
విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్–2025లో యుద్ధ పరికరాల ప్రదర్శన
ఆకట్టుకున్న ఆకాశ్, అండర్‌వాటర్ వెహికల్, యాంటీ –జీ సూట్
ప్రముఖ సంస్థలతోపాటు విద్యార్థుల ఆవిష్కరణలూ ప్రదర్శన
గచ్చిబౌలి : క్షిపణుల నుంచి డ్రోన్ల వరకు.. అత్యాధునిక పారాచ్యూట్‌ల నుంచి యుద్ధరంగంలో ఊహించని ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడే పరికరాల వరకు.. ‘విజ్ఞాన్ వైభవ్ ఎగ్జిబిషన్–2025’లో రక్షణ రంగానికి చెందిన అనేక అరుదైన ఆయుధాలు, పరికరాలు కొలువుదీరాయి. పేరెన్నికగన్న సంస్థలతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన వస్తువులు కూడా ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. వాటిల్లో కొన్ని ఇవీ..
యాంటీ – జీ సూట్, ఓ బాక్స్
యుద్ధ విమానాలు నడిపే ఫైటర్స్ కోసం యాంటీ –జీ సూట్‌ను తయారుచేశారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. ఈ సూట్ వేసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. దీని ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఫైటర్ జెట్‌లో కాక్ పిట్‌కు ఆక్సిజన్ బాక్స్ (ఓ బాక్స్)ను కనెక్ట్ చేసి ఉంచుతారు. ఎత్తుకు వెళ్లిన తరువాత ఫైటర్‌కు దీని ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరు డీఆర్‌డీఎల్ తయారు చేసింది. దీని ఖరీదు రూ.3 కోట్లు. తేజస్ ఫైటర్ జెట్‌లో దీన్ని వాడతారు.
అటానమస్ అండర్ వాటర్ వెహికల్..: స్వయంచాలిత జలాంతర్గత వాహనం (అటానమస్ అండర్ వాటర్ వెహికల్)ను కూడా ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. సముద్ర గర్భంలోని శత్రు సబ్ మెరైన్లతోపాటు బాంబు (మైన్స్)లను ఇది తనంత తానుగా గుర్తిస్తుంది. దీనిని మనుషులు నడపాల్సిన అవసరం లేదు. వైజాగ్‌కు చెందిన ఎన్‌ఎస్‌టీఎల్ దీనిని తయారు చేసింది.
ఆకాశ్ వెపన్ సిస్టమ్
శత్రుదేశాల డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, క్షిపణులను గాల్లోనే తునాతునకలు చేయగల సర్ఫేస్ టు ఎయిర్ ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డీఆర్‌డీఎల్ రూపొందించిన ఈ క్షిపణి 25 కిలోమీటర్ల ఎత్తులో వెళ్లే యుద్ధ విమానాలను పేల్చి వేయగలదు.
ఫిక్స్‌డ్ వింగ్ యూఏవీ: ఫిక్స్‌డ్ వింగ్ అన్‌మ్యాన్డ్ ఆటోమేటిక్ వెహికల్ ద్వారా శత్రు శిబిరాలపై బాంబులు వేయవచ్చు. స్వయంచాలితంగా వెళ్లే ఈ వాహనం.. బాంబు వేసిన వెంటనే కాలిపోతుంది. కేవలం రూ.లక్ష ఖర్చుతో తయారుచేసిన ఈ యూఏవీ బరువు 5 కిలోలు. బ్యాటరీల సçహాయంతో గంట సేపు ప్రయాణించగలదు. దీనిని ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న అనన్య, శివనాగలక్షి్మ, భాను ప్రకా‹Ù, తేజస్విని దీనిని రూపొందించారు.
మల్టీ కంబాట్ పారాచ్యూట్ సిస్టమ్..: మల్టీ కంబాట్ పారాచ్యూట్ సిస్టమ్ (ఎంసీపీఎస్)ను యుద్ధ విమానాలు నడిపే ఫైటర్లు వాడతారు. దీని ఖరీదు దాదాపు రూ.40 లక్షలు. 30 వేల అడుగుల ఎత్తు నుంచి దీని ద్వారా కిందికి దూకవచ్చు. దాదాపు 40 కిలో మీటర్ల దూరం ఎగురుతూ వెళ్లవచ్చు. దీనిని బెంగళూరు డీఆర్‌డీఏ తయారు చేసింది.
మల్టీపర్పస్ అగ్రికల్చర్ వెహికల్..
ఎగ్జిబిషన్‌లో ఆకట్టుకున్న మరో వాహనం సోలార్ బేస్డ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ వెహికల్. దీని సాయంతో పంటలకు నీళ్లు, రసాయనాలు పిచికారీ చేయవచ్చు. వాహనంపైనే సోలార్ ప్యానల్స్ ఉండటంతో ఇతర ఇంధనాలు దీనికి అవసరం ఉండదు. కేవలం రూ.6,500 ఖర్చుతో గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు తౌఫీక్, సంపత్, రచన, ఇషీ, చంటి, తరుణ్, కీర్తన దీనిని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment