ఉషను ఉపాధ్యక్షురాలిగా చేసేవాడిని
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణిని పొగిడిన ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా తనదైన శైలిలో మద్దతుదారులను అలరించారు. యూఎస్ 47వ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో తన విన్యాసాలతో మద్దతుదారులను ఉత్సహపరిచారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయోత్సవ ర్యాలీలో ఐకానిక్ డాన్స్ మూవ్స్‌తో సందడి చేసిన ఆయన ఆద్యంతం అదరగొట్టారు. అంతేకాదు తనకు మద్దతుగా నిలిచిన వారిని ప్రశంసించారు. ముఖ్యంగా ‘సెకండ్ లేడీ’ ఉషా చిలుకూరిని (Usha Chilukuri) పొగడ్తల్లో ముంచెత్తారు. అమెరికా చట్టాలు అనుమతించివుంటే ఆమెను ఉపాధ్యక్షురాలిని చేసేవాడినని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ తన మిత్రబృందాన్ని పొగిడారు. ముఖ్యంగా ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జేడీ వాన్స్ దంపతులను ప్రత్యేకంగా ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికా పార్లమెంట్ భవనంలోని రొటుండా హాల్‌లో అధ్యక్షుడి ప్రమాణస్వీకారం పూర్తవగానే ట్రంప్ ఉపన్యసించారు. ‘‘రాజకీయనేతగా జేడీ వాన్స్‌ను మొదట్నుంచీ గమనిస్తున్నా. ఒహాయాలో ఆయనకు మద్దతుగా నిల్చున్నా. ఆయన గొప్ప సెనేటర్. తెలివైన నాయకుడు. ఇందులో విశేషమేమంటే ఆయన భార్య ఉషా సైతం తెలివైన వ్యక్తే’’ అని అన్నారు.
ఉపాధ్యక్షురాలిగా చేసేవాడిని
జేడీ వాన్స్ వైపు చూస్తూ.. ‘‘ఆమెకున్న తెలివితేటలకు నిజానికి ఉషానే నేను ఉపాధ్యక్షురాలిగా చేసేవాడిని. కానీ అమెరికా నిబంధనలు అందుకు ఒప్పుకోవుగా’’ అని ట్రంప్ సరదాగా నవ్వుతూ పొగడటంతో అక్కడున్నవారంతా ట్రంప్‌తో పాటు నవ్వులు చిందించారు. ‘‘ఈమె గ్రేట్. ఈయన కూడా గ్రేట్. వీళ్లది అద్భుతమైన, అందమైన జోడీ. నమ్మశక్యంకానంతటి గొప్ప కెరీర్ వీళ్లది’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి సతీమణిని ‘ఫస్ట్ లేడీ’గా సంబోధిస్తారు. అలాగే ఉపాధ్యక్షుడి భార్యగా ‘సెకండ్ లేడీ’ హోదాతో గౌరవిస్తారు. ఈ హోదా పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా, తొలి హిందువుగా ఉష చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే.
కాగా, తెలుగు మూలాలు కలిగిన ఉషా చిలుకూరికి అమెరికా ‘సెకండ్ లేడీ’గా గౌరవం దక్కడంతో తెలుగు ప్రజలతో పాటు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉష పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామం. ఉష తల్లిదండ్రులు ఇద్దరూ విద్యాధికులే. ఉష కూడా పెద్ద చదువులే చదివారు. శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ చదివిన ఆమె తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశారు.
2013లో యేల్ వర్సిటీలోనే వాన్స్‌తో ఉషకు పరిచయమైంది. తర్వాతి ఏడాది 2014లో వీరు పెళ్లి చేసుకున్నారు. వాన్స్ రాజకీయాల్లో రాణించడం వెనుక ఉష కృషి ఎంతో ఉంది. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు స్వయంగా వెల్లడించారు. ‘భార్యే నా ధైర్యం. ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అంటూ వాన్స్ పలుమార్లు మెచ్చుకున్నారు. తాజాగా ట్రంప్ కూడా ఆమెను పొగిడారంటే ఉష ఎంతటి ప్రతిభవంతురాలో తెలుస్తోంది. కాగా, అతి చిన్న వయసులో అమెరికా‘సెకండ్ లేడీ’హోదా సాధించిన వారిలో మన ఉష కూడా ఉండడం మరింత విశేషం.
Comments
Please login to add a commentAdd a comment