అందరూ ఊహించినట్టుగానే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలతో, అమెరికా పౌరసత్వం(US Citizenship) కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి ఆయన స్వస్తి పలికారు. దీంతో అగ్రరాజ్యంలో నివసిస్తున్న వలసదారులు అయోమయంలో పడిపోయారు.
అమెరికాలో ప్రస్తుతం 1.40 కోట్ల మంది చట్టవిరుద్ధమైన వలసదార్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 7.25 లక్షల మంది భారతీయులు (Indians) ఉన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అక్రమ వలసదార్లను బయటకు పంపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వలసదార్లను ఏరివేసే కార్యక్రమంలో త్వరలో ప్రారంభం కానుంది.
ట్రంప్ పట్టుదల
2024లో జో బైడెన్ ప్రభుత్వం 1,529 మంది భారతీయులను వెనక్కి పంపించింది. ఇండియా సహా మొత్తం 192 దేశాలకు చెందిన 2.70 లక్షల మంది వెనక్కి వెళ్లిపోయారు. 2014 తర్వాత ఈ స్థాయిలో అక్రమ వలసదార్లను వెనక్కి పంపడం ఇదే మొదటిసారి. అక్రమంగా వలసవచ్చినవారు ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో ఉంటున్నారు. చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ వేతనానికే కూలీలు లభిస్తుండడంతో గత ప్రభుత్వాలు వీరిని చూసీచూడనట్లు వదిలేశాయి. ట్రంప్ మాత్రం వీరిని బయటకు నెట్టేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
చదవండి: ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసల వర్షం
అమెరికాలో 2.50 కోట్ల మంది అక్రమ వలసదార్లు ఉంటారని ట్రంప్ చెబుతున్నారు. నేర చరిత్ర ఉన్న 6.55 లక్షల మందితోపాటు 10.4 లక్షల మందికి ఇప్పటికే డిపోర్టేషన్ ఉత్తర్వులు అందాయి. త్వరలో వీరంతా వెనక్కి వెళ్లిపోవాల్సిందే. ట్రంప్ బారి నుంచి చట్టపరమైన రక్షణ కోసం అక్రమ వలసదార్లు ప్రయత్నిస్తున్నారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
మీరేమంటారు?
కాగా, ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ఏమనుకుంటున్నారు? ఎలాంటి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు, మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? ఎన్నారైలూ.. మీ అభిప్రాయాలను nri@sakshi.comకు పంపించండి. మీ పేరు, ఫొటో సహా sakshi.comలో ప్రచురిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment