అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానమైన ఉత్తర్వులు జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం రద్దు, ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు. వాటిలో ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అయితే జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం (US Citizenship) రద్దు కార్యానిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టు (US Court) తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి సమస్య లేకపోయినా.. ట్రంప్ మాత్రం ఈ ఉత్తర్వు ఎలాగైనా అమలు చేయాలనే పంతంతో ఉన్నారు. మరి అలాంటప్పుడు అక్కడే ఉన్న మన భారతీయ అమెరికన్లకు, చదువుకుంటున్న విద్యార్థులకు ఇక తిప్పలు తప్పవా అంటే..
తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఇది వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చట్టాన్నే రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు.
అయితే ట్రంప్ సహా మరే ఇతర యూఎస్ అధ్యక్షుడు ఈ రాజ్యంగ హక్కును రద్దు చేయడం అనేది అంత సులభం కాదు. ముందు అమలు చేయనున్న ఈ బిల్లుకి అమోదం లభించాలంటే హౌస్(దిగువ సభ), సెనెట్(ఎగువ సభ) రెండింటిలోనూ మూడింట రెండో వంతు ఓట్లు అవసరం. ఆ తర్వాత మూడు వంతుల అమెరికా రాష్ట్రాలు అమోదం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అమలు అవ్వడం అనేది అంత సులభం కాదనేది విశ్లేషకులు అభిప్రాయం.
నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల విషయంలో మాత్రం కఠినంగా నిబంధనలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో.. F1 (స్టూడెంట్ వీసాలు), H1 (వర్క్ వీసాలు), L1 (ఇంట్రా-కంపెనీ బదిలీలు), B1/B2 (టూరిస్ట్/బిజినెస్ వీసాలు)పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అయితే అధికారులు మాత్రం పాలసీ మార్పులు ఏవైనా అమల్లోకి తెచ్చే ముందు.. రెండువైపులా అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతోంది. ఇక.. టైర్ 1, టైర్-2లకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే..
విశ్వవిద్యాలయానికి, చేసే కోర్సులతో సంబంధం లేని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని F1 వీసాదారులకు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే F1 నిబంధనలకు లోబడిన పనులే చేసుకోవాలని, ఆ పరిధి దాటి పనులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
చదవండి: ట్రంప్ దూకుడు.. వారి గుండెల్లో రైళ్లు
ఇక.. హెచ్1, ఎల్1 వీసాల విషయంలో కొన్ని చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీలు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. దీంతో ఆ పాలసీలకు సమీక్షలు జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తంగా చూసుకుంటే.. ఉద్యోగార్థం నిజాయితీగా ప్రయత్నాలు చేసేవాళ్లకు మార్పులన్నీ ప్రయోజనకారిగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో వీసాల విశ్వసనీయతను బలోపేతం చేసే ప్రయత్నంగానూ నిపుణులు అభిప్రాయపడున్నారు.
చివరిగా.. మెరిట్ ఆధారిత గ్రీన్ కార్డ్ వ్యవస్థ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇది గనుక అమలైతే.. కొత్త దరఖాస్తులుదారులు 10-15 ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది. ప్రత్యేకించి ఇది భారతీయ కమ్యూనిటీకి మేలు చేసేదిగానే ఉంటుంది కూడా.
-వేణు చిత్వేల్
గమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్‌ఆర్‌ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.
(చదవండి: ట్రంప్‌కు షాక్, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట)
Comments
Please login to add a commentAdd a comment