Handloom textiles
-
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలను సచివాలయంలోని ఆప్కో విక్రయశాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ప్రకటించారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వ్రస్తాలను తప్పనిసరిగా ధరించాలనే విధానాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వ్రస్తాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. చేనేత వ్రస్తాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వ్రస్తాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సరళ, కనకదుర్గ, సునీత, ఇమామ్ వలీ, మోహనరావు, ప్రసాద్‌కు బహుమతులను అందజేశారు. నేతన్నలను ఆదుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ప్రధానంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ఊతమిచ్చారని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత స్పష్టం చేశారు. చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో చేనేత వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సునీత మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతుల్లో తయారైన చేనేత వస్త్రాలకు విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉండటంతో ఆ దిశగా పత్తి రైతులు, చేనేత కార్మికులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశంలోనే తయారైనవేనని, చేనేతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయించేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న చేనేత ప్రదర్శన, సబ్సిడీపై విక్రయాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సునీత కోరారు. 1.75 లక్షల మందికి ఉపాధి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత రంగం 1.75 లక్షల మందికి ఉపాధి చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంతో మద్దతునిస్తూ ప్రతి జిల్లాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తిస్తూ వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్లు గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆప్కో జీఎం తనూజారాణి మాట్లాడారు. -
‘చేనేతపై జీఎస్టీ తగ్గింపును పరిశీలిస్తున్నాం’
సాక్షి, యాదాద్రి/ఆలేరు రూరల్: చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గింపు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహాన్ చెప్పారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధింపు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. అయితే, నూలుపై గతంలో ఇచ్చే 10 శాతం ఇన్పుట్ సబ్సిడీని 15 శాతానికి కేంద్రం పెంచిందన్నారు. కరోనా వల్ల చేనేత కార్మికులు నష్టపోయిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందని, జీఎస్టీ తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో సోమవారం జరిగిన చేనేత కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతిచేసే నేతన్న రఘునాథపురంలో ఉండడం అభినందనీయమన్నారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని స్థానిక చేనేత, పవర్లూమ్ ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ముందుగా గ్రామంలో పవర్‌లూమ్‌లను మంత్రి పరిశీలించారు. ఉదయం యాదాద్రీశుని దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి ఆలేరులో వివిధ మోర్చాలతో సమావేశమయ్యారు. అనంతరం భువనగిరిలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భువనగిరి పోస్టల్ కార్యాలయంలో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పోస్టల్ కవర్‌ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం వలిగొండ మండలం అర్రూర్‌లో రైతులతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆలేరులో నిర్వహించిన వివిధ మోర్చా నాయకుల సమావేశంలో దేవ్‌సిన్హా మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. -
ఆన్‌లైన్‌లోనూ ‘ఆప్కో’ ట్రెండ్
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు చేయూతనిస్తున్న ఆప్కో మార్కెట్ పోటీలోనూ తగ్గేదే లేదంటోది. 7 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్లైన్ మార్కెట్లోనూ బ్రాండ్ బాజా మోగిస్తోంది. చేనేత వస్త్రాల విక్రయాలను మరింత విస్తృతం చేసేందుకు ఆప్కో హ్యాండ్లూమ్స్.కామ్ (apcohandlooms. com) వెబ్‌సైట్‌ను గత ఏడాది అక్టోబర్ 20న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆప్కో ఆన్లైన్ విక్రయాలను చేపట్టింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫ్లోక్స్, మిర్రావ్, పేటీఎం ద్వారా ఆన్లైన్ అమ్మకాలు జరుపుతోంది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు రూ.19,13,554 విలువైన చేనేత వస్త్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించగా.. 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి 15 వరకు రూ.40,74,129 విలువైన వస్త్రాలను విక్రయించింది. ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలను రూపొందిస్తూ ఆప్కోకు ఆదరణ పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది రూ.300 కోట్ల మేర టర్నోవర్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉన్న షోరూమ్‌లతోపాటు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో మెగా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
పొందూరు చేనేతపై నిర్మలా సీతారామన్ ప్రశంసలు
పొందూరు/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో మెగా చేనేత, ఖద్దరు క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పొందూరు చేనేత, ఖాదీ వస్త్రాలు దేశానికే ఆదర్శమని ఆమె ప్రశంసించారు. శనివారం పొందూరులో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ నేత ప్రక్రియ, వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. రూ.18 లక్షల చెక్కును ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘానికి అందజేశారు. భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాదీ తయారీ విధానం తెలుసుకునేందుకు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అనంతరం చేనేత వస్త్రాల స్టాళ్లు, బ్యాంక్‌ల స్టాళ్లను పరిశీలించారు. బ్యాంకు స్టాళ్ల వల్ల ప్రయోజనం లేదని, రుణాలు అర్హులందరికీ కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. స్టాళ్ల ముందు లోన్ల వివరాలు ఉంచాలని ఆదేశించారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. జేమ్–ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా కొనుగోలు, అమ్మకాలకు ముందుకు రావాలన్నారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆమె బ్యాంకులు అందించిన లోన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ, పొందూరు, చుట్టు పక్కల ప్రాంతాల్లో మగ్గం ఉన్న మూడు వేల మందితో మెగా ఖద్దరు, చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజుకి 50 శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు. మళ్లీ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తానని తెలిపారు. జాతీయ స్థాయిలో 2014లో రూ.9,400 కోట్లు ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18,000 కోట్లకు పెరిగిందని వివరించారు. నేతన్న నేస్తంతో ఆదుకుంటున్నాం.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24,000 అందజేస్తోందని తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఖద్దరు.. మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి వారి దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్నాయుడు, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ మార్కెట్‌కు ఆర్గానిక్ చేనేత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్లబోతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర అధికారులు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీసీ) అధికారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందిస్తున్నారని హెచ్‌ఈసీపీ అధికారులకు వివరించారు. విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని చెప్పారు. రసాయనాలు వినియోగించని పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్ఈపీసీ అధికారులకు వివరించారు. వీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు రావని.. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలకు ఏపీ చేనేత వస్త్రాలను ఎగుమతి చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్గానిక్ వస్త్రాలకు విశేష ఆదరణ.. హెచ్ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఏపీలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరగనుందని చెప్పారు. అలాగే ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్సి పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11 వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆప్కో డీఎంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజర్ ఎన్.కోటేశ్వరరావు, బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. -
వస్త్రాల్లో ఆర్గానిక్ ట్రెండ్
సాక్షి, అమరావతి: ఆర్గానిక్ అనగానే వంటలకు సంబంధించిన వస్తువులే గుర్తుకువస్తాయి. కానీ దుస్తుల్లోనూ ఇప్పుడు ఆర్గానిక్ ట్రెండ్ వచ్చేసింది. ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సాగు చేసిన పత్తిని సేకరించి.. దానినుంచి నూలు ఒడుకుతున్నారు. ఆ నూలుకు సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను అద్ది ఆర్గానిక్ వస్త్రాలను నేస్తున్నారు. చేనేత వస్త్రాల్లో ఇప్పుడిదే కొత్త ట్రెండ్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట తదితర ప్రాంతాల్లో నేతన్నలు ఆర్గానిక్ వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఆర్గానిక్ వస్త్రాల ఉత్పత్తికి ఊతమిచ్చేలా ఆప్కో చర్యలు చేపడుతోంది. రంగులు అద్దుతారిలా... ► చెట్ల బెరడు, పూలు, పండ్లు, కాయలు, ఆకులను సేకరించి.. నీటిలో ఉడికించి సహజసిద్ధ రంగుల్ని తయారు చేస్తున్నారు. ► ఆయా రంగుల్లో ముంచి ఆరబెట్టిన ఆర్గానిక్ నూలు(యార్న్)తో మగ్గంపై కలర్ ఫుల్ బట్టలను నేస్తున్నారు. ► దానిమ్మ కాయ బెరడుతో పసుపు, ముదురు ఆకుపచ్చ రంగులు, కరక్కాయ, జాజి, అల్జీరిన్‌తో ఎరుపు, కరక్కాయ, కరక పువ్వుతో బంగారు పసుపు (గోల్డెన్ ఎల్లో), మోదుగ పూలతో ముదురు పసుపు రంగుల్ని తయారు చేస్తున్నారు. చామంతి పువ్వులతో లేత పసుపు రంగు (లెమన్ ఎల్లో), ఇండిగో ఆకుల నుంచి నీలం రంగు, ఉల్లి పైపొరతో లేత గులాబీ, పాలకూర ఆకుల నుంచి లేత ఆకుపచ్చ, నల్ల బెల్లం, నీరు, కాల్చిన ఇనుము కలిపిన మిశ్రమం నుంచి నలుపు రంగుల్ని తీస్తున్నారు. ► వీటిని తుమ్మ జిగురుతో కలిపి బట్టలకు రంగులు బాగా పట్టేలా చేస్తున్నారు. ఈ వస్త్రాల తయారీకి ఖర్చు ఎక్కువే అయినా.. క్రేజ్ పెరుగుతోంది. ప్రయోజనాలివీ.. ► ఆర్గానిక్ వస్త్రాల వినియోగంతో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. ► ఆర్గానిక్ వస్త్రాల్లో రసాయనాలు లేవు కాబట్టి చర్మ సంబంధ వ్యాధులు, రసాయనాలు పీలిస్తే వచ్చే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. -
చేనేతకు వీడియో ‘కాల్’
నిన్నటి వరకు.. గుట్టలుగా పట్టుచీరలు.. ఎలా అమ్ముకోవాలో తెలియదు.. బేరం వస్తే వచ్చినట్టు లేదంటే లేదు.. కొత్తగా ఏదైనా ఆలోచన చేయాలన్నా బయటి పరిస్థితులు, మార్కెట్‌పై అంతంతగానే అవగాహన.. ప్రత్యేకించి ఆన్‌లైన్‌పై అవగాహన లేక అమ్మకాల్లో వెనుకబాటు.. ఈ క్రమంలోనే నష్టాలు.. ఆపై బతుకు కష్టాలు.. ప్రస్తుతం.. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. ఇప్పుడు భూదాన్‌పోచంపల్లి పట్టు చీరల వ్యాపారులు ‘ఆన్లైన్’ బాటపట్టారు. వీడియో కాల్లో డిజైన్ చూపించి అమ్మడం నేర్చుకున్నారు. మంచి డిజైన్లను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసి ఆర్డర్లు రాబట్టుకుంటున్నారు. కరోనా కాలంలో అన్ని రంగాలు కుదేలైపోతే ఇక్కడి వ్యాపారులు మాత్రం ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల విలువైన చేనేత వస్త్రాలను విక్రయించారు. సాక్షి, యాదాద్రి: ఆన్లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో భూదాన్ పోచంపల్లి పట్టుచీరల అమ్మకాలు ఊపం దుకున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా వందలాది మంది యువ చేనేత కళాకారులు ఇక్కత్, టైఅండ్‌డై పట్టుచీరలు, పెళ్లిచీరలు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్ అమ్మకాలను పెంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.4 కోట్ల మేరకు ఆన్లైన్ వ్యాపారం సాగుతోందని అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లితో పాటు చౌటుప్పల్, రామన్నపేట, హైదరాబాద్ కేంద్రాలుగా ఆన్లైన్లో వస్త్రాల అమ్మకాలు సాగుతున్నాయి. చేనేత కుటుం బాల్లో ఉన్నత చదువులు చదువుకున్న యువత.. తమకున్న అవగాహనతో ఈ రంగంలో రాణిస్తున్నారు. జిల్లాలో సుమారు 700 మంది వరకు ఆన్లైన్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుని కొత్త డిజైన్లతో కొనుగోలుదారులకు చేరువయ్యారు. ధర తక్కువ.. మంచి డిజైన్ కరోనా నేపథ్యంలో అందరి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. జనం అనవసర ఖర్చులు తగ్గించుకున్నారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లూ పడిపోయా యి. మరోపక్క రవాణా వసతి లేక, శుభకార్యాలు నిలిచిపోవడంతో చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఉత్పుత్తులు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఈ రంగంలోని యువత చేనేత వస్త్రాలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూ బ్ వంటి మాధ్యమాల్లో పెడుతూ వాటి గురించి ప్రచారం చేశారు. చివరకు వీడియో కాల్ ద్వారా డిజైన్లను చూపించి ఆకర్షించే యత్నం చేశారు. త క్కువ ధరకే మంచి రంగులు, అందమైన చీరల డిజైన్లను ఆన్లైన్లో ఉంచి కొనుగోలుదారులను ఆకట్టుకోగలిగారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి. ఆన్లైన్లో అమ్మకాలు ఇలా.. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, సిరిపురం, వెల్లం కి, బోగారం, రామన్నపేట, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ఆన్లైన్ అమ్మకాల్లో ముందున్నారు. పోచంపల్లి ఇక్కత్ (టై అండ్ డై) పట్టుచీరలు, డ్రెస్మెటీరియల్స్తోపాటు, మస్రస్ (మెర్స్రైజ్డ్), సిల్కు, పట్టు, కాటన్ వస్త్రాలలో తమకు అందుబాటులో ఉన్న డిజైన్లను, వాటి ధరలను వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. డిజైన్లు, ధర నచ్చి డబ్బులు చెల్లించిన వారికి కొరియర్ ద్వారా పంపిస్తారు. నమ్మకం కుదిరిన వారికి, సంస్థలకు క్రెడిట్ కూడా ఇస్తున్నారు. దీంతో లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కరు నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన సరుకు విక్రయించారని అంచనా. లాక్డౌన్ అనంతరం దుకాణాలు తెరుచుకోవడంతో ఆన్లైన్ వ్యాపారం కాస్త తగ్గింది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30 వేల చేనేత కుటుంబాలు ఉండగా, ప్రతి నెలా సగటున లక్ష పట్టుచీరలు ఉత్పత్తవుతున్నాయి. ఆన్లైన్లో విక్రయించే వారికి సొంతంగా వెబ్సైట్లు, కొందరికి యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసేవారు కొందరు అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాల నుంచి ఆర్డర్లు.. ఆన్లైన్లో పట్టుచీరల కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. కరోనాతో తగ్గిన సేల్స్‌ను ఆన్లైన్ ద్వారా పెంచుకున్నాం. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి కొనుగోలుదారుల కోసం తక్కువ ధర చీరలను కొత్త డిజైన్లతో ఎక్కువగా తయారుచేసి అమ్మకానికి పెట్టాం. వీడియో కాల్ ద్వారా చీరల రంగులు, డిజైన్లు చూపించి.. నచ్చితే ఆన్లైన్ చెల్లింపులతో విక్రయిస్తున్నాం. వీరికి ఇండియా పోస్ట్, కొరియర్ల ద్వారా పార్శిళ్లను పంపిస్తున్నాం. – అంబటి సాయినాథ్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి మార్జిన్ తగ్గించుకున్నాం లాక్డౌన్ వేళ ఆన్లైన్ వస్త్రవ్యాపారం బాగా జరిగింది. షాపింగ్‌కు బయటకు వెళ్లే వీల్లేకపోవడంతో చాలామంది ఆన్లైన్ ద్వారా చీరల్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చారు. కరోనా సమయంలో మేం కూడా మార్జిన్ (లాభం) తగ్గించుకున్నాం. ఒక్క పోచంపల్లిలోనే సుమారు 300పైగా యువకులు, దుకాణదారులు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్‌సీజన్‌తో గిరాకీ కొంచెం తగ్గింది. – భారత హరిశంకర్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి -
చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్’
సాక్షి, అమరావతి: గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి చేనేత వస్త్రాలకు ‘ఈ–మార్కెటింగ్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. నేత నైపుణ్యానికి పట్టం కట్టించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందులో మంత్రి వివరించారు. ► రాయలసీమ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ► కరోనా కష్టకాలంలో 6 నెలల ముందుగానే రెండవ ఏడాది సాయం అందించాం. ► చేనేత రుమాళ్లను, దుస్తులను విరివిగా కొనుగోలు చేస్తే నేతన్నలను ప్రోత్సహించినట్టే. ► ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్తులు, దుప్పట్లు అందిస్తోంది. ► అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ–కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆప్కో వస్త్రాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చాం. ► ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చొక్కాలు, ధోవతులు సహా మొత్తం 104 ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోకి తెచ్చాం. చేనేత పరిశ్రమకు భరోసా ఇవ్వడమే కాకుండా, నేతన్న ఆర్థికంగా లాభపడే విధంగా ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫికేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించనుంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. 13 నెలల కాలంలోనే చేనేతలకు రూ.600 కోట్ల సాయం అందించింది. ► ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా దాదాపుగా 81,024 కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. -
ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశా: పూనమ్ కౌర్
సాక్షి, చౌటుప్పల్: రైతులు, చేనేతలు.. దేశానికి వెన్నెముకలాంటివారని ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్ అన్నారు. కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని 220 మంది చేనేత కార్మికులకు హైదరాబాద్‌లోని నాస్కామ్ ఫౌండేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఎస్సీఎస్సీ సంస్థల సౌజన్యంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆదివారం చౌటుప్పల్‌లోని పద్మావతి ఫంక్షన్హాల్లో పంపిణీ చేసి మాట్లాడారు. ఈ రెండురగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవ్వేవని తెలిపారు. నేతన్నల కళా నైపుణ్యం ఎంతో గొప్పదని కొనియాడారు. పర్యావరణానికి అనుగుణంగా చేనేత వస్త్రాలు ఉంటాయన్నారు. మాట్లాడుతున్న ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్ తమ తండ్రి 30ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చీరల వ్యాపారం ప్రారంభించారన్నారు. తాను సైతం ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశానన్నారు. చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నానని, మగ్గం సైతం నేసానని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు చేనేత, వ్యవసాయ రంగాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం చేనేత సంఘంలోని వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి, యర్రమాద వెంకన్న, బడుగు మాణిక్యం, గోశిక స్వామి, గుర్రం నర్సింహ్మ, గోశిక ధనుంజయ, నల్ల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
పేరున్న ఊరు పుట్టపాక
పోగు, పోగు కలిపి వస్త్రం నేస్తారు. నైపుణ్యం ఉన్నవారు చేసే పనే. అయితే ఆ వస్త్రాన్ని తయారుచేయడంలో తమదైన ప్రత్యేకతను ఏళ్లుగా చాటుతూ వస్తున్నారు పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు. తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, తమలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ, పోటీతత్వంతో కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తున్నారు. ఆ కళానైపుణ్యం పుట్టపాక గ్రామానికి అవార్డులు కురిపిస్తోంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక అనే మారుమూల పల్లె.. చేనేతల పరంగా విశ్వవిఖ్యాతి గాంచింది. ఇక్కడి కళాకారులు తమ కళా నైపుణ్యంతో మరుగున పడిన ప్రాచీన కళ ‘తేలియా రుమాల్’ను ఏనాడో వెలుగులోకి తెచ్చారు. ఆ వెలుగులోని ప్రతిభను చూసి వస్త్ర ప్రపంచం పుట్టపాకను కీర్తించడం మొదలైంది. తేలియా రుమాల్ ఒక్కటే కాదు, ఇక్కడి కళాకారులు చేనేత వస్త్రతయారీనే ఒక ప్రయోగశాలగా మార్చారు! నూతన ఒరవడి సృష్టించారు. తేలియా రుమాల్‌ను, ఖతాల్ చీరలను నిలువు దారంపై డిజైన్ చేయడంలో వీరు విలక్షణమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. అసలు నిలువు దారం డిజైన్లు చేసి రంగులు అద్దడం ప్రపంచానికి పరిచయం చేసింది పుట్టపాక కళాకారులే. ఏ ప్రాంత ప్రజల అభిరుచికి తగినట్లుగా ఆ ప్రాంతం వారి కోసం వస్త్రాలు రూపొందించడంలో వీరు ఘటికులు. వీరి చేనేత కళా నైపుణ్యానికి ఇంతవరకు రెండు పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు వరించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టు వస్త్రం తయారీ మొదలైందీ ఇక్కడే. ఆ గుర్తింపు కూడా గ్రామంలో చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవడానికి ఒక కారణం. ఈ గ్రామ జనాభా 4,550 ఉంటే, అందులో 3 వేల జనాభా చేనేత కళాకారులదే! ఎండలో చల్లగా, చలిలో వెచ్చగా తేలియా రుమాలు అనేది ఒక రకమైన వస్త్రం. ఇది అతి ప్రాచీన కళావిశేషం. గజం నర్సింహ అనే పుట్టపాక చేనేత కళాకారుడు ఆ ప్రాచీన తేలియా రుమాలుకు పునరుజ్జీవం పోశారు. 21 రోజుల పాటు సాగే ‘యజ్ఞం’ అది. మొదట ఆముదపు పొట్టును కాల్చి బూడిద చేస్తారు. నువ్వుల నూనెతో బూడిదను కలిపి, నూలును అందులో ఉంచుతారు. రోజంతా నీటితో కలిపిన గొర్రె పేడలో నానబెడతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నూలును ఉతికి శుభ్రపరుస్తారు. ఆరబెడతారు. మళ్లీ అందులోనే పెడతారు. ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తారు. ఆ తర్వాత వస్త్రం అవసరాన్ని బట్టి వార్పుపై అవసరమైనంత పొడవులో దారాలను తీస్తారు. మగ్గంపై కావాల్సిన తీరులో డిజైన్లతో కూడిన వస్త్రాన్ని రూపొందిస్తారు. ఇలా తేలియా రుమాలు వస్త్రంతో తలపాగాలు, చీరలు, దుపట్టాలతో పాటు ఇతర దుస్తులను తయారు చేస్తారు. ఇవి ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉండడమే కాక çసువాసనలు వెదజల్లుతాయి. ఇలా తయారు చేసే చీరలైతే డిజైన్లను బట్టి ముప్పై వేల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒక చీర నేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం పుట్టపాకలో నేసే ప్రాచీన తేలియా రుమాల్ వస్త్రాలకు ప్రకృతి రంగులే ఆయువు, ఆధారం. తెల్ల దారానికి ప్రకృతి రంగులైన గుమ్మడి రంగు, తేలియా రంగు, ఇండిగో, నల్ల రంగులను ఉపయోగిస్తారు. మొదటగా తెల్ల దారాన్ని జిగురు తొలగించేందుకు గానూ ఒక రోజు నీళ్లలో నానబెట్టి నీడలో ఆరబెడతారు. వారం రోజులు అయ్యాక జిగురు తొలగిస్తారు. ఆ తర్వాత దారాన్ని శుద్ధి చేయడం కోసం కిలో దారానికి 150 కరక్కాయ పిందె పొడి, అల్లం 10 గ్రాములు కలిపి శుద్ధి చేస్తారు. ప్రకృతి రంగులు ఎలా వస్తాయి? గుమ్మడి రంగు: గుమ్మడి రంగు వేయడానికి అడవి పసుపు, తేయాకు, కత్తాకు కలిపి గుమ్మడి రంగును రూపొందిస్తారు. తేలియా రంగు : సున్నపు రాయి (కుంకుమ రాళ్లు), అడవి పసుపు, నువ్వుల నూనె, నిమ్మకాయతో కలిపి తయారు చేస్తారు. ఇండిగో రంగు : ఇండిగో కేక్, కాస్టిక్, కుంకుడు రసం, నిమ్మరసం కలిపి తయారు చేస్తారు. నల్ల రంగు : పాత ఇనుప సామాను 25 రోజులు నీటిలో నానబెట్టి తుప్పు పట్టిస్తారు. తాటిబెల్లం, ఇనుప తుప్పు, నల్ల కరక్కాయ పొడి, కుంకుడు రసం, నిమ్మ రసం కలిపి నల్లటి రంగుగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన రంగులతోనే ప్రాచీన తేలియా రుమాల్ అనే వస్త్రానికి రంగులు అద్దుతారు. ఈ రంగులతోనే పుట్టపాక ప్రపంచ ఖ్యాతి సాధించింది. తొలి ççసహకార సంఘం ఓసారి ఏడుగురు చేనేత కళాకారులు కలిసి ఓ డిజైన్ రూపొందించి, చేనేత వస్త్రాలు తయారు చేశారు. ఆ సమయంలో ‘ఆప్కో’ సంస్థ చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాలను తయారు చేయిస్తూ కొనుగోలు చేస్తోంది. ఇక్కడ కార్మికులు తయారు చేసిన డిజైన్లు కొయ్యలగూడెం సహకార సంఘం ద్వారా ఆప్కోకు పంపాలనుకున్నారు. కానీ, కొయ్యలగూడెం చేనేత సహకారసంఘం సభ్యులు వస్త్రాన్ని ఆప్కోకు పంపలేదు. దీంతో మనకు కూడా ఒక సంఘం కావాలని చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏర్పాటైన సంఘంలో నాలుగు వందల కుటుంబాలు ఉండేవి. వాళ్లంతా వెయ్యి మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలు తయారు చేసేవారు. ప్రాచీన తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు పట్టుచీరలు, స్పన్, సిల్క్ చీరలు తయారు చేసేవారు. ఆ రోజుల్లో స్పన్ సిల్క్ చీర ధర రూ. 200 ఉండేది. ప్రస్తుతం దాని ధర రూ.10 వేలకు పైగా ఉంటుంది. అప్పట్లో గజం గోవర్థన్, గజం అంజయ్య, రాపోలు అంజయ్య, గుండు జగన్నాథం, గజం రాములు, గజం నర్సింహులు అనే వారు మాస్టర్ వీవర్స్‌గా మారి చేనేత కళాకారులకు ముడి సరుకులు ఇస్తూ, తయారు చేయించేవారు. ఆ క్రమంలోనే తేలియా రుమాల్‌ను ఆధునిక డిజైన్లతో తయారుచేయించడం మొదలు పెట్టారు. పట్టు చీరలు, మస్రే చీరలు, తలపాగా, దుపట్టా (చున్నీ)లను తయారు చేసేవారు. డబల్ ఇక్కత్ తేలియా రుమాల్ వస్త్రంతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆధునిక సాంకేతికతకు కూడా అందని డిజైనింగ్ పుట్టపాక చేనేత కళాకారుల సృజనాత్మకతలో కనిపిస్తుంది. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుడి భవనంతో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు సహా ఎందరో ప్రముఖులకు చేరాయి. వారి ప్రశంసలకు నోచుకున్నాయి. దాంతో పుట్టపాక చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యానికి పదును పెడుతూ, పోటీతత్వంతో అనేక కొత్త కొత్త డిజైన్లను రూపొందించడం మొదలు పెట్టారు. అవార్డుల వెల్లువ చేనేత కార్మికుడు గజం నర్సింహ కుమారుడు అంజయ్య తన తండ్రి చేసిన తేలియా రుమాళ్ల వస్త్రాలను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త డిజైన్లను రూపొందించాడు. ఆయనతో పాటు గజం గోవర్థన్, అంజయ్య, గోలి సాంబయ్య తదితరులు తమ హస్తకళా నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తూ వస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం గజం గోవర్ధన్ (2011), గజం అంజయ్య (2013) లకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 2009 సంతు కబీర్ అవార్డును చేనేత దిగ్గజం గజం రాములుకు ప్రకటించగా, అప్పటికే ఆయన మృతి చెందడంతో ఆయన భార్య రాంబాయమ్మ అవార్డును అందుకున్నారు. 2010 సంవత్సరానికి సంతు కబీర్ అవార్డును గజం అంజయ్య అందుకున్నారు. ముందు ఏడాది జాతీయ చేనేత అవార్డును గజం భావనాఋషి అందుకున్నారు. 2010 జాతీయ చేనేత అవార్డును ఐదుగురు కళాకారులు గూడ శ్రీను, గజం భద్రయ్య, పున్న కష్ణయ్య, ఏ.నాగరాజు, గజం యాదగిరిలు అందుకున్నారు. రాంబాయమ్మ కూడా వ్యక్తిగతంగా చేనేత కళానైపుణ్యంతో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. చేనేత జాతీయ అవార్డు కొలను బుచ్చిరాములు, పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి సంయుక్తంగా అందుకున్నారు. 2016 చేనేత జాతీయ అవార్డు పుట్టపాక గ్రామానికి చెందిన గజం శ్రీనివాస్‌కు రాగా, ఇదే గ్రామానికి చెందిన చెరుపల్లి భావనాఋషికి నేషనల్ మెరిట్ అవార్డు లభించింది. వీరే కాక ఈ గ్రామానికి చెందిన చాలామంది చేనేత కార్మికులు రాష్ట్రపతి సంతు కబీర్ అవార్డు, కమలా అవార్డు, అష్టకళా నైపుణ్య అవార్డు, జాతీయ అవార్డులతో పాటు పలు ప్రశంసలు అందుకున్నారు. వస్తు మార్పిడి నుంచి విదేశీ ఎగుమతుల వరకు! వందేళ్ల క్రితం పుట్టపాకలో కొద్దిమంది చేనేత కళాకారులు ఉండేవారు. చేనేత వస్త్రాలను తయారు చేసి, ప్రజలకు అందజేసి, వారివద్ద నుంచి ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు, వస్తువులను తీసుకునేవారు. అప్పట్లో సాదా బట్టలు, టవల్స్, దోతులు, అంచు చీరలు అమ్మేవారు. ఏమైనా శుభకార్యాలప్పుడు వస్త్రాలు కావాలని చెబితే, నేసి ఇచ్చేవారు. రానురాను తయారు చేసిన వస్త్రా లను మూట కట్టుకొని, భుజాన వేసుకొని, పరిసర ప్రాంత గ్రామాలతో పాటు ఉమ్మడి జిల్లా చుట్టుపక్కల కూడా తిరుగుతూ అమ్మేవారు. అప్పుడు నేసిన వస్త్రాలన్నీ వస్తు మార్పిడి కిందే చేసేవారు. 1950 కి ముందు నాటికి ఇక్కడి చేనేత కళాకారుల సంఖ్య 200 లకు చేరుకుంది. వారు షావుకారుల వద్ద మగ్గాలు నేసేవారు. షావుకార్లు కళాకారులకు నూలు, రంగులు, ముడి సరుకులు ఇచ్చి తయారు చేయించేవారు. ఇలా కార్మికులు తయారు చేసిన వస్త్రాలను దేశంలోనే కాకుండా అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. అప్పట్లో గజం నర్సింహ ప్రాచీన తేలియా రుమాల్ వస్త్ర తయారీలో సిద్ధహస్తుడు. గ్రామంలో ఐదారుగురు షావుకారులు ఉండేవారు. ఇక్కడ నేసిన చేనేత వస్త్రాలకు పేరు ప్రఖ్యాతులు రావడంతో.. శ్రీకాకుళం, గుంటూరు, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలకు చెందిన చేనేత కుటుంబాలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాయి. గజం నర్సింహ ముంబయి, సోలాపూర్ ప్రాంతాలకు మొట్టమొదటగా ఎగుమతి చేశారు. తర్వాత్తర్వాత కలకత్తా, చెన్నై, గుజరాత్, బెంగళూరులతో పాటు సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, అరబ్ దేశాలకు ఎగుమతులు జరిగాయి. నైపుణ్యానికే ఈ గుర్తింపు పుట్టపాకలోని చేనేత కళాకారులను నైపుణ్యవంతులుగా తయారు చేయడమే నా లక్ష్యం. అందుకోసమే చేనేతను అభివృద్ధి చేసి, కళాకారులను ప్రోత్సహిస్తున్నా. చేనేతకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. చేనేత కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటా. – గజం గోవర్ధన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
గోండుకు బ్రాండింగ్
చేనేత వస్త్రాలు ఆయా ప్రాంతాలను ప్రతిబింబిస్తాయి. అక్కడి సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అందుకే ప్రాచీన కాలం నుంచీ వస్తున్న డిజైన్లతోనే నేటికీ వస్త్రాలు నేస్తుంటారు చేనేత కళాకారులు. ఈ క్రమంలో వాటిని మరింతగా ఆధునీకరించి, కొత్త కొత్త డిజైన్లతో నేటి తరానికి చేరవేయడం కోసం దేశమంతా పర్యటిస్తూ అక్కడి వారితో మమేకం అవుతున్నారు హైదరాబాద్‌కు చెందిన యువ సృజనశీలి అఖిల నూకల. చేనేతల్లో ప్రస్తుతం అందరూ కలంకారి వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. కాబట్టి కలంకారిలోనే మొదట ప్రయోగాలు చేయాలనుకున్నారు అఖిల. అందుకోసం తెలంగాణ, మహారాష్ట్రలోని గోండు తెగకు చెందిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గోండు విద్యార్థులతో కలిసి పనిచేశారు. అలాగే అస్సాంలోని బక్సార్ జిల్లా బరామా ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి గిరిజన జాతుల వారితో సన్నిహితంగా మెలిగి, వారికి సంబంధించిన సాంస్కృతిక అంశాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా వస్త్రాల మీద డిజైన్లు రూపొందించడాన్ని లక్ష్యంగా చేసుకున్న అఖిల.. హైదరాబాద్ భవాన్స్ వివేకానంద కాలేజీలో బి.ఎస్.సి. చదివారు. అస్సాంలో డిజైనింగ్ ఎస్.బి.ఐ ‘యూత్ ఫర్ ఇండియా’లో సభ్యురాలిగా ఉన్న 21 ఏళ్ల అఖిల, 2017 నుంచి అస్సామీ చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే పనిలో ఉన్నారు. ఇంతకుముందే వేరొకరు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టి మధ్యలోనే విరమించుకున్నారంటే.. అదంత సులువైన పనేమీ కాదని అర్థమౌతోంది. ప్రస్తుతం అఖిల తన ఈ ప్రణాళికకు మరో రెండు మాసాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. చేనేత మగ్గాల మీద నేస్తున్న చీరలకు ఆర్డర్లు సంపాదించి, వాటిని తన సృజనాత్మకతతో అస్సాంలో డిజైన్ చేయించి, వాటిని దేశవ్యాప్తంగా అందరికీ అందేలా చేయడమే అఖిల ముఖ్యోద్దేశం. చెప్పి చేయించుకోవాలి ‘‘వస్త్రాలు నేయడం వారి వృత్తి మాత్రమే కాదు, వారి జీవన విధానం కూడా. వారు నేసిన వస్త్రాలే వారి జీవనాధారం. ఆ వస్త్రాల నుంచే వారికి ఆదాయం రావాలి’’ అంటారు అఖిల తరచు తను పర్యటించే అస్సామీ ప్రాంతాల వారిని ఉద్దేశించి. అక్కడి వారికి వ్యవసాయ భూమి, పశుసంపద రెండూ ఉంటాయి. వారిలో చేనేత కార్మికులు వస్త్రాలు నేయడం కంటె, కుటుంబ బాధ్యతల కోసం ఎక్కువ సమయం గడపవలసి వస్తోంది, అందువల్ల అనుకున్న సమయానికి ఆర్డరు ఇచ్చిన వారికి వస్త్రాలు అందించలేకపోతున్నారు. దీనిని గ్రహించిన అఖిల, అక్కడి చేనేత కార్మికులను పని దిశగా మళ్లిస్తూ, సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారు. తరచు ప్రయాణాలు అఖిల తనొక్కరే ఈ పని చేస్తున్నా.. హ్యాండ్స్ ఆఫ్ ఇండియా, వృందావన్, బీడ్ సోషల్ ఎంటర్ప్రైజ్ (బెంగళూరు) వారితో భాగస్వామి అయ్యారు. ఇందుకోసం ఆమె గువహాటికి అనేకసార్లు ప్రయాణించవలసి వస్తోంది. ఈ పని పెద్ద కష్టం కాకపోవచ్చు కాని, భాష సమస్యను తనింకా దాటవలసి ఉందని నవ్వుతూ అంటారు అఖిల. ‘‘కొందరైనా హిందీ అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇందుకు సంతోషంగా ఉంది’’ అని చెబుతున్న అఖిల, ఇతర స్థానిక భాషలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. – రోహిణి -
నేతన్నకు దన్ను
తెలంగాణ టెక్స్టైల్, అపెరల్ విధానానికి రూపకల్పన - ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్న ప్రభుత్వం - ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలను ఆకర్షించడమే ధ్యేయం - రాష్ట్రంలో కొత్తగా ఐదు టెక్స్టైల్ పార్కులు - 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం - చేనేత, పవర్లూమ్ కార్మికుల వేతనాలు పెరిగేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: చేనేత, మరమగ్గాల కార్మి కులకు అండగా నిలవడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్టైల్, అపెరల్ పాలసీ–2017 రూపొందిస్తోంది. టెక్స్టైల్స్, అపెరల్ రంగాల్లోని ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. ప్రధానంగా స్పి న్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్ రంగా ల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ కి రూపకల్పన చేస్తోంది. రానున్న ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను ఇందులో పొందు పరిచారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయటం, కనీసం 5 అంతర్జాతీయ, 50 దేశీయ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందులో కనీసం 60 శాతం మంది మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చేనేత కార్మికుని నెలసరి వేతనం 50 శాతం, పవర్లూమ్లోని కార్మికుని ఆదాయం 30 శాతం పెరిగేలా చూడాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్త య్యే వస్త్రాల్లో కనీసం 20 శాతం ఎగుమతి చేయాలన్నది మరో లక్ష్యం. ప్రస్తుతమున్న పరిశ్రమకు అత్యాధునిక సాంకేతికతను జోడించడంతోపాటు శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కొత్త విధానంలో ప్రాధాన్యం కల్పిస్తోంది. చేనేత కళాకారుల ఉత్పత్తులకు ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణను (బెస్ట్ బ్రాండ్) కల్పించా లన్నది లక్ష్యంగా ఎంచుకుంది. చేనేత వస్త్రాలకు అందుకు అనువైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. నేతన్న కష్టాలను తీర్చేలా.. కొత్త పాలసీ కింద చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పది శాతం రాయితీకి అదనంగా నూలుపై 40 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కెమికల్స్, కలర్ డైలపై కూడా ఇదే తరహా రాయితీ అందుతుంది. చేనేత వ్యక్తిగత రుణాలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు ఉండేలా చేనేత వస్త్రాల డిజైనింగ్, ఫ్యాషన్ ఇంజ నీరింగ్ లో డిగ్రీ, డిప్లమో కోర్సులతో చేనేత శిక్షణా సంస్థ ఏర్పాటు చేయనుంది. మార్కెటింగ్‌పై ఫోకస్.. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. మరమగ్గాల ఆధునీకరణకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభు త్వం ఇచ్చే ఆర్డర్లకు నూలుపై 20 శాతం రాయితీ ఇస్తారు. మరమగ్గాలకు విద్యుత్ రాయితీ కల్పి స్తారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించే వస్త్రాలను మరమగ్గాల నుంచే కొనుగోలు చేస్తారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్లుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సేవలు వినియోగిం చుకుంటారు. చేనేత దుస్తులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్థల సహకారంతో చేనేతలో కొత్త నమూనాలు తీసుకురావడంపై దృష్టి సారిస్తారు. చేనేత వస్త్రాల విక్రయాలకు రిటైల్ దుకాణాలతో ఒప్పందం, ప్రభుత్వ షోరూం లను బొటిక్లుగా తీర్చిదిద్దుతారు. పరిశ్రమలకు బాసట.. నూతన పాలసీ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమల ఆధునీకరణ, విస్తరణకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. పెట్టుబడులు, నిర్వహణతోపాటు మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సాయం, రాయితీలు ఇస్తుంది. అవసరమైన భూమిని టీఎస్ఐఐసీ ద్వారా సమకూర్చుస్తుంది. వ్యర్థాల నిర్వహణ, పరిశోధన అభివృద్ధికి సౌకర్యాలు కల్పిస్తారు. టెక్స్టైల్ పార్కుల్లోనే కార్మికులు, సిబ్బందికి అవసరమైన నివాసాలకు స్థలాలు కేటాయిస్తారు. శిక్షణ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఒక్కో ఉద్యోగికి రూ.3,000 చొప్పున శిక్షణ రాయితీగా ఇస్తారు. శిక్షణ పొందిన ఉద్యోగి కనీసం ఏడాది పాటు సంబంధిత సంస్థలోనే పని చేయాల్సి ఉంటుంది. వలస వెళ్లిన చేనేత కార్మికులు రాష్ట్రానికి తిరిగి వస్తే వాళ్లకు పని కల్పించేందుకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో వరంగల్‌లో తలపెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మొదటి దశను 1,250 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. సిరిసిల్లలో వంద ఎకరాల విస్తీర్ణంలో టెక్స్టైల్, అపెరల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. కొత్తగా గోదాములు నిర్మిస్తారు. ప్రైవేట్ టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించనుంది.