తించాలని సర్కార్ యోచిస్తోంది. రాబోయే ఖరీఫ్ నుంచి రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్కారు ఇటీవల వేసిన అంచనా ప్రకారం 1.42 కోట్ల ఎకరాలకు ఖరీఫ్‌లో రూ.5,680 కోట్ల పెట్టుబడి పథకం కింద సాయం చేస్తారు. ఏప్రిల్ 20 నుంచే రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం కింద చెక్కులను అందజేస్తారు. రబీలో మాత్రం కేవలం ఆ సీజన్లో సాగు చేసే పంట భూములకే నవంబర్ 18 నాటికి పెట్టుబడి సాయం అందజేస్తారు. రబీలో బోర్లు, బావులు, ఇతర సాగునీటి వనరులు ఉన్నచోట్ల మాత్రమే పంటలు సాగవుతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి, పసుపు, మిర్చి వంటి పంటలు రబీలోనూ కొనసాగుతాయి. ఈ పంటలకు రెండో విడత పెట్టుబడి సాయం అందదు. రబీ సీజన్లో ఇతర పంటల సాగు ఎంతనేది గుర్తించడం కష్టం. కచ్చితత్వం లేకుండా పెట్టుబడి పథకం కింద సాయం చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని అంటున్నారు. అందుకే జియోట్యాగింగ్ ద్వారా పంటల వివరాలను గుర్తించాలని భావిస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా వివరాలు... శాటిలైట్ ద్వారా జియోట్యాగింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల వివరాలను కచ్చితంగా గుర్తించవచ్చు. ప్రభుత్వం వద్ద ఉన్న భూసర్వే వివరాలను గ్రామం, రైతు పేర్లతో సహా జియో సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేస్తారు. ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారన్నది జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తారు. అంటే ఏ రైతు ఏ పంట వేశాడు? ఎన్నెకరాల్లో వేశాడన్న సమాచారం సేకరించవచ్చు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి జియోట్యాగింగ్ పద్ధతి గురించి రాష్ట్ర అధికారులకు వివరించారు. కర్ణాటకలో మాదిరి గా మన దగ్గర కూడా జియోట్యాగింగ్ పద్ధతి అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రబీ పెట్టుబడి పంపిణీ తేదీకి... పంటల సాగు కాలానికి తేడా నవంబర్ 18 నాటికే రబీలో రెండో విడత పెట్టుబడి సాయం చేస్తానని సర్కారు ప్రకటించింది. వాస్తవంగా రబీ సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే మొదలవుతుంది. వరి నాట్లు మాత్రం ఫిబ్రవరి వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందిస్తారనేది సమస్య. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
భూములకు ‘భూధార్’
సాక్షి, అమరావతి: పౌరులకు ఆధార్ నంబర్ కేటాయిస్తున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా పొలాలు, స్థలాలకు ‘భూధార్’ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూముల లావాదేవీల్లో అక్రమాలను నిరోధించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి స్థిరాస్తికి దీన్ని వర్తింపచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబర్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూధార్ అమలు తీరు, ఉపయోగాలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో అధికారులు పవర్‌పాయింట్ ద్వారా రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వివరించారు. ప్రభుత్వ భూములకు రెండు సున్నాలు ప్రభుత్వ భూములు, స్థలాలకు మొదట రెండు సున్నాలతో నంబరు కేటాయిస్తారు. జియోట్యాగింగ్ చేయడం వల్ల భూదార్ నంబరు నొక్కగానే ఆ భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. అందులోనే భూ యజమాని పేరు, భూమి విస్తీర్ణం, ఏ తరహా భూమి, మార్కెట్ విలువతోపాటు 20 అంశాలు కనిపిస్తాయి. ఈ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే ఆటో మ్యుటేషన్ అయిపోతుంది. రుణాలు తీసుకున్నా అందులోనే డేటా కనిపిస్తుంది. క్రయ విక్రయాలకు కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు (క్రయ విక్రయ లావాదేవీలు), దస్తావేజు నకళ్లు లాంటివి తీసుకోవాల్సిన పని ఉండదు. జగ్గయ్యపేట, ఉయ్యూరులో పైలెట్ ప్రాజెక్టు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాలిటీలో ఇప్పటికే చేపట్టిన భూధార్ పైలట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూములు, స్థలాలు, ఇళ్లకు భూధార్ నంబరు కేటాయించి డిజిటలైజ్ చేస్తే తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత రుణాలు పొందేందుకు ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొన్నారు. 4.19 కోట్ల ఆస్తులకు భూధార్ ఈ ఏడాది అక్టోబరు నెలాఖరుకల్లా రాష్ట్రంలో 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తులు కలిపి మొత్తం 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబరు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా భూసేవ పేరుతో భూధార్ కార్యక్రమం చేపడుతున్నట్లు కేఈ కృష్ణమూర్తి వివరించారు. రైతుల సమయం, డబ్బు ఆదా చేయాలనే ఆటోమ్యుటేషన్కు శ్రీకారం చుట్టామని చెప్పారు. భూధార్ ఇలా - భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరు కేటాయిస్తారు. - ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్రానికి సంబంధించిన సెన్సెస్ కోడ్ కాగా తర్వాత తొమ్మిది అంకెలు ఉంటాయి. - ఒకవేళ ఈ ప్రాజెక్టును దేశమంతా చేపడితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు మొదటి రెండు అంకెలు రాష్ట్ర సెన్సెస్ కోడ్ (28) కోసం కేటాయిస్తారు. - తప్పులు దొర్లకుండా జాగ్రత్తల్లో భాగంగా తొలుత 28కి బదులు 99తో ఆరంభించి 11 అంకెల తాత్కాలిక నంబరు ఇస్తారు. - భూ వివరాలను సమగ్రంగా విశ్లేషించి అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్ర సెన్సస్ కోడ్ 28తో ప్రారంభమయ్యే శాశ్వత భూధార్ నంబరు కేటాయిస్తారు. -
శాటిలైట్ నిఘా
ఏటూరునాగారం: ‘పనిచేయని సీసీ కెమెరాలు.. ఇంటర్నెట్ సేవల్లో ఇబ్బందులు.. ట్రాఫిక్ జామ్ జరిగినా అటువైపు చూడని పోలీసులు..’లాంటి విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్తో సంబంధం లేకుండా.. కెమెరాలు లేని ప్రాంతాల్లోని దృశ్యాలను సైతం ఎప్పటికప్పుడు వీక్షించేందుకు శాటిలైట్ టెక్నాలజీని ఈ జాతరలో ఉపయోగించబోతున్నారు. సీసీ కెమెరాలు లేకపోయినా మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగే తోపులాటలు.. ట్రాఫిక్‌జామ్‌లు.. పోలీసులకు క్షణాల్లో తెలిసిపోనున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు మేడారానికి చుట్టూ 50 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మధ్యలోని ప్రాంతాలను జియోటాగింగ్ చేస్తున్నారు. మేడారం గద్దెల ప్రాంతంతోపాటు జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే డెన్లు, పోలీసు మంచెలు, ఔట్‌పోస్టులు, మూలమలుపులు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రద్దీ అయ్యే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, చింతల క్రాస్, బయ్యక్కపేట ప్రధాన రహదారి, కన్నెపల్లి సారమ్మల ఆలయం, కొండాయి గోవిందరాజుల పరిసర ప్రాంతాలను జియోటాగింగ్ చేస్తున్నారు. జియోట్యాగింగ్ ఇలా.. ముందుగా జియోట్యాగింగ్ చేయాలనుకున్న ప్రాంతం ఫొటో తీసి.. పేరు పెట్టి శాటిలైట్‌కు ట్యాగ్ చేస్తారు. దీనివల్ల ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయగానే ఆ ఫొటోతోపాటు అక్కడ ఉన్న పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంది. శాటిలైట్‌కు జియోట్యాగింగ్ అనుసంధానం చేయడం వల్ల అనుక్షణం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అధికారులకు, పోలీసులకు సమాచారం అందుతుంది. అంతేగాక సెల్ సిగ్నల్స్ లేకున్నా శాటిలైట్‌తో అనుసంధానం చేసుకొని సమాచారం చేరవేసుకునేందుకు ఈ సమాచార వ్యవస్థ పనిచేయనుంది. పోలీసులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా క్షణాల మీద సమాచారం అందడంతో సహాయక చర్యలు తీసుకోవడం సులభతరం కానుంది. -
వచ్చే ఏడాది 5.76కోట్ల మొక్కలు లక్ష్యం
కలెక్టర్ కరుణ హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఈ ఏడాది నిరే్ధశించిన 4 కోట్ల మొక్కల లక్ష్యంలో ఇప్పటవరకు 52 శాతం పూర్తయిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జిల్లాలో 5.76కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యాసంస్థలు, ప్రజల నుంచి పండ్ల మొక్కలకు డిమాండ్ ఉన్నందున వారంలో వాటిని తెప్పించి అందజేస్తామని పేర్కొన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ విషయంలో జిల్లా కొంత వెనుకబడి ఉందని తెలిపారు. మొక్కల సంరక్షణ, నీటి సరఫరాకు సుమారు రూ.39 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మొక్కల సంరక్షణ విషయంలో పారదర్శకతlకోసం ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేస్తున్నామని అన్నారు. సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అటవీశాఖ అధికారులు రాజారాం, భీమానాయక్, కృష్టాగౌడ్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.