సాక్షి, అమరావతి: పౌరులకు ఆధార్ నంబర్ కేటాయిస్తున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా పొలాలు, స్థలాలకు ‘భూధార్’ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూముల లావాదేవీల్లో అక్రమాలను నిరోధించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి స్థిరాస్తికి దీన్ని వర్తింపచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబర్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూధార్ అమలు తీరు, ఉపయోగాలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో అధికారులు పవర్‌పాయింట్ ద్వారా రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వివరించారు.
ప్రభుత్వ భూములకు రెండు సున్నాలు
ప్రభుత్వ భూములు, స్థలాలకు మొదట రెండు సున్నాలతో నంబరు కేటాయిస్తారు. జియోట్యాగింగ్ చేయడం వల్ల భూదార్ నంబరు నొక్కగానే ఆ భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. అందులోనే భూ యజమాని పేరు, భూమి విస్తీర్ణం, ఏ తరహా భూమి, మార్కెట్ విలువతోపాటు 20 అంశాలు కనిపిస్తాయి. ఈ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే ఆటో మ్యుటేషన్ అయిపోతుంది. రుణాలు తీసుకున్నా అందులోనే డేటా కనిపిస్తుంది. క్రయ విక్రయాలకు కూడా ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు (క్రయ విక్రయ లావాదేవీలు), దస్తావేజు నకళ్లు లాంటివి తీసుకోవాల్సిన పని ఉండదు.
జగ్గయ్యపేట, ఉయ్యూరులో పైలెట్ ప్రాజెక్టు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాలిటీలో ఇప్పటికే చేపట్టిన భూధార్ పైలట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూములు, స్థలాలు, ఇళ్లకు భూధార్ నంబరు కేటాయించి డిజిటలైజ్ చేస్తే తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత రుణాలు పొందేందుకు ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
4.19 కోట్ల ఆస్తులకు భూధార్
ఈ ఏడాది అక్టోబరు నెలాఖరుకల్లా రాష్ట్రంలో 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తులు కలిపి మొత్తం 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబరు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా భూసేవ పేరుతో భూధార్ కార్యక్రమం చేపడుతున్నట్లు కేఈ కృష్ణమూర్తి వివరించారు. రైతుల సమయం, డబ్బు ఆదా చేయాలనే ఆటోమ్యుటేషన్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు.
భూధార్ ఇలా
- భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరు కేటాయిస్తారు.
- ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్రానికి సంబంధించిన సెన్సెస్ కోడ్ కాగా తర్వాత తొమ్మిది అంకెలు ఉంటాయి.
- ఒకవేళ ఈ ప్రాజెక్టును దేశమంతా చేపడితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు మొదటి రెండు అంకెలు రాష్ట్ర సెన్సెస్ కోడ్ (28) కోసం కేటాయిస్తారు.
- తప్పులు దొర్లకుండా జాగ్రత్తల్లో భాగంగా తొలుత 28కి బదులు 99తో ఆరంభించి 11 అంకెల తాత్కాలిక నంబరు ఇస్తారు.
- భూ వివరాలను సమగ్రంగా విశ్లేషించి అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్ర సెన్సస్ కోడ్ 28తో ప్రారంభమయ్యే శాశ్వత భూధార్ నంబరు కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment