ఓ-1 రూట్లో యూఎస్‌కు! | O 1 visas are becoming increasingly popular in India | Sakshi
Sakshi News home page

ఓ-1 రూట్లో యూఎస్‌కు!

Jul 2 2025 3:44 AM | Updated on Jul 2 2025 3:44 AM

O 1 visas are becoming increasingly popular in India

భారత్‌లో ఓ–1 వీసాలకు పెరుగుతున్న ఆదరణ

అసాధారణ సామర్థ్యం గల వ్యక్తులకే ఈ వీసా

ప్రపంచంలో మూడో స్థానంలో మన దేశం

హెచ్‌–1బీ కంటే ఖరీదైనా సక్సెస్‌ రేటూ ఎక్కువే

అగ్ర రాజ్యంలో ఉద్యోగం చేయాలన్నది లక్షలాది మంది కల. యూఎస్‌ వర్క్‌ వీసా పొందడం ఆషామాషీ కాదు. ఈ వీసా కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండడం, వలసలపై ట్రంప్‌ ప్రభుత్వ కఠిన చర్యలు.. వెరసి అమెరికాలో ఉద్యోగ అవకాశాలను కోరుకునే నిపుణులకు ఓ–1 వీసా ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం), కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, సినిమా, టెలివిజన్‌ రంగంలో ‘అసాధారణ సామర్థ్యం‘ కలిగిన వ్యక్తులకు తాత్కాలిక నివాసం కోసం ఈ ప్రత్యేక నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసా జారీ చేస్తారు. తీవ్ర పోటీ ఉన్న హెచ్‌–1బీ వీసాకు ప్రత్యామ్నాయంగా ఓ–1 వీసా వినుతికెక్కుతోంది. అయితే లాటరీ లేకుండానే వీసా పొందే అవకాశం ఉండడం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు; చలనచిత్రం, టెలివిజన్‌ పరిశ్రమలో అసాధారణ విజయాల రికార్డు ద్వారా.. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించే వ్యక్తులకు యూఎస్‌లోకి ఓ–1 వీసా తాత్కాలిక ప్రవేశాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే దరఖాస్తుదారులు ప్రముఖ అవార్డులు, విద్య పరిశోధన ప్రచురణలు, వారున్న రంగానికి చేసిన సేవల వంటి ఎనిమిది కఠిన ప్రమాణాలలో కనీసం మూడింటిని కలిగి ఉండాలి.

కఠిన పరిశీలన కారణంగా కేవలం 37 శాతం మాత్రమే దరఖాస్తులు ఆమోదం పొందుతున్న హెచ్‌–1బీ వీసా మాదిరిగా కాకుండా.. అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు వ్యవస్థాగత అడ్డంకులను దాటడానికి ఓ–1 వీసా వీలు కల్పిస్తోంది. అర్హతల విషయంలో ఇది దరఖాస్తుదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే కనీస జీతం లేదా అధికారిక డిగ్రీ అవసరం లేదు. సాధించిన విజయాలకు రుజువుగా అంతర్జాతీయ అవార్డులు, మీడియా కవరేజీ పొందుపరిస్తే చాలు.

మూడవ స్థానంలో మనమే..: ఓ–1 వీసాలు పొందిన దేశాల జాబితాలో గ్రేట్‌ బ్రిటన్, బ్రెజిల్‌ తర్వాత మూడవ స్థానంలో భారత్‌ నిలిచింది. 2022–23లో భారతీయులు 1,418 ఓ–1 వీసాలు దక్కించుకున్నారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి, కొనసాగడానికి టెక్నాలజీ కంపెనీలు దృష్టిసారించాయి. అమెరికా ప్రస్తుతం భారీగా నిపుణుల వేటలో ఉంది. ప్రధానంగా ఏఐ నిపుణుల అవసరం పెరిగింది. దీంతో విదేశీ పరిశోధకులు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్‌ను పెంచుతోంది. వీరిలో అత్యధికులు యూఎస్‌లోకి సులభ మార్గాన్ని ఓ–1 వీసా అందిస్తుందని భావిస్తున్నారు.

చాలా ఖరీదు... 
ఓ–1 వీసా దరఖాస్తు సాధారణంగా హెచ్‌–1బీ వీసా దరఖాస్తు కంటే చాలా ఖరీదైనది. దీని ఖర్చులు 10,000–30,000 డాలర్ల వరకు ఉంటాయి. హెచ్‌–1బీ ఫీజుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ అన్నమాట. కానీ సక్సెస్‌ రేట్‌ 93 శాతం ఉంది. తొలుత గరిష్టంగా మూడే­ళ్ల వరకు యూఎస్‌లో నివాసానికి అనుమతిస్తారు. 

అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కొనసాగించినంత వరకు సంవత్సర కాల పరిమితితో అభ్యర్థి కోరినన్నిసార్లు గడువు పొడిగిస్తారు. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ అధికారిక డేటా ప్రకారం మంజూరైన ఓ–1 వీసాల సంఖ్య 2019–20లో 8,838 మాత్ర­మే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రెండున్నర రెట్లకుపైగా పెరిగింది.

దిగ్గజ కంపెనీల క్యూ..
గూగుల్, ఓపెన్  ఏఐ, టెస్లా, మెకిన్సే వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌ నుండి కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి రెడీ అయ్యా­యి. ఈ కంపెనీలు సేవలందిస్తున్న రంగాల్లో బాగా స్థిరపడిన అభ్యర్థులను వారి యూఎస్‌ ప్రధాన కార్యాలయానికి ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. హార్వర్డ్, యేల్, కొలంబియా వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అధ్యాపకులను, పరిశోధకులను నియమించునే పనిలో ఉంటున్నాయి.

ఏటా పెరుగుతున్నాయ్‌..
హెచ్‌1–బీతో పోలిస్తే ఓ–1 వీసాల సంఖ్య తక్కువగా ఉంది. 2023–24లో మొత్తం 2,25,957 హెచ్‌1–బీ వీసాలకు ఆమోద ముద్రపడింది. ఓ–1 వీసాల విషయంలో ఈ సంఖ్య 22,669 మాత్రమే. హెచ్‌1–బీ డిమాండ్‌ తగ్గుతున్న ధోరణిలో ఉన్నప్పటికీ.. ఓ–1 వీసాలు సంవత్సరానికి దాదాపు 10% పెరుగుతున్నాయి. ఓ–1 వీసాలకు అయ్యే ఖర్చు ఎక్కువైనప్పటికీ కంపెనీలు, వ్యక్తులు ఇప్పటికీ ఇంత పెద్ద మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement