ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న..
మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.
ఇమ్మిగ్రేషన్
ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.
గ్రీన్ కార్డు నిబంధనలు :
మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.
అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..?
ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది.
ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.
అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.
కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment