
ప్రత్యేక హ్యాండ్లూమ్ మార్క్ రూపొందించనున్న సర్కార్
రాష్ట్ర చేనేత కార్మికులు, ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు
‘నేతన్న భరోసా’కింద ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు నిర్ణయం
టెస్కో షోరూమ్‌ల ఆధునీకరణ, ఆన్‌లైన్ పోర్టల్‌పై దృష్టి
సాక్షి, హైదరాబాద్: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ చేనేత ఉత్పత్తుల ప్రాముఖ్యతను చాటేలా వాటికి ‘ప్రత్యేక లేబుల్’(తెలంగాణ హ్యాండ్లూమ్ లేబుల్/మార్క్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘తెలంగాణ లేబుల్’పై చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే నేత కార్మికులకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేసిన ప్రభుత్వం.. వాటిపై తయారు చేసే చేనేత ఉత్పత్తులకు ‘తెలంగాణ లేబుల్’జారీ చేస్తుంది.
ఈ చేనేత వ్రస్తాలు తయారు చేసే కార్మికులకు ‘తెలంగాణ నేతన్న భరోసా’పథకం కింద ప్రతినెలా రూ.2 వేలు చొప్పున ఏటా రూ.24 వేలు అదనంగా చెల్లిస్తారు. చేనేత వస్త్ర ఉత్పత్తులను మరమగ్గాల ద్వారా కాపీ కొట్టకుండా నిరోధించడంతో పాటు కొనుగోలుదారులకు నాణ్యతతో కూడిన అసలైన చేనేత వస్త్రాలు అందించడం లక్ష్యంగా ‘తెలంగాణ లేబుల్’కు రూపకల్పన చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డిజైన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చేనేత విభాగం సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో చేనేత, పట్టు వ్రస్తాలకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే టెక్స్‌టైల్ కమిటీ ‘హ్యాండ్లూమ్ మార్క్’, ‘సిల్క్ మార్క్’ను జారీ చేస్తోంది. ఈ మార్క్ కోసం టెక్స్‌టైల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇకపై టెక్స్‌టైల్ కమిటీ జారీ చేసే హ్యాండ్లూమ్ మార్క్‌కు బదులుగా ప్రత్యేక తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది.
తద్వారా తెలంగాణ చేనేత బ్రాండ్‌ను ప్రోత్సహించడంతో పాటు పోటీ మార్కెట్‌లో రాష్ట్ర సాంప్రదాయ ఉత్పత్తులు, నైపుణ్యానికి గుర్తింపు దక్కేలా చేయాలని భావిస్తోంది. చేనేత కార్మికుల జీవనోపాధి, సంక్షేమానికి ‘తెలంగాణ లేబుల్’బాటలు వేస్తుందని ఆశిస్తోంది.
విక్రయాలు పెంచేందుకు చేనేత బజార్లు
చేనేత విక్రయాలు పెంచేందుకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) సహకారంతో అంతర్ రాష్ట్ర ప్రదర్శనలు, ఉమ్మడి పది జిల్లాల్లో స్థానికంగా జరిగే పండుగలు, ఉత్సవాలు, జాతర్లలో చేనేత బజార్లు ఏర్పాటు చేయనున్నారు. పోచంపల్లి ఇక్క త్, వరంగల్ డర్రీలు, గద్వాల, నారాయణపేట చేనే త వస్త్ర ఉత్పత్తులకు గిరాకీ పెంచేందుకు ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలతోనూ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం టెస్కోకు తెలంగాణ వెలుపలా, బయటా కలిపి 31 షోరూమ్‌లు ఉన్నాయి. కాగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ షోరూమ్‌ల ఆధునికీకరణపై కూడా దృష్టి సారించారు. పోచంపల్లి ఇక్కత్, వరంగల్ డర్రీల ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై దృష్టి
టెస్కో షోరూమ్‌ల ద్వారా చేనేత వస్త్ర ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ సుమారు రూ.15 కోట్ల మేర ఉంటోంది. వీటితో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు విక్రయిస్తున్న వ్రస్తోత్పత్తుల విలువ రూ.260 కోట్ల మేర ఉంది. అయితే ఆన్‌లైన్ విక్రయాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చేనేత ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్‌కు రూపకల్పన జరుగుతోంది. ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ మార్క్ చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. నేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, చేనేత సహకార సొసైటీలను అనుసంధానం చేసే రీతిలో పోర్టల్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment