ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్లబోతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర అధికారులు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్‌ఈపీసీ) అధికారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందిస్తున్నారని హెచ్‌ఈసీపీ అధికారులకు వివరించారు.
విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని చెప్పారు. రసాయనాలు వినియోగించని పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్‌ఈపీసీ అధికారులకు వివరించారు. వీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు రావని.. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలకు ఏపీ చేనేత వస్త్రాలను ఎగుమతి చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు.
ఆర్గానిక్ వస్త్రాలకు విశేష ఆదరణ..
హెచ్‌ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఏపీలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరగనుందని చెప్పారు. అలాగే ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్సి పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11 వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆప్కో డీఎంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజర్ ఎన్.కోటేశ్వరరావు, బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment