![Sundar Pichai Disappointed with Donald Trump Foreign Work Visa Suspension - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/23/sunder%20pichai.jpg.webp?itok=E8R0bDV3)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దీనిపై గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను నిరుత్సాహాపరిచింది. అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం ఎంతో తోడ్పడింది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది. ఈ రోజు గూగుల్ కంపెనీ ఇలా ఉందంటే, అది ఇమ్మిగ్రాంట్ల వల్లే’ అని పిచాయ్ తెలిపారు. విదేశీ టెకీలకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మద్దతుగా ఉంటామని, అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ తన ట్విట్‌లో తెలిపారు. (వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం)
ట్రంప్ నిర్ణయాన్ని పిచాయ్ మాత్రమే కాక మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ కూడా వ్యతిరేకించాయి.మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ట్రంప్ చర్యను విమర్శిస్తూ.. ‘అమెరికాకు ఇప్పుడు వలసదారులు మరింత అవసరం. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచ ప్రతిభ నుంచి విడదీయడానికి లేదా ఆందోళనను సృష్టించే సమయం కాదు. వలసదారులు మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మన దేశం క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తారు. మనకు చాలా అవసరమైన సమయంలో వలసదారులు ఈ దేశానికి ఎంతో సహకరించారు’ అని ఆయన అన్నారు. బ్రాడ్ స్మిత్ ట్వీట్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా రీట్వీట్ చేశారు. (వెనక్కి రావాల్సిందేనా!)
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రకటనపై ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లతో ట్రంప్ చర్యలను విమర్శించింది. ‘ఈ చర్య అమెరికా ఆర్థిక ఆస్తిని, దాని వైవిధ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన శ్రమశక్తిలో చేరడానికి, పన్నులు చెల్లించడానికి.. ప్రపంచ వేదికపై మన పోటీతత్వానికి తోడ్పడటానికి ఇక్కడకు వస్తారు. వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మంచివి కావు’ అని ట్వీట్ చేసింది. కొంతకాలం క్రితం వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగమైన ఆలిస్ జి వెల్స్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘హెచ్1-బీ వీసా ప్రోగ్రాం ద్వారా ఉత్తమమైన, ప్రతిభావంతులను దేశంలోకి ఆహ్వానించి.. వారి కృషితో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విదేశీ ప్రతిభను ఆకర్షించడం అమెరికా బలం. బలహీనత కాదు’ అని ఆయన ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment