Textiles union
-
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
అంతర్జాతీయ మార్కెట్కు ఆర్గానిక్ చేనేత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్కు వెళ్లబోతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర అధికారులు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీసీ) అధికారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందిస్తున్నారని హెచ్ఈసీపీ అధికారులకు వివరించారు. విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని చెప్పారు. రసాయనాలు వినియోగించని పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్ఈపీసీ అధికారులకు వివరించారు. వీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు రావని.. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలకు ఏపీ చేనేత వస్త్రాలను ఎగుమతి చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్గానిక్ వస్త్రాలకు విశేష ఆదరణ.. హెచ్ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఏపీలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరగనుందని చెప్పారు. అలాగే ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్సి పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11 వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆప్కో డీఎంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజర్ ఎన్.కోటేశ్వరరావు, బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రుణమాఫీ లెక్క కుదిరింది..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇద్దరు మంత్రులు రాజీపడ్డారు. పర్సంటేజీల లెక్క కుదిరింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దే ఈ పంచాయితీ చేశారు. బోగస్ చే‘నేత’ సంఘాలకు రూ. 40.83 కోట్ల రుణమాఫీ నిధులు విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 2002 నుంచి 2004 మధ్య ఉరవకొండ, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, గుంతకల్లు, హిందూపురం, సోమందేపల్లి, నార్పల ప్రాంతాల్లోని కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై బోగస్ చేనేత సంఘాలను ఏర్పాటు చేశారు. కనీసం మగ్గంపై అవగాహన లేని వారిని కూడా సభ్యులుగా చేర్పించి.. ఆర్టీజన్ కార్డులు కూడా ఇప్పించేశారు. జౌళిశాఖ అధికారులతో కుమ్మక్కై 2003-2008 మధ్య దీన్దయాళ్ హర్గత్ యోజన(డీడీహెచ్వై) కింద కేంద్రం ఇచ్చే రాయితీలను మింగేయడానికి పథక రచన చేశారు. ముడి సరుకులు కొనుగోలు చేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించారు. మార్కెట్ ధరకన్నా అధిక ధరకు కొనుగోలు చేసినట్లు నకిలీ రసీదులు సృష్టించి.. రూ. 32.54 కోట్లను డీడీహెచ్వై పథకం కింద రాయితీ రూపంలో మింగేశారు. 127 బోగస్ చేనేత సంఘాలు రూ. 32.54 కోట్ల డీడీహెచ్వై నిధులను కాజేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ విచారణలో బహిర్గతమైంది. ఆ విభాగం ఇచ్చిన నివేదికపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య బోగస్ సంఘాలకు రుణమాఫీ నిధులు విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రికి సన్నిహితుడైన ఆప్కో సభ్యుడు ఒకరు రుణమాఫీ నిధులను విడుదల చేయిస్తానని బోగస్ చే‘నేత’లకు ప్రతిపాదించారు. అందుకు కనీసం రూ. 5 కోట్లను మంత్రికి ముడుపుల రూపంలో ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పి.. ఆ మేరకు నిధులు వసూలు చేశారు. ఆ నిధులను మంత్రికి అప్పగించేశారు. ప్రభుత్వ పెద్ద వద్ద తన పలుకుబడిని ఉపయోగించి రుణమాఫీ నిధులు విడుదల చేయించేందుకు సదరు మంత్రి ప్రయత్నించారు. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయాల్సిన దశలో తెలంగాణకు చెందిన కీలక మంత్రికి పర్సంటేజీల వ్యవహారం తెలిసింది. వసూలు చేసిన పర్సంటేజీల్లో తన వాటా ఇస్తేనే రుణమాఫీ ఫైలుకు ఆమోదం లభిస్తుందని సదరు మంత్రి తెగేసి చెప్పారు. దాంతో పంచాయితీ ప్రభుత్వ పెద్దకు వెళ్లింది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ పెద్ద ఇద్దరు మంత్రుల మధ్య రాజీ చేసినట్లు సమాచారం. బోగస్ చే‘నేత’ల నుంచి వసూలు చేసిన కూ. 5 కోట్ల పర్సంటేజీల్లో చెరి సగం పంచుకనేలా ఇద్దరు మంత్రుల మధ్య ప్రభుత్వ పెద్ద రాజీ చేసినట్లు జౌళి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు సరి కొత్త ప్రతిపాదనలు పంపాలని జౌళి శాఖ అధికారులను సదరు మంత్రి ఆదేశించడం గమనార్హం. మంత్రి ఆదేశాల మేరకు సరికొత్త ప్రతిపాదనలు తయారుచేసిన జౌళి శాఖ అధికారులు ఆ ఫైలును సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ ఫైలుపై రెండు రోజుల్లోగా తెలంగాణ మంత్రి సంతకం చేయడం ఖాయమని.. ఆ వెంటనే రుణమాఫీ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తధ్యమనే అభిప్రాయం ఆ శాఖ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.