సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీ పరిధిలోని విద్యా సంస్థలకు జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరుకు రవాణా సులభతరం చేయడంతో పాటు అక్రమాలకు తావీయకుండా ఉండేందుకు దీన్ని అమలు చేయనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సొసైటీలను ఆదేశించింది. రాష్ట్రంలో 5 గురుకుల సొసైటీలున్నాయి.
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్(తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీఎంఆర్‌ఈఐఎస్ (తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీఆర్‌ఈఐఎస్(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) పరిధిలో 870 గురుకుల విద్యా సంస్థలున్నాయి.
వీటికి పౌరసరఫరాలశాఖ బియ్యం సరఫరా చేస్తుండగా.. కూరగాయలు, గుడ్లు, మాంసం, ఇతర సరుకులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. ఏటా కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుండటంతో విద్యా సంస్థల చిరునామాల్లో గందరగోళం ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు జియోట్యాగింగ్ చేస్తే బాగుంటుందని పౌరసరఫరాల శాఖ సూచించింది.
సులభంగా గమ్యస్థానానికి...
గురుకుల పాఠశాలలు, కళాశాలల చిరునామా తెలుసు కోవడం సులభతరం చేసేందుకు జియోట్యాంగింగ్ ఉపకరిస్తుందని యంత్రాంగం యోచిస్తోంది. ప్రతి గురుకుల పాఠశాల, కళాశాల ఎక్కడుందో తెలుసుకునేందు కు వాటి అక్షాంశ, రేఖాంశాల (లాంగిట్యూడ్, లాటిట్యూ డ్)ను గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. గురుకుల పాఠశాల, కళాశాల ఫొటోను అందుబాటులో పెట్టనున్నారు. దీంతో సరుకు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో పాటు గురుకులానికి వెళ్లే సందర్శకులకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది.
ప్రయోగాత్మకంగా ప్రతీ సొసైటీలో పది గురుకుల పాఠశాలలను తొలుత జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం సొసైటీ కార్యదర్శులకు సూచించింది. ఇది పూర్తయ్యాక అన్ని గురుకులాలకు జియోట్యాగింగ్ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం కల్లా జియోట్యాగింగ్ పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,660 సంక్షేమ వసతిగృహాలను కూడా జియోట్యాగింగ్ చేయాల్సిందిగా ప్రభుత్వం సంక్షేమ శాఖలకు ఆదేశించింది. గురుకుల విద్యా సంస్థల తరహా లో వీటికి కూడా సరుకులు సరఫరా చేయనుండటంతో హాస్టళ్లకు సైతం ఇదే పద్ధతిలో జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment