Immigration Act
-
ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న.. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.ఇమ్మిగ్రేషన్ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.గ్రీన్ కార్డు నిబంధనలు : మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..? ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి. కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి. -
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భరతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.🚨 Indian students in Prince Edward Island, a province in Canada, are protesting as they face being deported to India after a sudden change in the provincial immigration rules. 🇮🇳🇨🇦 pic.twitter.com/sSfd2OOH5h— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితుల ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు. దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు’’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ నిరసన రెండో వారంలో అడుగుపెట్టిందని నిరసన తెలుతున్న భారతీయ విద్యార్థులు తెలిపారు. ‘‘మేము చేపట్టిన నిరసన రెండో వారంలోకి చేరింది. అంతే ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు పారదర్శకత కావాలి. నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఓ భారతీయ విద్యార్థి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధలను మార్పు చేసింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావటంతో హెల్త్‌కేర్, నివాస సదుపాయాలపై ప్రతికుల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో వర్క్ పర్మిట్లు రద్దై, తాము బహిష్కరణ ఎదుర్కొవల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికా వెళ్తే అంతే మరి..
హూస్టన్: వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఎత్తుగడలతో ఎన్నో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరవుతున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిందనే కారణంగా తన ముగ్గురు పిల్లలకు దూరం అయిన ఒక తల్లి దీనగాథ ఇది. బతుకుదెరువు కోసం సుమారు 3 వేల మైళ్లు ప్రయాణం చేసి భర్తను కలుసుకునేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికాకు బయలుదేరింది సిల్వానా. అప్పటికే తన భర్త దుండగుల చేతిలో చిక్కి చావు నుంచి తప్పించుకుని అఙ్ఞాతంలో నివసిస్తున్నాడని ఆమెకు తెలియదు. మధ్య అమెరికాలోని ఈఐ సెల్వడార్కు చేరుకుంది. గన్ కల్చర్‌కు చిరునామాగా ఉన్న అమెరికా దేశాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని ఎందుకు చంపుతారో కూడా తెలియదు. సిల్వానా కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టాక్సీ దిగగానే వారిని అడ్డుకున్న ఓ గ్యాంగ్ ఆమె పెద్ద కుమారుడికి తుపాకీ గురిపెట్టింది. కానీ అదృష్టవశాత్తూ అందులోని బుల్లెట్లు అయిపోవడంతో నిన్ను వదిలేస్తున్నామంటూ గ్యాంగ్‌స్టర్ వెళ్లిపోయాడు. కానీ వారిలో భయం మాత్రం పోలేదు. అదే తన పిల్లలతో గడిపే చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. గ్యాంగ్ నుంచి ఎలాగోలా తప్పించుకుని తనవారిని కాపాడుకుంది. మెక్సికో సరిహద్దులో వలసదారులతో కలిసి చేసిన ప్రయాణం ఆమెకు తన పిల్లల్ని దూరం చేసింది.. ఆమెను జైలు పాలు చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులను చూడగానే వలసదారులు అక్కడ ఉన్న ఎత్తైన గోడను దాటి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, సిల్వానా కూడా తన పిల్లలిద్దరినీ గోడ అవతలి వైపు పంపివేసింది. మూడేళ్ల కుమారున్ని గోడపై నుంచి విసిరివేయగా అవతలవైపు ఉన్నవారు బ్లాంకెట్ సాయంతో అతన్ని పట్టుకున్నారు. ‘ఎప్పుడైతే పిల్లలు