
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది.
అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment