
ఐటీఎంఈ సొసైటీ ఛైర్మన్ కేతన్ సంఘ్వీ, ఆసియా అరబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హానరీ ట్రేడ్ కమిషనర్ మురుజా షబ్బీర్ అర్సీవాలా, ఐటీఎంఈ ట్రెజరర్స్ ఆఫ్ ఇండియా సెంతిల్ కుమార్
భారతదేశంలోని టెక్స్‌టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరిస్తూ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులపై ఇటీవల చర్చ జరిగింది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్‌లో 2025 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన గ్లోబల్ టెక్స్‌టైల్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ (జీటీటీఈఎస్ 2025) వస్త్ర పరిశ్రమకు కీలకంగా మారింది. ఇండియా ఇంటర్నేషనల్ టెక్స్‌టైల్ మెషినరీ ఎగ్జిబిషన్స్ సొసైటీ (ఐటీఎంఈ సొసైటీ) నిర్వహించిన ఈ మూడు రోజుల కార్యక్రమంలో టెక్స్‌టైల్ టెక్నాలజీలో పురోగతిని ప్రదర్శించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ వర్గాలు, ఆవిష్కర్తలు, వాటాదారులు ఒకచోట చేరారు.
జీటీటీఈఎస్ 2025 ముఖ్యాంశాలు
భారత టెక్స్‌టైల్ కమిషనర్ రూప్‌రాశి మహాపాత్ర, దక్షిణాఫ్రికా, బెలారస్, బుర్కినా ఫాసో వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండో రోజున సెషన్‌ను ప్రారంభించిన అనంతరం ఐటీఎంఈ సొసైటీ ఛైర్మన్, స్టీరింగ్ కమిటీ మెంబర్ కేతన్ సంఘ్వీ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-2030ను ప్రారంభించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయడంలో ఈ వేదిక కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌తోపాటు వ్యూహాత్మక అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని చెప్పారు. టెక్స్‌టైల్ రంగం పురోగతికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.
ఛతీస్‌గఢ్ రాష్ట్ర పారిశామిక కార్పొరేషన్ అభివృద్ధి సభ్యులు, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ శుక్లా మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 24 ఏళ్లల్లో ఎగుమతులు 35.9 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2.97 లక్షల కోట్లు)కు చేరుకున్నాయని చెప్పారు. ఇది దేశ జీడీపీలో 2.3 శాతానికి సమానమని తెలిపారు. జాతీయ ఎగుమతులకు ఈ పరిశ్రమ 10.5 శాతం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జాంగీర్‌చంపాలో నెలకొల్పే వస్త్ర పరిశ్రమతో భవిష్యత్తులో ఛతీస్‌గఢ్ వస్త్ర కేంద్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 25,000 కంటే ఎక్కువ ఎంఎస్‌ఎంఈలు, 1,400 కంటే ఎక్కువ నమోదిత సార్టప్‌లతో రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
ఆసియా అరబ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హానరీ ట్రేడ్ కమిషనర్ మురుజా షబ్బీర్ అర్సీవాలా మాటాడుతూ..‘మేము ఆసియా ప్రాంతం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చాలా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు దైపాక్షిక వాణిజ్యం, దిగుమతి-ఎగుమతులు పెంచడంలో, పెట్టుబడుల పరంగా రెండు వైపులా ఉన్న కంపెనీలకు సాయం అందించడంలో విజయం సాధించాం. వస్త్ర రంగంలో పనిచేయడంతోపాటు ప్రపంచ పర్యటనలో భాగంగా ఏ ప్రాంతాన్ని సందర్శించినా హాస్పిటాలిటీ రంగం రంగం మా అజెండాలో భాగంగా ఉంటుంది. ఆయా సంస్థలతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐడీస్ పర్సనల్ కన్సలెంట్ పురోహిత్, గురత్ భాటియా, ఐటీఎంఈ ట్రెజరర్స్ ఆఫ్ ఇండియా సెంతిల్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్
జీటీటీఈఎస్ 2025లో 39 దేశాలకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నెట్ వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్, వ్యాపార సహకారాలకు కేంద్రంగా పనిచేసింది. స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజిటల్ ప్రింటింగ్, టెక్స్‌టైల్ రీసైక్లింగ్‌లో పురోగతితో సహా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ టెక్స్ టైల్ రీసైక్లింగ్, సుస్థిర పద్ధతులను ఈ కార్యక్రమంలో హైలైట్ చేశారు. ఎక్స్‌క్లూజివ్ బీ2బీ(బిజినెస్ టు బిజినెస్) సమావేశాలు, ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ వాటాదారుల జాయింట్ వెంచర్లు, వాణిజ్య సహకారాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ప్రపంచ టెక్స్‌టైల్ మెషినరీ మార్కెట్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇందులో చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment