
ఆర్‌వీఎం ఆర్డర్లు 1.05 కోట్ల మీటర్లు
ఇప్పటికి పూర్తయింది 20 లక్షల మీటర్లు..
డిసెంబరులో ఆర్డర్లు.. మార్చి నాటికీ అందని నూలు
గడువులోగా వస్త్రోత్పత్తి గగనమే
స్కూల్ యూనిఫామ్స్ బట్టకు కష్టకాలం
ఇంకా బీములెక్కని మహిళా శక్తి చీరలు
సిరిసిల్ల: సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులు, చేనేత, జౌళిశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం.. వ్రస్తోత్పత్తికి శాపంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే వ్రస్తోత్పత్తి ఆర్డర్లకు నూలు (దారం) సరఫరా చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. కానీ, సిరిసిల్లలో వ్రస్తోత్పత్తికి అవసరమైన నూలును సకాలంలో అందించడంలో విఫలమయ్యారు.
ఫలితంగా ఈనెల 15 నాటికి అందించాల్సిన ఆర్‌వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వ్రస్తాల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. సిరిసిల్లలోని పాతికవేల మరమగ్గాల (పవర్‌లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వ్రస్తాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. దానికి అవసరమైన నూలు అందించలేదు. దీంతో గడువులోగా వ్రస్తాల తయారీ కష్టంగా మారింది.
ప్రభుత్వ లక్ష్యానికి గండి
స్కూళ్లు తెరిచే నాటికి (జూన్ మొదటి వారంలో) అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోని పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు డిసెంబర్‌లో సిరిసిల్ల నేతన్నలకు కోటి ఐదు లక్షల మీటర్ల వ్రస్తాల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి అవసరమైన నూలును డిపో ద్వారా అందించేందుకు టెండర్లు పిలిచారు.
ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయి.. సిరిసిల్లలోని నేతన్నలకు వేములవాడలోని నూలు డిపో ద్వారా నూలు సరఫరా అయ్యే సరికి ఫిబ్రవరి అయింది. వచ్చిన నూలుకు ఆసాములు పది శాతం మేరకు డీడీలు చెల్లించి, నూలు తీసుకుని వచ్చి భీములుగా పోసి సాంచాలపైకి ఎక్కించారు. ప్రస్తుతం పది లక్షల మీటర్ల వస్త్రాలు సిద్ధంగా ఉండగా.. భీములపై మరో పది లక్షల మీటర్ల వస్త్రం రెడీ అవుతోంది.
మొత్తంగా 20 లక్షల మీటర్లు మరో వారంలోగా సిద్ధమైనా.. ఈ నెలాఖరులోగా 50 శాతం వ్రస్తోత్పత్తి లక్ష్యం అసాధ్యమే. ఈ లెక్కన వ్రస్తాల సేకరణ పూర్తయి, యూనిఫామ్స్ కుట్టి, బడి తెరిచే నాటికి రెండు జతల డ్రెస్సులు అందించాలనే లక్ష్యం సాధించడం కష్టంగానే ఉంది.

సమస్య ఏంటంటే..!
ప్రభుత్వం టెస్కో ద్వారా సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ (మ్యాక్స్)లకు వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం, ఇక్కడ మాస్టర్ వీవర్స్ (యజమానులు) నూలును కొనుగోలు చేసి ఆసాముల (పవర్‌లూమ్స్ యజమానులు)కు ఇవ్వడం, వారు సాంచాలు నడుపుతూ, కార్మికులతో పని చేయిస్తూ.. బట్ట నేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు సకాలంలో అందించలేదు.
ఇప్పుడు ప్రైవేటుగా కొనుగోలు చేసి స్కూల్ యూనిఫామ్స్ బట్టను నేయాలని యజమానులను జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఆలస్యంగా నూలు ఆర్డర్లు ఇవ్వడంతో వ్రస్తోత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇటీవల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టరేట్‌లో వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఈనెల 15లోగా 50 శాతం బట్ట ఇవ్వాలని కోరారు. కానీ ఆ మేరకు సిరిసిల్లలో వ్రస్తాల నిల్వలు లేవు.
మహిళాశక్తి చీరల ఊసేది?
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 8న ఇందిరా మహిళా శక్తి పేరిట స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75 కోట్లు ఉంటుంది. కానీ, దానికి సంబంధించిన నూలును ఇప్పటి వరకు సరఫరా చేయలేదు.
రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మొదటి విడతకే మోక్షం లేక వ్రస్తోత్పత్తిదారులు రెండో విడత ఆర్డర్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగుల), వెప్ట్ (అడ్డం కోముల పోగుల) నూలు అందుబాటులో ఉండటం లేదు.
వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను మగ్గంపై నేసే అవకాశం ఉంది. ఒకటి ఉండి ఒకటి లేక వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతుండగా, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి మరింత ఆలస్యం కానుంది.
ఆలస్యమైనా లక్ష్యం సాధిస్తాం
కొంత ఆలస్యమైనా వ్రస్తోత్పత్తిలో లక్ష్యం సాధిస్తాం. ఈ మేరకు సిరిసిల్లలోని వ్రస్తోత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా నూలు డిపో ఏర్పాటు చేసి నూలు సరఫరా చేస్తున్నాం. ప్రైవేటుగా కూడా నూలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పాం. డిపో ద్వారా అందరికీ నూలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటాం. – వులిశె అశోక్‌రావు, టెస్కో జీఎం, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment