వాషింగ్టన్: వైట్‌హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్‌లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే.
అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం !
ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు.
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
Published Sat, Jan 2 2021 6:03 AM | Last Updated on Sat, Jan 2 2021 8:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment