సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇద్దరు మంత్రులు రాజీపడ్డారు. పర్సంటేజీల లెక్క కుదిరింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దే ఈ పంచాయితీ చేశారు. బోగస్ చే‘నేత’ సంఘాలకు రూ. 40.83 కోట్ల రుణమాఫీ నిధులు విడుదలవడానికి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 2002 నుంచి 2004 మధ్య ఉరవకొండ, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, గుంతకల్లు, హిందూపురం, సోమందేపల్లి, నార్పల ప్రాంతాల్లోని కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై బోగస్ చేనేత సంఘాలను ఏర్పాటు చేశారు. కనీసం మగ్గంపై అవగాహన లేని వారిని కూడా సభ్యులుగా చేర్పించి.. ఆర్టీజన్ కార్డులు కూడా ఇప్పించేశారు. జౌళిశాఖ అధికారులతో కుమ్మక్కై 2003-2008 మధ్య దీన్‌దయాళ్ హర్గత్ యోజన(డీడీహెచ్‌వై) కింద కేంద్రం ఇచ్చే రాయితీలను మింగేయడానికి పథక రచన చేశారు. ముడి సరుకులు కొనుగోలు చేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించారు. మార్కెట్ ధరకన్నా అధిక ధరకు కొనుగోలు చేసినట్లు నకిలీ రసీదులు సృష్టించి.. రూ. 32.54 కోట్లను డీడీహెచ్‌వై పథకం కింద రాయితీ రూపంలో మింగేశారు. 127 బోగస్ చేనేత సంఘాలు రూ. 32.54 కోట్ల డీడీహెచ్‌వై నిధులను కాజేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ విచారణలో బహిర్గతమైంది. ఆ విభాగం ఇచ్చిన నివేదికపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య బోగస్ సంఘాలకు రుణమాఫీ నిధులు విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రికి సన్నిహితుడైన ఆప్కో సభ్యుడు ఒకరు రుణమాఫీ నిధులను విడుదల చేయిస్తానని బోగస్ చే‘నేత’లకు ప్రతిపాదించారు. అందుకు కనీసం రూ. 5 కోట్లను మంత్రికి ముడుపుల రూపంలో ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పి.. ఆ మేరకు నిధులు వసూలు చేశారు. ఆ నిధులను మంత్రికి అప్పగించేశారు. ప్రభుత్వ పెద్ద వద్ద తన పలుకుబడిని ఉపయోగించి రుణమాఫీ నిధులు విడుదల చేయించేందుకు సదరు మంత్రి ప్రయత్నించారు. రుణమాఫీ ఫైలుపై సంతకం చేయాల్సిన దశలో తెలంగాణకు చెందిన కీలక మంత్రికి పర్సంటేజీల వ్యవహారం తెలిసింది. వసూలు చేసిన పర్సంటేజీల్లో తన వాటా ఇస్తేనే రుణమాఫీ ఫైలుకు ఆమోదం లభిస్తుందని సదరు మంత్రి తెగేసి చెప్పారు. దాంతో పంచాయితీ ప్రభుత్వ పెద్దకు వెళ్లింది.
రెండు రోజుల క్రితం ప్రభుత్వ పెద్ద ఇద్దరు మంత్రుల మధ్య రాజీ చేసినట్లు సమాచారం. బోగస్ చే‘నేత’ల నుంచి వసూలు చేసిన కూ. 5 కోట్ల పర్సంటేజీల్లో చెరి సగం పంచుకనేలా ఇద్దరు మంత్రుల మధ్య ప్రభుత్వ పెద్ద రాజీ చేసినట్లు జౌళి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు సరి కొత్త ప్రతిపాదనలు పంపాలని జౌళి శాఖ అధికారులను సదరు మంత్రి ఆదేశించడం గమనార్హం. మంత్రి ఆదేశాల మేరకు సరికొత్త ప్రతిపాదనలు తయారుచేసిన జౌళి శాఖ అధికారులు ఆ ఫైలును సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ ఫైలుపై రెండు రోజుల్లోగా తెలంగాణ మంత్రి సంతకం చేయడం ఖాయమని.. ఆ వెంటనే రుణమాఫీ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తధ్యమనే అభిప్రాయం ఆ శాఖ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.