వాషింగ్టన్: అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే కార్యక్రమం అమెరికాలో నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా.. 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరినట్లు తెలుస్తోంది. మరో 24 గంటల్లో విమానం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు ఢిల్లీ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం.
ఇంతకు ముందు.. వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే భారత్ విషయంలో మాత్రం ఇదే తొలి అడుగు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు.
అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా ఉంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన వెంటనే అమెరికా భూభూగంలో ఉన్న అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే తీరతానని ట్రంప్ ప్రతినబూనారు. అలాంటి వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. ఇదే అంశంపై ట్రంప్ గతంలో మోదీతోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఆ టైంలో ‘‘సరైన చర్యలు తీసుకుంటాం’’ అని భారత ప్రధాని తనతో అన్నారని ట్రంప్ తమ చర్చల సారాంశాన్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment