ఏటూరునాగారం: ‘పనిచేయని సీసీ కెమెరాలు.. ఇంటర్నెట్ సేవల్లో ఇబ్బందులు.. ట్రాఫిక్ జామ్ జరిగినా అటువైపు చూడని పోలీసులు..’లాంటి విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా.. కెమెరాలు లేని ప్రాంతాల్లోని దృశ్యాలను సైతం ఎప్పటికప్పుడు వీక్షించేందుకు శాటిలైట్ టెక్నాలజీని ఈ జాతరలో ఉపయోగించబోతున్నారు. సీసీ కెమెరాలు లేకపోయినా మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగే తోపులాటలు.. ట్రాఫిక్‌జామ్‌లు.. పోలీసులకు క్షణాల్లో తెలిసిపోనున్నాయి.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు మేడారానికి చుట్టూ 50 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మధ్యలోని ప్రాంతాలను జియోటాగింగ్ చేస్తున్నారు. మేడారం గద్దెల ప్రాంతంతోపాటు జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే డెన్‌లు, పోలీసు మంచెలు, ఔట్‌పోస్టులు, మూలమలుపులు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రద్దీ అయ్యే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, చింతల క్రాస్, బయ్యక్కపేట ప్రధాన రహదారి, కన్నెపల్లి సారమ్మల ఆలయం, కొండాయి గోవిందరాజుల పరిసర ప్రాంతాలను జియోటాగింగ్ చేస్తున్నారు.
జియోట్యాగింగ్ ఇలా..
ముందుగా జియోట్యాగింగ్ చేయాలనుకున్న ప్రాంతం ఫొటో తీసి.. పేరు పెట్టి శాటిలైట్‌కు ట్యాగ్ చేస్తారు. దీనివల్ల ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయగానే ఆ ఫొటోతోపాటు అక్కడ ఉన్న పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంది. శాటిలైట్‌కు జియోట్యాగింగ్ అనుసంధానం చేయడం వల్ల అనుక్షణం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఆన్‌లైన్‌లో వీక్షించే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అధికారులకు, పోలీసులకు సమాచారం అందుతుంది. అంతేగాక సెల్ సిగ్నల్స్ లేకున్నా శాటిలైట్‌తో అనుసంధానం చేసుకొని సమాచారం చేరవేసుకునేందుకు ఈ సమాచార వ్యవస్థ పనిచేయనుంది. పోలీసులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా క్షణాల మీద సమాచారం అందడంతో సహాయక చర్యలు తీసుకోవడం సులభతరం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment