work visa
-
జర్మనీలో జాబ్.. ఇదే మంచి అవకాశం!
జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. జర్మనీ వర్క్ వీసా ప్రాసెస్ చేయడానికి గతంలో 9 నెలలు పట్టేది. ఇప్పుడు దానిని కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు.తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ తెలిపారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించనున్నారు. మింట్ నివేదిక ప్రకారం.. జర్మన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం, జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. వర్క్ వీసా ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కలిగిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది.జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మన్ ఆర్థిక వ్యవస్థ 74 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ ప్రకారం, ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకు 80 వేల వర్క్ వీసాలను జారీ చేసింది. వీరిలో 50 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు.కాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టు 14న జర్మన్ ఎంపీలు జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్లను కలిశారు. దీనిపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ఢిల్లీలో జుర్గెన్ హార్డ్ , రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు. -
ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు
వెల్లింగ్టన్ : మీరు ఆ దేశానికి వెళ్లేందుకు, అక్కడ పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారా? ఇందుకోసం వీసాకి అప్లయి చేస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని విసా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, చదువు అనేది సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశం అనేది ఓ కల. అందుకే దేశీయంగా ఆదరణ, అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్స్‌లు చదివి విదేశాలకు క్యూకడుతుంటారు. దీనికి తోడు ఆయా దేశాల అభివృద్దిలో భాగం చేసేందుకు వీసా మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో న్యూజిలాండ్ ఎంప్లాయింటెంట్ వీసా ప్రోగ్రాంలో భారీగా మార్పులు చేసింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో విదేశీయులు తమ దేశానికి వలదారులు భారీ ఎత్తున క్యూ కట్టారని, దీంతో విసాలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో పనిచేసే వారికి న్యూజిలాండ్‌లో వసతి ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. న్యూజిలాండ్ వీసాలో చేసిన కీలక మార్పులు తక్కువ నైపుణ్యం కలిగిన లెవల్ 4, లెవల్ 5 కోసం ఉద్యోగాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతున్న వలసదారులకు ఇంగ్లీష్ తప్పని సరి చేసింది. కనీస నైపుణ్యాలు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పులు లెవల్ 4, లెవల్ 5 వంటి లో స్కిల్డ్ ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఆయా సంస్థలు సంబంధిత విభాగాల ఉద్యోగులకు వీసా ఇచ్చే విషయంలో వారి జీతాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. లెవల్ 4, లెవల్ 5 ఉద్యోగులకు న్యూజిలాండ్‌లో నివసించే కాలవ్యవధిని 5 నుంచి 3ఏళ్లకు తగ్గించింది. ఫ్రాంఛైజీ అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు ప్రామాణిక, హైవ్యాల్యూమ్ ఉపాధి అక్రిడిటేషన్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో నైపుణ్యం కొరత ఉన్న సెకండరీ టీచర్ల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం,నిలుపుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ వాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలి అని ఆమె అన్నారు. కాగా, గత సంవత్సరం, దాదాపు 173,000 మంది న్యూజిలాండ్‌కు వలస వెళ్ళారు. సుమారు 5.1 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌కు కోవిడ్ తగ్గుముఖం పెట్టిన తర్వాత విదేశీయుల తాకిడి ఎక్కువైంది. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా వలసదారులు పెరిగారు. దీంతో రాబోయే రెండేళ్లలలో వలసదారుల్ని తగ్గించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్ కళాప్రాంగణంలో ప్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు. అవి.. ► ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్‌కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. ► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ► ఫ్రాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. ► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్‌లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. ► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్ -
Passport: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే
మోర్తాడ్ (బాల్కొండ): తమ దేశానికి వచ్చే పర్యాటకులు, వర్క్ వీసా పొందినవారు పాస్‌పోర్టులలో ఇంటిపేరును తప్పనిసరిగా జత చేయించుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం నిర్దేశించింది. యూఏఈకి వచ్చేవారి వివరాలు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం మేరకు భారతీయులు ఎవరైనా తమ పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకపోతే నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూఏఈలోని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. కొందరి పాస్‌పోర్టులలో ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ కార్డులలో ఇంటి పేరు ఉండకుండా పేరు మాత్రమే ఉంటుంది. పేరు ఒక్కటే ఉండటం వల్ల ఆయా వ్యక్తుల స్పష్టమైన వివరాలు తెలియడం లేదనే ఉద్దేశంతో యూఏఈ ప్రభుత్వం ఈ సవరణలను చేపట్టింది. ఇదిలా ఉండగా ఎవరైనా పెళ్లి చేసుకోక ముందు పాస్‌పోర్టు తీసుకుని ఉంటే అందులో భర్త లేదా భార్య(స్పౌస్) పేరు ఉండదు. అలాంటివారు కూడా తమ జీవిత భాగస్వామి పేరును నమోదు చేయించుకోవాలని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కోరారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో అనేక మంది పాస్‌పోర్టులలో వివరాలు స్పష్టంగా లేవు. కొత్త నిబంధనల వల్ల పాస్‌పోర్టులలో పూర్తి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది. యూఏఈలో రెన్యువల్‌కు ఇక్కడ విచారణ యూఏఈలో ఉపాధి పొందుతున్నవారు తమ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అక్కడి భారత రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక పోలీసు విభాగం(స్పెషల్ బ్రాంచ్) అధికారులు విచారణ జరుపుతున్నారు. విదేశాల్లో ఉన్న వారు పాస్‌పోర్టు రెన్యువల్‌కు గడువు సమీపిస్తే తాము ఉండే దేశంలోని భారత రాయబార కార్యాలయంలో రెన్యువల్ చేసుకునేవారు. పాత పాస్‌పోర్టునే రెన్యువల్ చేసుకోవడం వల్ల ఎలాంటి విచారణ నిర్వహించకపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం భారత రాయబార కార్యాలయం ఇచ్చిన సమాచారంతో పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేవారి ఇంటి వద్దకు ఎస్బీ అధికారులు వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుండటం గమనార్హం. పాస్‌పోర్టుల జారీ పారదర్శకంగా ఉండాలన్న కారణంతోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..) -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్‌కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్‌పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
వాషింగ్టన్: వైట్‌హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్‌లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే. అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం ! ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. -
భారత్‌కు భారం..డ్రాగన్‌కు వరం
వాషింగ్టన్ : వీసాల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రరాజ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్1బీ వీసాలపై ఆంక్షలు భారత ప్రొఫెషనల్స్‌కు ఆటంకం కాగా ఇవి చైనాకు వరంలా మారతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీసాల నిలిపివేత నిర్ణయం అమెరికన్లకు ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఏమాత్రం ఉపయోగపడదని లాస్ఏంజెల్స్ టైమ్స్ హెచ్చరించింది. డ్రాగన్‌కు సానుకూలం ట్రంప్ నిర్ణయం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. సింథటిక్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్ రంగాల్లో చైనా నైపుణ్యాలతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో వారే పాతుకుపోతారని, అధ్యక్షుడి నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్ వంటి డ్రాగన్ కంపెనీలకు మేలు చేకూరుతుందని వాల్‌స్ర్టీట్ జర్నల్ పేర్కొంది. ఇక బహుళజాతి సంస్థలు అమెరికాకు విదేశీ మేనేజర్లను రప్పించే వెసులుబాటు లేకుంటే ఈ ఉద్యోగాలను విదేశాలకే తరలిస్తాయని, అమెరికన్లకు అవకాశాలు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది. టెకీల్లో అలజడి.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను కలవరపాటుకు గురిచేసింది. తమ భవిష్యత్‌పై పలువురు ప్రొఫెషనల్స్‌లో గుబులు మొదలైంది. మరోవైపు హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన వారి భాగస్వాములు అత్యవసరంగా భారత్‌కు వచ్చిన క్రమంలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించాలని అమెరికన్ అధికారులను కోరతున్నారు. వీసాల నిలిపివేతపై ట్రంప్ ఉత్తర్వులపై విశ్లేషకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి : హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ! -
అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. వలస విధానంలో సమూల సంస్కరణల్ని తీసుకువచ్చి ఇకపై ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని అధికార యంత్రాంగానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్న ట్రంప్... తాను తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు లాభం చేస్తుందని అంటున్నారు. కరోనా వైరస్ వల్ల అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని కట్టడి చేసి, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచడానికే వలస విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి దీని నుంచి మినహాయింపులున్నాయి. గత ఏప్రిల్‌లో 60 రోజులపాటు ఈ వీసాలపై నిషేధం విధించిన ట్రంప్ సర్కార్ ఈ ఏడాది చివరి వరకు దీనిని పొడిగించింది. 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ వీసాల జారీపై ఈ ఏడాది వరకు నిషేధం పొడిగిస్తూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత శ్వేతసౌధం అధికారి మీడియాతో మాట్లాడారు. హెచ్–1బీ, ఎల్1 వీసాలపై తాత్కాలిక నిషేధంతో అమెరికాలో 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ కానున్నాయని అంచనాలున్నట్టుగా చెప్పారు. ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లతో భర్తీ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్ దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు. లాటరీ విధానం రద్దుకు సన్నాహాలు ఇన్నాళ్లూ హెచ్1బీ వీసాలను లాటరీ విధానం ద్వారా ఇచ్చేవారని, ఇకపై ఉద్యోగాల్లో తీసుకునే విదేశీ పనివారి నైపుణ్యం, వారికిచ్చే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తారని వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. ‘ప్రతీ ఏడాది హెచ్–1బీ వీసాలు 85 వేల వరకు జారీ చేస్తాం. కానీ దరఖాస్తులు 2 నుంచి 3 లక్షలు వస్తాయి. ఇకపై లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మంజూరు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంటే అత్యధిక వేతనాలు లభించే 85 వేల మందికి మంజూరు చేస్తాం. దీనివల్ల నైపుణ్యం కలిగిన వారికే పనిచేసే అవకాశం వస్తుంది’అని ఆ అధికారి వివరించారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికన్లలో హర్షం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. మేరీల్యాండ్‌లో వాషింగ్టన్ పోస్ట్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్‌లో 65శాతం ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. కరోనా వైరస్ విసిరిన సవాళ్లతో వలసదారుల నుంచి తమ ఉపాధికి ముప్పు ఉంటుందని 81శాతం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో వెల్లడైంది. భారతీయులపై ప్రభావం ఎంత ? అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ నిషేధం ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారిపై దీని ప్రభావం చూపిస్తుంది. ప్రతీ ఏడాది మంజూరు చేసే హెచ్–1బీ వీసాలు 85 వేలకు వీసాలకు గాను 70శాతం మంది భారతీయులే. వారందరూ ఇక ఏడాది పాటు వేచి చూడాలి. అయితే కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో ఎవరూ విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎన్నో టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్తోనే పనులు జరిపించుకుంటున్నాయి. అందువల్ల అందరూ అనుకునేటంత నష్టం ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అమెరికా టెక్ కంపెనీల్లో ఆందోళన అమెరికాలో వృత్తి నిపుణులకు భారీగా వేతనాలు చెల్లించాలి. విదేశీయులైతే తక్కువ వేతనాలకు వస్తారన్న కారణంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్, ఫేస్బుక్ వంటి ఐటీ దిగ్గజాలకు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎదురు దెబ్బ తగలనుంది. హెచ్–1బీ వీసాలను అత్యధికంగా స్పాన్సర్ చేస్తూ విదేశీ వర్కర్ల సేవల్ని ఎక్కువగా ఈ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి కంపెనీలూ కూడా తక్కువ వేతనాలకే భారతీయ టెక్కీలను ఉద్యోగాల్లోకి తీసుకొని లబ్ధి పొందుతున్నాయి. తాజా ఉత్తర్వులతో టెక్ కంపెనీలు విదేశీ వర్కర్లను పనిలోకి తీసుకోలేవు. ఆ పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది. సుందర్ పిచాయ్ అసంతృప్తి ట్రంప్ నిర్ణయంపై గూగుల్ సీఈవో, ఇండియన్ అమెరికన్ సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షానే తాను ఉంటానని అవకాశాలు అందరికీ ఇవ్వాలన్నారు. ‘అమెరికా ఆర్థిక విజయాలకు వలస విధానమే ఎంతో తోడ్పడింది. టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా అమెరికాను నిలిపిందంటే, గూగుల్ ఇప్పుడు ఇలా నిలిచిందింటే ఆ విధానమే కారణం’అని పిచాయ్ ట్వీట్ చేశారు. న్యాయస్థానంలో నిలబడుతుందా? ట్రంప్ కొత్త ఉత్తర్వులపై అమెరికన్ కంపెనీల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఫస్ట్ రికవరీ పేరుతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని అధ్యక్షుడు భావిస్తున్నప్పటికీ ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వలస విధానాలను వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యూయార్క్‌కి చెందిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ మెహతా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉందన్నారు. ‘ట్రంప్ ప్రకటన ఇమ్మిగ్రేషన్, నేషనాలటీ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకెళితే దీనిని నిలిపివేస్తారు. ఇలా నిషేధం పొడిగించడం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఈ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతో సాయంగా ఉన్నారు’అని వ్యాఖ్యానించారు. -
వీసాలపై ట్రంప్ నిర్ణయం.. పిచాయ్ స్పందన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దీనిపై గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను నిరుత్సాహాపరిచింది. అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం ఎంతో తోడ్పడింది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది. ఈ రోజు గూగుల్ కంపెనీ ఇలా ఉందంటే, అది ఇమ్మిగ్రాంట్ల వల్లే’ అని పిచాయ్ తెలిపారు. విదేశీ టెకీలకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మద్దతుగా ఉంటామని, అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ తన ట్విట్లో తెలిపారు. (వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం) ట్రంప్ నిర్ణయాన్ని పిచాయ్ మాత్రమే కాక మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ కూడా వ్యతిరేకించాయి.మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ట్రంప్ చర్యను విమర్శిస్తూ.. ‘అమెరికాకు ఇప్పుడు వలసదారులు మరింత అవసరం. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచ ప్రతిభ నుంచి విడదీయడానికి లేదా ఆందోళనను సృష్టించే సమయం కాదు. వలసదారులు మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మన దేశం క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తారు. మనకు చాలా అవసరమైన సమయంలో వలసదారులు ఈ దేశానికి ఎంతో సహకరించారు’ అని ఆయన అన్నారు. బ్రాడ్ స్మిత్ ట్వీట్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా రీట్వీట్ చేశారు. (వెనక్కి రావాల్సిందేనా!) ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రకటనపై ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లతో ట్రంప్ చర్యలను విమర్శించింది. ‘ఈ చర్య అమెరికా ఆర్థిక ఆస్తిని, దాని వైవిధ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన శ్రమశక్తిలో చేరడానికి, పన్నులు చెల్లించడానికి.. ప్రపంచ వేదికపై మన పోటీతత్వానికి తోడ్పడటానికి ఇక్కడకు వస్తారు. వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మంచివి కావు’ అని ట్వీట్ చేసింది. కొంతకాలం క్రితం వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగమైన ఆలిస్ జి వెల్స్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘హెచ్1-బీ వీసా ప్రోగ్రాం ద్వారా ఉత్తమమైన, ప్రతిభావంతులను దేశంలోకి ఆహ్వానించి.. వారి కృషితో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విదేశీ ప్రతిభను ఆకర్షించడం అమెరికా బలం. బలహీనత కాదు’ అని ఆయన ట్విట్ చేశారు. -
వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. ఇక ఈ ఏడాది డిసెంబర్31 వరకూ హెచ్ 1బీ, హెచ్ 2బీ, జే 1, ఎల్ 1 వీసాల జారీని నిలిపివేశారు. హెచ్ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. హెచ్ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్ పిలుపు ఇచ్చారు. మెరిట్ ఆధారంగానే హెచ్1బీ వీసాల జారీకి మొగ్గుచూపారు. దీంతో ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీ లభించనుంది. కాగా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకే ట్రంప్ హెచ్ 1బీ వీసాల జారీలో సంస్కరణలకు మొగ్గుచూపారని వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకే.. కరోనా మహమ్మారితో అమెరికాలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిన క్రమంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే లక్ష్యంతో వలస విధానం, వీసాల జారీ ప్రక్రియలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ సంస్కరణలు అమెరికన్ ఉద్యోగుల వేతనాలను కాపాడతాయని పేర్కొంది. అత్యధిక నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌కే అమెరికాలో ప్రవేశానికి అనుమతి లభిస్తుందని తెలిపింది. అమెరికన్ ఉద్యోగుల స్ధానంలో తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను యజమానులు నియమించుకుంటున్న క్రమంలో ఆ లోటుపాట్లను సవరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. వలసలతో ముప్పు వీసాల నిలిపివేత ఉత్తర్వుల్లో ట్రంప్ ప్రధానంగా అమెరికన్ల ఉద్యోగాలకు వలసదారులతో ముప్పు ఎదురవుతుందనే అంశాన్ని నొక్కిచెప్పారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు ప్రతి రంగంలో అమెరికన్లు ఉద్యోగాల కోసం విదేశీయులతో పోటీపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. తాత్కాలిక పనుల కోసం అమెరికాలోకి వచ్చే లక్షలాది విదేశీయులతో అమెరికన్లు పోటీపడుతున్నారని, వలసదారులతో పాటు వారి కుటుంబసభ్యులతో సైతం అమెరికన్లు ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారని ప్రస్తావించారు. సాధారణ పరిస్ధితుల్లో తాత్కాలిక ఉద్యోగుల రాకతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినా కోవిడ్-19 వ్యాప్తితో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో తాత్కాలిక ఉద్యోగులు అమెరికన్ ఉద్యోగుల ఉపాథికి పెనుముప్పుగా పరిణమించారని ట్రంప్ పేర్కొన్నారు. మూడు నెలల్లో 2 కోట్ల ఉద్యోగాలు మాయం ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్‌లో అమెరికాలో పలు పరిశ్రమల్లో కోల్పోయిన 17 లక్షల ఉద్యోగాల భర్తీకి యజమానులు హెచ్2బీ నాన్ఇమిగ్రెంట్ వీసాల ద్వారా నియామకాలకు ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. ఇదే సమయంలో కీలక పరిశ్రమల్లో పనిచేసే 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోగా, ఈ స్ధానాల భర్తీకి యజమానులు హెచ్1బీ, ఎల్ 1 వర్కర్ల వైపు చూస్తున్నారని ఉత్తర్వుల్లో ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. జే1 వీసాదారులతో ఉద్యోగాలకు పోటీపడే అమెరికన్ యువతలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 20 శాతం పైగా ఉందని వెల్లడించింది. చదవండి : వెనక్కి రావాల్సిందేనా! -
హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు వర్క్ వీసాల జారీని నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని వెల్లడించింది. పలువురు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వెలువడిన ఆ కథనం ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. (‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’) ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. కొత్తగా హెచ్1బీ, లేదా ఇతర వర్క్ వీసా వచ్చినవారు అమెరికా వెలుపల ఉంటే, వారికి కూడా దేశంలోకి అనుమతి ఉండదు. అయితే, ఇప్పటికే హెచ్1బీ, ఇతర వీసాలపై అమెరికాలో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నిపుణులైన విదేశీయులకు అమెరికాలోని సంస్థలు అమెరికాలో ఉద్యోగ అవకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. భారతీయుల్లో చాలామంది ఈ వీసా సాధించాలని కలలు కంటుంటారు. భారత్, చైనాల నుంచి వేలాది మంది వృత్తి నిపుణులను టెక్నాలజీ సంస్థలు ఈ వీసాపై అమెరికాకు తీసుకువస్తుంటాయి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయి, ఇండియాకు తిరిగొచ్చిన భారతీయులకు ట్రంప్ తీసుకోనున్న నిర్ణయం అశనిపాతం కానుంది. హెచ్1బీతో పాటు, హెచ్2బీ, జే1, ఎల్1 వీసాలను కూడా రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి హోగన్ గిడ్లీ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, సంస్థలకు అవసరమైన నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌నకు యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ డోనోహూ ఒక లేఖ రాశారు. (జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆవేదన) -
వీసా బ్యాన్పై కసరత్తు!
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన స్టుడెంట్ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు. ‘వర్క్ వీసాల నిషేధానికి సంబంధించి ఈ నెలలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చు. ఈ దిశగా ఇమిగ్రేషన్ సలహాదారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు’అని శుక్రవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడే వైద్య నిపుణుల కొరత తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న 40 వేల గ్రీన్‌కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆమోదం పొంది, జారీ చేయని గ్రీన్ కార్డ్‌లను ఇప్పుడు వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ పలువురు సభ్యులు కాంగ్రెస్‌లో ప్రతిపాదన చేశారు. -
కరోనా: వర్క్ వీసా కాలపరిమితి పొడిగింపు!
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ యునైటెడ్ కింగ్డం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటువ్యాధిని అరికట్టే చర్యల్లో భాగంగా.. తమ దేశంలో సేవలు అందిస్తున్న విదేశీ వైద్యులు, నర్సుల వీసా కాల పరిమితిని ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మహమ్మారిపై పోరులో భాగస్వామ్యమైనందుకు గానూ వారికి ఈ వెసలుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దాదాపు 2800 మంది వలసజీవులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చి యూకేలో నివాసం ఉంటున్న వైద్య సిబ్బందికి ఊరట లభించింది. అక్టోబరులో వీసా గడువు ముగిసే వైద్యులకు మరో ఏడాది పాటు అక్కడే ఉండే అవకాశం లభించింది. (ట్రంప్‌కు హెచ్-1బీ వీసా ఉద్యోగుల అభ్యర్థన?) ఈ విషయాన్ని యూకే హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మంగళవారం ధ్రువీకరించారు. ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి జాతీయ ఆరోగ్య సేవలో నిమగ్నమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వీసా కాలపరిమితిని పొడిగిస్తున్నాం. కరోనాతో పోరాడుతూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వారి పట్ల కృతజ్ఞతాభావం చాటుకునే సమయం ఇది. వీసా ప్రక్రియ కారణంగా వారి దృష్టి మరలడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆటోమేటిక్‌గా ఏడాదిపాటు వీసాను మేమే పొడిగించాం. కాబట్టి ఎవరూ వీసా కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించిన ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుంది’’అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నర్సుల పనివేళల నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా బ్రిటన్‌లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో అక్కడ లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.(‘యుద్ధం లేదు.. కానీ 5 వేల మంది చనిపోతే ఎలా?’) -
డిగ్రీ అయ్యాక రెండేళ్లు ఉండొచ్చు
లండన్: యూకేలో డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులకు భారీగా ఊరట లభించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్క్ వీసాలో పాత నిబంధనల్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ చదువుకునే నిపుణులైన విదేశీ విద్యార్థులు తమ కెరీర్ మలచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం అక్కడ చదివే విదేశీ విద్యార్థులు డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తయ్యాక 4నెలలు పాటు మాత్రమే ఉండే వీలుంది. 27 వర్సిటీలు పైలెట్ స్కీమ్ కింద ఆరు నెలల పాటు ఉండే అవకాశాన్ని కల్పిస్తాయి. వీసా నిబంధనల్ని సవరించడంతో చదువు పూర్తయ్యాక రెండేళ్ల పాటు యూకేలో ఉంటూనే ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు. డిగ్రీ పూర్తయిన నాలుగు నెలలు మాత్రమే దేశంలో ఉండే అవకాశం ఇస్తే, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని, దీని వల్ల టాలెంట్ ఉన్న వారంతా వేరే దేశాలకు తరలివెళ్లిపోతారని యూకేలో యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై గత ఆరేళ్లుగా విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత పాత నిబంధనలనే తీసుకురావాలని బోరిస్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘‘వీసా నిబంధనల్ని పునరుద్ధరించడం వల్ల విద్యార్థులు రెండేళ్ల పాటు పని చేయడంలో అనుభవాన్ని తెచ్చుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుంది’’ అని యూకే హోంమంత్రి భారత్ సంతతికి చెందిన ప్రీతి పటేల్ అన్నారు. భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య ఒకప్పుడు బ్రిటన్‌లో చదువు పూర్తయిన విద్యార్థులు మరో రెండేళ్ల పాటు అదే వీసాపై ఆ దేశంలో కొనసాగే అవకాశం ఉండేది. కానీ థెరిసా మే హోం మంత్రిగా ఉన్నప్పుడు 2012లో విద్యార్థులు రెండేళ్లు పాటు కొనసాగే నిబంధనలను రద్దు చేశారు. దీంతో బ్రిటన్‌కు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 55శాతానికి పడిపోయింది. 2010లో 51,218 మంది విద్యార్థులు బ్రిటన్‌కు వస్తే, 2011–12లో వారి సంఖ్య ఏకంగా 22,575కి పడిపోయింది. 2017–18 వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయి 15,338కి చేరుకుంది. గత ఏడాది మాత్రం మళ్లీ విద్యార్థుల సంఖ్య పెరిగి 21 వేలకు పైగా చేరుకుంది. ‘రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసా పునరుద్ధరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ఆరేళ్లుగా ఈ వీసా పునరుద్ధరణకు మేము పోరాటాలు చేస్తున్నాం’ అని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్మని యూకే యూనియన్ సంస్థ చైర్ పర్సన్ సనమ్ అరోరా అన్నారు. -
భారతీయ విద్యార్ధులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో చదివే భారతయ విద్యార్ధులకు తీపికబురు అందింది. అక్కడ చదివే విద్యార్ధులు తమ విద్యాకాలం ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు బ్రిటన్‌లో పనిచేసే వెసులుబాటును బ్రిటిష్ ప్రభుత్వం కల్పించింది. భారత విద్యార్ధులతో సహా అంతర్జాతీయ విద్యార్ధులందరికీ రెండేళ్ల పాటు వర్తించేలా విద్యానంతర వర్క్ వీసాను బ్రిటన్ ప్రకటించిది. భారత విద్యార్ధులు తమ చదువు ముగిసిన తర్వాత మరో రెండేళ్లు యూకేలో గడిపే వెసులుబాటు లభించిందని, ఈ అవకాశంతో వారు మరింత అనుభవం, నైపుణ్యాలు సమకూర్చుకోవచ్చని భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ సర్ డొమినిక్ అక్విత్ పేర్కొన్నారు. 2019 జూన్ నాటికి 22,000 మంది భారత విద్యార్ధులు యూకేలో చదువుతుండగా, 2016 జూన్‌తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విద్యార్ధులకు నూతన గ్రాడ్యుయేట్ రూట్ ద్వారా తాము కోరుకున్న డిగ్రీలను పొందడంతో పాటు విలువైన అనుభవంతో పటిష్టమైన కెరీర్లను రూపొందించుకునేందుకు అవకాశం లభిస్తుందని బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతి పటేల్ చెప్పారు. మరోవైపు శాస్త్రవేత్తలకు త్వరితగతిన వీసా కల్పించే సదుపాయం అందుబాటులోకి తేవడంతో పాటు నైపుణ్యంతో కూడిన వర్క్ వీసాకు అనుమతించే పీహెచ్డీ విద్యార్ధుల సంఖ్యపై పరిమితిని బ్రిటన్ తొలగించింది. -
పనులు లేక పస్తులు..
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) : కష్టపడి పనిచేసి తాము సంపాదించిన సొమ్మును ఇంటికి çపంపాలని ఎంతో ఆశతో ఇరాక్ వెళ్లిన కార్మికులు.. పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది కార్మికులు ఇరాక్‌లో తాము అనుభవిస్తున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాలుగు నెలల క్రితం కార్మికులు ఇరాక్ వెళ్లడానికి వీసాల కోసం నందిపేట్ మండలంలోని ఓ ఏజెంటును సంప్రదించారు. ఒక్కో కార్మికుని వద్ద రూ.1.80లక్షలు వసూలు చేసిన ఏజెంటు వర్క్ వీసాకు బదులు విజిట్ వీసా ఇచ్చి పంపించాడు. ఇప్పుడు విజిట్ వీసాపై వెళ్లాలని, ఇరాక్ వెళ్లిన తర్వాత తమ మరో ఏజెంటు వర్క్ వీసా ఇప్పిస్తాడని నమ్మించాడు. ఒక్కో కార్మికునికి నెలకు రూ.50వేల వరకు వేతనం ఉంటుందని చెప్పాడు. కానీ, స్వదేశంలోని ఏజెంటు చెప్పిన విధంగా ఇరాక్‌లో కార్మికులకు వర్క్ వీసా లభించలేదు. ఇరాక్‌లోనే ఉన్న జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌కు చెందిన మరో ఏజెంటు కార్మికులను కలుసుకున్నా పని మాత్రం చూపలేదు. ఎర్బిల్లోని ఒక అద్దె ఇంటిలో కార్మికులను దింపి మాయమయ్యాడు. ఒక వారం పాటు రోజూ భోజనం సరఫరా చేసి.. ఆ తరువాత రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే భోజనం అందిస్తున్నాడని కార్మికులు తెలిపారు. ఎర్బిల్లోని ఇంటికి అద్దెను ఏజెంటు చెల్లించకపోవడంతో తామే అద్దె భారం మోసామని వెల్లడించారు. నాలుగు నెలల నుంచి కార్మికులు అద్దె ఇంట్లో గడుపుతున్నారు. ఇరాక్‌లో ఉన్న తమ వారు పడుతున్న కష్టాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఒక్కో కార్మికునికి రూ.50వేల వరకు పంపించారు. ఇరాక్ వెళ్లడానికి చేసిన అప్పుకు మరింత అప్పు తోడై తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు. రోజుకు 16 డాలర్ల చొప్పున జరిమానా.. ఇరాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం రోజుకు 16 డాలర్ల చొప్పున జరిమానా విధిస్తుంది. అంటే రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు జరిమానా భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఇంటికి రావడానికి అవసరమైన విమాన చార్జీలు సైతం సొంతంగా సమకూర్చుకోవాలి. ఇరాక్ నుంచి ఇంటికి రావాలంటే ఒక్కో కార్మికుడు దాదాపు రూ.లక్ష వరకు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇరాక్‌లో ఉన్న తమ వారిని ఇంటికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్. స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాలోకి మారడానికి యూకే నిబంధనలను మరింత సరళతరం చేసింది. సరళతరం చేసిన ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు జనవరి 11 నుంచి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం యూకేలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సును పూర్తిచేసుకునే లోపలే టైర్-2 వీసా(స్కిల్డ్ వర్క్ వీసా)లోకి మారిపోవచ్చు. అయితే ఇప్పటి వరకున్న నిబంధనల్లో టైర్-2 వీసాను విద్యార్థులు పొందాలంటే, కచ్చితంగా వారు డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ పట్టా పొందే దాకా ఆగాల్సి వస్తుండటంతో, అనంతరం విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడానికి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. దీంతో విద్యార్థులు ఉద్యోగం పొందడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సవరించిన నిబంధనల వల్ల కొన్ని నెలలు ముందుగానే విద్యార్థులు టైర్-2 వీసాను దరఖాస్తు చేసుకోవచ్చని ఈవై-యూకే పేర్కొంది. ప్రస్తుతం చదువుకోవడానికి యూకే వెళ్తున్న విద్యార్థులకు స్టూడెండ్ వీసా(టైర్-4 వీసా)ను కోర్సు కాల వ్యవధితో పాటు 4 నెలల కాలానికి కలిపి ఇస్తున్నారు. కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉండటం విదేశీ విద్యార్థులు ఉద్యోగం వెతుకోవడాన్ని దెబ్బతీస్తోంది. ఈ లోపల వారు ఉద్యోగం పొందలేకపోతే, విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. అంతేకాక టైర్-4 వీసా నుంచి టైర్-2వీసాల్లోకి మారడం కూడా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఆ లోపల డిగ్రీ పొందలేకపోతే, స్టూడెంట్ వీసాకు కూడా కాలం చెల్లిపోతుంది. -
నిపుణులే కావాలి
► వ్యవసాయ కార్మికులకూ ఎర్రతివాచీ ► వలసలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: ప్రతిభాపాటవాలు, నైపుణ్యం ఆధారంగానే అమెరికాలోకి వలసలను అనుమతిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మికులకు కూడా వర్క్ వీసాలిచ్చే యోచన ఉందని తెలిపారు. బ్రిటిష్ వారపత్రిక ‘ది ఎకనమిస్ట్’కు గురువారం ఇచ్చిన ఇంటర్వూ్యలో ట్రంప్ అమెరికాలో వలసలపై మాట్లాడారు. అయితే, దేశంలోకి అక్రమ వలసలను తగ్గించే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా చట్టబద్ధంగా సాగే వలసలకు అనుకూలమని ఆయన తెలిపారు. ప్రతిభ, నైపుణ్యం ప్రాతిపదికన ఆస్ట్రేలియా, కెనడాల్లో జరిగే వలసల్లా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండు దేశాల వలస విధానాలను ట్రంప్ ప్రశంసించారు. ఆస్ట్రేలియా జనాభాలో 71 శాతం మంది మాత్రమే అక్కడ పుట్టగా మిగిలిన వారంతా వలస వచ్చిన వారే. వీరందరికీ దేశ అవసరాల రీత్యా వివిధ రకాల నైపుణ్యాలున్న వారికి మాత్రమే అక్కడకొచ్చి పనిచేయడానికి వీసాలు జారీచేస్తున్నారు. కెనడా కూడా అత్యున్నత స్థాయి ప్రతిభాపాటవాలు ఉంటేనే ‘స్కిల్డ్’ కేటగిరీలో వీసాలకు దరఖాస్తుచేసుకునే అవకాశం ఉంటుంది. ‘ప్రతిభావంతులే అమెరికాలోకి రావాలని కోరుతున్నాను. మన దేశాన్ని ప్రేమించేవారు, దేశాభివృద్ధికి పాటుపడేవారు ఇక్కడికొచ్చి పనిచేయాలంటున్నాను. అమెరికాకు వలసొచ్చేవారు కనీసం ఐదేళ్లపాటు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి సాయం తీసుకోకుండా నిబంధనలు రూపొందిస్తున్నాం’ అని చెప్పారు. అమెరికా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడానికి బయటి నుంచి కార్మికులను ఆహ్వానిస్తున్నామన్నారు. ‘వ్యవసాయ కార్మికులకు వర్క్ వీసాలిచ్చే ఆలోచనలో ఉన్నాం. సరిహద్దులు దాటి మా పొలాల్లో పనిచేసి స్వదేశాలకుపోయే కార్మికులు ఇప్పుడూ ఉన్నారు. వీరిS సంఖ్య మరింత పెరగాలి’ అని ట్రంప్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలతో.. అమెరికా సర్కారు ప్రకటించే కొత్త వలసల విధానంతో భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత సాంకేతిక వృత్తినిపుణులకు ఇబ్బంది ఉండకపోవచ్చనే సూచనలు కనబడుతున్నాయి. -
ఆస్ట్రేలియా పౌరసత్వం ఇక కష్టమే
-
ఆస్ట్రేలియా పౌరసత్వం ఇక కష్టమే
⇔ కనీసం నాలుగేళ్లు ఉన్నవారికే... ⇔ నిబంధనలను కఠినతరం చేసిన ఆస్ట్రేలియా ⇔ ఇప్పటిదాకా ఎన్నిసార్లయినా పరీక్ష రాయొచ్చు ⇔ ఇక మూడుసార్లే అవకాశం మెల్బోర్న్: భారతీయులు అత్యధికంగా వినియోగించే వర్క్ వీసాను రద్దుచేసిన ఆస్ట్రేలియా...పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజా నిబంధనల ప్రకారం పౌరసత్వం పొందాలంటే ఆంగ్లంపై పట్టు కలిగిఉండడంతోపాటు సుదీర్ఘకాల నివాసం ఉండాలి. కనీసం నాలుగేళ్లు ఇక్కడ నివసించడంతోపాటు ఆస్ట్రేలియా విలువలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒక వ్యక్తి పౌరసత్వ పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరుకావొచ్చు. అయితే తాజా సవరణల ప్రకారం మూడుసార్లు మాత్రమే పరీక్షకు హాజరుకావొచ్చు. మూడోసారి కూడా పరీక్షలో అర్హత సాధించలేకపోతే ఆ తర్వాత రెండేళ్లపాటు పౌరసత్వం పొందేందుకు వీలుకాదు. పరీక్షలో మోసగించేందుకు యత్నించినవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతోపాటు స్వతంత్ర ఆంగ్ల పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది.మహిళలు, బాలలకు ఎటువంటి గౌరవం ఇవ్వాలనే దానిపైనే ఇందులో ప్రధాన ప్రశ్నలు ఉంటాయి. ఇంకా బాల్యవివాహాలు, గృహహింస తదితరాలకు సంబంధించిన ప్రశ్నలిచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై ప్రధానమంత్రి మాల్కం టర్న్‌బుల్ మాట్లాడుతూ తమ దేశ విలువలను దరఖాస్తుదారుడు ఏమేరకు అర్థం చేసుకున్నాడు?వాటికి ఏవిధంగా కట్టుబడి ఉంటాడు? అనేదానిపైనా ప్రశ్నలు ఉంటాయన్నారు. వీటిన్నిటితోపాటు పౌరసత్వ పరీక్ష సమయంలో మోసగించేందుకు యత్నించేవారిని ఆటోమేటిక్‌గా ఫెయిల్ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. విలువలకు కట్టుబడేవారికి, కష్టపడే స్వభావం కలిగినవారికే పౌరసత్వం ఇస్తామన్నారు. ‘పౌరసత్వం అనేది దేశ ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. అందువల్ల పౌరసత్వ కార్యక్రమమనేది జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి’ అని అన్నారు. కాగా ఇప్పటిదాకా కనీసం 12 నెలలు నివసించినవారు పౌరసత్వం పొందవచ్చు. అయితే ఇకనుంచి అలా కుదరదు. కనీసం నాలుగు సంవత్సరాలు ఇక్కడ నివసించినవారు మాత్రమే పౌరసత్వ పరీక్షకు అర్హులు. -
ఆ వీసాలను ట్రంప్ సర్కారు రద్దు చేయనుందా?
హెచ్–4 వీసాల రద్దు దిశగా ట్రంప్ సర్కారు పావులు! వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్ వీసాల్ని(స్పౌజ్ వీసా) ట్రంప్ సర్కారు రద్దు చేయనుందా? అమెరికా ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ వీసాలు జారీ చేయాలని 2015లో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 2 లక్షల మంది ‘జీవిత భాగస్వామి వీసా’(హెచ్–4)లపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధిక శాతం వివిధ ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సర్కారు నిర్ణయాన్ని 2015లోనే కాలిఫోర్నియాకు చెందిన కొందరు ఐటీ ఉద్యోగులు కింది కోర్టులో దావా వేశారు. కేసును 2016లో కింది కోర్టు కొట్టివేసింది. తీర్పును పైకోర్టులో సవాలు చేశారు. ఇంతలో ట్రంప్ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ కేసులో సమాధానం చెప్పేందుకు తమకు 60 రోజులు గడువు కావాలని కోర్టును కోరింది. ఆ గడువు సోమవారంతో ముగియడంతో... విచారణను మరో ఆరు నెలలు ఆపాలంటూ వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీలు కోర్టును ట్రంప్ సర్కారు కోరింది. 2015 నుంచిహెచ్–4 పేరిట జీవిత భాగస్వాములకు వర్క్ వీసాల జారీని ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికాలో వీరి సంఖ్య 2 లక్షలుగా ఉంది. వీరిలో చాలా మందికి హెచ్ –1బీ వీసా వచ్చే అవకాశమున్నా... ‘జీవిత భాగస్వామి వీసా’ కోసం దానిని వదులుకున్నారు. దాదాపు 2 లక్షల మంది యువతులు జీవిత భాగస్వామి వీసాలపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధికశాతం మంది అక్కడే స్థిరపడ్డారు. ఐతే విదేశీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు హెచ్-4 వీసాలను రద్దు చేయడంపై దృష్టి సారించిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
ఇంటికి రావాలంటే జరిమానా కట్టాల్సిందే..
మలేసియాలో నిబంధనలకు విరుద్ధంగా మన కార్మికులు భారీ జరిమానా వసూలు చేస్తున్న ప్రభుత్వం మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): పర్యాటకుల స్వర్గధామంగా పిలిచే మలేసియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి వద్దామన్నా.. అక్కడ పని చేద్దామన్నా నిబంధనలు అడ్డుపడుతుండడం.. భారీ జరిమానా భయంతో క్షణమొక యుగంలా బతుకుతున్నారు. గతంలో ఔట్‌పాస్ పొంది ఇంటికి వచ్చేందుకు మన కరెన్సీలో రూ. 15 వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉండగా, తాజాగా దానిని రూ. 45 వేలకు పెంచింది. పర్యాటక ప్రాంతం కావడంతో తక్కువ పనికి ఎక్కువ వేతనం వస్తుందని ఏజెంట్లు ఇక్కడి నుంచి వేలాది మంది నిరుద్యోగులను మలేసియా పంపించారు. వర్క్‌వీసా పేరిట విజిట్ వీసాలపై అక్కడికి తరలించారు. అయితే, రూ లక్షల్లో అప్పు చేసి అక్కడికి వెళ్లిన వారు విజిట్ వీసా గడువు ముగిసినా.. చేసిన అప్పులు తీర్చడానికి నిబంధనలకు విరుద్ధంగా అక్కడే ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటున్నారు. అయితే, కొన్ని నెలలుగా మలేసియాలో వర్క్‌పర్మిట్, సరైన వీసా లేకుండా ఉంటున్న వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు అక్కడే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరోపక్క ఇంటికి వద్దామంటే పాస్‌పోర్టులు ఏజెంట్ల చేతిలో ఉండడంతో దిక్కుతోచకున్నారు. మూడేళ్లుగా అక్కడ ఉంటున్న వారు ఇంటికి వచ్చేందుకు మలేసియాలోని ఇండియన్ హై కమిషన్‌ను ఔట్ పాస్ కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే, మన హైకమిషన్ ఔట్‌పాస్ జారీ చేసినా వీసా లేకుండా మలేసియాలో ఉన్నందుకు అక్కడి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తోంది. గతంలో ఇండియన్ కరెన్సీలో రూ.15వేలు చెల్లిస్తే మలేసియా నుంచి ఇండియాకు వెళ్లడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. అయితే, మలేసియా ప్రభుత్వం జరిమానాను భారీగా పెంచింది. ఇప్పుడు అలా ఇంటికి వెళ్లాలను కునేవారు రూ. 45 వేలు చెల్లించాల్సి వస్తోంది. జరిమానా మొత్తాన్ని పెంచడంతో ఇళ్లకు వెళ్దామనుకుంటున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడే ఉందామంటే పోలీసులు అరెస్టు చేస్తుండడంతో అయోమయంలో పడ్డారు. పోలీసులు అరెస్టు చేస్తే జరిమానా అయినా కట్టాలి.. లేదంటే జైలుకైనా వెళ్లాల్సి ఉండడంతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఆశపెట్టి.. అగాధంలోకి..
మోర్తాడ్ (నిజామాబాద్): భారీ వేతనం.. మంచి వసతి అంటూ ఆశపెట్టి విదేశాలకు పంపుతున్న ఏజెంట్లు వారి బతుకులను అగాథంలోకి నెడుతున్నారు. ఇరాక్‌లోని వివిధ కంపెనీల్లో పని కోసం పంపిన ఏజెంట్ల మోసపూరిత విధానాలు మన కార్మికుల పాలిట శాపంగా మారాయి. ఇరాక్ అంతర్యుద్ధం నేపథ్యంలో ఏజెంట్ల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగులను మాయ చేసిన ఏజెంట్లు వర్క్ వీసాల పేర రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75వరకు వసూలు చేసి విజిట్ వీసాలను చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం వర్క్ వీసా ఉన్నవారిని మాత్రమే స్వస్థలాలకు వెళ్లడానికి ఇరాక్ ప్రభుత్వం అనుమతినిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారికి అనుమతి ఇవ్వకపోవడంతో వేలాది మంది కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. కిర్కుక్ ప్రాంతంలోని కార్వంచ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ గ్రూపు కంపెనీలో ఉన్న 250 మంది కార్మికులకు వర్క్ వీసాలు లేవు. ఈ ఒక్క కంపెనీలోనే కాక ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న అనేక కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అలాగే ఉంది. ఏళ్ల తరబడి ఇలాగే... దుబాయ్, ఖతర్, మస్కట్, బెహరాన్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లడం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఏళ్లుగా సాగుతోంది. గల్ఫ్‌లో పని చేస్తున్న వారి సంఖ్య పెరగడంతో పోటీ ఎక్కువై వేతనాలు తగ్గాయి. అయితే, ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో పునర్నిర్మాణం పనుల కోసం అమెరికా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పని చేయడానికి కార్మికులు అధికంగా అవసరం అయ్యారు. అంతేకాక మిలట్రీ క్యాంపుల్లోను పని చేయడానికి కార్మికులు కావాల్సి వచ్చింది. దీంతో కార్మికులకు అక్కడి కంపెనీలు వేతనాలను ఎరగా వేసింది. ఇరాక్‌లో పని చేస్తే నెలకు 400 నుంచి 500 అమెరికన డాలర్లు వేతనంగా లభిస్తాయని, భోజనం.. వసతి సౌకర్యం ఉంటుందని ఏజెంట్లు ఆశ పెట్టారు. ఈ పరిస్థితుల్లో వర్క్ వీసాలు లేకున్నా.. వేతనాలు వస్తాయనే ఉద్దేశంతో ఎంతో మంది భారతీయులు ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌కు వెళ్లారు. ఇందులో తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే, ఏజెంట్లు తమకు మూడు నెలల విజిట్ వీసాలను ఇచ్చారని, ఇరాక్ వెళ్లిన తరువాత వర్క్ పర్మిట్ ఇస్తారని చెప్పారని కార్మికులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే, వర్క్ పర్మిట్ మాత్రం ఇవ్వలేదని, వేతనం వస్తుంది కదా అని వీసాల విషయం ఎవరిని అడగలేదని పేర్కొంటున్నారు. ఏజెంట్ల హుండీ దందా.. వర్క్ వీసాలు లేని వారు కంపెనీ క్యాంపులను విడిచి బయట తిరిగే పరిస్థితి లేదు. దీంతో కార్మికులు ప్రతి నెల వారి వేతనాలను ఇంటికి పంపడానికి అధికారికంగా ఉన్న మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలను వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుండీ దందాకు అవకాశం ఏర్పడింది. నిరుద్యోగులను పంపించిన ఏజెంట్లే హుండీ దందా చేస్తున్నారు తమ ప్రతినిధులను నియమించుకుని కార్మికులు ప్రతి నెలా పంపే సొమ్మును హవాలా ద్వారా కార్మికుల ఇళ్లలో చెల్లిస్తున్నారు. దొరకని లెక్కలు.. భారత్ నుంచి ఇరాక్‌కు నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడం.. ఏజెంట్లు వయా దుబాయిగా ఇరాక్‌కు పంపుతుండడంతో ఇక్కడి నుంచి ఇరాక్‌కు వెళ్లిన వారెందరు అనే లెక్క తేలడం కష్టంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇరాక్ వెళ్లినప్పటికీ వారిలో చాలా మంది దుబాయ్ నుంచి వెళ్లడంతో వారికి సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు. దీంతో ఇరాక్‌లో ఉన్న వారి లెక్క కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.