దూరమయ్యారో అప్పుడే నా ఆత్మ నన్ను వదిలిపోయిందని’ ఒక ఇంటర్వ్యూలో తన చేదు ఙ్ఞాపకాలను గుర్తుచేసుకుంది సిల్వానా. ఆమెను అక్రమవలసదారుగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికా చట్టాల ప్రకారం ఆమెను నిర్బంధించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు అధికమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేయడం అన్యాయమని, అమెరికా కుటుంబ చట్టాల ప్రకారం ఇది విరుద్దమని డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధులు దేశ భద్రత విభాగానికి లేఖ రాశారు. తాజాగా ఓ ఏడేళ్ల అమ్మాయిని తల్లికి దూరం చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారులపై ఆరోపణలు రావడంతో.. పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇటువంటి విధానాల వల్ల ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతున్నారని అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్ డిప్యూటీ డైరెక్టర్ లీ గెలెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి దూరమై.. వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు ఒక హోటల్‌కి తీసుకువెళ్లేందుకు వ్యాన్ ఎక్కించారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. వారిలో సిల్వానా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న తమ్ముడిని ఒడిలో పెట్టుకుని, చెల్లిని ఓదారుస్తూ, నాన్న కనిపిస్తాడేమోనన్న ఆశతో ఆ రాత్రంతా నిద్రపోలేదు సిల్వానా పెద్ద కొడుకు. హోటల్‌కు చేరుకోగానే తమ తండ్రి వద్దకు తీసుకువచ్చారేమో అని సంబరపడింది సిల్వానా కూతురు. కానీ ఆమె ఆనందం అంతలోనే ఆవిరైంది. అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు గదులు కేటాయించడంతో సోదరులకు కూడా దూరం అయింది. కేవలం భోజన సమయాల్లో వారిని చూసేందుకు వీలయ్యేది. అన్నను కలిసిన ప్రతీసారీ ఆమె అడిగే ఒకే ఒక ప్రశ్న అమ్మ ఎక్కడా అని. అమ్మ కావాలి అంటూ ఏడ్చే చిన్నారి తమ్ముడిని ఎలా ఓదార్చాలో అర్థంకాక.. చెల్లికి సమాధానం చెప్పలేక ఎంతో కుమిలిపోయేవాడు ఆమె పెద్ద కొడుకు. తల్లి ఇచ్చిన ఫోన్ బుక్‌ను పోగొట్టుకున్నాడు. తండ్రిని కలుసుకునేందుకు మార్గాల కోసం అన్వేషించాడు. ఫేస్బుక్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దామనుకుంటే అక్కడ యాక్సెస్ లేదని అధికారులు చెప్పడంతో నిరాశ చెందాడు. చేసేదేమీలేక చుట్టూ ఉన్న వారితో కొత్త స్నేహాలు ఏర్పరచుకున్నారు. కొద్దిరోజులకే వారిని కూడా ఎప్పటికపుడు తమ దేశాలకు తిరిగి పంపించేయడంతో మళ్లీ ఒంటరివారిగా మిగిలేవారు సిల్వానా పిల్లలు. తల్లి కోసం ఏడ్చిన ఆమె కూతురు.. మరో నాలుగేళ్ల చిన్నారిని తల్లిలా లాలించడం నేర్చుకుంది. రోజులు గడుస్తున్నా తల్లిజాడ తెలియక వెక్కి వెక్కి ఏడ్చే ఆ చిన్నారులది అరణ్యరోదనగానే మిగిలింది. 21 రోజుల నిరీక్షణ అనంతరం.. తండ్రి యులియో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పిల్లలతో ఫోన్లో మాట్లాడిన అనంతరం సిల్వానాలో ఆశలు చిగురించాయి. కానీ చిన్న కొడుకు మాత్రం ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది. హుస్టన్ ఎయిర్‌పోర్టులో పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలని అధికారులు సమాచారంతో అందిచడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తల్లి కూడా ఎయిర్‌పోర్టుకు వస్తుందని ఎదురుచూసిన చిన్నారులకు నిరాశే ఎదురైంది. నిర్బంధం నుంచి విముక్తి.. అరిజోనాలో సిల్వానాను నిర్బందించారు అధికారులు. తన పిల్లల గురించి అడిగిన ప్రతిసారీ ఆమెకు ఎటువంటి సమాధానం లభించేది కాదు. కొన్నాళ్ల తర్వాత ఆమెను తిరిగి పంపించేందుకు, వలసదారులతో కలిసి విమానం ఎక్కించారు. ‘మిగతావారంతా సంతోషంగానే ఉన్నారు. నేను మాత్రమే పిల్లలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నానని కుమిలిపోయింది సిల్వానా. నిర్భంధంలో ఉన్నప్పటికీ భర్తను కలుసుకోగలిగింది కానీ.. పిల్లల జాడ మాత్రం తెలుసుకోలేపోయింది. తనలాగే పిల్లలకు దూరమైన 8 మంది తల్లుల్ని కలుసుకుంది సిల్వానా. సెల్వడార్లో తమను బెదిరించి, తమ జీవితాలు చెల్లాచెదురవడానికి కారణమైన దుండగులను గుర్తుపట్టి పోలీసులకు సాయం చేసింది. 2000 డాలర్ల పెనాల్టీ విధించి ఆమెకు విముక్తి కలిగించారు అధికారులు. అంతులేని ఆనందంతో.. రిలీజ్ అయిన వెంటనే పిల్లల్ని చూసేందుకు ఆత్రుతగా బయలుదేరింది. కానీ తనను పిల్లలు క్షమిస్తారా.. మూడేళ్ల పసివాడు కనీసం గుర్తిస్తాడా అనే సందేహాలతో సతమతమైంది. పెద్ద వాళ్లిద్దరూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్న కుమారుడు మాత్రం ఎంతగా ప్రయత్నించినా తల్లి దగ్గరకు రాలేదు. సోదరుడి వద్దే ఉండిపోయాడు. ఆ చిత్రాన్ని చూసిన యులియో కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. -
గల్ఫ్ ఏజెంట్లలో వణుకు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 66 మంది ఏజెంట్ల అరెస్ట్ సిరిసిల్ల: అరచేతిలో స్వర్గం చూపించి నిరుద్యోగ యువతను గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్ల గుండెల్లో వణుకు మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పక్షం రోజుల్లో 66 మందిని జిల్లా పోలీసులు అరెస్ట్‌లు, బైండోవర్లు చేశారు. ట్రావెల్ ఏజెన్సీలపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి నకిలీ దందాకు ఉచ్చు బిగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వంద మందికిపైగా అనధికారిక గల్ఫ్ ఏజెంట్లు ఉన్నారు. ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా వీరు గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపిస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ఉండగా.. వారి అధీనంలో అనధికారిక ఏజెంట్లు వందలాది మంది ఉన్నారు. గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల వీసాలను రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి ధరలను పెంచి అంటగడుతున్నారు. దుబాయికి చెందిన పేరున్న కంపెనీ వీసా అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 30వేలు ఉంటే.. దాన్ని రూ. 50 నుంచి రూ.60వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లో చేయాల్సిన పనిని చెప్పకుండా హోటల్లో పని అని, గార్డెన్లో, పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో, కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు, ఇంటి కారు డ్రైవర్ అంటూ సులభమైన పనిని చెప్పి పంపిస్తున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి అధికవడ్డీలకు అప్పులు చేసి వెళ్తున్న యువ కులు తీరా అక్కడికి వెళ్లాక మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటున్నారు. సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సుమారు 25వేల మంది యువకులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏజెంట్ చేసిన మోసంతో ఇంటికి రాలేక.. అక్కడే ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గల్ఫ్‌బాటలో ఏజెంట్ల మాటలే కీలకంగా మారాయి. అలాంటి ఏజెంట్లపై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 66 మంది ఏజెంట్లను పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకుని అరెస్ట్, బైండోవర్ చేశారు. అన్ని మండలాల్లోనూ ఇంకా అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. అంతేకాకుండా పోలీసులు గ్రామాల వారిగా వివరాలు సేకరించి వారిపై నిఘా ఉంచారు. దుబాయ్ వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ వలస జీవుల కష్టాలను విన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రవాసీ తెలంగాణ శాఖ మంత్రి కె.తారకరామారావు మంత్రి హోదాలో దుబాయ్ వెళ్లి పరిశీలించారు. గుర్తింపు లేని ఏజెన్సీలు, విజిటింగ్ వీసాలపై వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. తెలంగాణలో గల్ఫ్ వలసజీవుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు తీసు కుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తం గా పోలీసు దాడులు జరగడం విశేషం. గల్ఫ్ బాటలో మోసాలను అరికట్టే పక్రియకు సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇరాక్‌లో ఉన్న రాష్ట్ర కార్మికులకు సుష్మా భరోసా మోర్తాడ్: ఇరాక్‌లో ఇక్కట్లు పడుతున్న రాష్ట్ర కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సానుకూలత వ్యక్తం చేసింది. ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది కార్మికులున్నారు. వారిని కంపెనీ వీసాలపై కాకుండా విజిట్ వీసాలపై ఏజెంట్లు ఇరాక్‌కు పంపించారు. వీసాల గడువు ముగియ డంతో వారికి ఇరాక్‌లోని కంపెనీలు పని ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు ఇరాక్‌లో ఉండలేమని ఎలాగైనా ఇంటికి చేరుకోవా లని ఆశిస్తున్నారు. అయితే విజిట్ వీసా గడువు ముగిసి పోవడంతో కార్మికులు ఇంటికి వెళ్లాలంటే జరిమానా చెల్లించాలని ఇరాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాక్ వెళ్లడానికి అప్పు చేసిన తాము మళ్లీ ఇంటికి రావడానికి అప్పు చేయాల్సి రావడంతో కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుంది. ఈ క్రమంలో అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్న జన్నారం వాసి కొమురయ్య ఎప్పటికప్పుడు తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డికి సమాచారం అందిస్తు న్నారు. బసంత్‌రెడ్డి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ద్వారా కార్మికుల ఇబ్బందులను విదేశాంగ శాఖకు విన్నవించారు. వీరి చొరవ వల్ల 33 మంది ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా వందలాది మంది కార్మికులు ఇరాక్‌లో ఉన్నారని విదేశాంగ శాఖకు బసంత్‌రెడ్డి సమాచారం ఇవ్వడంతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. జరిమానా చెల్లించ కుండా ఇళ్లకు చేర్పించడానికి చర్యలు తీసు కుంటామని సుష్మా స్వరాజ్ ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇరాక్‌లో ఉన్న కార్మికులు బాగ్దాద్ లోని రాయబార కార్యాలయంలో సంప్ర దించాలని లేదా ఎర్బీల్లోని కాన్స్ లేట్ కార్యాలయం 009647517402100 నంబర్ లో సంప్రదించాలని సుష్మా స్వరాజ్ ట్వీటర్లో సూచించారు. అనుమతి లేకుంటే చర్యలు విదేశాలకు చట్టపరమైన అనుమతులు లేకుండా పంపించడం నేరం. ఇమిగ్రేషన్ యాక్టు ప్రకారం అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ట్రావెల్ ఏజన్సీలు నిర్వహించడం చట్టవిరుద్దం. పాస్‌పోర్టులు కలిగి ఉండడం నేరం. జిల్లాలో ఏజెంట్లను మొదటి తప్పిదంగా భావించి బైండోవర్ చేశాం. మళ్లీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – విశ్వజిత్ కాంపాటి, జిల్లా ఎస్పీ. -
సింగపూర్‌లో భారతీయులు అరెస్ట్
సింగపూర్: వీసా కాలపరిమితి ముగిసిన ఇంకా దేశంలోనే నివసిస్తున్న 26 మందిని ఇమ్మిగ్రేషన్ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు సింగపూర్ ఇమ్మిగ్రేషన్ మరియు చెక్ పాయింట్ అథారటీ (ఐసీఏ) ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం సింగపూర్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో అత్యధికులు భారత్‌కు చెందిన వారు కాగా మిగత వారు చైనా దేశస్థులని వారు పేర్కొన్నారు. వీరికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల యూఎస్ డాలర్లు జరిమాన విధించ వచ్చని అన్నారు. లేకుంటే జైలు శిక్ష, జరిమాన రెండు విధించే అవకాశాలు కూడా ఉన్నాయని ఐసీఏ ఉన్నతాధికారులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 26 నుంచి 62 ఏళ్ల వయస్సు గల వారున్నారని తెలిపారు.